పుట్టిన క్షణం తేరిపార చూసి
ఆడపిల్లని నిరాశ పడిన వాళ్ళను
బోసినవ్వుల కేరింతలతో మైమరిపించేశాను
తప్పటడుగులు వేసేటప్పుడు
చేయిపట్టుకుని నడిపించినవారికి
చేతికర్రనై చేయూతనయ్యాను
ఆడపిల్లకు చదువెందుకు
అనేవాళ్ళు నోరు మూసుకునేలా
చదువులలోని మర్మాన్నంతా గ్రహించి
అగ్రస్థానంలో నిలుచున్నాను
సుకుమారపు తెరను తొలగించుకుని
శారీరకంగా ఆడవాళ్ళకు కష్టం అనుకున్నవన్నీ
ఎవరెస్ట్ ఎక్కడం నుంచి సిటీ బస్సు డ్రైవింగ్ వరకు
అలవోకగా చేసేశాను
ఉద్యోగం పురుష జన్మ (లక్షణం) అన్న నానుడిని
నామరూపాలు లేకుండా చేశాను
అంతే కాదు
రోడ్డుమీద నన్ను చూసి చేసే చెత్త కూతలకు
చెప్పుతో సమాధానం ఇచ్చాను
అత్తింటి ఆరళ్ళను, వరకట్నపు వేధింపులను అవలీలగా భరించాను
నోములు, వ్రతాలను వినమ్రంగా చేశాను
నెలసరి బాధలను నాలోనే ద్రిగమింగాను
కాన్పుల కష్టాలను ఇష్టంగా భరించాను
పురుషులు చెయ్యలేని, చేతకాని
ఎన్నో ఎన్నెన్నో నేను చేశాను
అందుకే నేనెవరితోనూ సమానం కాను
నాకు నేనే సాటి నాకు నేనే పోటీ