(భూమిక నిర్వహించిన కథ, వ్యాసం, కవితల పోటీల్లో మొదటి బహుమతి పొందిన కథ)
గృహప్రవేశం జరిగిన పది రోజులకి మేము మా కొత్త ఫ్లాట్‌కి షిఫ్ట్ అయ్యాము. వారం రోజులు ఆఫీసుకి సెలవు పెట్టి ఇల్లు సర్దుకుంటుండగా కాలింగ్ బెల్ మ్రోగింది. తలుపు తెరిస్తే, ఎదురుగా నా వయసే ఉన్న అమ్మాయి. ఎవరో తెలీకపోయినా నవ్వుతూ ”ప్లీజ్ కమిన్” అంటూ ఆహ్వానించాను.
లోనికి వచ్చి సోఫాలో కూర్చుంటూ ”నా పేరు సౌమ్య అండీ. మీ ఎదురు ఫ్లాట్‌లో ఉంటున్నాము. మీరు యిక్కడికి కొత్తగా వచ్చినట్టున్నారు కదా, ఏదైనా సహాయం కావలసి వస్తే మొహమాటం లేకుండా అడగండి. అన్నట్టు ఈ రోజు కృష్ణాష్టమి కదా, పూజ చేశాము. యిదిగోండి ప్రసాదం” అంటూ తనిచ్చిన ప్రసాదాన్ని అందుకుంటూ ”వెరీ నైస్ టు మీట్ యూ సౌమ్యా. బై ద వే నా పేరు నవ్య. మీరేం తీసుకుంటారు? కాఫీయా, టీయా” అని నేనడుగుతుంటే ”ఇప్పుడేమీ వద్దు నవ్యా. మరోసారి తీరికగా వస్తాను. స్టవ్ మీద కూర మాడిపోతుంది” అంటూ హడావిడిగా వెళ్ళిపోయింది.
చూసిన మొదటి క్షణంలోనే సౌమ్య నాకు తెగ నచ్చేసింది. పేరుకి తగ్గట్టుగానే తన మాట తీరు ఎంతో సౌమ్యంగా, ఆహ్లాదంగా అనిపించింది. వారం రోజుల్లోనే పాలు, కూరగాయలు, పూలు, యిస్త్రీ… యిలా మాక్కావల్సినవన్నీ తన సహాయంతోనే కుదిరిపోయాయి. చాలా హెల్పింగ్ నేచర్ తనది.
….. ….. …..
ఈ రోజుతో నా లీవ్ అయిపోవచ్చింది. యింక రేపటినుండి ఆఫీస్‌కి వెళ్ళాలి కదాని తీరిక చేసుకుని సౌమ్య ఫ్లాట్‌కి వెళ్ళాను అత్తయ్య చేసిన జంతికలు, రవ్వ లడ్డులు తీసుకుని. సౌమ్య నన్ను ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంది. యిల్లు చాలా నీట్‌గా తీర్చిదిద్దినట్టుగా ఉంది. సౌమ్య భర్త సతీష్, బాబు అరవింద్ బైటికి వెళ్ళినట్లున్నారు. సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్న వాళ్ళ అత్తయ్యని పరిచయం చేసింది సౌమ్య. ఒక్క క్షణం నా వైపు పలకరింపుగా చూసి, వెంటనే టీవీ సీరియల్‌లో మునిగిపోయింది ఆవిడ.
సౌమ్య, నేను యిక కాఫీ త్రాగుతూ మాటల్లో పడిపోయాము.
సౌమ్య, సతీష్‌లది ప్రేమ వివాహం. ఇంజనీరింగ్ కాలేజీలో తనకి సీనియర్‌గా పరిచయమయ్యాడట సతీష్. ఆ పరిచయం మెల్లిగా ప్రేమలోకి దారి తీసి, యిద్దరి చదువులూ పూర్తయిన తర్వాత పెద్దల అంగీకారంతోనే వాళ్ళ పెళ్ళి జరిగింది. బాబు పుట్టిన సంవత్సరం వరకూ సౌమ్య విప్రోలో డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేసి, ఆ తరువాత బాబుతో కుదరక ఉద్యోగానికి రాజీనామా చేసింది. సతీష్ ప్రస్తుతం ఒరాకిల్‌లో సీనియర్ సిస్టమ్స్ అనలిస్ట్‌గా ఉన్నాడు. ఇవీ సౌమ్య చెప్పిన వివరాలు.
ఈలోగా సతీష్, అరవింద్ వచ్చారు. సతీష్‌ని పరిచయం చేసింది సౌమ్య. ఎందుకో గానీ మొదటి పరిచయంలోనే అతని పట్ల నాకంత సదభిప్రాయం కలగలేదు. కారు నలుపు, బాన పొట్ట, రూపురేఖల్లోనే కాదు, వ్యక్తిత్వంలోనూ సౌమ్యకి ఏ మాత్రం తూగడనిపించింది. అతనితో మాట్లాడిన ఆ కొద్దిసేపట్లోనే, ఉద్యోగం చేసే ఆడవారి పట్ల అతనికి చులకన భావం ఉన్నట్లుగా గమనించాను. ఇంక వారి దగ్గర సెలవు తీసుకుని ఇంటికి వచ్చేశాను.
….. ….. …..
మరుసటి రోజు నుండి ఆఫీసు, ఇల్లు రొటీన్‌లో పడిపోయాను. ఉదయం ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడో లేదా సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడో సౌమ్య కనిపిస్తే కాసేపు మాట్లాడుకునేవాళ్ళం.
మావారు ఎవ్వరితోనైనా సరే యిట్టే మాటలు కలిపేయగలరు. అందుకే తను, సతీష్ త్వరలోనే మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. సతీష్ పట్ల నాకు కలిగిన అభిప్రాయం సరైనదేనని మావారు దృఢపరిచారు. సౌమ్య విప్రోలో చేరిన రెండు సంవత్సరాలలోనే తన చురుకుదనం, తెలివితేటలతో ఆఫీస్‌లో డబల్ ప్రమోషన్స్ కొట్టేయడంతో, తనకంటే ముందే కెరీర్ నిచ్చెనలు ఎక్కేసి, తన పై మెట్టుమీద నిలబడుతుందేమోనన్న భయంతో, ప్లాన్డ్‌గా సౌమ్య తనంతట తానే ఉద్యోగానికి రిజైన్ చేసేటటువంటి పరిస్థితులను కల్పించాడట సతీష్. అయితే ఇవేమీ తెలియని సౌమ్య ”బాబు కాస్త పెద్దయ్యాక నువ్వు మళ్ళీ జాబ్‌లో చేరొచ్చులే” అని నమ్మకంగా చెప్పిన భర్త మాటలు విని జాబ్‌కి రిజైన్ ఇచ్చేసి ఇంటికి అంకితమైపోయింది.
ఇదంతా చెప్పిన మా వారు ”నవ్యా, నాకో ఉచిత సలహా కూడా ఇచ్చాడు సతీష్. మా అమ్మని కొన్నాళ్ళపాటు వైజాగ్‌లో మా తమ్ముడి దగ్గర దింపేసి మన పాప కోసం నీ చేత ముందుగా ఆఫీస్‌కి సెలవు పెట్టించి, ఆ తర్వాత మెల్లిగా రిజైన్ చేయించేయమని. మరి నీకు ఓకేనా” అని హాస్యమాడుతుంటే ”ఒకవేళ మీరలా చేయాలని చూసినా ఇలాంటి వాటికి అత్తయ్యెంత మాత్రమూ ఒప్పుకోదు” అని ధీమాగా చెప్పాను.
ఔను మరి. అత్తయ్యంటే నాకు అమ్మతో సమానమే. తను నన్ను కోడలిలాగా కాకుండా, కూతురిలాగే చూసుకుంటారు. మా వారి చిన్నతనంలోనే మా మామగారు చనిపోతే, ఆయన పనిచేసిన ఆఫీసులోనే ఆవిడ చిన్న ఉద్యోగంలో చేరి, ప్రైవేటుగా చదువుకుని, ప్రమోషన్స్ తెచ్చుకుని ఎంతో కష్టపడి పిల్లల్ని పైకి తీసుకుని వచ్చారు.
ఆడవాళ్ళ మీద మగవారి పెత్తనం ఉండకూడదని, స్త్రీలకి స్వయం నిర్ణయాధికారం ఉండాలని, భార్యాభర్తలు హక్కులని, బాధ్యతలని సమానంగా పంచుకోవాలని గాఢంగా నమ్మే మనిషి మా అత్తయ్య. అందుకే నేను ప్రగ్నెంట్‌గా ఉన్నప్పుడు, పాప పుట్టిన తర్వాత కూడా నాకు అన్ని విధాలా ఎంతో సపోర్ట్‌గా ఉన్నారు. ఇప్పటికీ నేనెప్పుడైనా పాపతో మీకు ఇబ్బందిగా ఉంటే చెప్పండి అత్తయ్యా. నేను కొన్నాళ్ళు ఆఫీస్‌కి సెలవు పెడతాను అంటే కూడా ”నాకేం కష్టం నవ్యా. పాపకి సంబంధించిన పన్లన్నీ చేయడానికి పనిపిల్ల ఉండనే ఉంది. కేవలం పైపైన చూడడమేగా నా పని. అంతగా అవసరమైతే అబ్బాయి సెలవు పెట్టుకుంటాడులే. వాడిదెలాగూ గవర్నమెంటు
ఉద్యోగమేగా. బోలెడన్ని సెలవులుంటాయి” అనే అత్తయ్యని చూసి మా వారు ఉడుక్కుంటారు ”ఏమిటమ్మా, నువ్వెప్పుడూ కోడలి పక్షమే” అంటూ.
….. ….. …..
నాలుగు సంవత్సరాలు గడచిపోయాయి. ఈ మధ్య కొద్ది రోజులుగా గమనిస్తున్నాను. సౌమ్యలో ఏదో మార్పు. మనసు విప్పి మాట్లాడడం లేదు. ఎప్పుడూ ఉదాసీనంగా, ఏదో కోల్పోయినట్లుగా ఉంటోంది. మొహంలో కళ తగ్గింది. మునుపటి హుషారు, చురుకుదనము లేవు. ఎన్నిసార్లడిగినా ఏమీ లేదనే అంటోంది. సౌమ్య అలా డల్‌గా వుంటే నా మనసుకేమీ తోచడం లేదు.
”ఇంక లాభం లేదు. మా మైత్రిని రంగంలోకి దింపాల్సిందే” అనుకున్నాను.
అన్నట్లు, మైత్రి ఎవరో చెప్పనేలేదు కదూ. తను మా వారి చెల్లెలు. నాకు వరసకి ఆడపడుచే అయినా, మేమిద్దరం అక్కాచెల్లెళ్ళకంటే ఎక్కువ క్లోజ్‌గా ఉంటాము. మా వారిలాగే తనూ ఎవ్వరితోనైనా ఇట్టే కలిసిపోతుంది. ఎదుటివారి చేత మాట్లాడిస్తుంది. వారి మనసులోని మాటలని సులభంగా గ్రహిస్తుంది. తగిన సలహాలిస్తుంది. అవసరమైతే సహాయమూ చేస్తుంది. మా ఇంటికి వచ్చినప్పుడల్లా సౌమ్యని కూడా పలకరించి కానీ వెళ్ళదు మైత్రి.
ఆ రోజు సాయంత్రం సౌమ్య కనిపించగానే ”సౌమ్యా, దసరాకి బొమ్మల కొలువు పెట్టింది మైత్రి. మనిద్దరినీ రేపు ఉదయమే వాళ్ళింటికి రమ్మని చెప్పింది. నీ సెల్‌కి తను ఎన్నిసార్లు ఫోన్ చేసినా నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని, నన్ను నీకు చెప్పమంది. రేపు పది గంటలకల్లా వెళ్ళి ఈవెనింగ్ వరకూ సరదాగా గడిపి తాంబూలం తీసుకుని వద్దామా?” అని అడిగాను. ఎప్పుడు ఏ ప్రోగ్రాం వేసినా ”మా వారినడిగి చెబుతాను” అనే సౌమ్య ఎందుకో గానీ ఈ సారి వెంటనే సరేననడం శుభసూచకంగా అనిపించింది. ఆ రాత్రే మైత్రికి ఫోన్ చేసి విషయమంతా వివరంగా చెప్పాను.
….. ….. …..
మర్నాడు ఉదయం పది గంటలకల్లా సౌమ్య, నేను మైత్రి వాళ్ళింటికి చేరుకున్నాము. మమ్మల్ని చూస్తూనే ఆనందంగా ఎదురొచ్చింది మైత్రి. ముగ్గురం కొంచెం సేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత ”మైత్రీ, నేను అన్నయ్యగారితో కలిసి కాసేపు పిల్లలని ఆడిస్తాను. మీరు మాట్లాడుకుంటుండండి” అని చెప్పి వాళ్ళిద్దరినీ ఒంటరిగా వదిలేసి పిల్లల రూమ్‌లోకి నడిచాను.
అన్నయ్య గారిని పలకరించి, పిల్లలతో కలిసి క్యారం బోర్డు ఆడడం మొదలుపెట్టానే గానీ మైత్రి, సౌమ్యల సంభాషణ మీదే
ఉంది నా ధ్యాసంతా.
”అదేమిటి మైత్రీ, నువ్వు ఖాళీగా కూర్చుని ఇంతసేపూ మాతో కబుర్లు చెబుతుంటే పాపం మీ వారు ఒక్కరే పిల్లలని ఆడిస్తున్నారా?” అని సౌమ్య ఆశ్చర్యంగా అడగడం వినిపిస్తోంది. తనకి ఈ విషయం ఆశ్చర్యంగా అనిపించడంలో వింతేమీ లేదు. ఎందుకంటే నేనెన్నోసార్లు గమనించాను. మా ఫ్లాట్స్‌లో మేమందరం ”లేడీస్ ఈవెనింగ్” అని నెలకి ఒక్క రోజు, ఆదివారం సాయంత్రం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు మా క్లబ్ హౌస్‌లో జరుపుకుంటాము. మేమలా సరదాగా గడిపిన ఆ మూడు గంటలలో ఎన్నోసార్లు వాళ్ళ బాబు వచ్చి సౌమ్యని విసిగిస్తుంటాడు. ఆ టైంలో సౌమ్య భర్త ఇంట్లోనే టీవీ చూస్తూనో లేదా ఫోన్‌లో ఫ్రెండ్స్‌తో హస్కు కొడుతూనో ఉంటాడే తప్ప కొంచెం కూడా వాళ్ళ బాబు బాధ్యత తీసుకోడు. ఆ అత్తగారూ అంతే. యిల్లూ, బాబు అన్నీ సౌమ్య బాధ్యత అన్నట్లుంటారు వాళ్ళు.
సౌమ్య అన్నదానికి మైత్రి ”పిల్లలని మా వారు ఆడించడంలో తప్పేముంది సౌమ్యా. పిల్లల బాధ్యత తల్లిదండ్రులిద్దరికీ సమానమే కదా. వారంలో ఐదు రోజులు మా వారు ఆఫీస్‌కి వెళ్తారు కాబట్టి పిల్లలను నేను చూసుకుంటాను. శని, ఆది వారాలు తనకి సెలవే కాబట్టి, పిల్లలని తనే చూసుకుంటారు. ఆ రెండు రోజులూ వంట కూడా తనే చేస్తారు లేదా హోటల్ నుండి తెప్పిస్తారు. తను ఆ రెండు రోజులూ నాకు పూర్తిగా రెస్ట్ ఇస్తారు కాబట్టి నేను నా టెక్నికల్ ఆర్టికల్స్ చాలామటుకు శని, ఆదివారాల్లోనే పూర్తి చేసుకోగలుగుతాను” అంది.
సౌమ్యకి అర్థమయినట్లు లేదు. ”ఏంటీ నువ్వు టెక్నికల్ ఆర్టికల్స్ రాస్తావా మైత్రీ. నాకు తెలియదే. నీ గురించి మొత్తం చెప్పాలి ఈ రోజు” అంది.
”తప్పకుండా. నేనూ, మా వారూ ఖరగ్‌పూర్ ఐఐటిలో ఎంటెక్ ఎలక్ట్రానిక్స్ చేశాము. అక్కడే మా ఇద్దరి పరిచయమూ ప్రణయానికి దారి తీసింది. చదువు పూర్తవుతూనే యిద్దరం క్యాంపస్ సెలెక్షన్స్‌లో అమెజాన్‌లో సెలక్ట్ అయ్యాము. లక్కీగా ఒకే చోట పోస్టింగ్స్ ఇచ్చారు. జాబ్‌లో చేరిన ఆరు నెలలకి పెద్దల అంగీకారంతో మా వివాహం జరిగింది. పెళ్ళైన రెండేళ్ళకి మాకు పిల్లలు పుట్టారు. కవలలు కావడంతో వర్క్, యిల్లు, పిల్లలు… బ్యాలెన్స్ చేయడం కాస్త కష్టంగా ఉండేది. అప్పటికీ మా అత్తయ్యగారు, అమ్మ కూడా చాలా హెల్ప్ చేసేవారు. కానీ, మేమిద్దరమూ జోనల్ ఇన్‌ఛార్జ్‌లము కావడంతో వర్క్ ప్రెజర్ చాలా ఎక్కువగా ఉండేది. తరచుగా ఫారిన్ కంట్రీస్‌లో మీటింగ్స్‌కి అటెండ్ అవ్వవలసి వస్తుండేది. దాంతో నేనింక ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశాను” అని చెప్పింది.
”ఐతే అన్నయ్యగారు కూడా మా వారిలాగే నీ చేత ఉద్యోగం మాన్పించేశారన్నమాట” అంది సౌమ్య.
సౌమ్య మాటలకి మైత్రి వెంటనే స్పందించింది. ”లేదు సౌమ్యా, నేను జాబ్‌కి రిజైన్ చేయడంలో మా వారి పాత్ర ఎంత మాత్రమూ లేదు. అది పూర్తిగా నా నిర్ణయమే. మా వారు నిజానికి సర్వెంట్స్ సాయంతో ఎలాగోలా మేనేజ్ చేసుకుందామని అన్నారు. నాకే పిల్లల ముద్దు ముచ్చటలు చూస్తూ వారితో సరదాగా ఉండాల్సిన సమయంలో, ఒక టైమూ పాడూ లేకుండా వచ్చే ఫారిన్ క్లైంట్స్ కాల్స్ అటెండ్ చేస్తూ, విదేశాల్లో మీటింగ్స్ అంటూ బిజీగా ఉండడం నచ్చక ఉద్యోగం మానేయాలని నిర్ణయించుకున్నాను.”
సౌమ్య ఆలోచనలో పడిందేమో కొద్ది క్షణాలపాటు మాటలు వినిపించలేదు.
కొంచెంసేపటి తర్వాత మళ్ళీ సౌమ్య గొంతు వినిపించింది. ”మైత్రీ, నువ్వు ఉద్యోగం మానేసిన తర్వాత భర్త మీద ఆర్థికంగా ఆధారపడినట్లుగా ఎప్పుడైనా ఫీలయ్యావా?”
తన ప్రశ్న వినగానే పది రోజుల కిందట మా ఫ్లాట్స్‌లో జరిగిన విషయం జ్ఞప్తికి వచ్చింది నాకు. ఆ రోజు చెన్నై వరద బాధితుల సహాయార్థం ఫ్లాట్స్‌లో అందరి దగ్గరా డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్న మా అసోసియేషన్ ట్రెజరర్ ”సౌమ్యా నీ పేర్న ఎంత రాయమంటావు” అని అడిగింది. సౌమ్య వెంటనే రెండువేలు రాయి కవితా అని చెప్పి డబ్బులు తేవడానికి లోనికి వెళ్ళిన పది నిమిషాలకు తిరిగి వచ్చి ”సారీ మా వారు ఐదు వందలే రాయమన్నారు” అని చెప్పింది చిన్నబోయిన మొహంతో.
”అలా ఎన్నడూ ఫీలవ్వలేదు సౌమ్యా. మా వారి శాలరీ అకౌంట్ నుండి రెండు డెబిట్ కార్డ్స్ తీసుకున్నాము. ఒకటి నా దగ్గర, మరొకటి తన దగ్గర ఉంటాయి. ఉద్యోగం చేసినా, చేయకపోయినా భార్యాభర్తలకి అన్ని విషయాల్లోనూ సమానాధికారాలు ఉంటాయి.
ఉద్యోగం మానేసినంత మాత్రాన మన స్వాతంత్య్రాన్ని, వ్యక్తిత్వాన్ని కోల్పోనవసరం లేదుగా” అని మైత్రి చెప్పిన జవాబు నాకెంతో నచ్చింది.
సౌమ్య సందేహాలింకా పూర్తి కానట్లున్నాయి. తన సందేహాలన్నింటికీ మైత్రి దగ్గర సమాధానం దొరుకుతుందనే నిజానికి నేను తనని ఇక్కడికి తీసుకువచ్చింది.
”అన్నట్లు మైత్రీ, టెక్నికల్ ఆర్టికల్స్ రాయడానికి నీకు టైం ఎలా దొరుకుతోంది? నాకైతే ఉద్యోగం మానేశాక ఇంట్లో పనికే ఎంత టైమూ చాలట్లేదు”.
”ఒక్క విషయం సౌమ్యా. ఆడవాళ్ళు జాబ్ మానేసి ఇంటిని చూసుకోవడం అంటే వాళ్ళ తెలివితేటలని, నాలెడ్జినీ, వ్యక్తిత్వాన్నీ, చివరికి వారి సమయాన్ని కూడా పెట్టెలో పెట్టి తాళం వేసేయడం కాదు. నా సబ్జెక్టు సైబర్ సెక్యూరిటీ అంటే నాకెంతో పాషన్. ఉద్యోగం మానేసినా నేను నా సబ్జెక్టుకు టచ్‌లోనే ఉన్నాను. పిల్లలని స్కూల్‌కి పంపిన తర్వాత, వాళ్ళు నిద్రపోయిన టైంలోనూ నేను రెగ్యులర్‌గా నా సబ్జెక్టు మీద వచ్చిన అన్ని ఆర్టికల్స్‌నూ చదువుతాను. ముందే చెప్పానుగా, వీకెండ్స్‌లో యింటి బాధ్యత, పిల్లల బాధ్యత అంతా మా వారిదేనని. సో వీకెండ్స్ టైం అంతా నేను ఆర్టికల్స్ వ్రాయడానికి ఉపయోగించుకుంటాను. టెక్నికల్ జర్నల్స్‌లో పబ్లిష్ అయిన నా ఆర్టికల్స్ చదివిన ఒక ప్రొఫెసర్, అమెరికాలోని ఒక యూనివర్శిటీలో ఆన్‌లైన్ పి.హెచ్.డి.కి నన్ను రికమెండ్ చేశారు. ఈ మధ్యే నా ఫైనల్ థీసిస్ సబ్మిట్ చేశాను. అదే యూనివర్శిటీ వాళ్ళు వాళ్ళ ఆన్ లైన్ కోర్సులకి సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌గా నన్ను అపాయింట్ చేశారు. అలా ఇప్పుడు నేను ఆన్‌లైన్‌లో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను ఇంటినుండే” ఓపిగ్గా చెప్పింది మైత్రి.
ఉద్యోగం మానేసి పూర్తిగా ఇంటికీ, వంటకీ అంకితమైపోయి, తనకంటూ ఏ హాబీస్ లేకుండా, నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోకుండా, కూపస్థమండూకంలాగా ఉండిపోయిన తను కోల్పోయింది కేవలం ఆర్థిక స్వాతంత్య్రాన్ని మాత్రమే కాదు, తన పూర్తి వ్యక్తిత్వాన్ని అని తెలిసొచ్చింది సౌమ్యకి.
ఇంతకాలం తనెంత పొరపాటు చేశానో అర్థం చేసుకున్న సౌమ్య వచ్చిన ఇంతసేపటికి తన మనసులో గూడు కట్టుకున్న బాధని బయటపెట్టింది. ”మైత్రీ, ఈ రోజు నీతో మాట్లాడిన తర్వాతే ఇన్నాళ్ళూ నేనేం కోల్పోయానో అర్థమయ్యింది. రెండు వారాల క్రితం మా తమ్ముడికి ప్రాణం మీదకి వచ్చి సతీష్‌ని డబ్బు సాయమడిగితే, సహాయం అందించకపోగా మా వాళ్ళ గురించి చులకనగా మాట్లాడాడు. నాకు చాలా బాధనిపించింది. నేనే ఉద్యోగం చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అనిపించి, వెంటనే నేను ఉద్యోగ ప్రయత్నం చేయబోతే ఇన్నేళ్ళ గ్యాప్ తర్వాత నీకెవరు ఉద్యోగమిస్తారు? యిచ్చినా నువ్వేం చేయగలవు అని హేళన చేశాడు. నువ్వు ఉద్యోగమంటూ ఊరేగితే బాబుని ఎవరు చూస్తారు అని కూడా అన్నాడు. ఈ పరిస్థితులలో నాకేమి చేయాలో పాలు పోవడంలేదు” అంది.
”నువ్వు చాలా బ్రైట్ స్టూడెంట్‌వని మా నవ్య నీ గురించి ఎప్పుడూ పొగుడుతూ ఉంటుంది సౌమ్యా. అలాంటి నీకు మళ్ళీ ఉద్యోగం చేయడమనేది ఏమంత కష్టమైన పని కాదు. ముందుగా నువ్వు ఇంటర్నెట్‌లో నీ సబ్జెక్టులో వచ్చిన లేటెస్ట్ డెవలప్‌మెంట్స్ అన్నీ ఫాలో అవ్వు. నిన్ను నువ్వు అప్‌డేట్ చేసుకో. అలాగే ఏదైనా ఇన్‌స్టిట్యూట్‌లో చేరి ప్రస్తుతం డిమాండ్‌లో ఉన్న కోర్సులో జాయినవు. మీ యింటికి దగ్గరలో, నా ఫ్రెండ్ వాళ్ళదే ఒక ఇన్‌స్టిట్యూట్ ఉంది. నువ్వు చేరతానంటే, నేను తనకి ఫోన్ చేసి చెబుతాను. మెరిట్ స్టూడెంట్స్‌కి వాళ్ళే ప్లేస్‌మెంట్స్ కూడా అరేంజ్ చేస్తారు. ఇక బాబు విషయమంటావా, మీ బాబు కాస్త పెద్దయ్యాడు. ఇప్పుడు ఆరో తరగతిలో ఉన్నాడుగా. తన పనులు తాను చేసుకోగలడు. మీ అత్తగారినీ, బాబునీ కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేట్టుగా చూసుకో. అంతగా అవసరమైతే మా అన్నయ్య వాళ్ళ పాపతోపాటు, మీ బాబుని కూడా కొన్నాళ్ళపాటు మా అమ్మ చూసుకోగలదు. చక్కగా చదువుకుని ఉద్యోగం చేస్తూ, వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలని ఆరాటపడే స్త్రీలకి తనకి చేతనైనంత సహాయాన్ని అందించడానికి మా అమ్మ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది” చెప్పింది మైత్రి.
”చాలా థాంక్స్ మైత్రీ, ఇప్పుడు నా మనసు తేలికపడింది. నువ్వు చెప్పింది బాగుంది. అలాగే చేస్తాను” అని సౌమ్య చెబుతుంటే, తనని మైత్రి వాళ్ళింటికి తీసుకుని వచ్చిన నా ఉద్దేశ్యం నెరవేరినట్లే అనిపించింది.
….. ….. …..
చెప్పినట్లుగానే వారం రోజుల్లో సౌమ్య కొత్త కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవడానికి ఇన్‌స్టిట్యూట్‌లో చేరిపోయింది. నాలుగు నెలల కోర్సు పూర్తవుతూనే సౌమ్యకి మంచి కంపెనీలో ఇంటర్వ్యూకి పిలుపొచ్చింది. ఆ రోజు సాయంత్రం వెలిగిపోతున్న మొహంతో, చేతిలో స్వీట్స్ ప్యాకెట్‌తో యింటికి వచ్చిన సౌమ్యని చూస్తూనే మా అత్తయ్య ”కంగ్రాట్స్ సౌమ్యా, నీ మొహంలో మెరుపులు చూస్తేనే తెలుస్తోందమ్మా, నువ్వెళ్ళొచ్చిన ఇంటర్వ్యూ సక్సెస్ అయిందనీ, నీకు ఉద్యోగం వచ్చిందనీ. ఉండమ్మా, నోరు తీపి చేస్తాను” అంటూ లోనికి వెళ్ళింది.
”హార్టీ కంగ్రాచ్యులేషన్స్ సౌమ్యా. బై ద వే జాబ్ వచ్చింది సరే, మరి అందులో చేరేదీ, లేనిదీ మీ వారినడిగి చెబుతావా” అంటూ నేను చేస్తున్న వేళాకోళానికి మనసారా నవ్వేస్తూ ”ఉద్యోగంలో చేరడమా, మానడమా అనేది పూర్తిగా నా స్వవిషయం మిస్ నవ్యా. అది నేనే నిర్ణయించుకుంటాను, అందులో మరొకరి ప్రమేయం ఎంత మాత్రమూ ఉండదు” అని ధీమాగా చెబుతున్న సౌమ్యని చూస్తూ ”మైత్రీ యూ ఆర్ గ్రేట్” అనుకున్నాను ఆనందంగా.