ఋతువులు ఆరేనని తెలుసు
కానీ
నా ఋతుచక్రంలో నేనో బందీనౌతానని చిన్నప్పుడు తెలియదు
ఆ చక్రంలో చిక్కిన రోజున నా గుండె శిశిరమౌతుంది
చెట్టు నుంచి ఆకులు రాలినట్లుగా
కంటి నుంచి బొట్లు బొట్లుగా
ఋతుస్రావం చుక్కలు చుక్కలుగా జాలువారుతుంటే
ఆరవరోజైన వసంతం ఎప్పుడొస్తుందా అని ఆత్రంగా ఎదురు చూశా…
కాయం హేమంతంలో వృద్ధునిలా బిగుసుకుపోతుంటే
వేన్నీళ్ళకై ఎదురు చూసిన దేహంలా
కన్నీళ్ళతో కాయం కట్టైతుంది
ప్రాయం మొదలైందని సంబురపడే సమయం కూడా ఇవ్వక
ప్రాణాల్ని సైతం తోడేసేలా పొత్తి కడుపులో నొప్పులు
కన్యగా అనుభవించే పురిటి నొప్పులు…
జత నాగులు అల్లిన జ్ఞాపకంలా ఉదరంలో పేగుల పెనవేతలు
తీర్చలేరెవరు స్త్రీకి ఆ మూడు రోజుల వ్యథలు…!