ఏదైనా నిష్పత్తే
కొంచెం ప్రేమ కొంచెం ఈర్ష్య
కొంచెం సాహసం కొంచెం విషాదం
ఏవి ఏ పాళ్ళలో కలుస్తాయో
ఎవరికీ తెలియదు.
ఈ జీవన పానీయాన్ని
ఏ ల్యాబ్‌కీ పంపనక్కరలేదు
ఈ రుచి
ఒక మిశ్రమ అనుభూతి.
దేహాన్నే పరిశీలిద్దాం
దానిదొక యాంత్రిక ప్రతిపత్తి.
ఒకానొక సమన్వయంతో
వెలిగే వత్తి.
చేతులు ముడుచుకోవు
కాళ్ళు
నడవాలనే కోరికను అణచుకోవు.
కనులు మూసుకున్నా దర్శిస్తాయి
కన్నీళ్ళు వద్దన్నా వర్షిస్తాయి.
గుండె చప్పుడుకూ
భావలోకానికీ మధ్య
ఒక విచిత్ర శబ్దం విన్పిస్తుంది.
ఏదైనా ఒక కలయిక
కరిగేటప్పుడే తికమక.
బయటికి వెళ్ళకపోతే
ఇల్లు ఇరుకు.
సాయంత్రం పూట
సూర్య కషాయాన్ని
తాగాలంటే బెరుకు.
కొంచెం ఉత్సాహం కొంచెం ఉద్వేగం
సరిహద్దులు లేని సందేహాల్తో
మానవ ప్రయత్నమే
ఒక స్పష్టత
పట్టాల కెక్కిన జీవన కవిత
కొంచెం వెలుగు కొంచెం కలుగు
కొంచెం మధురిమ కొంచెం అరుణిమ
నిష్పత్తి కుదిరితే
జీవితం ఘుమఘుమలాడుతుంది
ఏదైనా నిష్పత్తే.