ఇవి పారుతున్న
చెమట చుక్కలు కావు పరిగెడుతున్న
రక్తపు రహదారులు
నువ్వు కొత్తగా సరుకును చేసి
చూపటానికి ఏముంది?
అమ్మ, చెల్లి, భార్యాబిడ్డలు
స్త్రీలందరూ ద్రవిస్తున్న
కన్నీటి రక్తపు వరదలే!
ఆ వంపు సొంపుల అందంలోనే నువ్వు పిండమై
మలమూత్రాల సంద్రంలో
ఈతకొట్టి ఊపిరి పోసుకున్నది
ఆ చీము నెత్తురులను తాగే
నువ్వు మగ రూపంతో
స్త్రీని చీల్చుకొని వచ్చి
భూమిపై పురుడు పోసుకుంది
స్త్రీలు… పూజింపబడినా
గోడల మధ్యన బంధించబడినా
నట్టింట హత్యలు చేయబడినా
అత్యాచారం చేసి చంపబడినా
బజారు సరుకుగా అమ్మబడినా
క్షమయా ధరిత్రీ! అనేగా…నీ
అచంచల ప్రగాఢ విశ్వాసం?
మనువు చేతి ఆటబొమ్మవు కదా!
పితృస్వామ్య భావజాలకుడివి కదా!
పురుష అహంకార పాలకుడివి కూడా కదా!
ఇంతకన్నా… మరింకేం చేయగలవు చెప్పూ?
నీ వృత్తి… ప్రవృత్తి…
ప్రకృతీ విరోధక సామీప్యాలే కదా!
నాలుగు కూడళ్ళ మధ్య
నగ్నంగా రమించగల ధీరుడవు
సిగ్గూ లజ్జా విచక్షణ లొదిలేసిన
వికృత కామప్రకోప వీక్షకుడవు
దేహమంతా కుళ్ళిన
వాసనను పులుముకున్న వేళ
మదపిచ్చితో చూపులను
ప్రదర్శించక ఏం చేస్తాయి చెప్పూ?
ప్రశ్నల చురకత్తులను సంధించిన వేళ!
దేహవాంఛ… బూతు
పురాణ చిట్టాలను విదిలించక ఏం చేస్తుంది పాపం?
కొందరికి పుట్టుకతో
వచ్చిన బుద్దులు పుడకలతో… కానీ… పోవంటారు?
అది… నిజమే… సుమీ…!