జ్వలిత ఒక మహా కవయిత్రి. ఆమె వచనం కంటే… ఆమె కవిత్వము అద్భుతం. ఆ మహా కవయిత్రి జ్వలిత నాకు 2009లో అనకాపల్లిలో జరిగిన ‘మనలో మనం’ రచయిత్రుల మీటింగులో పరిచయమైంది. జ్వలిత రచయిత్రిగా అంతకుముందే ఆమె రచనలతోనే పరిచయముండేది. కానీ ఈ రచయిత్రుల సదస్సులోనే ఆమెను మొదటిసారి చూడడము, ఆమెను వినడం ప్రత్యక్షంగా జరిగింది. ‘మనలో మనం’ అనే పేరుతో ఈ మీటింగ్ ఆధిపత్య రచయిత్రుల మీటింగ్‌గా జరిగింది. ఆధిపత్య కుల జెండర్ దృక్కోణంగా, బహుజన కులాల రచయిత్రుల సామాజిక, సాహిత్య కుల జెండర్ అస్తిత్వాలని, ప్రశ్నలని క్రూరంగా అణచివేసిన ఆ అనకాపల్లి సదస్సులో జ్వలిత బహుజన కులాల రచయిత్రుల వైపుగా
ఉండి తన గొంతును వినిపించింది. ఇదొక చారిత్రాత్మకమైన సందర్భం. బహుజన కులాల రచయిత్రులు కొందరు తమ అస్తిత్వ కుల జెండర్ సోయి లేక ఆధిపత్య కులాల మహిళల అడుగులకు మడుగులేసే వైపుగా ఉంటే, జ్వలిత బహుజన కులాల రచయిత్రిగా తన అస్తిత్వాన్ని ‘మట్టిపూలు’గా నిలుపుకుంది.
‘మట్టిపూలు’ ఏర్పాటు బహుజన కులాల రచయిత్రుల కుల జెండర్ చర్చగా సాగిన ఒక చారిత్రకము. బహుజన రచయిత్రులు శ్రామిక నేపథ్యాల చెమట చుక్కలని గడిచిన మహిళా సాహిత్యము అవాచ్యం చేసింది. సాహిత్యాన్ని బహుజన కుల జెండర్ దృష్టి కోణాల్నుంచి, శ్రమ కోణాల్నుంచి చూడాలనీ, పితృస్వామ్యము ప్రధాన సమస్యగా యీ మహిళలకు లేదనే అవగాహనల్ని అణచివేసిన కులాధిపత్య ధోరణుల నుంచే ‘మట్టిపూలు’ ఏర్పాటు చేయడం జరిగింది. జ్వలిత ‘మట్టిపూలు’లో ముఖ్యభూమికగా ఉన్నారు.
ఆధిపత్య కులాల మహిళా అధికార ప్రలోభాలకు లొంగి కొందరు బహుజన కులాల మహిళలు రకరకాల అవకాశాల కోసం తాబెదారితనంగా దొర్సానుల పంచన చేరితే… జ్వలిత బహుజన రచయిత్రుల పక్షాన నిలబడడం ఒక గొప్ప చారిత్రకమైన అస్తిత్వ నిర్ణయం.
జ్వలిత బహుజన శ్రమ కులంగా, శ్రమ మహిళగా తన సామాజిక కుల జెండర్ అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి నిరంతరం యుద్ధం చేస్తున్న సైనికి లాగనే కనిపిస్తుంటది. ఆమె రచనలన్నీ ఈ సంగతులు పట్టిస్తయి. అటు ఆధిపత్య కులంతో, ఇటు స్వంత కులం మగ పెత్తనాల మీద, ఆధిపత్య ఆడపెత్తనాల మీద జ్వలిత యుద్ధనారి.
జ్వలిత పెన్ను గన్నులాగనే దూసుకొస్తుంటది. కవిత్వంగా తీసుకొచ్చిన ‘పరివ్యాప్త’ కాలాన్ని జయిస్తూ ఎడిట్ చేసిన అగ్ని లిపి, జ్వలితావరణాలు (వ్యాసాలు), ‘ఆత్మాన్వేషణ’గా చేసిన తన కతల సంపుటిలో తన రచనలు అనుభవాలుగా, చైతన్యాలుగా జ్వలిస్తుంటాయి. జ్వలిత రచనలు,
ఉపన్యాసాలు గురి చూసి కొట్టే గుల్లేరుల్లాగనే ఉంటయి. జ్వలిత పెన్ను ఎంత బలమైందో, తన గొంతు కూడా అంతే బలమైంది.
ఆమె రచనలు ముఖ్యంగా ఆమె కవిత్వానికి నేను ఫిదాను. ఆమె కవిత్వానికున్న పదును పోల్చలేనిది. అట్లాంటి పదునైన కవిత్వం గురిచూసి కొట్టే గుల్లేరే కాదు, గుండెను పిండే కవిత్వము, పిండి చేసే కవిత్వము జ్వలిత కవిత్వము.
జ్వలిత స్నేహశీలి, సున్నితమైన మనిషి. ఆమె స్నేహం, ప్రేమ, సమక్షం నాకు ఒక తీయని అనుభూతి. లక్షింపేట ఘటనలో బాధిత మహిళల్ని కలిసే నిజనిర్థారణ కమిటీగా ‘మట్టిపూలు’ వెళ్ళినప్పుడు, తర్వాత ఆదిలాబాద్ జోడెఘాట్‌లో జరిగిన బహుజన కతకుల మీట్లో కలిసి చేసిన ప్రమాణాలు, పంచుకున్న జీవితాలు, ప్రవహించిన మా స్నేహాలు పదిలమే.
జ్వలిత రిటైర్మెంట్ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆ మహా కవయిత్రి ఇంకా గొప్ప రచనలు చేయాలని అభినందిస్తూ… ఆకాంక్షిస్తూ… బహుజన రచయిత్రికి బంతిపూల దండలు.