సెక్స్‌ వర్క్‌… సెక్స్‌ వర్కర్‌… పునరావాసం !! – సత్యవతి, ప్రశాంతి

ఈ మధ్య కొన్ని ఆలోచనలు నన్ను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ప్రపంచం మొత్తం మీద అతి పురాతనమైన వ్యవస్థ వ్యభిచారం. వ్యభిచారం చుట్టూ అల్లుకుని ఉన్న భావజాలం, అందులో చిక్కుకున్న మహిళల జీవితాలు ఈ మధ్య చాలా దగ్గరగా చూడగలిగిన అవకాశాలు దొరికాయి. ఇటు వ్యభిచారం ఆరోపణల మీద అరెస్టయి మహిళా జైలులో ఉన్న ఖైదీలు, అటు కుటుంబ అవసరాల దృష్ట్యా తప్పక వ్యభిచారాన్ని వృత్తిగా స్వీకరించి ఒక మహిళా సంఘంగా ఐక్యమైన సెక్స్‌ వర్కర్లు. సెక్స్‌ని వర్క్‌గా స్వీకరించాం, మా శరీరాలనే పెట్టుబడిగా పెట్టాం, దీని ద్వారానే మా జీవనాధారం నిలుపుకుంటున్నాం అంటున్నారు వీళ్ళు. ప్రతిరోజూ వేలాదిమంది మహిళలు ఇష్టపడో, బలవంతం మీదనో వ్యభిచారం చేస్తూ బతుకుతున్నారు.

ఇటీవల ఒక సెక్స్‌ వర్కర్‌తో మాట్లాడినపుడు ఆమె అన్న మాటలు పదే పదే బుర్రలో తిరుగాడుతున్నాయి. ”కొంతమంది వేళ్ళను ఉపయోగించి సంపాదిస్తారు. కొంతమంది కాళ్ళను ఉపయోగించి సంపాదిస్తారు. చాలావరకు తమ మెదళ్ళను ఉపయోగిస్తారు. ఆఖరికి తమ గర్భసంచీలను కూడా అద్దెకిచ్చి డబ్బు సంపాదిస్తున్నారు. మేము కూడా మా శరీర అవయవాన్ని వాడుకుని మా పొట్టలు నింపుకుంటున్నాం తప్పేంటి? పోలీసులు మమ్మల్ని ఎందుకు అరెస్టు చేస్తారు? మమ్మల్నెందుకు కొడుతున్నారు? మమ్మల్నెందుకు హోమ్‌ల్లోనో, జైళ్ళల్లోనో బంధిస్తున్నారు?” ఆమె దబదబ అడుగుతుంటే నేను కళ్ళప్పగించి వింటుండిపోయాను. ఏం సమాధానం చెప్పాలి? ఇంకా ఇలా అంది. ఈ దేశంలో పేదరికం ఉన్నంతకాలం సెక్స్‌ వర్క్‌ ఉంటుంది. ప్రభుత్వాలు సీటాలు, దీటాలు, పేటాలు ఎన్ని తెచ్చినా ఈ వృత్తి కొనసాగుతూనే ఉంటుంది. మా ఇష్టంతో మేము ఈ వృత్తిని చేసుకుంటున్నాం. సంపాదించి కుటుంబాన్ని కాపాడుకుంటున్నాం. ఈ పోలీసులు మమ్మల్నెందుకు అరెస్ట్‌ చెయ్యాలి? అంటుంటే ఇంకొకామె అందుకుని మా మొగుళ్ళ తాగుళ్ళని ఆపలేరు, మమ్మల్ని కొడుతుంటే కాపాడలేరు. మేం కష్టపడి సంపాదించి పిల్లలకింత పెట్టుకుంటున్నాం. వాళ్ళని చదివించుకుంటున్నాం. మమ్మల్ని ఉద్ధరిస్తామంటూ హోముల్లో ఎందుకు పెడతారు? అంటూ చెరిగిపారేసింది. నేనేం చెప్పగలను?

అసలు పురాణాల్లోనే వ్యభిచారం, వ్యభిచారులు ఉన్నారు కదా! స్వర్గంలో, ఇంద్రుడి కొలువులో రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమలు దేవ వేశ్యలని కదా చెబుతారు. పురుషుని కోసం సోకాల్డ్‌ స్వర్గంలో దేవ వేశ్యలు కొలువై ఉన్నారు. భూమి మీద మానవ వేశ్యలు ఉన్నారు. ఏకపతీవ్రతం భారతీయ సంస్కృతి అంటూ ఊదరగొట్టే భారతదేశంలో ప్రతిరోజూ వేలాదిమంది పురుషులు సెక్స్‌ వర్కర్ల దగ్గరకు వెళుతుంటారు. వ్యభిచరిస్తుంటారు. అయినా వాళ్ళు చెడిపోరు. నానా రోగాలను అంటించుకంటూ ధర్మపత్నులకు కూడా అంటిస్తూ ఎలాంటి చట్ట, పోలీస్‌ భయం లేకుండా బతికేస్తున్నారు/అర్థాంతరపు చావులు చస్తున్నారు కూడా. వీళ్ళకి వ్యభిచారి అనే ముద్ర కానీ, చెడిపోయాడనే చెడ్డ పేరు కాని రాదు. పైగా శృంగార పురుషుడని, కృష్ణలీలలని బిరుదులు కూడా ఇస్తుంటారు. వ్యభిచారం చేస్తూ దొరికారని పోలీసులు అరెస్ట్‌ చెయ్యరు, జైల్లో పెట్టరు… వీళ్ళని ఉద్ధరించడానికి ఉజ్వల హోమ్‌ల్లోనూ తొయ్యరు. యుగయుగాలుగా, తరతరాలుగా వ్యభిచార వృత్తిలో స్త్రీలు మాత్రమే నేరస్తులు లేదా బాధితులు.

మానవ అక్రమ రవాణాలో కూడా బాలికల్ని, మహిళల్ని వ్యభిచార కూపంలోకి తోసే ట్రాఫికర్లు చాలా తేలికగా కేసుల్నుంచి, జైళ్ళనుంచి బయటపడి మళ్ళీ తమ వేటను కొనసాగిస్తున్నారు. చాలామంది తమ కుటుంబాలతో కలిసుంటూనే ట్రాఫికింగ్‌ నేరాలకు పాల్పడుతుంటారు. కానీ ట్రాఫికర్ల చేతుల్లో అమ్మకం సరుకుగా మారి పిల్లలు, స్త్రీలు అప్పుడప్పుడూ పోలీసుల రెయిడ్స్‌లో దొరికి ఉజ్వల హోమ్‌ల్లో కుక్కబడతారు. కొంతమంది జైళ్ళలో బంధించబడతారు. కొంతమంది సెక్స్‌వర్కర్లని సెక్స్‌వర్క్‌ చేయిస్తున్నారంటూ జైళ్ళలోకి పంపిస్తే, కొంతమందిని బాధితులంటూ హోమ్‌ల్లో పెడుతున్నారు. విచిత్రమైన విషయమేంటంటే నేరస్థులంటూ జైల్లో వేసినవాళ్ళు, అతి త్వరలోనే బెయిల్‌ తీసుకుని బయటకు వెళ్ళిపోతున్నారు. బాధితులు మాత్రం జైలుకన్నా ఘోరమైన ఉజ్వల హోమ్‌ల్లో ఏళ్ళ తరబడి మగ్గిపోతున్నారు. రెండో, మూడో గదులున్న ఈ హోమ్‌లో 30 నుండి 40 మంది వరకు ఎలాంటి సౌకర్యాలు లేకుండా బతుకుతున్నారు. కొన్నిసార్లు ఆ భయంకర చెర నుండి తప్పించుకుని పారిపోతున్నారు. మళ్ళీ పోలీసులకు దొరికితే నేరస్థులై జైళ్ళకెళ్తున్నారు.

ఇటీవల మాకెదురైన రెండు అనుభవాల గురించి తప్పక రాయాలి. చంచల్‌ గూడా మహిళా కారాగారంలో పనిచేస్తున్న అనుభవం అందించిన విషయమొకటి. అలాగే ట్రాఫికింగ్‌ బాధితులను ఉంచే ఉజ్వల హోమ్‌ సందర్శన అంశమొకటి. నాలుగైదు నెలల క్రితం ట్రాఫికింగ్‌లో చిక్కుకున్న కొంతమంది మహిళల్ని రకరకాల ప్రాంతాల్లో పోలీసులు రెస్క్యూ చేసి తీసుకొచ్చి ఒక ప్రముఖ హోమ్‌లో

ఉంచారు. సాధారణంగా వీరిని జడ్జిముందు హాజరుపరిచి, జ్యుడిషియల్‌ కస్టడీతోనే హోమ్‌లో ఉంచుతారు.హోమ్‌లో ఉంచబడే వాళ్ళు బాధితులే. ఈ బాధితులు హఠాత్తుగా నేరస్తులుగా మారి జైలుకొచ్చారు. హోమ్‌లో దాడికి ప్రయత్నించి హోమ్‌నుంచి పారిపోయే ప్లాన్‌ చేశారనే ఆరోపణలతో ఒంటినిండా దెబ్బలతో జైలుకొచ్చారు. బాధితులు నేరస్థులైపోయారు. వాళ్ళతో మాట్లాడినప్పుడు హోమ్‌లకు సంబంధించి చాలా విషయాలు అర్థమయ్యాయి. జైలుకి ఏ మాత్రం భిన్నం కావీ హోమ్‌లు. గమ్మత్తుగా నేరస్తులుగా మార్చబడ్డ బాధితులంతా చాలా తొందరగానే బెయిళ్ళు పొంది విడుదలై వెళ్ళిపోయారు.

మాకెదురైన రెండో అనుభవం ఏమిటంటే… ఈ మధ్యనే మేమొక ఉజ్వల హోమ్‌ని సందర్శించాం. ఒక గ్రామం నుంచి ఒకమ్మాయి బాధితురాలిగా ఈ హోమ్‌లో ఉంది. ఆమె తల్లి హెల్ప్‌లైన్‌కి ఫోన్‌ చేసి కూతురి విడుదలలో సహాయం చెయ్యమని అడిగినప్పుడు, ఆ అమ్మాయి ఉన్న హోమ్‌ను సందర్శించడం జరిగింది. రెండు పెద్ద గదులున్న హోమ్‌. ప్రభుత్వ సహాయంతో నడుస్తున్న, ట్రాఫికింగ్‌ బాధితుల కోసం మాత్రమే నడుస్తున్న ఉజ్వల హోమ్‌. అంతకు వారం ముందే ఆ హోమ్‌ నుండి 12 మంది బాధితులు గోడదూకి పారిపోయారని, ఇద్దరు మాత్రమే పోలీసులకు దొరికి జైలుకెళ్ళారని నిర్వాహకులు చెప్పారు. ప్రస్తుతం 22 మంది

ఉన్నారు. సగం మంది తెలుగు ప్రాంతాల నుండి, సగం మంది కలకత్తా నుండి వచ్చినవాళ్ళు ఉన్నారు. ఆ హోమ్‌లోకి అడుగుపెడుతుంటే నాకు ఊపిరాడనట్టయింది. జీవచ్ఛవాలకి నైటీలు తొడిగి నిలబెట్టినట్టు అందరూ లేచి నిలబడ్డారు. వాళ్ళతో మూడేళ్ళ పసివాడు కూడా

ఉన్నాడు. బాధితులుగా వచ్చిన వాళ్ళలో చాలామంది రెండు, మూడు సంవత్సరాలుగా ఆ హోమ్‌లో ఉండిపోయారు. నిర్వాహకుల మాటల్లో, ”ట్రాఫికింగ్‌లో ఇరుక్కుని, పోలీసుల రైడ్స్‌లో దొరికిన వీళ్ళంతా బాధితులే. వీళ్ళచేత వృత్తి చేయించినవాళ్ళు నేరస్థులుగా జైళ్ళకెళతారు. ఉజ్వల హోమ్‌లో పెట్టినవాళ్ళు బాధితులు. వీళ్ళకి జీవనోపాధులు నేర్పించి, మళ్ళీ వృత్తిలోకి వెళ్ళకుండా సైకలాజికల్‌ కౌన్సిలింగ్‌ ఇప్పించి జడ్జి ఆర్డర్‌తోనే విడుదల చేస్తాము. వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగిస్తాము. కానీ అలా జరగడం లేదు. జడ్జీలు వాళ్ళ దృక్పథాల ప్రకారం, వాళ్ళ ఇష్టానుసారం విడుదల ఆర్డర్‌లు ఇస్తున్నారు. వీళ్ళని ఎంతకాలం హోమ్‌లో ఉంచాలనే దానిమీద ఎలాంటి నియమ నిబంధనలు లేవు. ఉదా:- ఈ బాబు చూడండి. వీడికి మూడేళ్ళు. ఇక్కడే పుట్టాడు. వీడికి బయటి ప్రపంచం తెలియదు. బాధితుల కోసమంటూ ఫారిన్‌ ఫండింగ్‌తో ఓ కార్పొరేట్‌ హోమ్‌ నడుపుతున్న ఒక నిర్వాహకురాలు బాధితుల్ని కనీసం మూడేళ్ళు హోమ్‌లో ఉంచితేనే రీహాబిలిటేషన్‌ అయినట్టు అంటుంది. అది కరెక్ట్‌ కాదు అనిపిస్తుంది నాకు. వీళ్ళు మారారని మేము సర్టిఫికెట్‌ ఇస్తే కూడా వాళ్ళని విడుదల చేయడం లేదు” అంటూ చెప్పారు.

హోమ్‌లో కొంతమందితో మాట్లాడినప్పుడు, వాళ్ళ శారీరక, మానసిక స్థితిగతుల్ని గమనించినప్పుడు వీళ్ళు మళ్ళీ సెక్స్‌వర్క్‌లోకి వెళతారా? వెళ్ళగలుగుతారా? అనిపించింది. వాళ్ళని బలవంతంగా బంధించి ఉంచారు తప్ప ఆ హోమ్‌లో వాళ్ళ పునరావాసం జరిగే అవకాశం లేదు. నాలుగు మిషన్లు పెట్టి కుట్లు, అల్లికలు నేర్పించటం పునరావాసం అనిపించుకోదు.

బాధితులు వీళ్ళు అని చెబుతూనే వాళ్ళకి ఎలాంటి మానవ హక్కులు లేకుండా పశువుల్ని బందిల దొడ్లో బంధించినట్లు హోమ్‌లలో బంధించి కల్పిస్తున్న పునరావాసం ఏమిటో అర్థం కాదు. ఆకాశం కూడా కనబడకుండా పరదాలు కట్టి, కనీసం వాళ్ళకి ఎండపొడ కూడా తగలనీయకుండా చేస్తున్న ఈ హోమ్స్‌ కన్నా జైలే బెటరేమో అనిపించింది. ఎందుకంటే జైలులో పెద్ద పెద్ద ఆవరణలుంటాయి. చెట్లుంటాయి. గాలీ, వెలుతురూ ఉంటుంది. అన్నింటినీ మించి ఆత్మీయులతో మాట్లాడుకోగలిగే ‘ములాఖాత్‌’లుంటాయి. న్యాయ సహాయంతో బెయిల్‌ పొందే అవకాశం ఉంది. నేరస్తులక్కూడా కొన్ని హక్కులున్నాయి. పోలీసుల రైడ్‌, రెస్క్యూలు జరిగి పోలీసులకు దొరికిన ఆర్గనైజర్స్‌ నేరస్తులుగా జైలుకి, బాధితులు పునరావాసం కోసం ఉజ్వల హోమ్‌కి తరలించబడినప్పుడు పలు సెక్షన్‌ల కింద నేరాలారోపించబడిన నేరస్థులు బెయిల్‌ మీద స్వేచ్ఛగా బయటికెళ్ళిపోతుంటే, బాధితులు మాత్రం చీకటి గుహల్లాంటి హోమ్‌లలో సంవత్సరాల తరబడి మగ్గిపోతున్నారు. మానసిక రోగులవుతున్నారు. డిప్రెషన్‌తో కుంగిపోతున్నారు. వాళ్ళ సంతానం చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నారు. బయట ఉండిపోయిన పిల్లలు తండ్రి పట్టించుకోక అనాధలవుతున్నారు. చాలా సార్లు ఒంటరి మహిళలు ఈ వృత్తిలోకి వచ్చి పిల్లల్ని చదివించుకుంటున్నారు. ఈ మధ్య సెక్స్‌వర్కర్ల హక్కుల కోసం పనిచేసే ఒక సంస్థకి వెళ్ళినపుడు చాలా ఆసక్తికరమైన అంశాలు వాళ్ళు మాట్లాడారు. ఆ సంఘంలో సభ్యులుగా ఉన్న స్త్రీలు సెక్స్‌ వర్క్‌ని వృత్తిగా చేస్తున్నవాళ్ళు. అలాగే ప్రభుత్వం హెచ్‌.ఐ.వి, సుఖవ్యాధులకు సంబంధించి చేసే ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. చాలా మంది తమ అనుభవాలను పంచుకుంటూ తమ భర్తలు తమని వదిలేసి వెళ్ళిపోయినపుడు గతి లేక పిల్లలకింత తిండిపెట్టడం కోసమే ఈ పనిచేస్తున్నాం అన్నారు. ఒకామె మాట్లాడుతూ ”నా కూతురు మెడిసిన్‌ చేస్తోంది. నేను సెక్స్‌వర్క్‌ చేస్తానని ఆమెకి తెలియదు. నా భర్త తాగి తాగి చచ్చాడు. నా కూతురికి డాక్టరవ్వాలని కోరిక. నేను దందా చేసి ఆమె ఫీజులు కడతాను. ఈ మధ్య పోలీసుల వేధింపులెక్కువయ్యాయి. మేమెవ్వరం ఈ ప్రాంతంలో కనబడొద్దంట. మేం చచ్చిపోవాలంట. మా ఫోటోలు సికింద్రాబాద్‌ స్టేషన్‌కాడ అంటిస్తామంటూ బెదిరిస్తున్నారు. ఆ ఫోటో నా బిడ్డ చూస్తే నా బతుకేం కావాలి?” అంటూ భోరున ఏడ్చిందామె. వాళ్ళు చెప్పిన హృదయవిదారకరమైన కథలు విని నేను చాలా రోజులు నిద్రపోలేదు. ఎన్నో ఆలోచనలు. సెక్స్‌వర్క్‌ చుట్టూ ఉన్న విషాదం, అందులోకి తెలిసో, తెలియకో, కుటుంబ అవసరాల కోసమో దిగిన స్త్రీల జీవితాల చుట్టూ ఉన్న దుఃఖం, వేదన, అమానుషం… పురుషుల ద్వారా మోసపోయి, అమ్మబడి అంగడి సరుకులైన వైనాలు… ప్చ్‌…

సెక్స్‌ వర్కర్స్‌తో పాటు విటులుంటేనే అది వ్యభిచారమౌతుందని, వ్యభిచారం దానంతటది నేరం కాదని చట్టం చెబుతోంది. పబ్లిక్‌ స్థలాలతో మగవాళ్ళని సెక్స్‌వర్క్‌ కోసం పిలవడం నేరమంటూ స్త్రీలను అరెస్టులు చేస్తున్నారు కానీ పురుషుల్ని వదిలేస్తున్నారు. వ్యభిచారానికి అలవాటుపడిన పురుషుల్ని ఇటు నేరస్తులుగానో, అటు బాధితులుగానో ముద్రలువేయడం లేదు. వాళ్ళని ఉజ్వల హోముల్లాంటివి పెట్టి పునరావాసం కల్పించడం లేదు. ఎందుకని? స్త్రీలని మాత్రమే ఎందుకు శిక్షిస్తున్నారు. బాధితులంటూ సానుభూతులు వల్లిస్తూ జైలు కన్నా హీనమైన హోమ్‌ల్లో ఎందుకు మగ్గబెడుతున్నారు? ఎన్నో ప్రశ్నలు.

కొంతమంది తీహార్‌ జైలులాంటి కార్పొరేట్‌ హోమ్‌లు నడుపుతూ ఒకే బాధితని పదిసార్లు పునరావాసం చేసామని చూపించుకుంటూ అంతర్జాతీయ స్థాయిలో అపూర్వ పునరావాసం కల్పించిన వాళ్ళుగా, గొప్పమానవతా వాదులుగా కీర్తి కిరీటాలు తొడుక్కుంటున్నారు. సదరు హోమ్‌లో ఉండి ”రిహాబిలిటేట్‌” అయిన ఒక మహిళ మళ్ళీ సెక్స్‌వర్క్‌ చేస్తూ జైలుకొచ్చింది. అపుడు బాధిత… ఇపుడు నేరస్తురాలు. అలా చాలా మంది హోమ్స్‌ నుంచి బయటకొచ్చాకా కూడా మళ్ళీ అదే వృత్తిలోకి తామే దిగడమో, లాగబడడమో జరుగుతోంది.

ఈ అంశం గురించి రాస్తుంటే ఎన్నో ప్రశ్నలు… సమాధానాలు దొరకని ప్రశ్నలు. సెక్స్‌వర్కర్లు, విటులు, బాధితులు, నేరస్తులు, ట్రాఫికింగ్‌లు, ట్రాఫికర్లు, బాలికల అక్రమ రవాణా… దిమ్మతిరిగే ప్రశ్నలు… సమాధానాలెక్కడ???

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.