పుస్తక ప్రేమికులందరూ ఈ పుస్తకం చదవకపోవడం ఒక తప్పు. చదివాక ఆ అనుభూతిని పంచుకోకపోవడం మరో పెద్ద తప్పు. అందుకే నేను రెండు తప్పులూ చేయదల్చుకోలేదు. నంబూరి పరిపూర్ణ గారి గురించి నాకు అసలు ఏమీ తెలియదు. కూకట్‌పల్లిలో ఉన్న ఆలంబన అనే సంస్థ ఆవరణలో నేను వారి కుటుంబంలో మొదటగా కలిసింది దాసరి శిరీష గారిని, తరువాత విజయవాడలో దాసరి అమరేంద్ర గారిని. ఆ సమయంలోనే శిరీష గారి కథా సంపుటి ”మనోవీథి” అమరేంద్ర గారి ”అండమాన్ డైరీ” పుస్తకాలతో పాటు పరిపూర్ణగారి ”శిఖరారోహణ” కూడా తీసుకోవడం జరిగింది. ”వెలుగు దారుల్లో” పుస్తకావిష్కరణ అని తెలియగానే ఆటోబయోగ్రఫీల మీద నాకున్న సహజాసక్తి కొంత, ఆ కుటుంబంతో
ఉన్న పరిచయం మరికొంత ఆ పుస్తకం మీద ఆసక్తిని కలిగించాయి. అయితే అనుకోకుండా సాక్షిలో వచ్చిన ఒక చిన్న సమీక్ష చూశాక పుస్తకం చదవకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాను. ఏకబిగిన కాకపోయినా 3 దఫాలుగా 250 పేజీలని పూర్తి చేశాను.
నాలుగేళ్ళ క్రితం కొండపల్లి కోటేశ్వరమ్మగారి ఆత్మకథ ”నిర్జన వారధి” చదివినప్పుడు ఎంత ఉద్విగ్నత కలిగిందో దానికి రెట్టింపు ఈ పుస్తకం చదువుతున్నప్పుడు కలిగింది. ఎంత కాదనుకున్నా ఈ జీవిత కథని ”నిర్జన వారధి”తో పోల్చకుండా
ఉండలేము. దీనికి మొదటి కారణం కమ్యూనిస్టు నేపథ్యం, రెండవది ఇరు జీవితాల్లో
ఉన్న సారూప్యత. కామ్రేడ్ దాసరి నాగభూషణం, కామ్రేడ్ కొండపల్లి సీతారామయ్యలు ఇద్దరూ సిద్ధాంత రీత్యా కరడుగట్టిన వామపక్ష నేతలు. ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. కానీ వారి వ్యక్తిగత జీవితాల్ని ప్రజలు ఎప్పుడూ పట్టించుకోలేదు. పరిపూర్ణ గారు తనని ఆదరించిన ప్రతి ఒక్కరినీ గుర్తుపెట్టుకుని పుస్తకం మొదట్లోనే ప్రస్తావించడం ఆవిడ వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. తమ కుల నేపథ్యం, చిన్నప్పటి సినిమా అవకాశం, రాజమండ్రి, కాకినాడల్లో సాగిన చదువు, వామపక్ష ఉద్యమాలు, దాసరి నాగభూషణం గారితో వివాహం, ఆయన వేరుపడిన సంఘటనలు, ఆదరించిన తీరు ఎక్కడా దాపరికాలు లేకుండా అన్నీ వివరించారు.
ఓ రాత్రి ఎన్నడూ కలగని పిరికితనం, దైన్యంతో పక్కింటి బావిలో దూకి చనిపోదామనుకున్న సందర్భంలో తన ముగ్గురు పిల్లల్ని తడిమి చూసుకుని బాల్యం నుండి పార్టీ అందించిన స్ఫూర్తితో ధైర్యం తెచ్చుకుని పిల్లల కోసం మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా దాసరి గారి గురించి తూలనాడలేదు. ఒకట్రెండు సందర్భాల్ని ప్రస్తావించి అక్కడితో వదిలేశారు, పైగా దానికి సహజసిద్ధంగా వచ్చిన భూస్వామ్య మనస్తత్వం అని సమర్ధించారు. ఇద్దరూ అనుకోకుండా ఎదురుపడ్డ సందర్భాల్లో ఆయన ముఖం చాటేసే క్రమంలో తాను మాత్రం నవ్వుకునేదాన్నని చెప్పారు. ఇది ఆవిడకున్న ఆత్మస్థైర్యాన్ని సూచిస్తుంది. దాసరి తనకు అన్యాయం చేశారనే బాధని పదే పదే ఎక్కడా ఉటంకించలేదు. అలా అని తానూ ఎప్పుడూ అనుకోలేదు, పిల్లల మనసుల్లో ఆ భావనని రానివ్వలేదు. దానికి నిదర్శనం శిరీష వివాహానికి ఆహ్వానించడానికి అమరేంద్ర వెళ్ళడం.
లైజాన్ ఆఫీసర్‌గా ఏలూరు జీవితం, హైదరాబాద్‌లో కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా మురికివాడల జీవితాల్లో వెలుగుకి కృషి చెయ్యటం, పదవీ విరమణ తరువాత మహిళా సంఘం స్థాపించి తాను నివసించిన కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి, ఇలా ఎన్నో విభిన్న దారుల్లో సాగింది ఆవిడ జీవితం. ఆనాడైనా, ఏనాడైనా విద్యే ఏ మనిషి అభివృద్ధికైనా కారణం అని పరిపూర్ణగారి జీవితం మనకు చెబుతుంది. విద్యాగంధం ఉన్న మనిషిని సమాజంలో ఉన్న ఏ అసమానతలు, ఆధిక్యతలు ఆపలేవని మరోసారి ఈ పుస్తకంలో రుజువైంది. 86 సంవత్సరాల ”పరిపూర్ణ”మైన జీవితాన్ని చూసిన ఆత్మకథ ఈ ”వెలుగుదారుల్లో”. అసలు ఈ పుస్తకానికి వెలుగుదారుల్లో అనే పేరుకంటే ”శిఖరారోహణ” అనేది సరైన పేరు. ఎందుకంటే ముగ్గురు బిడ్డలతో చీకటి దారుల్లో పరిపూర్ణగారు చేసిన ”శిఖరారోహణ” ఈ పుస్తకం. చివరికి శిఖరాగ్రం చేరి విజయగర్వంతో తన తరువాతి తరాల్ని సమాజంలో నిలిపిన ప్రజ్ఞాశాలి శ్రీమతి నంబూరి పరిపూర్ణ.