”ఐ లవ్‌ రెవల్యూషన్‌!” -మమత కొడిదెల

రెండు నెలల క్రితం ఒక శీతాకాలం మధ్యాహ్నం చలిగాలిలో ఒక ఇంటి ముందు నిలుచున్నాం నేను, పొర్టరికన్‌ కవి మిత్రుడు అన్హెల్‌ మార్టినెజ్‌ (Angel Martinez). ఇంటిముందున్న పోలీస్‌ వ్యాను లోంచి ఒక పోలీస్‌ ఆఫీసర్‌ దిగింది. ఆ ఆఫీసరుకు ఏం చెప్పాలో తేల్చుకోకముందే, ”వాళ్ళు స్నేహితులే” అన్న మాట వినిపించింది. తలెత్తి చూస్తే నవ్వుతూ ఆమె! మీనా బరాక!!

అన్హెల్‌ ఆమెకు తొంభైల నుంచి తెలుసు. నేను కూడా అంతకాలంగా తెలిసినట్లు, షేక్‌హ్యాండ్‌ కోసం చెయ్యి అందించే బదులు ప్రేమగా దగ్గరికి తీసుకుంది.

”మేయర్‌ తల్లి ఇంటికి పోలీస్‌ కాపలా” అంటూ, మా చలి కోట్లు పెట్టుకునే జాగా చూపించింది. అమీనా కొడుకు ర్యాస్‌ బరాక ఈ మధ్యనే ”న్యూఆర్క్” నగరానికి మేయర్‌గా ఎన్నికయ్యాడు. న్యూఆర్క్ పట్టణం న్యూజెర్సీ రాష్ట్రంలో పెద్ద నగరాల్లో ఒకటి, పొలిటికల్‌గా అతి ముఖ్య నగరం.

చలికోట్లను హ్యాంగర్స్‌కు తగిలించి ముందు గదిలోకి అడుగుపెట్టగానే కళ్ళు జిగేల్మన్నాయి. పుస్తకాలు… ఎన్నో! ఎన్నెన్నో!! ఎన్నెన్నెన్నో!!! అరల నిండా, ఫైర్‌ ప్లేస్‌లో కూడా రెండు అరలు చేసి దాని నిండా, కింద గోడల పక్కన… ఎటు చూసినా పుస్తకాలు. అందంగా తీర్చిదిద్దినట్లున్న అల్మైరాలో కాదు. నేలమీద ఒకదానిపై ఒకటి, పుస్తకం పేరు తెలిసేట్టుగా ఉన్నాయి. ఆర్డర్‌ ఇన్‌ డిసార్డర్‌. పుస్తకాలు లేనిచోట ఆఫ్రికన్‌ ఆర్ట్‌. అన్ని పుస్తకాల మధ్య ముక్కిపోయిన వాసన కాకుండా ఇల్లంతా మట్టి వాసన.

పక్క గదిలోంచి మ్యూజిక్‌. సన్నగా మృదుమధురంగా లేదు, కర్కశంగానూ లేదు. కొద్దిసేపు అటూ ఇటూ తచ్చాడి మ్యూజిక్‌ గదిలోనే కూర్చున్నాం.

అమీనా తను చదివిన కవితల సీడీ పెట్టి మా కోసం జ్యూస్‌ తీసుకురావడానికి కిచెన్‌లోకి వెళ్ళింది.

డ్రమ్స్‌, శాక్సాఫోన్‌ వాయిద్యాల నడుమ ఒక్కోసారి పాడుతూ, ఒక్కోసారి ఎలుగెత్తి చాటుతూ, కవిత్వం చదువుతున్న సీడీ అది. తనకు ఏమంటే ప్రేమో చెబుతున్న కవితలో, ఒక చోట ఆగింది. రెండు క్షణాలు నిశ్శబ్దం గదినిండా పరుచుకుంది. అంతలో దృఢంగా ఆమె గొంతు వినిపించింది, ‘ఐ లవ్‌ రెవల్యూషన్‌!’.

నా వెన్నులో వణుకు.

”ఐ లవ్‌ రెవల్యూషన్‌!”

అదేదో రొమాంటిక్‌గా అన్న మాట కాదు.

నలభై ఏళ్ళకు పైగా తాను నమ్మిన సిద్ధాంతాల పట్ల, పోరాటం పట్ల ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మొక్కవోని తపన, ఆశ ఆ ఒక్క మాట అంటున్న ఆ గొంతులో. ఆమె గురించి నా మనసులో ఏవన్నా ఎల్లలు ఏర్పరచుకుని ఉంటే ఆ క్షణంలో అవన్నీ మాయమైపోయాయి.

కవిత్వ పఠనం సాగిపోతూనే ఉంది. నాకు ఇక ఏదీ వినిపించలేదు. అన్హెల్‌ అది గమనించినట్లున్నాడు. తన పక్కనే ఉన్న పుస్తకాల దొంతరలోంచి ఒకదాన్ని తీసి, మధ్య పేజీల్లో ఉన్న ఫోటోలు చూపించాడు. ఏదో ప్రొటెస్ట్‌ మార్చ్‌. ఒక చెయ్యి భర్త అమిరి బరాక చేతిలో, మరొక చేతిలో ఒక పసిపిల్లవాడ్ని ఎత్తుకుని. ఫోటోలు, కాప్షన్స్‌ చదువుతుండగా జ్యూస్‌ గ్లాసులు పట్టుకుని వచ్చింది అమీన.

ఆమె మా ముందు కొంచెం సర్దుకుని కూర్చోగానే చెప్పాను. ”మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నా అమీనా. ఇంటర్వ్యూ అనుకోండి. మీ జీవితం నుంచి మేం నేర్చుకోవలసింది చాలా

ఉంది. అయితే నా దగ్గర ప్రశ్నల జాబితా ఏమీ లేదు. ఒక్కోసారి ఉద్యమానికి సంబంధించని పర్సనల్‌ విషయాలు దొర్లొచ్చు”.

”ఏం ఫర్వాలేదు” చిరునవ్వుతో అన్నది. ఆమె ముఖంలో ఎప్పుడూ నవ్వు, కళ్ళల్లో మెరుపు ఉండడం గమనించాను.

”మొట్టమొదట నన్ను తొలుస్తున్న ప్రశ్న. మీరు పెయింటర్‌, నటి, కవయిత్రి, సింగర్‌. మీకు మీరుగా కొన్ని స్వచ్ఛంద సంస్థలను, వాటిలో కూడా మహిళల కోసం ప్రత్యేక విభాగాలు స్థాపించారు. అయినా, మిమ్నల్ని అమిరి బరాక భార్యగానే గుర్తిస్తారని, అమిరి నీడలో ఉన్నట్లు అనిపించిందా? మీ ఉద్యమ జీవితం అమిరి బరాకను కలిశాకే మొదలయ్యిందా?

”నేను అమిరిని సామాజిక కార్యకర్త అయిన ఒక మిత్రుడి ఇంట్లో మొదటిసారి కలిశాను. అప్పటికే నేను క్రియాశీల రాజకీయాల్లో ఉన్నాను. ఆ మిత్రుడు కూడా పెయింటర్‌. నన్ను అమిరికి పెయింటర్‌గానే పరిచయం చేశాడు. మేం కలిసి పనిచేస్తూ మంచి స్నేహితులమయ్యాం. అటు తర్వాత ప్రేమ, పెళ్ళి. ఇక నీడ అంటావా? అది మంచి నీడ. అమిరి నన్ను వంటగదికో, పిల్లల గదికో పరిమితం చెయ్యలేదు. పిల్లలు మరీ చిన్నవాళ్ళైనప్పుడు తప్ప, ఎప్పుడూ తన పక్కన పని చేశాను. ఇద్దరం కలిసి కొన్ని మంచి పనులు చేశాం, నాకు నేనుగా చేసిన వాటికి కూడా తను చాలా సహకరించాడు. ఎంత పని చేసినా సరే, నీకు గుర్తింపు రావాలంటే నువ్వు ఎవరితో సలుకుంటున్నావు, నీ పక్కన నడుస్తున్నవారెవరు అన్నది ముఖ్యం. అది మంచి విషయం కాదు, కానీ లోకం అట్లా ఉంది మరి. అమిరి నా భర్త కాకపోయి ఉంటే నా గురించి, నా పని గురించి ఎవరికీ తెలిసేది కాదేమో. అయితే, ఏ గుర్తింపు లేకపోయినా, దానికోసం పాకులాడకుండా సమ సమాజం కోసం జీవితమంతా పనిచేసే ఎంతోమందిలో నేనూ ఒకదాన్నై ఉండేదాన్నని ఖచ్చితంగా చెప్పగలను. ఇంతకీ అమిరికి కూడా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఎట్లా వచ్చిందో తెలుసా? 1967 న్యూయార్క్‌ జాతి కలహాల్లో అమిరి అరెస్టయ్యాడు. రాడికల్‌ పొయట్‌గా అప్పటికే అమిరి మీద పోలీసు నిఘా ఉంది. తన కవిత్వ పఠనాన్ని, తను డైరెక్ట్‌ చేస్తున్న నాటకాలను అడ్డుకోవడం లాంటివి చేసేవాళ్ళు. అరెస్ట్‌ చేస్తూ తనను బాగా కొట్టారు. జైలులో చంపేస్తారని భయపడ్డాం. ఇంతకీ అమిరిని జైలుకు తీసుకెళ్ళకుండా పోలీస్‌ ఆఫీసర్‌ ఇంటికి తీసుకెళ్ళి కొట్టారు. అమిరి స్నేహితుడు, ప్రముఖ కవి అయిన అల్లెన్‌ గిన్స్‌బర్గ్‌ (Allen Ginsberg)కు ఫోన్‌ చేసి అరెస్ట్‌ గురించి చెప్పాను. అతను సాత్ర్‌ (Jean – Paul Satre)కు ఫోన్‌ చేశాడు. సాత్ర్‌ పోలీసులకు ఫోన్‌ చేయడం, అదే సమయంలో అమిరిని కొడుతుండడం చూసిన జనం ఆ ఇంట్లోకి చేతికి దొరికిన వస్తువులను విసరడం వల్లనే అమిరి బతికి బయటపడ్డాడు. సాత్ర్‌ ఫోన్‌ చెయ్యకపోయి ఉంటే అమిరి బతికేవాడు కాదని అనుకుంటాను”.

అప్పుడే మ్యూజిక్‌ ప్లేయర్‌ నుంచి ప్రముఖ కవయిత్రి, సివిల్‌ రైట్స్‌ యాక్టివిస్ట్‌ జేన్‌ కోర్టెజ్‌ (Jayne Cortez) గురించిన కవిత మొదలయింది. ”ఈ కవిత నాకు చాలా ఇష్టం” అంటూ మాటలు ఆపింది. జేన్‌ కోర్టెజ్‌ పేరు వినగానే తనకు గుర్తొచ్చే విషయాల గురించిన కవిత. అమీనా కవితలన్నీ కొన్ని అంశాల చుట్టే తిరుగుతుంటాయి – జాతి, లింగ వివక్షలు, సమ సమాజం, పోరాటం.

కవిత పూర్తయ్యాక చెప్పింది. ”జేన్‌ కోర్టెజ్‌ నా ప్రాణ స్నేహితురాలు. ఇద్దరం కలిసి ఎన్నోఉద్యమాల్లో పాల్గొన్నాం. తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంది కానీ ఎప్పుడూ కుంగిపోలేదు. తన గురించి కాకుండా తన కామ్రేడ్స్‌ బాగు గురించి ఎక్కువగా పట్టించుకునేది. ఎంతో బలమైన కవిత్వం రాసింది. ఉన్నది ఉన్నట్లుగా, ఆత్మపరిశీలన చేసుకునే విధంగా ఉంటాయి ఆమె కవితలు. బ్లాక్‌ ఆర్ట్స్‌ మూవ్‌మెంట్‌కు జేన్‌ లాంటి కళాకారులు, కార్యకర్తల వల్లనే మంచి పేరు వచ్చింది”.

బ్లాక్‌ ఆర్ట్స్‌ మూవ్‌మెంట్‌ను అమిరి బరాక ప్రారంభించారు. 1965లో మాల్కమ్‌ ఎక్స్‌ (Malcolm X) చనిపోయిన తర్వాత బ్లాక్‌ పవర్‌ మూవ్‌మెంట్‌లో పాల్గొన్నవాళ్ళు రెండు బృందాలుగా విడిపోయారు. ఒక బృందం విప్లవ జాతీయ వాదులైతే, మరో బృందం సాంస్కృతిక జాతీయ వాదులయ్యారు. మొదటి బృందం బ్లాక్‌ పాంథర్‌ పార్టీగా గుర్తింపు పొందింది. రెండో బృందం కవిత్వం, పాట, నాటకాలు, కథ, నవలా ప్రక్రియల ద్వారా నల్లవారిలో చైతన్యం తీసుకురావాలని సంకల్పించింది. ఈ రెండవ బృందం బ్లాక్‌ ఆర్ట్స్‌ మూవ్‌మెంట్‌గా పేరు తెచ్చుకుంది. అప్పట్లో అమిరి పేరు లెరోయ్‌ జోన్స్‌. అమీనా పేరు సిల్వియా జోన్స్‌. ఈ మూవ్‌మెంట్‌ మొదలుపెట్టిన తర్వాతే అమిరి, అమీన అని పేర్లు మార్చుకున్నారు.

అయితే 1975 తర్వాత ఇద్దరి రాజకీయ దృక్పథంలో మార్పు వచ్చింది. నల్ల జాతీయత నుంచి మార్క్సిజంవైపు మళ్ళారు. వీళ్ళతో పాటు మాయా ఏంజెలో, జేమ్స్‌ బాల్డ్విన్‌ కూడా మార్క్సిజం వైపు మొగ్గు చూపడంతో బ్లాక్‌ ఆర్ట్స్‌ మూవ్‌మెంట్‌ మరుగున పడిపోయింది.

”ఒక్కసారి ఊహించు” అమీనా నవ్వుతూ అంది. ”ఆఫ్రికాలో ఉండి ఆఫ్రికా జాతీయత, నల్ల జాతీయత అంటే ఒక అర్థముంది. ఈ దేశంలో ఉండి నల్ల జాతీయత అంటే ఏమన్నా అర్థముందా? తెల్లవాళ్ళను పక్కను పెట్టు, ఆదివాసీ తెగలవాళ్ళు ఎక్కడికి పోతారు? నల్లవారి హక్కుల కోసం పోరాటంలో అర్థముంది. పోరాడాల్సిన అవసరం ఉంది. అయితే అది జాతీయత కోసం కాదు. అసమానతలు తొలగి, సమానత్వం సాధించుకోవడానికి. ఆ పోరాటం మార్క్సిజం ద్వారానే సాధ్యమవుతుందని మేం నమ్మాం”.

”మీరు కూడా చెరొకీ తెగకు చెందినవారు కదా?” అని హఠాత్తుగా గుర్తొచ్చి అడిగాను. చెరొకీ తెగ అమెరికాలోని ఆదివాసీ తెగల్లో ప్రముఖమైనది.

”నేను కాదు కానీ, మా ముత్తవ్వ చెరొకీ. మా ముత్తాత నల్లవాడు. మా అమ్మమ్మ తర్వాత చెరొకీ పద్ధతులేవీ ఇంట్లో పాటించలేదు. నన్ను మా అమ్మమ్మ పెంచింది. ఆమె మొత్తం కమ్యూనిటీకే అమ్మలా ఉండేది. ఆమెను సలహాలు అడగడానికీ, సహాయం కోసం ఎప్పుడూ ఎవరో ఒకరు ఇంటికి వచ్చేవారు. ఆమె కూడా చిన్న చిన్న పార్టీలు అరేంజ్‌ చేసేది”.

గేదరింగ్‌లకు ఆతిథ్యమివ్వడం అంత చిన్నప్పుడే నేర్చుకున్నట్లుంది అమీనా. మేం ఇప్పుడు కూర్చున్న ఆ ఇంట్లోనే ఎంతోమంది నూతన కళాకారులు ఆరంగేట్రం చేశారు. మహిళల కోసం, ప్రత్యేకంగా నల్లజాతి మహిళల కోసం ఒక సంస్థను ఏర్పాటు చేసింది అమీనా. అట్లాంటి ఒక సంస్థలో పనిచేసేటప్పుడు అక్కడికి వచ్చే పిల్లలకు చదవడం రాదని తెలుసుకుని ఆ పిల్లలకు చదవడం నేర్పడానికి మరొక సంస్థను ఏర్పాటు చేసింది. ఆ ఇంట్లోనే ఎన్నో ఆలోచనలు ఆచరణలోకి వచ్చాయి.

”మీమీద అమ్మమ్మ ప్రభావం గురించి చెప్పండి?”

”నేను చిన్నప్పుడే చురుగ్గా ఉండేదాన్ని. ఇంటికి వచ్చినవాళ్ళముందు నాటకాలు వేయడం, పాటలు పాడడం, డ్యాన్స్‌ చేయడంవంటి అటెన్షన్‌ కోరుకునే పనులు చేసేదాన్ని. మా అమ్మమ్మ నన్ను ప్రోత్సహించేది. ఆమెవల్లనే నాకు బిడియం పోయింది. ఎన్నో విషయాలు త్వరగా నేర్చుకున్నాను. తలబిరుసు కూడా. పద్దెనిమిదేళ్ళు రాగానే ఇల్లొదిలేశాను. త్వరలో పెళ్ళి కూడా అయింది. ఇద్దరు పిల్లలు పుట్టాక విడాకులు తీసుకున్నాను. ఆ తర్వాతే అమిరి కలిశాడు. ఏదేమైనా నాకు కూడా మా అమ్మమ్మలా అతిథ్యం ఇవ్వడం ఇష్టం. నాకు తోటపని అంటే ఇష్టం లేదు కానీ, మా అమ్మమ్మ వల్లనే ఇంట్లో మొక్కల్ని జాగ్రత్తగా కాపాడుకునే మెలకువలు తెలిశాయి. ఆ మొక్కల్ని తాకినప్పుడల్లా అమ్మమ్మ గుర్తొస్తుంది. మా అమ్మాయి షాని కూడా గుర్తొస్తుంది.”

షాని! ఆమె పేరు ఎత్తకూడదని, అదే సమయంలో ఆమె విషయంలో కూడా తన పంథాను మార్చకుండా ఎలా దృఢంగా నిలబడగలిగిందో అడగాలనీ అనుకున్నాను. ఎంతో ఆలోచించాక ఆమె ప్రస్తావన తీసుకొచ్చే ధైర్యం నాకే లేదని అనిపించింది. అమీనా, అమిరిల రెండవ కూతురు షాని. మొదటి కూతురు వాండా విల్సన్‌. వాండా తన భర్త జేమ్స్‌ కోల్మన్‌ పెట్టే హింసలు భరించలేక విడాకులు తీసుకుంది. షాని లెస్బియన్‌. తన పార్టనర్‌ రేషోన్‌తో కలిసి ఉండేది. వాండా విడాకుల తర్వాత షాని పార్టనర్‌తో కలిసి ఒక ఇంట్లో ఉంది. వాండాను మానసికంగా కోలుకోలేని దెబ్బకొట్టాలని ఎదురుచూస్తున్న జేమ్స్‌ ఒకరోజు వాండా ఇంట్లో లేని సమయంలో ఇంట్లో దూరి షానిని, ఆమె పార్టనర్‌ని కాల్చి చంపాడు. బరాక ఇంట్లో షాని అంటే ప్రత్యేకమైన ప్రేమ. ఆమె మరణం ఇంటిల్లిపాదినీ కృంగదీసింది. అంతటి విషాదంలో అమినాకు మరో పరీక్ష ఎదురయింది.

గుండె దడదడలాడుతుండగా, అడగొద్దు అనుకుంటున్న ప్రశ్న అడిగాను – ”మీరు మరణశిక్షకు వ్యతిరేకంగా పోరాడారు కదా. అయితే స్వంత కూతురి విషయంలో కూడా మీ పంథా మార్చుకోలేదు. అంత గట్టిగా ఎలా ఉండగలిగారు?”.

ఆమె నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పింది, ”మరణశిక్ష తప్పు అని మనస్ఫూర్తిగా నమ్మాను. మరణశిక్షకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో నేను, అమిరి ముందు ఉండేవాళ్ళం. కూతురు ఈ విధంగా చనిపోవడంతో తట్టుకోలేని అమిరి కూడా మరణశిక్ష కావలసిందే అంటూ కొన్ని రోజులు అన్నాడు. దృఢంగా నిలబడడానికి నేను చేసిన ప్రత్యేక ప్రయత్నమంటూ ఏమీ లేదు. అలా ఆలోచించడం చాలా సహజం అనిపించింది. ఒకరికి ఒక రకంగా చెప్పి, నా వరకు వచ్చేసరికి ఇంకోరకంగా ఎలా ప్రవర్తించగలను?”

నిజమే కదా. ఒక విషయం పట్ల మన ఆలోచనల్లో, ఆచరణలో మార్పు రావలసింది ఆ విషయం పట్ల అవగాహనతోనే కానీ వ్యక్తిగత కారణాల వల్ల కాదు.

అమీనా చెప్పుకుపోతోంది. ”మరొకరికి ఇలా జరగకుండా జేమ్స్‌ జీవితాంతం జైల్లో ఉండాల్సిందే. మొదట్లో ఆధారాలు లేవని అతనికి శిక్ష పడదని అందరూ అనుకున్నారు. 250,000 డాలర్లు కడితే బెయిల్‌ వస్తుందని కూడా అనుకున్నారు. అతను కోర్టులో తాను నిర్దోషినని చెప్పుకున్నాడు. అతను బయటికి వచ్చి నా మిగతా పిల్లలను చంపేస్తాడని భయపడ్డాను. షానీని చంపకముందే వాండాను చంపుతానని ఎన్నోసార్లు బెదిరించాడు. ఒకసారి ఆమె తలకు గన్‌ గురిపెట్టాడు కూడా. అతడు తను నిర్దోషినని (‘నాట్‌ గిల్టీ’ అని) అనగానే, ”నువ్వేం చేశావో నీకు తెలుసు. నువ్వొక పిరికివాడివి” అని కోర్టులో అరిచాను. తర్వాత అతనే హత్య చేశాడని నిరూపితమైంది. యావజ్జీవ ఖైదు వేశారు. మరణశిక్ష తప్పు అని నేను ఇప్పటికీ నమ్ముతాను”.

ఆ సంఘటన తర్వాత కూ+దీు గ్రూపులకు మరింత అండగా నిలబడ్డారు అమీనా, అమిరి. షాని మరణానికి ముందే ఆ కుటుంబం మరొక దుర్ఘటన నుంచి అప్పుడప్పుడే కోలుకుంటోంది. అందరికంటే చిన్న కొడుకు, అహి బరాక ఒక రోజు కారులో

వెళ్తుండగా ఒక వ్యక్తి ఆ కారుమీదకు కాల్పులు జరిపాడు. ప్రాణాపాయం తప్పింది కానీ, బుల్లెట్‌ తలలో దిగి అహి మెదడు దెబ్బతింది. అతను మంచి కవి. ఆ దుర్ఘటన జరిగాక కూడా తండ్రితో కలిసి కవిత్వ పఠనానికి వెళ్ళేవాడు కానీ, ఎన్నో విషయాలు మర్చిపోతూ చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తాడు.

అమీనా ఇంకో కొడుకు ర్యాస్‌ బరాక ఈ మధ్యే న్యూయార్క్‌ మేయర్‌గా ఎన్నికయ్యాడు. అతను కూడా మంచి కవి. కొన్నేళ్ళ క్రితం షాని జ్ఞాపకార్థం కవిత్వ పఠన కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఇప్పుడు మేయర్‌గా అతను షాని బరాక

ఉమెన్స్‌ రిసోర్స్‌ సెంటర్‌ను ప్రారంభించాడు. గృహ హింసను ఎదుర్కొంటున్న మహిళలకు ఇక్కడ సహాయం దొరుకుతుంది. ఉద్యోగం కోసం ట్రెయినింగ్‌, కౌన్సిలింగ్‌, మానసిక ఆరోగ్య సేవల కోసం మహిళలు ఈ సెంటర్‌కు వెళ్ళవచ్చు. అమీనా మరో ఇద్దరు కొడుకులు కూడా ర్యాన్‌ దగ్గరే మంచి పదవుల్లో పనిచేస్తున్నారు. హక్కుల కోసం తల్లిదండ్రులు వీథిపోరాటం చేస్తే, పిల్లలు ప్రభుత్వ పదవుల్లో ఆ హక్కులను ఒక్కొక్కటిగా సాధిస్తున్నారు.

షాని మరణించిన సంవత్సరంలోనే అమిరి న్యూజెర్సీ పోయెట్‌ లారియేట్‌ పదవిని పోగొట్టుకున్నాడు. ”అమెరికాను ఎవరో పేల్చివేశారు” (Sombody blew up America) అనే కవితలో సెప్టెంబర్‌ పదకొండున వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ కూలిపోయిన రోజు అక్కడ పనిచేసే నాలుగువేల మంది యూదులు పనిలోకి ఎందుకు వెళ్ళలేదన్న ప్రశ్న వేశాడు అమిరి. ఈ కవిత చాలా పెద్దది. దేశంలోనూ, ఇతర దేశాల్లోనూ అమెరికా చేసే అకృత్యాలను ఎండగడుతూ రాసిన కవిత ఇది. మొత్తం కవితలో ఇది అబద్ధమని ఎవరూ ఎత్తి చూపలేరు, ఈ నాలుగు లైన్లు తప్ప. యూదు వ్యతిరేకి అని అమిరికి ఒక పేరు కూడా ఉంది. యూదులకు వ్యతిరేకంగా అన్న ఆ నాలుగు లైన్లవల్ల అప్పటి న్యూజెర్సీ గవర్నర్‌ అమిరిని పదవినుంచి దించడానికి పోయెట్‌ లారియేట్‌ పదవినే తొలగించాడు. ఇంతకీ ఆ మాటను చాలామందే నమ్ముతారు. ”కాన్‌స్పిరసీ” థియరీ కూడా కావచ్చు. కానీ అది నిజమని అమిరి నమ్మాడు.

మన ప్రభుత్వం ఇచ్చిన అవార్డులను కొంతమంది తిరిగి ఇచ్చేసిన జ్ఞాపకాలతో అడిగాను. ”ఈ ప్రభుత్వం ఇచ్చే అవార్డులు, పదవులు ఎందుకు? అది గొప్ప కవిత. ఆ కవితలో చెప్పిన ఎన్నో విషయాలను వదిలేసి, ఒక్కమాట వల్ల పోయెట్‌ లారియేట్‌ పదవినే తొలగించడం ద్వారా వారి నిరంకుశత్వం వెల్లడి కావడం గర్వకారణమే కదా? ఇంతకీ మీరు మీ కవితలను ఒకరినొకరు ఎడిట్‌ చేసుకునేవారా?”

నా మాటలు నమ్మలేనట్లుగా చూసింది అమీనా, ”వాళ్ళు మాకు చాలా బాకీ ఉన్నారు. ఇలాంటి పదవులు నల్లవాళ్ళలో ఎంతోమందికి లేవు. అందుకు కారణం వందల ఏళ్ళకొద్దీ సాగిన బానిసత్వం, తర్వాత వర్ణ వివక్ష. ఇప్పటికీ అదే నడుస్తోంది. తెల్ల కవి ఎవరైనా అలా రాసి ఉంటే కవితను మార్చమనో, క్షమాపణ చెప్పమనో అడిగేవాళ్ళు. నల్లవాడైనందుకు పదవిలోంచి దిగిపొమ్మని చెప్పి, అందుకు అమిరి ఒప్పుకోనందుకు ఆ పదవినే పీకేశారు. అమిరి మొదట ఆ కవిత నాకు వినిపించినపుడే యూదుల ప్రస్తావన తీసేయమని అమిరికి చెప్పాను. పూర్తిగా నిరూపించబడని విషయం గురించి ప్రస్తావించడం తగదని చెప్పాను. నా మాట వినకపోవడం ఎప్పుడో కానీ జరగదు. వినకపోవడం వల్ల నష్టం జరిగిందని, చివరికి ఆ కవితను సరిదిద్ది ఆ నాలుగు లైన్లు తీసేసి ఆ కవితను నాకు అంకితమిచ్చాడు” నవ్వుతూ అంది అమీనా.

ఆమె ముఖంలో అలసట ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. కానీ నాది ఒక ప్రశ్న మిగిలిపోయింది. ఆ మాటే చెప్పాను ఆమెకు. నవ్వుతూ చూసింది. ”ఇట్స్‌ బెటర్‌ బి ఎ గుడ్‌ క్వశ్చన్‌” అన్నట్లు చూసింది. ఊపిరి పీల్చుకుని అడిగాను. ”మీ ఉద్యమ జీవితం వల్ల మీ వ్యక్తిగత జీవితంలో మీరు చేసిన పొరపాట్లేంటి?”

ఆశ్చర్యంగా చూసింది, ”ఏమీ లేవనే అనుకుంటాను…”

”ఇది వ్యక్తిగతమైన ప్రశ్న. నా తల్లిదండ్రులు పార్టీలో పనిచేస్తున్నప్పుడు పదేళ్ళు వాళ్ళకు దూరంగా వేరే ఊర్లో పెరిగాను.

ఉద్యమంలోంచి బయటకు వచ్చిన తర్వాతే నేను వాళ్ళ దగ్గరికి వచ్చాను. నాలాంటి వాళ్ళెందరో. నేను పేద రైతు కుటుంబంలో, అంతకంటే పేదవారైన కూలీల మధ్య పెరిగాను. వాళ్ళు అమ్మా నాన్న చేసే పని గురించి మంచి మాటలు చెప్పేవాళ్ళు. అందుకే ఇప్పుడు ఎప్పుడైనా దారి తప్పినప్పుడు కూడా విప్లవం గురించి ఆశ చావదు. వ్యక్తిగతంగా ఎంత నొప్పిలో ఉన్నా నా లక్ష్యం వేరని అనిపిస్తుంది. అదే ఒక్కోసారి నన్ను బతికిస్తుంది కూడా. కానీ కొంతమంది పిల్లల దారులు పూర్తిగా వేరయ్యాయి. తల్లిదండ్రులకు పూర్తిగా వ్యతిరేకమైన పంథాలో ఉన్నారు. మార్క్సిజాన్ని ఇంట్లో పాటించకపోవడం ఒక తప్పని నా అభిప్రాయం. పిల్లలను పోరాటంలోకి తీసుకెళ్ళాలనేది నా ఉద్దేశం కాదు. కానీ, పాఠాలైతే చెప్పాలి. దేవుళ్ళను నమ్మేవాళ్ళు పిల్లలను పుట్టకముందు నుంచే గుళ్ళకు తిప్పుతారు. మనం కూడా మన పిల్లలకు వివక్ష గురించి, అసమానతల గురించీ తెలియచెప్పాలి కదా? కానీ ఈ పొరపాటు మీరు చేసినట్లు లేదు. పిల్లలను ఎలా మ్యానేజ్‌ చేశారు? ఇలాంటి పొరపాట్లేవైనా మీరు చేశారా?”

ఆశ్చర్యపోతూ నవ్వింది అమీనా. ”ఇలాంటివి… కాదు, సరిగ్గా ఇలాంటి పొరపాట్లే చేశాం.

ఉద్యమంలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు పిల్లలను చూసుకునేవాళ్ళు. పిల్లలకు నా అవసరం ఉందని

ఉద్యమం నుంచి విరామం తీసుకున్నా, వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ వాళ్ళతో లేను. ఉద్యమంతోనే ఉన్నాను. పిల్లల పనులకంటే ముందు ఉద్యమానికి సంబంధించిన పనులు చేశాను.”

నాకు విచిత్రంగా అనిపించింది. ”మరి ర్యాస్‌ మేయర్‌గా మంచి పనులు చేస్తున్నాడు. తన క్యాంపెయిన్‌ స్లోగన్‌ కూడా ‘మనం మేయర్‌ అయినప్పుడు…’ ఆ పదవి తన కోసం కాదని, ”మనం” అని అందరినీ కలుపుకుంటున్నాడు. అలాంటి మాట ఎప్పుడూ వినలేదు”.

”ర్యాస్‌ మంచివాడు. నాకు తన పనిపట్ల గౌరవం ఉంది. ఒకింత గౌరవం కూడా. కానీ అతను MLK (మార్టిన్‌ లూథర్‌ కింగ్‌) లాంటి లీడరు. రెలిజియస్‌. నేనేమో మార్క్సిస్ట్‌ను. తను మార్క్సిస్టు అయి ఉంటే ఇంకా ఎన్నో చేయగలడని అనిపిస్తుంది. ఏం ఫర్వాలేదు, మనకు చేతినిండా పని ఉంది. పనిచేసే స్థైర్యమూ, శక్తీ ఇంకా ఉన్నాయి. సమసమాజం చాలా దూరంలో ఉంది. కానీ మనం దాన్ని తప్పకుండా చేరుకుంటాం. అమిరి కూడా తన జీవితం చివరి నిమిషందాకా ఇలాగే భావించాడు.” ఆమె ముఖంలో కనిపిస్తున్న అలసట ఆమె కంఠంలో లేదు.

”నాకు ఇంత టైమిచ్చారు. థాంక్యూ అమీనా” హృదయపూర్వకంగా చెప్పాను.

మేం చలికోట్లు వేసుకుంటూ ఉండగా, ”నీ పేరు డ్రమ్‌లా ధ్వనిస్తుంది కదూ? మమద మమద మమదా మమద మమద” దరువేస్తూ అన్నదామె. ”మమద కాదు, మమత” అని కరెక్ట్‌ చేయాలనిపించలేదు.

”మళ్ళీ కలుసుకుందాం” అని ఒకరికొకరం మాట ఇచ్చుకుని బయటపడ్డాం. చాలాసేపటిదాకా, నా గుండె దరువేస్తూనే ఉంది. ”మమద మమద మమదా మమద మమద. కదం తొక్కుతూ, పదం పాడుతూ, హృదయాంతరాళం గర్జిస్తూ – దారి పొడవునా గుండె నెత్తురులు తర్పణ చేస్తూ పదండి ముందుకు”.

అమీనా చాలా మంచి కవిత్వం రాసింది. అన్నింటిలోకి సామాన్యమైన కవిత. అయితే

ఉద్యమకారిణిగా ఆమె జీవితాన్ని కొన్ని వాక్యాల్లోకి ఒంపుకున్న కవిత ఇదిగో.

చిట్టచివరి మాట

ఇనుప పాదాలకు బదులు

నా పిడికిలి ఉక్కులాంటిది కావాలనుకుంటాను

అనుభూతిని పోగొట్టుకునే బదులు

నా కన్నీళ్ళతో నేలను తడపగలగాలని అనుకుంటాను

శ్రామికుల భుజాలమీద స్వారీ చేసే బదులు

నా కాళ్ళమీద నేనే నడుస్తాను

బానిసలా బతకడం కంటే

చచ్చిపోవడమే మేలనుకుంటాను

ప్రజలపట్ల పట్టింపులేని పదాలు రాసేకంటే

నా ప్రతిఘటన కవిత్వాలపై విమర్శల్ని ఆహ్వానిస్తాను

నా ‘ప్రచార’ కవిత్వానికి నన్ను వదిలేయండి

స్వేచ్ఛను ఆహ్వానిస్తాయి నా పాటలు

కవిత తరువాత కవిత

నా రాతప్రతులను తిప్పి పంపండి

చెప్పిందే చెప్తున్నానని నాకు చెప్పండి

నిజమే, అణచివేత అనే పదం మరీ ఎక్కువసార్లే ఉపయోగించబడింది

కానీ, ఏమీ చెప్పకుండా ఉండే బదులు

గొంతెత్తి నా ఆక్షేపణను తెలియజేస్తూనే ఉంటాను

నా చిట్టచివరి పదాలు

విప్లవానికి పిలుపునిస్తాయని ఆశిస్తాను.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

2 Responses to ”ఐ లవ్‌ రెవల్యూషన్‌!” -మమత కొడిదెల

  1. ప్రసాద్ చరసాల says:

    చాలా బాగుందండి.
    ఒక ప్రశ్నా-జవాబుల మామూలు మూసలో కాకుండా ఓ కథలా చెప్పడం చాలా బాగుంది.
    చివర్లో “మమద మమద మమదా..” అన్న ట్యూన్ కూడా భలే కుదిరింది.
    ఆ నగరాన్ని న్యుఅర్క్, న్యువర్క్ అని పలుకాలని విన్నానే.

  2. buchi reddy gangula says:

    భాగుంధి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.