”మేడమ్ మాకు యే పెన్షనొస్తలేదు. గవురు మెంటు ఆసరా పెన్షన్ కింద విడో పెన్షన్ లని, ఓల్డేజి పెన్షన్‌లని, యింకా వికలాంగుల పెన్షన్‌లిస్తంది, గాని మాకు ఏ పెన్షన్ వస్తలేదు.
మేము దేవుని పెండ్లాలమట, దేవుడు సస్తేగాని మాకు విడో పెన్షన్‌లు రావట. ఆ లేని దేవుడు యెన్నడు సావాలె… మాకు పెన్షన్‌లు యెప్పుడు రావాలె. మాకు విడో సర్టిఫికెట్లు, ఓల్డేజి సర్టిఫికెట్లిస్తలేదు, అదేమంటే మీరు జోగిండ్లు అంటండ్రు మేమేం జెయ్యాలె యెట్ల బత్కాలె.
మమ్ముల ప్రత్యేకంగా బెట్టి జోగినీ పెన్షన్ యివ్వాలె.
ఆఫీసుల పోంటి తిరుగుతాంటె ఆఫీసర్లేమో ”అరే మేమేం జెయ్యాలె, ‘ఆసరా’ పథకంలో జోగినీలకియ్యాలెనని లేదు. విడో సర్టిఫికెట్ తెచ్చుకోండ్రి ఇస్తమని అంటండ్రు. లేని దేవునితోని ముడిబెట్టి మాకేందీ సెరలు.” అని జాతీయ మహిళా కమిషన్ (2015లో అనుకుంట) హైద్రాబాద్‌లో జోగినీలపై పెట్టిన మీటింగులో జోగినీల మొత్తుకోల్లు.
ఆ మొత్తుకోల్లు విన్న జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ యింకా సభ్యులంతా ‘యిట్లాంటి జోగినీ వెతలు విని ‘మేము ఒంటరి మహిళల్లో జోగినీలను చేర్చమనీ, జోగినీలను ఒంటరి మహిళలుగా పరిగనించమని ప్రభుత్వాలకు సిఫారసు చేస్తామని చెపితే… ఆ రోజున జోగినీ మహిళలు పెద్ద ఎత్తున లేచారు. ”మమ్మల్ని ఒంటరి మహిళల కింద చూడొద్దు. అంతకుమించి క్రూరత్వాలను యీ కుల, మత సమాజాన్నుంచి ఎదుర్కుంటున్నము.
ఒంటరి మహిళలంటే పెండ్లిగాని మహిళలు, మొగడు సచ్చిపోయినోల్లు, విడాకులు తీసుకున్నోల్లనుకుంటే… మాకు దేవునితోని పెండ్లయితది, దేవుడు బతికిండో సచ్చిండో యెవ్వరికి తెల్వది, విడాకుల ముచ్చటే లేదు.”
”మాకు భర్తలుండరు, తండ్రు లుండరు. ఫలానావాడు నా భర్త, ఫలానా వాడు నా తండ్రి అని చెప్పుకొనే గౌరవాలు, రక్షణలు వుండయి”.
”మా మాదిగ కులం ఆడవాల్లే నూటికి 95 మందిని జోగినీలను జేస్తుండ్రు”
‘రఘునాథరావు కమిషన్ లెక్క తేల్చినట్లు మేము 50 వేల మందిమి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాము.’
‘జోగిని లేని ఊరు జోలెబట్టి బిచ్చమెత్తుదాట, జోగిని ఉన్న ఊరు సంపద లతో పంటలతో పచ్చగుంటదాట. ఊల్లె మా కులం ఆడవాల్లనే యీ జోగినీ రొంపిలకు దింపి మమ్ముల ఊరు మొగాల్లందరికి
ఉంపుడుగత్తెలన్జేసిండ్రు. ఉంపుడు గత్తెలకన్నా పైసలిస్తరు. మాకు పైసలిచ్చే కట్టడి గూడ లేదు’.
ఒంటరి మహిళలుగా ఉన్న అవివాహితులు, విడోలు, డైవర్సీలు మల్లా పెండ్లి జేసుకోవచ్చు. కాని మాకు… ఏ మానవమాత్రుడు మమ్మల్ని పెండ్లి చేసుకోవద్దు, మాకు తాలిగట్టిన మొగోడు తనువు చాలిస్తడట. మాకు పెండ్లీలు నిషేధం. కనపడని దేవునితో పెండ్లిచేసి, కనిపించే మనుషులతోని మాకు పెండ్లీలు నిషేధాలు యీ కుల సమాజంలో”.
జోగినీలంటేనే వ్యవస్థీకృతంగా ఎప్పుడైనా, ఎక్కడైనా ఏ మగవాడైనా లైంగికంగా వేధించొచ్చు, రేప్ చేయొచ్చు. అది తప్పుగా చూడరు.
‘ఒంటరి మహిళలు వారిమీద లైంగిక వేధింపులు జరిగితే కేసుబెట్టొచ్చు, పోలీస్టేషన్‌కు పోవచ్చు’.
‘కాని మా జోగినీల మీద లైంగిక వేధింపులు గాదు లైంగిక దాడులు నిత్యం జరిగినా కేసు కట్టరు, పోలీసులు కేసు రాయరు. ‘మీ పనే అది గదా కేసేమని రాయాలె? మీరు మామూలు ఆడోల్లయితే వేధింపులు, అత్యాచారాలు వర్తిస్తయి, జోగినీ అంటేనే మీకు అవి మామూలు. అది ఆచారంగా ఉన్న వాటిమీద ఏమని కేసు రాస్కోవాలె పోండ్రిపోండ్ర’ని చీత్కరిస్తుంటరు.
‘ఒంటరి మహిళలంత సాదా సీదా జీవితాలు కావు మాయి. మేము డైవర్సీ మహిళ కింద, భర్త చనిపోయిన మహిళ కింద, పెళ్ళికాని మహిళల కింద స్టేటస్ రాదు అంతకన్నా క్రూరమైన ఆర్థిక, సామాజిక కుల జెండర్ జీవితాలు మాయి” అని విముక్త జోగినీలు ఆనాడు జాతీయ మహిళా కమిషన్ ముందు మొరపెట్టుకున్నరు. మాకు ఏ పెన్షన్ లేదు, మాకు ఒంటరి మహిళలకు మించిన ప్రత్యేక రక్షణలు, ఆర్థిక ఆలంబనాలు కావాలన్నారు’.
తర్వాత ఆజమ్మ, నర్సమ్మ, ఈశ్వరమ్మ, నిర్మలమ్మ, పద్మమ్మ, కిష్టమ్మ, మణెమ్మ, బాలకిష్టమ్మ, మైబమ్మ, కౌసల్య, చెన్నమ్మలాంటి విముక్త జోగినీలు సెక్రటేరియట్ చుట్టూ తిరిగి మాకు పెన్షన్‌లు కావాలె, ఆసరా పథకంలో మమ్మల్ని ప్రస్తావించలేదని, మాకు పెన్షనివ్వడం లేదని మహిళా శిశు సంక్షేమ సెక్రెటరీని, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ సెక్రెటరీని కలిసి అర్జీలు పెట్టుకొన్నరు. సంక్షేమభవన్ చుట్టూ తిరిగారు, తర్వాత ప్రెస్‌క్లబ్‌లల్లో మీటింగులు బెట్టి తమ గోడు వెల్లబోసుకున్నరు. ప్రభుత్వంలో ఉన్న ప్రముఖులనందర్ని కలిసి మాట్లాడిండ్రు.
యీ మహిళలు ఉద్యమంగా చేసిన ప్రయత్నాలు కొంతవరకు ఫలించినట్లు ‘ఒంటరి మహిళా ఫించన్’ జాబితాలో జోగినీ మహిళలను కూడా చేర్చడం ఒక ఊరట. కానీ ఆసరా పథకం కింద ఒంటరి మహిళ ఆర్థిక సహాయం కొరకు యిచ్చే దరఖాస్తు ఫామ్‌లో తండ్రి/భర్త పేరు కాలమ్, వైవాహిక స్థితి కాలమ్‌లో వివాహిత/అవివాహిత/డైవర్సీ మహిళ కాలమ్‌తో పాటు జోగినీ మహిళ కాలమ్ గానీ లేదా జోగినీలకు ప్రత్యేక ఫారమ్‌గానీ యిస్తే బాగుంటది. అట్లా లేనందుకు… ఆయా కాలమ్ ప్రశ్నలడిగి దేనికి చెందుతారు అని వేధిస్తున్నారని జోగినీ మహిళలు రోదిస్తున్నరు. వారి రోదన ఎవరి చెవులకెక్కుతయి?