ఇప్పుడీ బావిలోకి చేతాడు
వేయడానికెవరూ లేరు
ఉన్నారనుకుంటే
కేవలం
అది నీ భ్రమ మాత్రమే
బావులన్నీ కూడిపిస్తున్నారు
తేలిక నడక కావాలి ఎవరికైనా
ఇంతకీ నువ్వెక్కడున్నావ్?
సంద్రానివా
నదివా
లేక కాలువవా
సరస్సులోనా… చెరువులోనా
మరి బావిలోనా… మురికి కాలువలోనా
ఎప్పుడైనా గమనించే ప్రయత్నం చేసావా
ప్రతి చుక్కా నీరే… ద్రవమే
నువ్వు భార జలానివా సుజలానివా?
నీకు నీవుగా ధారాపాతమయ్యే జీవానికి
నువ్వొక నిధివి
కన్నీటి కాల్వలెందుకు
నువ్వు సమస్త విశ్వాన్నీ
ఒక్క పిడికిటన మోసే విశ్వవ్యాప్తివి
నిన్నాస్వాదించడంతోనే
ఈ జగతి వికసిస్తుంది
నీ ప్రేమ పూర్వక ఆలింగనంలో
తడిసి ముద్దై మొలకెత్తుతుంది
సృష్టి జీవనాధారమా
కేవలం నిన్ను నీవుగా మేల్కోవెందుకు
నీలోకి నీవు ప్రయాణించవెందుకు
చుట్టున్న జీవితం నీదేనా
నువ్విష్టపడేదేనా చూసుకో
మొదట నిన్ను నీవు ప్రేమించు
కొంత కాలంలో
నీలోని నిర్మలాకాశం
కొత్తగా ఓ చుక్కల పడవలో
మరో సందేశాన్నిస్తుంది
ఈ బావీ నీది కాదు
నువ్వో శోకసంద్రానివీ కావు
ఆకాశ మేఘాల్లో
నిండుగా దాగున్న
అమృత హిమబిందువు నీవు
మహిళా… నీ అంతర్మథనాలు
కేవలం నీకే తెలుసు
ఇంతటి సహనం యెవరిచ్చారో గానీ
వారికి మనస్ఫూర్తిగా
నమస్కరించి మొక్కాలి
నిన్నీ ఇలకు ఓర్పనే పేరున
పరిచయం చేసినందుకు!