నదినని అంటావు
అయినా
పరవళ్ళు త్రొక్కనియ్యవు
అమృత ధారల
కొండవాగునని అంటావు
అయినా
రాయిరప్ప సందుల
గూడుల నుండి
ముక్తి లేదు!
అప్పుడప్పుడు అంటూ ఉంటావు
మచ్చలేని తాజాపువ్వునని
అయినా
సువాసనలు కాస్త పరుచుకున్నాయని
చిదిమి వేయడానికి వెనకాడవు!
ఎందుకు పదేపదే నాకు చెబుతావు
ఆహా! ఎంత అందమైన లతనని
బితుకు బితుకుగా
గోడ మీదకి కాస్త అల్లుకోపోతే
ఆకులతో పాటు కొమ్మల్ని రెమ్మల్ని
కొట్టి పారేయడానికి వెనకాడవు!
నదిని నేను
ఎంతకాలం, ఎన్నాళ్ళు
ఇలా వెతుకులాడాలి
బెజ్జాలని, కన్నాలని
నీళ్ళకుండలో
హద్దుల పరిధిలో
ఎంతకాలం ఇలా
ఇంకా
అదిమి పట్టుకుంటాను
జాలువారే దిట్టతనాన్ని
స్నానాల గది షవరు బెజ్జాల్లో!
ఇంకా
ఎంతకాలం ఇలా
పరిమళాల పూవునై
అలంకరణనై ఉంటాను
నీ పూల గాజు జాడీలో!
గుర్తుంచుకో
ఎంత నరికి పారేసినా
చావను
చచ్చి చచ్చి
ప్రతిసారీ ఎమీబాలా
ప్రతిఖండంలోంచి
లేచి వస్తాను
బతికి బయటికి!
ప్రతి నిత్యం పెను మార్పు
చెందుతాను
తిరిగి మరల వచ్చేస్తాను
చందమామను తాకి
మట్టి పడకకి!