ఆధునిక సమాజ జాతిపిత డా||బి.ఆర్. అంబేద్కర్ (Father of modern India) ఆలస్యంగానైనా ప్రపంచం మొత్తం అంబేద్కర్‌ని అందరివాడని గుర్తించడం, ఈ సంవత్సరం ‘విశ్వ విజ్ఞాన్ దివస్’గా ఖచీూ కొనియాడడం మంచి పరిణామం. బ్రతికినంత కాలం ఆయన జీవించిన మార్గం, ప్రతి నిత్యం ఆయన సల్పిన పోరు వర్ణనాతీతం. ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, విశ్వజనీన మనిషి అయిన అంబేద్కర్ ఆలోచనా విధానమే ఈ దేశానికి దిక్సూచి, ఏకైక మార్గమని అర్థమవుతుంది. అనేక జాడ్యాలతో, కులం, మతం, వర్గం, విష సంస్కృతితో పెనవేసుకున్న మన సమాజంలో వేదనలు, అసమానతలు, అసాంఘికత పోవాలన్నా రాజ్యాంగ బద్ధంగా రాజ్యం, రాజ్యమేలాలన్నా మహనీయుని మార్గమొక్కటే శరణ్యం. ముఖ్యంగా అణగారిన వర్గాల కోసం, కులాల కోసం, స్త్రీల కోసం అంబేద్కర్ ఎనలేని కృషి చేశారు. ఎవరి పొరపాటైనా కానివ్వండి కానీ, అది కాస్తా దళితులకు మాత్రమే దేవుడయ్యాడు. ఫూలే ఆలోచనలతో, ఆయన ఆచరణలో నడిచిన అంబేద్కర్ స్త్రీల గురించి ఆ రోజుల్లోనే అన్ని కోణాల నుండి విశదంగా, విప్లవాత్మకంగా వివరించిన వ్యక్తి. వేషధారణలో, కట్టు బొట్టులో, అలంకరణలో స్త్రీలు ఎలా ఉండాలనేది అంబేద్కర్ వివరించారు. మోకాళ్ళ వరకు చీర ట్టుకున్నా, పిచ్చి పూసలు మెడలో వేసుకున్నా తక్కువగా చూడబడతారనీ, చులకన అవుతారని తెలిపారు. స్త్రీలు ఆలోచించాలనీ, అప్పుడే వారి పట్ల ఉన్న వివక్ష గురించి మాట్లాడగలుగుతారనీ, మాట్లాడుతూ ఏ దుస్థితిలో ఉన్నామని తెలుసుకోమంటారు. అంతేకాకుండా సమాజ అభివృద్ధిని కొలవాలంటే అట్టడుగు ఉన్న స్త్రీల పరిస్థితిని కొలబద్దగా వాడాలంటారు. అంబేద్కర్ మనువాదాన్ని మంట గలిపిన వ్యక్తి. అంటే స్త్రీల గురించి, వారి హక్కుల గురించి ఎంత లోతుగా ఆలోచించేవారు అనేది మనకు తేటతెల్లమవుతుంది. సమాన పనికి సమాన వేతన చట్టం, ప్రసూతి సదుపాయాల చట్టం లాంటి అనేక ప్రత్యేక చట్టాలను పొందుపర్చిన మహానుభావుడు. రాజ్యాంగంలో ఆయన పొందుపర్చిన అంశాలు అందరివీ. హెచ్చుతగ్గులు పోవాలని రూపొందించిన రిజర్వేషన్లు మినహా బలమైన రాజ్యాంగాన్ని ఆయన మనకి అందించారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అందరికీ అందాలని కలలు కన్నారు.
ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు అన్నీ కూడా ఈ దేశంలో సరిగా రాజ్యాంగం ప్రకారం అమలయితే ఎలాంటి వేదనలు
ఉండేవి కాదు. ఈ రాజ్యాంగం చాలా బలమైన ఆయుధమనీ మంచివారి చేతిలో ఉంటే మంచిగా, చెడ్డవారి చేతిలో ఉంటే చెడ్డగా పనిచేస్తుందనీ ఆయన ఆ రోజే చెప్పారు. అంతేకాదు అది సరిగా అమలు కానందు వల్లే ఈ రోజుకీ ప్రత్యేక చట్టాలని మనం ప్రాకులాడవలసి వస్తోంది. అయినా ఫలితం శూన్యమే. అన్నింటికంటే ముఖ్యంగా రిజర్వేషన్ల విషయంలో కూడా సరిగా అమలయితే ఇంతకాలం అవసరం లేకపోయేది. అమలు చిత్తశుద్ధిగా లేనందువలన కుల దోపిడీ కానీ, వర్గ దోపిడీ, లింగ దోపిడీ కానీ మరింత పెచ్చుమీరుతోంది. అంబేద్కర్ వారసులుగా చెప్పుకునేవారు ఎంతోమంది ఇంట్లో భార్యలను కొట్టే పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు. అనేక జాడ్యాలతో పాటు మన సమాజంలో ఉన్న మరొక జాడ్యం ఏమిటంటే దళితుల సమస్య అంటే ఆ సమస్య గురించి దళితులే మాట్లాడాలి. స్త్రీల సమస్యంటే ఆ సమస్య గురించి స్త్రీలే మాట్లాడాలి, ఇదేంటి? ఇదేం నీతి? దళితుల సమస్య దురహంకార దళితేతరుల నుండి వస్తుంది. స్త్రీల సమస్య సమానత్వం కోరుకోని, ఆ భావజాలం లేని పురుష సమాజం నుండి వస్తుంది. మరి ఈ సమస్యలు పరిష్కారమవ్వాలంటే చైతన్యమవ్వాలిందీ, మనలాంటి వాళ్ళం చైతన్యం చేయాల్సిందీ రెండో వర్గం వాళ్ళని కదా? ప్రభుత్వాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, స్త్రీ వాద సంఘాలు కానీ ఆ పని చెయ్యడం లేదు. ముఖ్యంగా కౌన్సిలర్లు లేక ప్రత్యేక చట్టాలుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కానీ, కుటుంబ హింస నిరోధక చట్టం గురించి కానీ మళ్ళీ మళ్ళీ బాధితులకే నేర్పుతూ ఉన్నాం. వీళ్ళకి తెలియడం అవసరమే కానీ, మరింత తెలియాల్సిన వర్గానికి మనం నేర్పించడం లేదేమో! అవగాహన కలిగించడం లేదేమో! మనం ఆలోచించాలి. అలాగే రాజకీయాలు. రాజకీయ నాయకులు ఎలా ఉండాలి? వారి భాష ఎలా ఉండాలి? అనేది కూడా మనం మాట్లాడడంలేదు. మన నాయకులు అనేకసార్లు జెండర్ దృక్పథం లేకుండా మాట్లాడడం మనం చూస్తుంటాం. గాజులు తొడుక్కుని లేమనీ, లంగా గాళ్ళనీ అనడం లాంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇక స్త్రీ నేతలు రాజకీయాల్లో ఉన్న వారి దృక్పథం, వారి మాటలు ఏ మాత్రం స్పృహ లేకుండా ఉంటాయి. ఎవరి కోసం కేంద్రీకరించి మనం పని చేయాలి, మన భాష, ఎలా ఉండాలి అనేది మర్చిపోతున్నారు.
ఇలాంటి అనేక విషయాల్లో మనం అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్త్రీల పట్ల ఆ రోజు నుండి ఈ రోజు వరకు అంత విశాల దృక్పథంతో ఆలోచించిన వ్యక్తి లేరనే చెప్పాలి. అందుకే స్త్రీల రిజర్వేషన్ బిల్లు కూడా రప్పించుకోలేకపోయాం. రాజకీయ వ్యవస్థ మారాలన్నా, కుటుంబ వ్యవస్థ మారాలన్నా, సామాజిక వ్యవస్థ మారాలన్నా అంబేద్కర్ సిద్ధాంతం ఆచరించాలి. కుటుంబంలో తల్లిదండ్రుల దగ్గరనుంచి పిల్లల్ని పెంచే తారతమ్యాలు పోనంతకాలం స్త్రీల దృక్పథంలో మార్పు రాదు. పురుషుల దృక్పథంలోనూ మార్పు రాదు. ఎంతమంది చదువుకున్న తల్లులు పిల్లలకి చిన్నప్పటినుంచీ బ్యూటీ పార్లర్లకు తీసుకెళ్తారో మనకు తెలుసు. కొడుకుల్ని తీస్కెళ్ళరు కదా? అంటే ఆడపిల్లలు అందంగా ఉండాలి అని కోరుకునే తల్లులు ఆడపిల్లలు జ్ఞానవంతంగా ఉండాలని కోరుకుంటున్నారా? మనం ఆనేక విషయాల్లో మూసల్లోనే కొట్టుకుపోతున్నాం. స్త్రీ, పురుష సమానత్వం గురించి మాట్లాడుకునే మనం ఎంతమంది పురుషులను వంటగదిలో భాగస్వాములను చేస్తున్నాం. ఏది ఏమైనా స్త్రీ, పురుష సమానత్వం, కుల సమానత్వం గురించి భేషజాలకు పోకుండా చర్చ జరగాల్సిన ఆవశ్యకత ఉంది. దానిలో భాగంగానే అంబేద్కర్, ఫూలేల ఆలోచనా విధానాలను ఆచరణాత్మకంగా తీస్కోవాలి. సమాజంలో సగభాగమైన స్రీల పట్ల అంబేద్కర్ ఆలోచనలను, అంబేద్కర్ వాదులుగా మనమందరం ఆచరిద్దాం!!!