ఆయన ఓ న్యాయమూర్తి. ఆయన ప్రతిరోజూ దొంగలను, హంతకులను, రకరకాల నేరాలు చేసేవారిని చూసి చూసి ఒత్తిడికి లోనయ్యేవారు. ఎవరితోనూ సరిగ్గా మాట్లాడేవారు కాదు. ఇది గమనించిన ఆయన మిత్రులు ఆయనను ఒక జైన్ గురువు దగ్గరకు తీసుకువెళ్ళి పరిస్థితిని వివరించి, ”అయ్యా! మీరే ఈయనకు ధ్యానం చేసే పద్ధతిని నేర్పాలి” అని కోరారు.
జైన్ గురువు అలాగే అని రోజూ ఒక గంటపాటు ఆ న్యాయమూర్తికి ధ్యానం నేర్పారు.
కానీ న్యాయమూర్తి ఎంత ప్రయత్నించినా ఆలోచనలు మారడం లేదు. ధ్యానం మీద మనసు నిలుపలేకపోయారు. గురువు మాటలు బుర్రకెక్కడం లేదు. ఒకరోజు న్యాయస్థానంలో ఒక కేసు వాదనకు వచ్చింది. ఒక దొంగ పట్టపగలు ఒక అమ్మాయి మెడలో గొలుసు దొంగిలించి పట్టుబడ్డాడు. పోలీసులు అతన్ని పట్టుకొచ్చి న్యాయమూర్తి ఎదుట నిలబెట్టారు. న్యాయమూర్తి అతన్ని చూశారు. ”దొంగతనం నేరం… పైగా అందరి ముందు ఒక అమ్మాయి మెడలో గొలుసు లాక్కోవచ్చా? నిన్ను చూసిన వాళ్ళందరూ నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పరా?” అని అడిగారు.
ఆ దొంగ తలను అడ్డంగా ఊపాడు. ”అయ్యా! దొంగిలిస్తున్నప్పుడు నాకు గొలుసు ఒక్కటే పెద్దగా కనిపించింది. చుట్టూ ఉన్న వారెవరూ నా కంటికి కనిపించలేదు” అన్నాడు.
న్యాయమూర్తి పెను నిట్టూర్పు విడిచాడు. ”దొంగ వెధవా! నీకు ధ్యానం బాగా తెలుసులా ఉంది. ధ్యానానికి కావలసింది ఏకాగ్రత. అది నీవు సాధించావు. అభినందనలు. అయితే అది మంచి పనులకు ఉపయోగించాలి కానీ, చెడు పనులకు ఉపయోగించకూడదు ఈసారెప్పుడైనా నీ ఏకాగ్రతను దొంగతనాలకు ఉపయోగించావంటే కఠిన కారాగార శిక్ష తప్పదు. ఇప్పుడు మాత్రం చిన్న జరిమానాతో వదిలిపెడుతున్నాను” అని చెప్పి తాను కూడా ధ్యానంలో ఏకాగ్రతను సాధించాలని మనసులో గట్టిగా నిర్ణయించుకున్నారు న్యాయమూర్తి.