భూమిక ఒక నేస్తం. ఒక సలహాదారు. ఒక దిక్సూచి. ఒక సమాచార దర్శని. దాదాపు నాకు ఆ పత్రిక పుట్టినప్పటి నుంచీ తెలుసు. తెలుసు అంటే అప్పటినుంచీ చదువుతున్నానని అర్థం. అప్పుడే ప్రేమలో పడ్డాను. అప్పుడెప్పుడో భూమిక తొలి సంచికల్లో మృణాల్ పాండేది ఒక మంచి కథ అనువాదం చేశాను. ఆ పత్రిక అప్పుడు వస్తున్న అన్వేషి కార్యాలయాన్ని, లలితగార్ని ఎంతో ఆసక్తిగా చూసి వచ్చాను. తర్వాత భూమిక సత్యవతి ఆధ్వర్యంలోకి వచ్చాక ఆ పత్రికతో పెనవేసుకుపోయాను లేదా పోయాము చాలా మందిమి. వ్యాపార దృష్టి లేని ఒక పత్రిక, అందులోనూ స్త్రీల పత్రిక నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడాలి. ఒక మంచి పత్రిక, అంటే ఒక ఉపయోగకరమైన పత్రికను నిలుపుకోవడానికి ఆ పత్రిక ఎవరికోసం పనిచేస్తోందో వాళ్ళు కూడా ఆసక్తి చూపించాలి, కాస్త శ్రమను వెచ్చించాలి, పదిమందికి చెప్పాలి. భూమికలో మంచి వ్యాసాలొస్తాయి, సమాచారం వస్తుంది. ప్రేమ్‌చంద్ వంటి గొప్ప రచయితల నవలలు వస్తాయి. కానీ చాలామందికి టీవీలో జబర్దస్త్ వస్తుందని తెలుసు కానీ భూమిక అని ఒక పత్రిక వస్తుందని, అందులో తమను ఉత్తేజపరిచే, ఉద్దీపం కలిగించే అనేక విషయాలుంటాయనీ తెలియదు. అట్లా తెలియకుండా ఉండడంలో వ్యవస్థ యధాతథ స్థితిలో నిలిచి ఉండడానికి చాలా సంబంధం ఉంది. నిలిపే ప్రయత్నం చాలా ఉంది. దానికి స్త్రీలుగా మనం సహకరించకూడదని తెలుసుకోవాలి. భూమికతో నా అనుబంధాన్ని చెప్పమంటే ఒక వ్యాపార ప్రకటనలాగా వ్రాసుకుపోతున్నానని అనుకోవద్దు. భూమిక పత్రిక మనది అనుకుంటాను నేను. ఇక సత్యవతితో నా స్నేహం గురించి మాత్రం ఎలా చెప్పకుండా ఉండను! నా చేత రాగం భూపాలం రాయించింది. స్వాతంత్య్రానంతర తొలి కథా రచయిత్రుల పరిచయాలు వ్రాయించింది. ఇంక భూమిక తరఫున చేసిన విహారాలు, వాకపల్లి సందర్శన చాలామంది రచయిత్రులను కలిపింది, మిత్రులను చేసింది. అవి ఒకలాంటి ఉద్దీపనలే. భూమికతో అనుబంధం అంటే ఇంకా చాలా చెప్పొచ్చు కానీ ఒద్దు. భూమిక అంటే ఒక ఉపక్రమణిక, ఒక ఉపోద్ఘాతము, ఒక జూతీవటaషవ అని అర్థం నిఘంటువులో. ఇది ఒక స్త్రీవాద పత్రిక, మనందరికీ ఒక వేదిక. ఈ పత్రికను గురించి తెలియని వాళ్ళకు ఒక బహుమతిగా చందా కట్టొచ్చు. పదిమందికైనా కట్టొచ్చు. ప్రయత్నించండి చూద్దాం.
– పి. సత్యవతి, విజయవాడ