మనం మారాలి -డాక్టర్‌ కొమర్రాజు రామలక్ష్మి

ఆ రోజు ఆదివారం. ఇంట్లో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నాం. నాన్న హాల్లో కూర్చుని ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నారు. అమ్మ వంటింట్లో టిఫిన్‌ తయారుచేసే పనిలో ఉంది. నాకు సెమిస్టర్‌ ఎగ్జామ్స్‌ ఉండడంతో అప్పటిదాకా చదువుకుని టిఫిన్‌ అయిందేమో చూద్దామని వంటింట్లోకి వచ్చాను.చట్నీ వేస్తే టిఫిన్‌ రెడీ అయినట్లే అంటూ ‘కరుణ ఆంటీ పొద్దున ఆరుగంటలకే బస్సెక్కిందట. వచ్చేస్తూ ఉండాలి’ అంటోంది అమ్మ బయటికి చూస్తూ…

అవును కదా! ఈ రోజు కరుణ ఆంటీ వస్తోంది కదా అనుకుంటూ ‘వచ్చేస్తూ ఉంటుందిలే అమ్మా నువ్వేం కంగారుపడకు’ అంటూ ఉండగానే ఆంటీ లోపలికి వచ్చేసింది.

అన్నట్టు అసలు విషయం చెప్పనేలేదు కదూ! మా అమ్మ పేరు అరుణ. ఆంటీ పేరు కరుణ. ఇద్దరూ చిన్నప్పటి నుండి బెస్ట్‌ ఫ్రెండ్స్‌. ఫస్ట్‌క్లాస్‌ నుండి డిగ్రీదాకా కలిసి చదువుకున్నారు. ఆ తర్వాత అమ్మ పి.జి., బి.ఎడ్‌ చేసి వరంగల్‌లో గవర్నమెంట్‌ టీచర్‌గా పనిచేస్తోంది. డిగ్రీతోపాటే చదువాపేసి కరుణ ఆంటీకి పెళ్ళి చేశారట వాళ్ళ పెద్దవాళ్ళు. ఆంటీకి మాత్రం పిజి చేసి, పిహెడ్‌డి చేసి లెక్చరర్‌ ఉద్యోగం చేయాలనే కోరిక

ఉండేదట. పేరెంట్స్‌ మాటను కాదనలే పెళ్ళికి ఒప్పుకుందట. అమ్మ చెబుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనుషులు అనుకున్నవేమీ కావు. పరిస్థితులతో అడ్జస్ట్‌ కాక తప్పదు.

కరుణ ఆంటీ భర్త గోపాల్‌ హైద్రాబాద్‌లో జాబ్‌ చేస్తూ ఉండడంతో ఆంటీవాళ్ళు అక్కడే సెటిల్‌ అయ్యారు. వాళ్ళకొక అబ్బాయి. బి.టెక్‌ సెకండియర్‌ చదువుతున్నాడు. ఆంటీకేమో ఆడపిల్లలంటే ఇష్టం. అందుకే నేనంటే ఎక్కువ ఇష్టపడుతుంది. వచ్చినప్పుడల్లా డ్రెస్‌లు, గాజులు అవీ నాకోసం తెస్తుంటుంది. జాబ్‌ చేసే ఆడవాళ్ళు భర్తమాట వినరట. కుటుంబాన్ని పట్టించుకోరట. అందుకే ఆంటీ జాబ్‌ చేయడం అంకుల్‌కి ఇష్టంలేదు.

అరుణ, కరుణ ఇద్దరూ సార్థక నామధేయులే. అరుణ అంటే మా అమ్మ కొంచెం తీవ్రంగా ఆలోచిస్తుంది. ఎవరినైనా వెంటనే ప్రశ్నిస్తుంది. ఎవరైనా తప్పుచేస్తే మొహమాటం లేకుండా వెంటనే ఖండిస్తుంది. కానీ కరుణ ఆంటీ మొహమాటస్తురాలు. చాలా నెమ్మదైన మనిషి. ఏదీ పైకి చెప్పుకోలేక తనలో తానే బాధపడుతూ ఉంటుంది. ఈ విషయం కూడా అమ్మే చెబుతుంటుంది.

‘రాధికా! ఆంటీని ఫ్రెష్‌ అయి రమ్మను. టిఫిన్‌ తిందాం’ అని అమ్మ పిలిచిన పిలుపుకు అవును నేను ఇంతసేపూ వీళ్ళిద్దరి గురించి ఆలోచిస్తున్నాను అనుకుంటూ రండి ఆంటీ టిఫిన్‌ తిందాం అంటూ ఆంటీతోపాటు డైనింగ్‌ టేబుల్‌ దగ్గరకు వెళ్ళాం. అప్పటికే నాన్న టిఫిన్‌ తిని పనుందంటూ బైటికి వెళ్ళారు.

‘అవును కరుణా! ఏంటి సడన్‌గా వస్తున్నట్లు ఫోన్‌ చేశావు. ఏమయింది? ఏమయినా సమస్యా?’ అని అడిగింది అమ్మ.

‘అదేంలేదే. నిన్ను చూడాలని, నీతో చాలా విషయాలు మాట్లాడాలని అనిపించింది. వెంటనే వచ్చేశాను. నేనెక్కడికయినా వెళ్ళడం ఆయనకు ఇష్టముండదు. కాకపోతే నా అదృష్టం. నీ దగ్గరకు వస్తానంటే మాత్రం వద్దనడు’ అంది కరుణ ఆంటీ అమ్మవైపు చూస్తూ.

‘మంచి పనిచేశావు. రావాలనిపించినపుడు వచ్చేయాలి. మన కష్టాన్నయినా, సంతోషాన్నయినా మన మనసుకు నచ్చిన వాళ్ళతో పంచుకోవడం చాలా అవసరం. అయినా చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడానికి కూడా వీల్లేని పరిస్థితులు, ఆంక్షలు ఏంటో’ అంది అమ్మ. వీళ్ళిద్దరి స్నేహం చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక రకంగా జెలసీగా కూడా అనిపిస్తుంది. పక్క పక్క ఊర్లలోనే ఉన్నా వీళ్ళింకా ఉత్తరాలు రాసుకుంటారు. అనేక ముచ్చట్లను కలబోసుకుంటారు. వీలయినప్పుడల్లా ఫోన్లలో మాట్లాడుకుంటారు. ముఖ్యంగా ఒకరిని ఒకరు గౌరవించుకుంటారు. వాళ్ళ దృష్టిలో వాళ్ళిద్దరి స్నేహాన్ని మించింది ఏదీ లేదు.

మధ్యాహ్నం భోజనాలయ్యాక ఇద్దరూ ఒకచోట చేరి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. దాదాపు వాళ్ళిద్దరి ఆశయాలు, అభిరుచులు ఒక్కటే. అయితే ఇంతకుముందే చెప్పుకున్నట్లు అరుణకు కుటుంబపరంగా సహాయ సహకారాలున్నాయి. కరుణకు ఆ వెసులుబాటు లేదు. అన్నీ భర్త గోపాల్‌ ఇష్టానికి అనుకూలంగానే జరగాలి. అతనికి ఆడవాళ్ళంటే చులకన భావమట. అతని దృష్టిలో ఆడవాళ్ళు ఇంటిపని, వంటపని చూసుకుంటే చాలు. దానికి తోడు వాళ్ళకు ఆడపిల్లలు కూడా లేరు. కరుణ ఆలోచనా విధానం పూర్తిగా వ్యతిరేకం. అయితే ఇంట్లో పురుషాధిపత్య భావజాలంతో సర్దుకుపోవడం అలవాటయింది. అమ్మ, ఆంటీ మాట్లాడుకుంటుంటే అప్పుడప్పుడూ ఇవన్నీ వింటూ ఉంటాను.

కాలేజీలో చదివే రోజుల్లో కరుణ పాటలు పాడేది, బొమ్మలేసేది. రవివర్మ పెయింటింగ్స్‌ అంటే తనకు చాలా ఇష్టం. కవిత్వం, కథలు కూడా రాసేదట. పెళ్ళయ్యాక అన్నీ మానేయాల్సి వచ్చిందట. తన భావాలను గౌరవించని భర్త దొరకడం తన దురదృష్టం అనుకుంటూ

ఉంటుందట. మన సమాజంలో పెళ్ళి అనేది మనుషుల జీవితాలను, ముఖ్యంగా ఆడవాళ్ళ జీవితాలను ఎంతగా మార్చేస్తుంది. పెళ్ళి పేరుతో అత్తింట అడుగుపెట్టిన ఆడపిల్లకు అంతా దుఃఖమేనా? అడుగడుగునా అవమానాలేనా? అందరు మగవాళ్ళూ అట్లాగే

ఉంటారా? కాకపోవచ్చు. మరి నాన్న మంచివాళ్ళే కదా! నాన్న అమ్మ అభిప్రాయాలను గౌరవిస్తారు కదా! పెళ్ళనేది అదృష్టంపై ఆధారపడి

ఉంటుందా? కరుణ ఆంటీ అవన్నీ ఎట్లా భరిస్తోందో వాళ్ళ అబ్బాయయినా ఆమెకు సపోర్టుగా ఉంటే బాగుండు.

అమ్మతో మాట్లాడినపుడు మాత్రం కరుణ ఆంటీ ఉత్సహంగా ఉన్నట్లు అనిపిస్తుంది. విచిత్రమేమిటంటే ఆంటీ అమ్మతో మాట్లాడడాన్ని మాత్రం గోపాల్‌ అంకుల్‌ వద్దనడంట. అది కొంతవరకు నయం. ఆ అవకాశాన్ని ఉపయోగించుకునే ఆంటీ ఎప్పటికప్పుడు కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంటుంది. ఈసారి మరీ విసిగిపోయినట్లుంది. అందుకే అతనేమనుకున్నా ఫర్వాలేదని, ఈ రోజు రాత్రికి ఇక్కడే ఉండి మర్నాడు పొద్దున్నే వెళ్దామని వచ్చిందట.

సాయంత్రం నాలుగయింది. అమ్మ, ఆంటీల కబుర్లు కొనసాగుతూనే ఉన్నాయి. వాళ్ళిద్దరూ మన అసమ సమాజంలో మానవ ప్రవర్తనల గురించి మాట్లాడుకుంటున్నారు. పదిలంగా గుండెల్లో దాచుకున్న తమ చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. వాళ్ళను డిస్టర్బ్‌ చేయడం ఇష్టంలేక నేనే టీ పెట్టి తెచ్చి ఇచ్చాను. ‘మీరిద్దరూ పొద్దుటినుంచి మాట్లాడుతూనే ఉన్నారు. కాసేపు రెస్ట్‌ తీసుకోకూడదూ’ అన్నాను టీ ఇస్తూ. నా మాటలకు ఈ లోకంలోకి వచ్చిన వాళ్ళు టీ తీసుకున్నారు. ‘థాంక్యూ రాధికా! నీలాంటి కూతురుండడం మా అరుణ చేసుకున్న అదృష్టం’ అంది కరుణ ఆంటీ. అమ్మ నావైపు కృతజ్ఞతతో చూసింది. కాసేపయ్యాక వాళ్ళిద్దరూ తయారై భద్రకాళి గుడికి, వృద్ధాశ్రమానికీ వెళ్ళొచ్చారు.

తిరిగొచ్చాక రాత్రి భోజనాలయ్యాక తర్వాత వాళ్ళిద్దరూ మేడమీదికి వెళ్ళి వెన్నెలను చూస్తూ, పాత రోజులను గుర్తు చేసుకుంటూ కాసేపు ఎంజాయ్‌ చేశారు. మళ్ళీ మాటల్లో పడిపోయారు. యాంత్రికమైన జీవన విధానం గురించి, మనుషుల మధ్య పెరుగుతున్న దూరం గురించి, మాయమైపోతున్న మానవ సంబంధాల గురించి చర్చిస్తున్నారు. కరుణ చాలా రోజులకు ఒక పాట పాడింది. వెరీనైస్‌ అంటూ చప్పట్లు కొడుతూ ‘అవునే కరుణా! నీలో ఇంత టాలెంట్‌ పెట్టుకుని ఊరికే బాధపడుతూ ఉండడం దేనికి? నువ్వు మళ్ళీ కవితలు, కథలు రాయడం మొదలుపెట్టొచ్చు కదా! బొమ్మలు కూడా బాగా వేస్తావాయె’ అంది అరుణ.

‘మరుగున పడిపోయిన వాటన్నింటినీ నేను మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టడమా? అన్నీ వదిలేసి ఒక జడ పదార్థంలా మారిన నాకు అవన్నీ ఇప్పుడు సాధ్యమవుతాయా? అయినా ఎందుకు మళ్ళీ గొడవలు కొని తెచ్చుకోవడం’ అన్న కరుణతో ‘ఎందుకు సాధ్యం కాదు? ప్రపంచంలో మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. మనకూ ఆత్మగౌరవం ఉంటుంది, ఇష్టాయిష్టాలు ఉంటాయి. గోపాల్‌ ఎంకరేజ్‌ చేయనంత మాత్రాన నీవు అన్నీ వదులుకోవాల్సిన అవసరముందా? ఒక్కసారి మళ్ళీ ఆలోచించు. వీలయినంతవరకూ అతనిలో మార్పు కోసం ఎదురు చూశావు. అతను మారలేదు. వదిలెయ్‌. అతన్ని పట్టించుకోవడం మానెయ్‌.

ఇప్పటికైనా నీకిష్టమైన దారిని నీవు ఎంచుకోవచ్చు కదా! ముందు అతనికి భయపడడం మానెయ్‌. అతనే దారికొస్తాడు. మనకు తెలియనిదేముంది. మగవాళ్ళంతా చాలావరకు ‘మేల్‌ ఇగో’తోనే ఉంటారు ఎక్కడో ఒకళ్ళిద్దరు తప్ప.పెళ్ళి, పిల్లలు జీవితంలో ఒక భాగం మాత్రమే. పరిస్థితులు మనకు అనుకూలంగా లేవని అంతగా కుమిలిపోవాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఆ పరిస్థితులను ఎదుర్కొనే మనోబలాన్ని సమకూర్చుకోవడం అలవరచుకోవాలి. మన అనుభవాల్లోంచే జీవిత పాఠాలను నేర్చుకోవాలి. కొన్నింటితో రాజీపడాలి. కొన్నింటికోసం పోరాటం చేయాలి, సాధించుకోవాలి. మానవ జన్మకు సార్థకత చేకూర్చుకోవాలి’ అన్న అరుణ మాటలకు ప్రభావితురాలైన కరుణ ‘అవును నాకూ పరిస్థితులకు ఎదురు తిరుగుదాం అనే అనిపిస్తోంది కానీ ఏదో బెరుకు, భయం’ అంది సందిగ్ధంగా.

‘నీ మొహం! నేను మళ్ళీ చెబుతున్నాను విను. అవన్నీ ఒదిలెయ్‌. ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించు. భవిష్యత్తులో మనిద్దరం కలిసి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయ్‌. వాటన్నింటికీ రూపకల్పన చేసుకుందాం. కుటుంబ సంబంధాలు ముఖ్యమే కాదనను, కానీ మన ఆలోచనలు, అభిప్రాయాలు మనకుంటాయి కదా. మనకంటూ కనీస స్వేచ్ఛ ఉండాలి కదా! ఆలోచించు. ఎంతో విలువైన జీవితాన్ని ఇప్పటివరకూ వృధా చేశాం. ఇప్పటినుంచైనా మనకోసం మనం జీవిద్దాం. మనల్ని మనం ప్రేమించుకుందాం. గౌరవించుకుందాం. భవిష్యత్తు ప్రణాళికతో ముందుకెళ్దాం. మనం అనుకున్నట్లు సమాజానికి మనం చేయగల సేవలను చేద్దాం. మన ఆశలకు ఊపిరి పోద్దాం. కలలను సాకారం చేసుకుందాం. ఇంతవరకు కుటుంబం కోసం బతికాం. ఇకముందు సమాజం కోసం బతుకుదాం’ అన్న అరుణ మాటలను విన్న కరుణ ‘అవును నిజమే. ఇనాళ్ళూ అజ్ఞానంలో ఉండి ఆశలను, ఆశయాలను వదులుకుని భర్త, పిల్లలే పరమావధిగా బతికాం. స్వీయ సంతృప్తిని కోల్పోయాం. నువ్వన్నా కొంచెం నయం. నేనైతే మరీ ఆత్మగౌరవం లేకుండా బతికా. ఇకముందు అలా కాదు. నీవు చెప్పినట్టు నాలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసి, పదునుపెడతా. సామాజిక సమస్యల పట్ల స్పందిస్తూ పరిష్కార మార్గాలను సూచిస్తూ కవిత్వం, కథలు రాస్తా. సమాజం తీరు తెన్నులపై బొమ్మలు వేస్తా. గోపాల్‌ సహకరించకపోయినా కృంగిపోను. మగవాళ్ళంతే అనుకుంటూ ముందుకెళ్తా. నీ సహకారంతో నాకంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకుంటూ అనుకున్నవన్నీ సాధిస్తా. అందుకనుగుణంగా నేనే మారుతా’ అంది కరుణ మెరిసే కళ్ళతో అరుణవైపు చూస్తూ. కరుణలో వచ్చిన ఈ మార్పును చూసి అరుణ కళ్ళు కూడా ఆనందంతో మెరుస్తున్నాయి. ఆ రాత్రి ఇద్దరూ ఏదో సాధించామన్న ధీమాతో తృప్తిగా నిద్రపోయారు.

 

 

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.