గర్భస్థ శిశువులు మరణభయంతో వణుకుతున్న చోట
ప్రాణవాయువు అందక పసిప్రాణాలు గాలిలో కలుస్తున్న చోట
స్వాతంత్య్రం వచ్చిందని నమ్మిన ఓ పసిమొగ్గ
చెత్తకుప్ప సాక్షిగా చెరచబడ్డ చోట
భారతీయులంతా నా సోదరులంటూనే
మనుషుల్ని మనుషులుగా చూడలేని చోట
మట్టిని, నీటిని, చెట్టుని, పశువుని అమ్మతో పోలుస్తూనే
అమ్మ జాతిని అంగడిబొమ్మను చేసి అవమానిస్తున్న చోట
అన్నెం పున్నెం ఎరుగని జీవితాలు పరువుహత్యల పాలవుతున్న చోట
ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు పాలకుల స్వార్థానికి బలవుతున్న చోట
అన్యాయం, అక్రమం, అవినీతి, అరాచకత్వాలన్నీ
మూకుమ్మడిగా రాజ్యమేలుతుంటే ప్రశ్నించే గొంతులు
నొక్కివేయబడుతున్న చోట
రాజ్యపు దురాగతాన్ని నిరసిస్తూ నినదించే పిడికిళ్ళూ
గళమెత్తిన కలాలూ నెత్తుటి మడుగుల్లో తేలుతున్న చోట
రేపు నా శరీరమూ తూటాలతో ఛిద్రమైనా సరే
తండ్రీ ఆ చోట నన్నొక అక్షరాన్ని చెయ్…