అందంగా ఉన్నానన్నావు… నవ్వుకున్నాను
నచ్చానని… పెళ్ళి చేసుకుంటానన్నావు… ఒప్పుకున్నాను
మూడు ముళ్ళతో ముడేశావు… నీ వెనుక నడిచొచ్చాను
అనుదినం కట్నాలు కావాలంటూ వేధించావు… భరించాను
అందంగా ఉన్నానని అక్రమ సంబంధాలంటగట్టావు… సహించాను
అందవిహీనమవ్వాలని వాతలు పెట్టావు… భరించాను… బ్లేడుతో కోశావు… అనుభవించాను
ఏ మాత్రం అవకాశం దొరికినా తప్పు చేశానంటూ కొట్టావు… సహించాను
ఏ బాధ్యతా పట్టకుండా చిత్తమొచ్చినట్లు తిరిగావు… భరించాను
అమ్మాయి మగ స్నేహాలు నేర్చిందని లోపం నాదేనన్నావు… సహించాను
అబ్బాయి చెడ్డదారి పట్టాడని నాది తప్పుడు పెంపకమన్నావు… భరించాను
ఇవన్నీ నాలుగ్గోడల నడుమే కనుక… కానీ ఈనాడు… ఈనాడు
నీ బాధలు మర్చిపోవడానికి నువ్వు తాగే మందు
నన్ను తెమ్మంటున్నావు… అలుసిచ్చాననా…
ఇవాళిది తెమ్మంటావు… మరి రేపు…
రేపు నాలుగు రోడ్ల మధ్య నిలబెట్టి మరేదో కావాలంటావు
ఆపై నీతో ఉన్న మందికి నన్ను మగువ కమ్మంటావు
నాలుగ్గోడలు దాటే ఈ అభిమాన దహనాన్ని భరించలేను
ఇప్పుడైనా నువ్వు మారకపోతే… మారకపోతే
ఇన్నాళ్ళ అసహనం ఉవ్వెత్తున ఎగసిపడుతుంది
నువ్వార్పలేని జ్వాలై నిన్నే నుసి చేస్తుంది…
ఇది నువ్వు తెలుసుకుంటావని ఇన్నాళ్ళు వేచాను…
ఇక నా వల్ల కాదు… నిన్ను చంపేయాలనుంది… కానీ
మెడనొంచి మూడు ముళ్ళేశావు నా చేతులు కట్టేస్తూ
అందుకే వెళ్ళిపోతున్నా దూరంగా…
ఎప్పుడో నీ వ్యసనాల ఫలంగా నీ కాళ్ళూ చేతులూ పడిపోయాక
చాకిరీకోసం నన్నెతుక్కుంటూ వస్తావని తెలుసు అందుకే…
నీకందనంత దూరం పారిపోతున్నా…
నా ఆత్మ గౌరవం నన్ను నిలదీసే పరిస్థితి లేని చోటును వెతుక్కుంటూ