స్త్రీలంటే కేవలం అందాలు, అలంకరణలు, కుట్టుపని, కొత్త వంటలు మాత్రమే కాదు… స్త్రీలకి మెదడుంది దానికి జ్ఞానాన్నివ్వాలి, హృదయముంది అనుభవాన్నివ్వాలి, శరీరముంది వ్యాయామాన్నివ్వాలి అన్న విషయాన్ని గుర్తించి, స్త్రీలకు ఇంట బయట ఒక సమాజముందన్న అవగాహనని కల్పిస్తూ, చైతన్యపరుస్తూ 1993లో త్రైమాస పత్రికగా ప్రారంభమై అనతికాలంలోనే మాసపత్రికగా నిలదొక్కుకుని నిరంతరాయంగా, పాతికేళ్ళు తనతోపాటు స్త్రీలందరినీ జర్నీ చేయించిన భూమిక నా కథలకు వేదికయిందని చెప్పడానికి నేను గర్విస్తున్నాను.
భూమిక ‘అన్వేషి’తో కలిసి నిర్వహించిన ఆ గొప్ప వర్క్‌షాప్‌లో నుండి నేను రచయిత్రిగా ఎదిగానని చెప్పడానికి
ఏ మాత్రం సంకోచించను. ఒక ఓల్గా, ఒక పి.సత్యవతి, అల్లం రాజయ్య, కేతు విశ్వనాధరెడ్డి, వల్లంపాటి, వాసిరెడ్డి సీతాదేవి, కాళీపట్నం మాస్టారు… ఇలా ఎందరో మేరువులు ఆ వర్క్‌షాప్‌లో కథలెలా రాయాలో, ఎలా రాయకూడదో కూడా చెప్పినందు వలన నా ప్రాపంచిక దృక్పథం ఏమిటో నాకు సరిగ్గా బోధపడింది.
ఆ సభలో భూమికలో వచ్చిన కొన్ని కథల్ని విశ్లేషిస్తూ కేతు విశ్వనాధరెడ్డి గారు నా కథ ‘ఇల్లాలి సుఖం’, అందులోని మాండలికం గురించి ప్రస్తావించడం నాకెంతో ఉత్సాహాన్నిచ్చింది. భూమిక టీం అంతా ‘ఇల్లాలి సుఖం’ గురించి మాట్లాడుతుంటే ”అరె! ఇలా జీవితాలను చెప్పడమేనా కథలంటే” అనుకుంటే ధైర్యమొచ్చింది. నేను పంపిన కథలను నిరభ్యంతరంగా భూమికలో ప్రచురించడంతో వెంటవెంటనే కథలు రాయడానికి నాకు మార్గం సుగమమైంది. అలా భూమిక బడ్డింగ్ రైటర్స్ ఎందరికో ప్రోత్సాహాన్నివ్వడమే కాకుండా స్త్రీ పాఠకులనెంతగానో చైతన్యపరిచింది.
ముఖ్యంగా ఎప్పటికప్పుడు సామాజిక సంచలనాలను, సందర్భాలను విశ్లేషిస్తూ వెలువడుతోన్న సంపాదకీయాలు సమాజం పట్ల కొత్త అవగాహనను కల్పించి ఆయా సందర్భాలను మూలాల నుంచి అర్ధం చేసుకునేలా దోహదపడ్డాయని చెప్పక తప్పదు. ప్రముఖ పత్రికల సంపాదకులు కూడా ఒక కొత్త సందర్భాన్ని గురించి భూమిక సంపాదకీయం ఎలా ఉండబోతోందోనని ఉత్సుకత చూపిస్తారని విన్నప్పుడు సంభ్రమాశ్చర్యాలకు లోనవడం జరిగింది. అత్యంత తేలిగ్గా ఒక్కో సంచలనాన్ని తన సంపాదకీయాల్లో అర్ధం చేయించడం భూమిక ప్రత్యేకత. సమాజం పట్ల లోతయిన అవగాహన ఉంటేనే తప్ప సంపాదకీయాలు ఇలా రాయగలగడం సాధ్యంకాదు. ఆ సంపాదకీయాల్లోని పదును సామాన్య స్త్రీ పాఠకులకు కూడా పోరాట స్ఫూర్తిని కలిగిస్తుంది.
ఇవన్నీ ఒక ఎత్తయితే భూమిక తన రచయిత్రులతో చేయించి స్నేహపూరిత, సాహిత్య, సామాజిక సాహస యాత్రలు మరో ఎత్తు. ఆ ప్రయాణాల ద్వారా కొత్త ప్రపంచాన్ని చూసి చలించిపోయే, ముగ్ధులయ్యే, అవగాహన పొందే అవకాశాలు కలగడం గొప్ప అనుభవం.
ఇక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసి, బాధిత స్త్రీల కోసం భూమిక తక్షణమే పనిచేస్తోన్న తీరు మరింత అభినందనీయం.
అయితే భూమిక తాలూకు ఈ సుదీర్ఘ ప్రయాణం నల్లేరు మీద బండి నడకలా ఏమీ సాగలేదు. ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ, ఆగకనే తిరిగి ప్రయాణం కొనసాగిస్తూ స్ఫూర్తినిస్తోన్న పాతికేళ్ళ నవయవ్వన జ్ఞానవతి భూమికకి హృదయ పూర్వక అభినందనలు,
శుభాకాంక్షలు. అందులో భాగమై భూమికని స్వంతం చేసుకున్న మనమంతా కూడా మనని మనం అభినందించుకోవాలి.
అలాగే భూమిక టీం అందరికీ కూడా శుభాభినందనలు. వాళ్ళు ఎంత సవసఱషa్‌వగా పనిచేస్తారో భూమిక ప్రయాణాల్లో చూడడం జరిగింది.
ఇక్కడ ఒక్క విషయం స్పష్టంగా చెప్పుకోవాలి.
భూమికను ఇంత అందంగా, జ్ఞానవంతంగా తీర్చిదిద్దడానికి వెనుక సత్యవతి చేసిన అపారమైన కృషి, శ్రమ ఎంతో ఉన్నాయి. నిజానికి సత్యవతి, భూమిక వేరు వేరు కాదు.
‘సత్యభూమిక’ అన్న పదం ఎంతయినా తగినది.
స్త్రీలమీద హింసలేని సమాజం కోసం అహర్నిశలూ కలగంటూ, ఆ కలని సాకారం చేసే ప్రయత్నంలో ఆమె చేస్తోన్న ప్రయత్నాలూ, ప్రయాణాలూ, సాధిస్తోన్న ప్రయోజనాలూ… ఒక్క సత్యవతికి మాత్రమే సాధ్యం.
ఆమె కాళ్ళకి చక్రాలున్నాయి. శరీరానికి రెక్కలున్నాయి. హృదయం నిండా కలలున్నాయి. హింసలేని సమాజం స్త్రీల హక్కని నమ్మి, తాను చేస్తోన్న ఉన్నత ఉద్యోగాన్ని వదులుకుని అటువంటి సమాజ స్థాపన కోసం పూర్తిస్థాయిలో పనిచేస్తోన్న సత్యవతి ఎంతయినా అభినందనీయురాలు. ఒక గొప్ప స్ఫూర్తితో, నమ్మకంతో తన జీవితాన్ని ఆనందార్ణవం చేసుకోవడమే కాకుండా, తన చుట్టూ ఉన్నవారిని కూడా సూదంటురాయిలా అందులోకి లాగేయడం సత్యవతి ప్రత్యేకత. తను మనకి సన్నిహిత మిత్రురాలనుకుంటే, ఎంత ఒత్తిడికి లోనయినా సరే నమ్మకం, ధైర్యం, ఉత్సాహం తోసుకొచ్చేస్తాయి…
దటీజ్ భూమిక… సత్యభూమిక. – ప్రతిమ, నాయుడుపేట