జీవితం నెమ్మదిగా దుఃఖిస్తూ కరుగుతుంది
పరీక్షించడానికి ఏమీ ఉండదందులో
నిశ్శబ్ద శిలవై బ్రతుకు సముద్రంలో
అసహాయంగా జారుతూ పోతుంటావు
అలా పెరుగుతూ పోతున్నాక
జ్ఞాపకాల గాయపు గుర్తులు మిగుల్తాయి
ప్రత్యేకమయిన వేదిక ఏదీ కన్పించదిక్కడ
కానీ అందరం ప్రేక్షకుల్లా మిగిలిపోయి
జీవితం ఆటని చూస్తూ పోతుంటాం
ముందూ వెనకాల పోరాటసంగీతం కొనసాగి
మనల్ని మనం బ్రతికించుకోవాలనే తాపత్రయం
ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది
ఏదీ నీ సొంతం కానప్పుడు
బ్రతుకు మేలిముసుగులో దాచినదీ
నువ్వు సంపాదించుకున్నావనుకుంటున్నదంతా
నీది మాత్రమే ఎలా అయిపోతుంది?…కాదు
క్షతగాత్రునిగానే మిగుల్తావు
గాయపుసంచిని భుజాన వేస్కుని
సంచరిస్తూనే ఉంటావు… తప్పదు.
ఒక్కచోటనే కట్టుబడి ఉండటానికి
నువ్వేం ప్రాణంలేని శిలవు కాదుగా…
అనుభవాలన్నీ తుప్పుపడ్తున్న కాలాన
జ్ఞాపకాలనేం చేసుకుంటావు
స్మశానందాకా ఒంటరిగా నడిచి
అక్కడే నవ్వుతూ కుమ్మరించుకోవాల్సిందే…
కాలం నడుస్తూ ఉంటుంది
తనవెంట నిన్ను నడిపించుకు వెళ్తూ ఉంటుంది
ఎవ్వరూ నీ తోడుండరు… నీవూ నీ పడవ తప్ప
బ్రతుకు సముద్రయానంలో ఎవరూ తోడురారు
ఏవో కల్లోలాలు… ఎన్నో భయంకర తుఫాన్లు.
ఇంతేకాదు జీవితం అంటే…
ఇంకా ఏదో మిగిలుంది…మరింకేదో ఉంది
ఏదో ఉంది… నిజంగానే.