(భూమిక నిర్వహించిన కథ, వ్యాసం, కవితల పోటీల్లో తృతీయ బహుమతి పొందిన వ్యాసం)
పటిష్టమైన కుటుంబ వ్యవస్థకు పెట్టింది పేరు మన భారతదేశం. ప్రపంచీకరణ, పెరిగిన జనాభా ప్రభావం కుటుంబ వ్యవస్థ మీద కూడా ఏర్పడింది. స్త్రీలు వంటింటికే పరిమితమైన దశనుంచి స్త్రీలు అన్ని రంగాలలో పురుషులను అధిగమించి దూసుకువెళ్తున్న తరుణంలో అనేక విపత్కర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. అందులో ప్రధానమైంది కుటుంబ హింస.
ఒక వ్యక్తితో కుటుంబ సంబంధంలో ఉండి అతనివల్ల హింసకు గురవడం కుటుంబ హింస కిందకి వస్తుంది. దీనికోసం 2005లో ఒక సివిల్ చట్టం ఏర్పడింది. జమ్ము కాశ్మీర్ తప్ప దేశమంతా ఈ చట్టం పరిధి కిందకు వస్తుంది. స్త్రీ తన కుటుంబంలోని మగవారు భర్త, బావ, మరిది, అన్నదమ్ములు, మామ, కొడుకు, అల్లుడు, తండ్రి జరిపే ఎటువంటి హింసనుంచైనా మహిళలకు రక్షణ కల్పించేందుకు ఈ చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు స్త్రీలకు వరకట్న వేధింపుల చట్టం మాత్రమే ఉండేది.
గృహ హింస వివిధ రూపాలలో ఉంటుంది. మొదట చెప్పుకోవలసింది శారీరక హింస. కొట్టడం, గాయపరచడం, చంపే ప్రయత్నం మొదలైనవి. రెండవది లైంగిక హింస. భార్య ఇష్టానికి వ్యతిరేకంగా వివిధ రూపాలలో హింసించడం, ఇతర కుటుంబసభ్యులు లైంగికంగా అత్యాచారాలు చేయడం, అక్రమ సంబంధాలు అంటగట్టడం ఇతరత్రా. మూడవది ఆర్థికపరమైన హింస. ఇది నగదు, వనరులు, స్త్రీ ధనం దక్కకుండా హింసించడం, వ్యాపార లావాదేవీలలో వాటాలు ఇవ్వకుండా నగదుపరంగా, ఆస్తుల కేటాయింపులలో రావలసిన షేర్లు, సెక్యూరిటీ బాండ్లు ఇవ్వకుండా హింసించడం వంటివి. నాల్గవది మానసిక హింస. ఇది కంటికి కనిపించని గృహ హింస. కుటుంబంలో తిట్టడం, అవహేళన చేయడం, ఏదో ఒక రూపంలో అవమానించడం వంటివి మానసికంగా గృహ హింసకు దారితీస్తాయి. ఐదవది ఆధ్యాత్మిక హింస. కుటుంబంలో ఇష్టంలేని మతపరమైన ఆచారాన్ని పాటించమని వత్తిడి చేయడంవల్ల లుగుతుంది.
కుటుంబ హింసకు ప్రధాన కారణాలు పురుషులలో మద్యపానం, జూదం, పురుషాహంకారం ప్రధానంగా కనిపిస్తాయి. మద్యపానంతో ఎన్నో వేల కుటుంబాలు నిత్యం హింసకు గురవుతున్నాయి.
గృహ హింస చట్టం ఎవరికి వర్తిస్తుందంటే… దాని పరిధి విస్తృతమైనది. 2005లో వచ్చిన ఈ చట్టం విప్లవాత్మకమైనదని. వివాహిత మహిళలు, సహజీవనం చేసేవారు, వితంతువులు, కుమార్తెలు, పిల్లలున్న తల్లులు, ఒంటరిగా ఉండే మహిళలు, పిల్లలు… వీరందరికీ ఈ చట్టం వర్తిస్తుంది.
విస్తృతంగా చూస్తే భౌతికంగా, లైంగికంగా, మానసికంగా అవమానం, హేళన చేయడం, ఆర్థికంగా ఇబ్బందులపాలు చేయడం, వేధింపులు, చిత్రహింసలకు గురిచేయడం, ఆర్థికంగా ఇబ్బందులపాలు చేయడంలో భాగంగా పుట్టింటివారిచ్చిన నగల గురించి వేధించినా, ఆడపిల్ల పుట్టిందని వేధించినా గృహ హింసగా పరిగణిస్తూ ఐపిసి 498ఎ కింద కేసు పెట్టొచ్చు. పిల్లల తరపున ఫిర్యాదుచేస్తే ఫిర్యాదుకు గురైన వ్యక్తి వారి మెయింటెనెన్స్ భరించాలి.
స్త్రీలపై గృహ హింస గణనీయంగా పెరుగుతోంది. దీన్ని నిశితంగా పరిశీలిస్తే అనేక విషయాలు అవగతమవుతాయి. కుటుంబ జీవనానికి, సమాజానికి స్త్రీ పురుషులు మూలస్తంభాలు. కుటుంబ వ్యవస్థలో ఆత్మీయత, ప్రేమ, అనురాగం రాన్రాను బలహీనపడుతున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అమ్మమ్మ, నానమ్మలు నీతి కథల రూపంలో బాల్యం నుంచే ఎలా ఉండాలి, ఏది మంచి పద్ధతి, తప్పులు చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, నిజాయితీగా ఉండాలి మొదలైనవి నేర్పించడం జరిగేది. నేడు ఉమ్మడి కుటుంబాలు పోయి వ్యక్తిగత కుటుంబాలు (న్యూక్లియర్ ఫ్యామిలీ) వచ్చాయి. ఎవరికి వారు విడిపోవడం, విడిగా ఉండడం, అందులోనే స్వతంత్రం ఉందని భావించడం, ఒకవేళ కలిసి ఉన్నా వారి మధ్య సఖ్యత ఉండకపోవడం సర్వసాధారణమైపోయింది. పైగా చిన్న కుటుంబంలో ఒక్కరే సంతానం. ఆ ఒక్కరికి సోదరి, సోదరుల ప్రేమ లేక, తమ మనోభావాలను పంచుకునే తోడులేక ఒంటరిగా ఉంటూ కలిసి ఉన్నవారిని చూసినప్పుడు ఈర్ష్య, అసూయలు అదుపులో పెట్టుకోలేక సతమతమై కుటుంబంలో విపరీత పరిణామాలతో కూడిన ప్రవర్తన మొదలవుతుంది. దీనివల్ల అసహనం, అశాంతి కుటుంబంలో హింసలకు దారితీస్తుంది. ఆలోచనా విధానంలో పరిపక్వత లేకపోవడం, సంకుచిత మనస్తత్వం, హింసాత్మక ధోరణికి దారితీసే అవకాశాన్ని కల్పిస్తాయి. ఉమ్మడి కుటుంబాలు ఉంటున్నా ఒకప్పుడు ఉండే ఉమ్మడి కుటుంబాలకు, నేటి
ఉమ్మడి కుటుంబాలకు చాలా వ్యత్యాసం ఉంటోంది. ఒకరికొకరు అన్నట్లుగా ఉండే కుటుంబ సభ్యుల నుంచి ఒకరిని మించి ఒకరు అనే పోటీ పెరిగింది. ఈ పోటీతత్వంతో హింసాత్మక ధోరణులు ప్రబలుతున్నాయి.
స్వార్ధం అనేది గృహ హింసకు ప్రధాన కారణం. గృహంలో కుటుంబ సభ్యులతో ఎవరికి వారు వారి స్వార్థానికే ప్రాధాన్యత ఇవ్వడంతో గృహ హింస అధికమవుతోంది. నేను చెప్పిందే వేదం, అన్నీ నాకే తెలుసు, నాకు మాత్రమే ఉండాలి ఎదుటివారికి, తోటివారికి అవసరంలేదు అనుకున్నప్పుడు ఇబ్బందులు, మనస్పర్థలు మొదలవుతాయి.
కుటుంబంలో అవగాహన లోపం వల్ల సర్దుబాటుతనం లేకపోవడంవల్ల స్వార్థంతో ప్రవర్తించేవారిని భరించలేక గృహ హింసలు మరింత ఎక్కువవుతున్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో ఆర్థికంగా అనేక మార్పులు చోటుచేసుకోవడంతో, ఉద్యోగాలు చేసేవారి సంఖ్య స్త్రీలలో గణనీయంగా పెరిగింది. ఉద్యోగస్థులుగా స్త్రీలు అనేక రకాలుగా గృహ హింసను ఎదుర్కొంటున్నారు. భార్యాభర్తలలో ఆర్థిక అసమానతలు, కొన్నిసార్లు భర్తకంటే భార్య ఎక్కువ సంపాదించడం లేదా భర్త ఆశించిన మేర భార్య సంపాదించలేకపోవడం కూడా గృహ హింసలకు దారితీసే అవకాశముంది.
కుటుంబంలో అన్నదమ్ముల మధ్య జీతభత్యాలలో తేడాలు, అన్నదమ్ముల పిల్లల మధ్య ఆర్థికపరమైన పోటీలు, పోలికలు, ఎత్తుకు పై ఎత్తులు కుటుంబ హింసలకు దారితీస్తాయి. అనురాగం, ఆత్మీయతలు లోపించి అన్యోన్యత బదులుగా హింసాధోరణులు ప్రబలుతాయి. అత్యాశకు పోవడం, స్థోమత మరచి ఎక్కువగా ఊహించుకోవడం, ఆశించినది అందుకోవాలని ప్రయత్నించడం వంటివి ఆర్థికపరమైన గృహ హింసలకు ఆస్కారంగా నిలుస్తాయి. ఆస్తుల గురించిన చర్చలు, పట్టుదలలు గృహ హింసకు దోహదపడతాయి.
శారీరక, గృహ హింస సమస్యలు వర్ణింపరానివి. కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు, వివాహేతర సంబంధాలు, సహజీవనాలు, ఆడపిల్లల పట్ల అత్యాచారాలు… ఇవన్నీ శారీరకంగా ఎదుర్కొంటున్న సమస్యలు. మొదట ఘర్షణగా మొదలై అది పెరిగి చివరికి చేయి చేసుకోవడం, ఒకరినొకరు కొట్టుకోవడం వరకు కొనసాగి గృహ హింసగా మారే అవకాశముంది. పనులు చేయలేదని, కట్నం తేలేదని అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ మధ్య పోట్లాటలు చిలికి చిలికి గాలివానగా మారి హింసాత్మకంగా రూపుదాల్చడం, ఆస్తుల తగాదాలతో కొట్టుకోవడం, వాతలు పెట్టడం, సిగరెట్టుతో గుచ్చటం, బెల్టుతో కొట్టడం, అత్యాచారం చేయడం, గదిలో బంధించడం, గృహ నిర్బంధంలో ఉంచడం, తినడానికి ఏమీ ఇవ్వకుండా శారీరకంగా బాధపెట్టడం వంటివి ఈ కోవకు చెందినవి. దీనికి ప్రధాన కారణం అవగాహనా లోపం. కుటుంబ సభ్యుల మధ్య ఆత్మీయత కొరవడడం, ఓర్వలేనితనం, నాకే కావాలనుకోవడం, కొన్నిసార్లు మగవారు, తాము మగవారమని, తాము చెప్పినట్లే ఆడవాళ్ళు వినాలనే పట్టుదలకి, పౌరుషానికి పోవడం, మహిళల పట్ల చులకన భావం… గృహహింసకు కారణంగా మారుతుంది.
లైంగిక హింస మరొక దారుణమైన గృహ హింసగా పరిగణించబడుతుంది. తమలోని క్రోధాన్ని, కసిని లైంగికంగా హింసించడం ద్వారా లైంగిక హింస కుటుంబ హింసలో భాగమవుతుంది. కుటుంబంలో సభ్యుల మధ్య సరైన సంబంధాలు లేకపోవడం, ప్రేమ రాహిత్యం, ఆకర్షణలు లైంగిక హింసను ప్రేరేపిస్తాయి. భార్యకు ఇష్టం ఉన్నా, లేకున్నా భర్త లైంగికంగా దాడులు చేసినా, భార్యాభర్తల మధ్య వేరేవారి జోక్యం, అక్రమ సంబంధాలు, వావి వరసలు లేకుండా ఇతర కుటుంబ సభ్యులతో అసభ్యంగా ప్రవర్తించడం, లైంగిక హింసకు పాల్పడి ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించడం… ఇటువంటివన్నీ లైంగిక హింసలో భాగాలు.
గృహ హింస అనే మానవ హక్కులకు సంబంధించిన సమస్య అన్ని వయసుల వారికి అన్ని రకాల కుటుంబ నేపధ్యాల వారికి సంబంధించినది. ముఖ్యంగా మద్యపానం వ్యసనం వల్ల ఎక్కువగా గృహ హింస జరుగుతుంది. భర్త తాగి వచ్చి భార్యలను కొట్టడం, అదే ఆవేశంతో కూతుళ్ళను, తల్లిని చంపడం వంటి కేసులు ఎన్నో. మద్యపానం వంటి వ్యసనాలతో మధ్య తరగతి, కింది తరగతుల వారే గృహ హింసకు గురవుతున్నారని అనుకుంటే పొరపాటే.
సాక్షి దినపత్రికలోని (మార్చి 5, 2016) ఒక వార్తా కథనం ప్రకారం భారత ప్రభుత్వం 15 నుంచి 49 ఏళ్ళ వయసులోని 83,703 మంది మహిళల నుంచి తీసుకున్న సర్వేలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి.
శారీరక లైంగిక హింసకు వ్యతిరేకంగా సహాయం తీసుకునే విషయంలో విద్య కానీ, సంపద కానీ మహిళల జీవితంపై పెద్దగా ప్రభావం చూపడం లేదని కేంద్ర ప్రభుత్వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేక్షణ డేటా సూచిస్తోంది.
విద్య, సంపద లేని మహిళలతో పోలిస్తే ఉన్నత విద్యావంతులైన అత్యంత సంపన్న మహిళలు కూడా హింసకు వ్యతిరేకంగా సహాయం తీసుకోవడంలో వెనుకంజ వేస్తున్నారని ఈ డేటా సూచిస్తోంది.
1. నిందలకు, దూషణలకు గురైన మహిళలలో చాలామంది తమ కుటుంబాల నుంచి తరచుగా సహాయానికి ప్రయత్నించారు.
2. లైంగిక హింసను ఎదుర్కొన్న వందమంది మహిళల్లో ఒకరు మాత్రమే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
3. నిరక్షరాస్యులైన మహిళల్లో 44% మంది 15 ఏళ్ళ వయస్కులు హింసను అనుభవించారు. గత 12 నెలల్లో 26% మంది కుటుంబ హింసను ఎదుర్కొన్నారు.
4. లైంగిక హింసను ఎదుర్కొంటున్న వారిలో 85% మంది మహిళలు ఆ విషయం ఎవరితోనూ పంచుకోలేదు. వీరిలో 8% మంది మహిళలు మాత్రమే సహాయం కోసం ప్రయత్నించారు. శారీరక హింసను అనుభవించిన 72% మంది మహిళలు, లైంగిక హింసను ఎదుర్కొన్న 58% మంది మహిళలు తమ కుటుంబమే తమకు ఆధారమని చెప్పారు.
జాతీయ గణాంకాల నివేదిక 2014 మేరకు అతివలపై కొనసాగుతున్న నేరాలు –
1. భర్తల హింసలు, చర్యలకు గురవుతున్న భార్యల సంఖ్య 1,20,000
2. వేధింపులకు గురవుతున్నవారు 70,000
3. అపహరణలు 55,000
4. అత్యాచార బాధితులు 35,000
5. అవమానానికి గురయ్యేవారు 10,000
6. వరకట్న చావులు 10,000
7. వ్యభిచార వృత్తికి బానిసలు 5,000
మన దేశంలో ప్రతి పదిమంది మహిళల్లో నలుగురు గృహ హింసకు లోనవుతున్నారు. 45% మంది ఒక్కసారైనా శారీరక, మానసిక హింసకు, 55% గర్భిణీ స్త్రీలు శారీరక గాయాలకు, ప్రతిరోజూ 30 మంది అబలలు వరకట్న దాహానికి విగతజీవులవుతున్నారు.
వీటన్నింటి ద్వారా మన దేశంలో గృహ హింస ద్వారా బలైపోతున్న, బంధాలు కోల్పోతున్న కుటుంబ వ్యవస్థలోని పటిష్టతను మనం ఊహించుకోవచ్చు.
గృహ హింసకు కారణాలుగా స్త్రీపట్ల సమాజంలో ఉన్న భావన, స్త్రీలోని పునరుత్పత్తి లక్షణం ఆమెను భిన్నంగా చూడడానికి కారణమౌతున్నది.
స్త్రీకి సామాజికంగా, ఆర్థికంగా, స్వతంత్రత లేకపోవడం వల్ల ఒంటరిగా జీవించలేని పరిస్థితులు సమాజం కల్పించింది. స్త్రీకి రక్షణ, ఆశ్రయం కోసం కుటుంబం అవసరం.
కుటుంబ వ్యవస్థకు పవిత్రత ఆపాదించబడి ఆ ముసుగులో స్త్రీలపై జరుగుతున్న లైంగిక హింస బయటికి చెప్పుకోలేనివి అవుతున్నాయి.
స్త్రీ వాదం కుటుంబ సమస్యను స్త్రీకున్న ప్రధాన సమస్యగా భావించింది. ఇంటి చాకిరీలో ఎంత అలసిపోయినా స్త్రీ శ్రమకు విలువ లేదు. స్త్రీలు ఆర్థికంగా ఎదిగినా ఇంటిపని, వంటపని తప్పదు. సమాజం వాటిని స్త్రీలు చేసే పనులుగా నిర్ణయించింది. స్త్రీ వ్యక్తిత్వాన్ని, గొప్పతనాన్ని పురుషుడు అంగీకరించడు. పురుషాహంకారం అడ్డు వస్తుంది.
సమాజంలో ఎన్ని మార్పులు వచ్చినా, ఎందరిని విద్యావంతులుగా మార్చినా స్త్రీల పట్ల ఒక చులకన భావం పోకపోవడం గృహ హింసపై ప్రభావం చూపుతుంది.
కేవలం పురుషులే గృహ హింసకు కారణం అని చెప్పడానికి వీల్లేదు. గృహ హింసలో స్త్రీల భాగస్వామ్యం కూడా
ఉంది. అత్తలు, ఆడపడుచుల ఆరళ్ళు, వరకట్న వేధింపులు, అక్రమ సంబంధాలు, ఆస్తుల తగాదాలు, వ్యాపార లావాదేవీలు… వీటన్నింటిలో స్త్రీలపై జరిగే గృహ హింసలో స్త్రీలు ప్రధాన కారకులుగా మారుతున్నారు.
ఏది ఏమైనా గృహ హింస జరగకుండా కాపాడే బాధ్యత మనందరిదీ. దానికి నివారణ మార్గాలను కూడా మనమే ఏర్పరచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. గృహ హింసలు జరగకుండా జాతీయ గృహ హింస హాట్‌లైన్ 24 గంటలు 1800-799-7233 నెంబరు ద్వారా భద్రత కోసం ఏర్పాటు చేసింది.
గృహ హింస జరుగకుండా స్త్రీలు పనిచేసేచోట భద్రత కల్పించాలి. మన బంధువులు, ఉద్యోగస్థులు, కాలేజీలో చదివే తోటి విద్యార్థులు ఎవరైనా తమ తోటి జీవిత భాగస్వామిని హింసకు గురిచేస్తే చూస్తూ ఊరుకోకుండా ఎవరినైనా సంప్రదించాలి. మీకు తెలిసిన విషయాన్ని చెప్పి సమస్య పరిష్కారంవైపు ఆలోచించాలి.
సమస్యను చూడగలిగే ధైర్యం ఉంటే ఓపికపట్టి చూసుకోవాలి. ఏమైనా పరిష్కరించగలమా అని ఆలోచించాలి.
చిన్నవయసు నుంచి బాలికలు, బాలుర మనసులో స్థిరమైన భావజాలం పెంపొందించాలి. సమస్యలను ఎదుర్కోవడం పట్ల మనోధైర్యం పెంపొందింపచేయాలి. సముదాయాలలో ఇటువంటి విషయాల గురించి ప్రస్తావన తెచ్చి వారిని అప్రమత్తం చేయాలి.
కుల, మత, లింగ వివక్షలు, విభేదాలు లేకుండా గృహ హింస నిర్మూలనకు అందరూ కలసికట్టుగా కృషి చేయాలి. ఎవరికి వారు తమ కుటుంబంలో ఆదర్శవంతంగా, హింసరహితంగా ప్రవర్తించాలి.
పాఠశాల కరిక్యులంలో ఆరోగ్యవంతమైన కుటుంబ సంబంధాల గురించి చేర్చాలి, చర్చించాలి, నేర్పించాలి.
ఆన్‌లైన్‌లోని గృహ హింసకు గురైన వారి సంఘటనలు, సన్నివేశాలు వారిని గృహ హింస నివారణ బృందం ఎలా సంరక్షించాలో అర్థమయ్యేలా చూపించాలి.
గృహ హింస నివారణకు పూనుకున్న సంస్థలలో సభ్యులుగా చేరాలి. గృహ హింసకు సంబంధించి కళాశాలలో, పాఠశాలలో మేధావులు, ఉపాధ్యాయులు సదస్సులు, సెమినార్లు నిర్వహించాలి. కమ్యూనిటీ, టెక్నాలజీ సహకారం తీసుకోవాలి . ముందు జాగ్రత్తలు తీసుకుంటూ పనిచేయాలి.
గృహ హింసకు పాల్పడే వారికి జరిమానా వేయాలి. గృహ హింస బాధితులకు సహకరించే సంస్థలకు డబ్బు అందేలా చేయాలి.
కుటుంబ కోర్టుల పరిశీలనా పద్ధతిని వీలైతే మార్చాలి. ఫిర్యాదు ఎలా చేయాలి, అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలో నిర్దేశించాలి. ఫిర్యాదు చేసిన బాధితుల స్థానం ఏమిటో చూడాలి. వారి మెయింటెనెన్స్, ఫిర్యాదుకు గురైన వ్యక్తే భరించాలి. పిల్లలను తమతో ఉంచుకునే పరిస్థితి అయితే తగిన ఆధారాలు అందచేయాలి. సర్వీస్ ప్రొవైడర్స్ ఉండాలి. బాధితులకు అవసరమైన ఆరోగ్య వసతులు కల్పించి ఐపిసి 498ఎ చట్టం గురించి విస్తృత ప్రచారం చేయాలి.
పోలీసు వ్యవస్థ గృహ హింస బాధితులను పట్టించుకుని ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే తగిన సహాయ సహకారాలు అందించాలి. తగిన రక్షణ కల్పించాలి.
గృహ హింసను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలి. సమాజంలో మానసిక పరిపక్వత కోసం ప్రజలను, స్త్రీలను గౌరవించడం, స్త్రీలకు సముచిత స్థానం ఇవ్వడంపట్ల శ్రద్ధ చూపించాలి. ప్రభుత్వం దానికి తగిన పథకాలను ప్రవేశపెట్టాలి. మానసిక, ఆధ్యాత్మిక గృహ హింసలను జరగకుండా ఉంచడం కోసం మానసిక నిపుణులను కౌన్సిలింగ్ కోసం ఏర్పాటు చేయాలి.
భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని ప్రాంతాలలో గృహ హింస ఏదో ఒక రూపంలో గృహ హింస కొనసాగుతోంది. దీన్ని ఒక్కసారిగా నిర్మూలించడం ఎవరికీ సాధ్యంకాదు. కానీ అందరూ కలిసికట్టుగా ప్రయత్నిస్తే మార్పు తప్పకుండా వస్తుంది.
ఆడపిల్లలను ఆటవస్తువుగా చూసే దృక్పథం మారాలంటే స్త్రీలు మరింతగా విద్యావంతులుగా మారాలి. సమాజంలో స్త్రీ పట్ల గౌరవం కొనసాగేలా ప్రవర్తించాలి. కించపరిచేలా దిగజారిన వారికి తగిన శిక్షణనివ్వాలి. కుటుంబ హింసకు గురయిన స్త్రీలు తమతోటి స్త్రీలే అని ప్రతి స్త్రీ భావించాలి. కుటుంబంలోని ఇతర సభ్యులూ అలాగే భావించాలి. మార్పు మనలో రావాలి. మార్పుకు ఉదాహరణగా మనం నిలవాలి. ఎవరికి వారు దాన్ని స్వీకరిస్తే గృహ హింసను కొంతవరకైనా తగ్గించవచ్చు.