వర్తమాన లేఖ – శిలాలోలిత

ప్రియమైన వారణాసి నాగలక్ష్మీ

ఎలా ఉన్నావ్‌? గత నెలలోవచ్చాన్నేను. అక్కడుండగానే రాద్దామనుకున్నాను కానీ, కుదరలేదు. ఏమన్నా చెప్పబ్బా? ఇండియానే బాగుంది. అక్కడన్నీ జీవన సౌకర్యాలుంటాయి కానీ, జీవితం ఉండదు. ఇక్కడేమో జీవితం ఉంటుంది కానీ, అమెరికాలోలాజీవనసౌకర్యాలుండవన్పించింది. పిల్లలమీదున్న ప్రేమ, ఆప్యాయతలే

ఉండనిస్తాయంతే. నాగలక్ష్మీ, నువ్వే ఓ లలిత గతమంత సుకుమారంగా ఉంటావ్‌. చక్కని చిరునవ్వు, మనుషుల పట్ల మమత, లుపుగోలుతనం నన్నాకర్షించాయి. నిన్ను భూమిక ఆఫీసులో చూశాను. అప్పట్లో రచయిత్రుల సమావేశాలు జరుగుతుండేవి కదా! ఆ చర్చల్లో నువ్వెంతో ఉత్సాహంగా పాల్గొనేదానివి. నువ్వు నమ్మినదానిని బలంగా వాదించేదానివి. ఈ అమ్మాయి ఓ ఉత్సాహ తరంగంలా ఉందనుకున్నానప్పుడు. నీ చల్లని మనస్సు వల్ల తర్వాత్తర్వాత నువ్వంటే మమత ఏర్పడింది. భూమిక కవితల పోటీలో కూడా నీ కవిత ‘గులాబీ బాలలు’ స్వయం సిద్ధలుగా 2015లో అనుకుంటా ఎంపికైంది. చాలా మంచి కవిత అది.

నర్సాపురంలో పుట్టి నూజివీడులో పెరిగిన నువ్వు చిన్నప్పుడే మీ అన్నయ్యతో కలిసి ‘లిఖిత మాసపత్రిక’ నడిపేదానివి కదా! బొమ్మలు వెయ్యడం, పిల్లల కథలు రాయడం ఉత్సాహానికి కేంద్రంగా

ఉండేదానివి. బియస్సీ (ఆంధ్ర యూనివర్సిటీ), ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఎం.ఫిల్‌-థియరెటికల్‌ కెమిస్ట్రీ సెంట్రల్‌ యూనివర్సిటీలో చేసి ‘యూనివర్సిటీ ఫస్ట్‌’ను సాధించుకోవడంలోనే నీ ప్రతిభ కనబడుతోంది.

ఇక సాహిత్య విషయానికొస్తే ఇప్పుడు నువ్వొక చెయ్యితిరిగిన రచయిత్రివి, కవయిత్రివి, చిత్రకారిణివి, గురువువి కూడా. 2004లో అనుకుంటా నీ మొదటి పుస్తకం ‘వానచినుకులు’ వచ్చింది. లలిత గీతమాలిక అది. తర్వాత ‘ఆలంబన’ (2005), ‘ఆసరా’ (2010) ‘వేకువపాట’ (2015) వచ్చాయి కదూ! ఇవన్నీ కథల పుస్తకాలు. 2014లోనే ‘ఊర్వశి’ అనే నృత్యనాటిక రాశావు. వీణను శృతిచేయడం నీకిష్టం కదూ! పాటలు వినడం, పాడడం, రాయడం ఇంకా ఇంకా ఇష్టం. మీ అమ్మాయి వర్షిణి గానమాధుర్యం మరీ మరీ ఇష్టం కదూ నీకు. తెలుగు యూనివర్శిటీలో పాడినప్పుడు నేను కూడా విన్నాను. గొంతునిండా తేనెను నింపుకుందా అనిపించింది. ‘రంగ్‌రేఖా’ అనే పేరుతో 11 ఏళ్ళలోపు పిల్లలకు పెయింటింగ్‌ క్లాసులు నడుపుతున్నావు ఎప్పట్నించో. నన్ను కూడా నీ శిష్యురాలిగా చేసుకోవచ్చు కదోయ్‌! ఎందుకంటే నా మనసుకింకా 12 ఏళ్ళు రాలేదనుకుంటాను. అంతర్జాతీయ చిత్రలేఖన పోటీలో నీ పెయింటింగ్‌ సెలక్టయ్యి ‘రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ – లండన్‌’లో ప్రదర్శింపబడిందని విని ఒక మిత్రురాలిగా చాలా సంతోషించాను. నువ్వు వేసిన పెయింటింగ్స్‌లో ‘మమత’ – మదర్‌ అండ్‌ బేబీ నీకు చాలా ఇష్టం కదా! ప్రకృతి అన్నా, మానవత్వమన్నా నీకు పంచప్రాణాలు. ఇంచుమించు నీ రచనలన్నింటిలోనూ అవే ప్రతిఫలిస్తూ

ఉంటాయి. వెబ్‌ మేగజైన్స్‌ – ‘సారంగా’, ‘విహంగ’, ‘కౌముది’, ‘వాకిలి’, ‘మ్యూస్‌ ఇండియా’లో నీ రచనలు వస్తూ ఉంటాయి. ఈ మధ్య పొయెటిక్‌ ప్రిజమ్‌ 2015-16లో నీ కవిత వచ్చింది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన షషష.షశీఎవఅషఱ్‌ష్ట్రషఱరసశీఎ – మార్చి 8న రిలీజ్‌ చేసిన పుస్తకం 100 కవితలతో వచ్చింది కదా! ఇంగ్లీషులో. అందులో నీ కవిత కూడా ఉండడం చూసి సంతోషించాను. ఇక రేడియో టాక్స్‌, కథా పఠనం, కవిత్వ పఠనం, పాటలు… ఇవి నీ నిత్యకృత్యాలే కదా! మీ నాన్నగారంటే నీకు చాలా ఇష్టం కదూ! ఒక రోల్‌ మోడల్‌ కూడా ఆయన. రామకృష్ణ శాస్త్రి, పార్వతమ్మ ముద్దు బిడ్డవు నువ్వు. మీ ఇద్దరి వెన్నెముక పార్వతమ్మ గారే కదూ! మెరక పొలాల రైతు జీవితంలో వచ్చే ఒడిదుడుకుల్ని తట్టుకుంటూ సాగే ఆయన సానుకూల దృక్పథమే నా జీవనశైలి అన్నావొకసారి.

‘ఆసరా’ కథ – అంతర్జాలం మనలోకి చొచ్చుకొని వచ్చిన మొదటి రోజుల్లో రాసిన కథ. కౌమార దశలో పిల్లలు ఎదుర్కొనే సమస్యలు ‘కారా’ మేస్టార్‌కి బాగా నచ్చి, ఇల్లు వెతుక్కుంటూ వచ్చి అభినందించారన్నావు. అది నీ జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేని మధురానుభూతి అని కదా అన్నావు. ‘సంధ్యారాగం’ కథ ఆడపిల్లల పెంపకం, జెండర్‌ డిస్క్రిమినేషన్‌ గురించి రాశావు. అలాగే ‘చిన్న బోదా చిన్ని ప్రాణం’ – కథలో పిల్లల పెంపకం, బాధ్యత అంతా తల్లికే పరిమితం చేస్తే వచ్చే ఇబ్బందుల గురించి రాశావు. ‘భూమిక’లో వచ్చిన ‘రేపటి ప్రశ్న’ కథ భ్రూణ హత్యల గురించి రాసింది. ఇక, అవార్డుల విషయానికొస్తే చాలా వచ్చాయి. నీ ప్రతిభకు గుర్తింపులవి. నాకు గుర్తున్నంతవరకూ రాస్తాను. తెలుగు యూనివర్శిటీ సాహితీ పురస్కారం (2004), అబ్బూరి రుక్మిణమ్మ అవార్డు (2005), యమ్‌.వి.యల్‌. సాహితీ పురస్కారం (2004), ‘లేఖినీ’ కథా పురస్కారం, ‘షి’ అవార్డ్‌, భూమిక నుంచి ‘ఉత్తమ కవిత’ అవార్డ్‌, ఢిల్లీ తెలుగు అకాడమీ అవార్డ్‌ ఇలా… నీ సాహితీ ప్రస్థానంలో కొన్ని వానచినుకులవి. ఒకసారి నేనడిగితే నీకెవరెవరు ఇష్టం అని చాలామంది అని వెలుగుతున్న మొఖంతో అన్నావు. కొ.కు., కారా మాస్టారు, అబ్బూరి ఛాయాదేవి, శాంతసుందరిగారు బాగా ఇష్టమన్నావు. నాగలక్ష్మీ నీకు గుర్తుందా నీ మొదటి కథ పడ్డప్పటి సంతోషం. 1979లో ఆంధ్రప్రభలో వచ్చింది. అలాగే మొదటి కవిత కూడా 1990ల్లో అనుకుంటా ప్రచురితమైంది. స్త్రీల సమస్యల్ని, ప్రకృతినీ, మానవత్వపు విలువల్ని ప్రతిఫలిస్తూ ఉంటాయి నీ రచనలెప్పుడూ. ఒక మంచి స్నేహశీలివి నువ్వు. అందుకే మన స్నేహం కొనసాగుతూ ఉందిలా!

జయంత్‌ ఇప్పుడు ఐయన్‌డిలో ఎం.బి.ఏ చేస్తున్నాడన్నావు కదూ! ఎలా

ఉన్నావు? నిత్యం వైద్యంలో తలమునకలవుతున్నా, నీ సాహిత్య రచనలపట్ల, సంగీతం పట్ల శర్మగారి ప్రోత్సాహం, నీకు అత్మీయ స్పర్శనే మిగిల్చింది. మీ ఇద్దరూ ఇష్టులే కదా నాకెప్పుడూ! ఉండనా మరి.

– నీ శిలాలోలిత

Share
This entry was posted in వర్తమాన లేఖ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.