మనిషికి ఉందా మానవత్వం
ఏమిటి నేస్తం నీ నిర్లిప్తత నిందలా ఉందే
నిర్లిప్తత కాదు నేస్తం నమ్మలేని నిజం
జన జీవన స్రవంతిలో జీవుడి పోరాటం
ఎటువెళ్ళాలో తెలియని వ్యధతో ఆరాటం
దానం చేసే కరములు కరువై దారిద్య్రంతో దాడి చేయలేక
అనాథలు అభాగ్యులు అహర్నిశలు నివ్వెరపోయి చూస్తుంటే
నాది కాదు ఈ సమాజం నన్నెవరు నిలదీస్తారు
అంటూ అశేష ప్రజానీకం పట్టించుకోక పోతే
అనిపిస్తుంది నాకప్పుడు మనిషికి ఉందా మానవత్వమని
కూలి చేసుకొని కడుపు నింపుకోలేక బరువెక్కిన గుండెల్తో
బిడ్డను బడికి పంపి బాధను దిగమింగుకుంటూ
బంధువులే రాబందులై రాకాసుల్లా బెదిరిస్తుంటే
భరించలేని దుఃఖాన్ని బహిర్గతం చేయలేక
ఆడుబిడ్డను ఆడబిడ్డను చేయాలని ఆశించే అనామకుడికి
వరకట్నం పిశాచిలా గుండెల్ని పీల్చేస్తుంటే
అనిపిస్తుంది నాకప్పుడు మనిషికి ఉందా మానవత్వమని
మగాడు మృగంలా మారి మగువను మతితప్పేలా తిప్పలు పెడుతుంటే
ఆదరణ లేని అతివ అయోమయంలో అర్థిస్తుంటే
అనిపిస్తుంది నాకప్పుడు మనిషికి ఉందా మానవత్వమని
భారాన్ని భరించి బరువెక్కిన ఉదరాన్ని ఊయలగా భావించి
ఉషోదయాన్ని నీకు ఊపిరిగా పోసి కొత్త లోకానికి నిన్ను కానుకిచ్చిన
అమృతమూర్తిని అనాధాశ్రమానికి పంపుతుంటే
అనిపిస్తుంది నాకప్పుడు మనిషికి ఉందా మానవత్వమని
ఎవరినో దూషించి ఇంకెవరినో ఆరాధించి
నేను డాంబికం డప్పు వాయించడం లేదు నేస్తం
చేయి చేయి కలిపి నవసమాజ నిర్మాణం జరిగి
మానవత్వం మనుజ లోకంలో మెరిపించి శిఖరాన్ని తాకించి
మనిషంటేనే మానవత్వం మానవత్వం అంటేనే మనిషి అని ఆకాంక్షిస్తూ….