అవును…
ఈ రోజు నుంచి
నాలుగడుగులు నడిచే తీరుతా
నాలోకి నేను ప్రవహిస్తూ…
వడివడిగా నడిచే… తీరుతా
ఎప్పట్నుంచో అంటిపెట్టుకున్న
ఈ వంటింటిని కాస్తా…
పక్కకు జరిపి
ఓ నాలుగడుగులు నడిచే తీరుతా…
చిట్టి చేతులనాడే
అంటగట్టిన ఆమాద్మీ చిహ్నం
ఎదురు చూస్తుందనో…
జాతీయాదాయానికి పట్టని
ఇంటిచాకిరి
వెంటపడుతుందనో…
వంకలేం పెట్టకుండా
నడిచే తీరుతా…
బాలభానుడి కిరణంలా…
సవ్యసాచి సైతం విస్తుపోయే కౌశలం నాది
రాజు మంత్రీ బంటూ నేనే…
నా ప్రతిభా పాఠవంతో
కాలానికి గాలం వేసైనా…
కాసిన్ని క్షణాలని పోగేసుకుంటా…
పొద్దున్నే సెలయేరై పచ్చదనాన్ని నింపుకుంటా
నిన్నటి అసంపూర్తి కావ్యానికి
కదులుతున్న మేఘం
ఓ కొసమెరుపును అద్దేదాకా
నడిచే తీరుతా…
అన్నట్టు…
మా పేద విద్యార్థుల సమయాన్ని
హరిస్తాననుకునేరు…!
విధి నిర్వహణకు నీరాజనాన్ని
ఉదయ సాయంత్రాల అదనపు తరగతుల
పహారా కాస్తున్నాం…
సద్దిడబ్బా… చంటిపిల్లలూ
ఇంటాయనా… ఇస్త్రీ బట్టలూ…
సాకులన్నింటి నధిగమించి
గాలిపటాన్నయి తేలిపోతా…
కాంతిరేఖనయి వెలుగు పంచుతా…
యావత్ లోకానికి నడక నేర్పి
అలసి మెత్తబడ్డ నా పాదాలని
ఇంకిపోతున్న మా పల్లె చెరువు తల్లి
చదివినట్టుంది…
తన అరచేతులని పరిచి ఆహ్వానించింది చిన్నప్పటి మా నాన్నలా…
ఇప్పుడదే నాకు ట్యాంక్‌బండూ… వాకింగ్ ట్రాకూనూ…