వెన్నెలంతా నాదే
మల్లెల పరిమళమంతా నాదే అని
సూర్యుడు నిద్రపోగానే అనుకుంటావేమో…
రాత్రి కన్య చీకటి చీరపై చేయివేస్తావు…
ఊరవతలి పూరిపాక కల్లుకుండని నీ కడుపుల దాచుకుని
నను తాగకు పోతావన్న బీడీని
నీ పెదవుల మధ్య పొగగా ఆమె ముఖంపై వదిలినా…
నీ అరచేతుల్లో నలిగి,
పళ్ళకు గారపట్టిన రంగు,
ఆ వాసనంటు ఇష్టంలేదనే మాట చెప్పే స్వాతంత్య్రం ఆమెకు లేదపుడు…
పూవుదేహంపై చేయిని విసిరే రాత్రికి
Don’t Touch me అనే ఆమె మాటకీ విలువచ్చిందిపుడు…
మనసు లేని మనిషనుకున్నారు ఇన్ని రోజులు…
కాదని చెప్పుటకు ఉన్నత న్యాయస్థానం ఆమెకు వకాల్తా పాడింది ఈ రోజు…
మరమనిషి 0కాదు…
స్పందించే గుణమున్న మనసు అంటూ
మనసు పొరలలో
విషాదపు గూడును
తొలగించే తీర్పునిచ్చింది ఈ రోజు…
ఆమె అనుమతి పత్రాన్ని
అమలు పరిచే చీకటి గోడలెన్నో
వారి అంతరాత్మకే తెలియాలి…
ఆమె నోరు విప్పితే మనకు తెలియాలి…