ఒక ప్రత్యామ్నాయ స్త్రీ వాద పత్రిక ఇరవై అయిదు సంవత్సరాల పాటు అజేయంగా, అనుపమానంగా నడిచిన తీరును మార్చి 15 నాటి ”భూమిక రజతోత్సవ సభ” రూపు కట్టింది. సుందరయ్య కళానిలయం భిన్నమైన వ్యక్తులతో నిండిపోయింది. రచయితలు, జర్నలిస్టులు, యాక్టివిస్టులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, వ్యక్తులతో నిండుకుండలా కళకళలాడింది కళానిలయం. భూమిక సంస్థలో పనిచేస్తున్న యాభై పై చిలుకు ఉద్యోగులు చాలా క్రమశిక్షణతో వచ్చిన అతిధులకు కర్పూరం కడ్డీలు, అల్పాహారం, పుస్తకాలు అందిస్తూ ఆహ్వానం పలికారు. కర్పూరం కడ్డీలను చూసి ఓ మిత్రురాలు ”ఆంధ్రాలో పల్లెటూళ్ళో పెళ్ళికొచ్చినట్టుందని” చమత్కరించారు. కర్పూరాన్ని ఆస్వాదిస్తూ హాలులోకి రాగానే సాంబ్రాణి సువాసన… మొత్తానికి ఒక హాయైన వాతావరణం హాలులో అలుముకుంది. చాలా రోజుల తర్వాత కలిసిన మిత్రుల కరచాలనాలు, కబుర్లు, నవ్వులు… ఉల్లాసం… ఉత్సాహం.
మెత్తటి స్వరంతో ప్రశాంతి ఆ సాయంత్రాన్ని ఆహ్లాదపరుస్తూ సభను ప్రారంభించింది. వేదిక మీదకు సభికుల్ని ఆహ్వానించడంతో పాటు పరిణతి కలిగిన సమన్వయ కర్తగా ఆద్యంతమూ సభను నిర్వహించడం చూస్తే ముచ్చటేసింది.
రావలసిన అతిధులు మార్గమధ్యలో ఉండడం వల్ల ఓ పదిహేను నిమిషాలు ఆలస్యంగా సభ మొదలైంది. భూమిక సహ సంపాదకురాలు ప్రశాంతి సభను ప్రారంభించి సభికులకు ఆత్మీయంగా ఆహ్వానం పలికింది. అతిధుల్ని ఆదరంగా సభా వేదిక మీదికి ఆహ్వానించింది. డా||రమా మేల్కోటే, డా|| విజయభారతి, మల్లు స్వరాజ్యం, ముదిగంటి సుజాతారెడ్డి, డా|| అమృతలత, మహేష్ భగవత్, రామచంద్రారెడ్డి గార్లు సభాసీనులయ్యారు. ఆరుగురు మహిళలు, ఇద్దరు మాత్రమే పురుషులతో సభా వేదిక భూమిక ముద్రను ప్రతిబింబించింది. భూమికతో పెనవేసిన తన ప్రయాణం గురించి మాట్లాడమని ప్రశాంతి సత్యవతిని పిలిచింది.
భూమిక ఎలా ప్రారంభమైంది, ప్రారంభ దినాల్లో అన్వేషి అందించిన సహాయ, సహకారాల గురించి వివరిస్తూ ”భూమికను నేనొక్కదాన్ని మొదలుపెట్టలేదు. అన్వేషి పూనికతో ఒక సామూహిక ప్రయత్నంగా భూమిక మొదలైంది. 2000 సంవత్సరం వరకు అలాగే సాగింది. మధ్యలో ఎంతోమంది భూమికను వదిలేసి వెళ్ళిపోయారు. 2000లో అందరూ వదిలేశారు. నేను అప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎమ్మార్వోగా పనిచేస్తున్నాను. అనివార్యంగా నా ఉద్యోగాన్ని వదిలేసి భూమికను నా చేతుల్లోకి తీసుకున్నాను. ఇప్పటికి పద్దెనిమిది సంవత్సరాలుగా నేనే భూమికను నడుపుతున్నానని సగర్వంగా చెప్పగలను. 2014లో ప్రశాంతి ఆగమనం భూమికకు మరింత బలమైంది. ఎన్నో ఆటుపోట్లను, సమస్యలను ఎదుర్కొన్నాను. ఈ ఆనంద సమయంలో వాటినన్నింటినీ ఏకరువు పెట్టదలచుకోలేదు. ఎంతోమంది మిత్రులు… అబ్బూరి ఛాయాదేవి, సుజాతామూర్తి, డా|| అమృతలత, డా|| జయని నెహ్రూలాంటి వారెందరో భూమికకు అవసర సమయంలో ఆదుకున్నారు. వేదికమీదున్న అందరూ భిన్న రంగాల్లో నిష్ణాతులు. నాకు ఆత్మీయులు. మహేష్ భగవత్ గారు జెండర్ స్పృహ ఉన్న పోలీసు అధికారి. అందుకే ఆయనతో కలిసి చాలా కాలంగా పనిచేస్తున్నాం. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా చాలామంది మాట్లాడాలి కాబట్టి నా ప్రసంగం ముగిస్తున్నాను” అంటూ ముగించింది.
తెలంగాణ పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించిన, మార్చి 10న అస్తమించిన విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మకు నివాళి అర్పిస్తూ సభంతా ఒక నిమిషం మౌనం పాటించారు.
తర్వాత వేదిక మీదున్న అతిథులను ఒకరి తరువాత ఒకరిగా మాట్లాడమని ఆహాన్వించింది ప్రశాంతి. వేదికమీదున్న వాళ్ళు ఒకళ్ళను మించి ఒకళ్ళు సమర్ధులు. విభిన్నరంగాల వాళ్ళు. రాచకొండ పోలీస్ కమిషనర్ ‘మహేష్ భగవత్’ గారి మాటలు విలక్షణమైనవి. వాగ్ధాటితో సభికుల్ని ఆకట్టుకున్నారు. పోలీస్ వ్యవస్థ నుంచి సమాజానికి దగ్గరవ్వడానికి, సేవ చేయడానికి ‘భూమిక’ ఎంతో సహకరిస్తోందని, తన వంతు బాధ్యతగా ఎప్పటికీ ‘భూమిక’కు సపోర్ట్‌గా నిలవడం తనకెంతో సంతోషంగా
ఉందన్నారు.
‘మల్లు స్వరాజ్యం’లాంటి పోరాట యోధురాలి ఉపన్యాసం మరువలేనిది. ముఖ్యంగా, ఈ సభలో స్త్రీల పక్షాన నిలబడి, మహిళల మనోభావాలను గౌరవిస్తూ మాట్లాడే ఒక పోలీస్ అధికారిని వినడం బాగుందంటూనే ఆ వ్యవస్థలో ప్రక్షాలన జరగాల్సి
ఉందన్నారు. పోలీసుల్లో మార్పుకి, మహిళా ఖైదీల్లో పరివర్తనకి పనిచేస్తున్న భూమికను అభినందించారు. ఆమె మాటలు తుపాకి గుళ్ళలా సభంతా మార్మోగాయి. సత్యవతి మీదున్న అపారమైన ప్రేమను వ్యక్తపరిచారు. చివర్లో సత్యవతి రాసిన కవితను చదివి పెద్దగా చదవుకోకపోయినా తనక్కూడా కవిత్వం రాయాలనిపిస్తున్నదని అనడం నిజంగా అపురూపం. ఈ రోజుకీ కోల్పోని ఆమె చురుకుదనం, ఆ రోజు ఎందరికో స్ఫూర్తిదాయకమైంది.
మల్లు స్వరాజ్యం గారి ఆవేదనను, ఆగ్రహాన్ని మహేష్ భగవత్ ఎంతో సమన్వయంతో ఎదుర్కొన్నారు, చిరునవ్వుతో అంగీకరించారు. పోలీస్ వ్యవస్థలో ఇలాంటి మానసికమైన మార్పులు రావడం తనకెంతో సంతోషంగా ఉందని కూడా మల్లు స్వరాజ్యం గారు అన్నారు. ‘విజయభారతి’ గారు చేసిన సాహిత్య సామాజిక సేవ మరువలేనిది. క్లుప్తంగానైనా తన అభిప్రాయాల్ని బలంగా వ్యక్తపరిచారు. భూమిక వంటి స్త్రీవాద పత్రిక ఎప్పటీకి కొనసాగాల్సిన అవసరం ఉందంటూ తన ఆకాంక్షను తెలియజేశారు. ‘రమామేల్కోటే’ గారు ‘భూమిక’ స్థాపించిన విషయాల దగ్గరినుంచీ మొదలుపెట్టి, ఈనాటి భూమిక వరకూ విలువైన విషయాల్ని వెల్లడించారు. ‘ముదిగంటి సుజాతారెడ్డి’గారు కూడా, భూమిక ఇన్నాళ్ళు నిలబడిందంటే కొండవీటి గుండెధైర్యమే కారణమని అభినందించారు. ‘భూమిక’ ప్రెసిడెంట్ అమృతలత గారు, పత్రిక నిర్వహణలోని సాధక బాధకాల్ని తెలియచేశారు. అన్నింటినీ దాటుకుని రజతోత్సవం జరుపుకోవడం మామూలు విషయం కాదన్నారు. ఇన్నేళ్ళ పాటు నిలబడడానికి సత్యవతి కార్యదీక్ష కారణమన్నారు. 4 కాళ్ళు, 8 చేతులతో కలెక్టివ్‌గా ఎలా పనిచేయాలో అద్భుతంగా వివరించారు. రామచంద్రారెడ్డి గారు భూమిక పట్ల తనకున్న అభిమానాన్ని ప్రకటించారు. ఇటువంటి పత్రికలు సుదీర్ఘ కాలం కొనసాగాల్సిన అవసరాన్ని వ్యక్తీకరించారు.
ప్రసంగాలు అయిపోయిన తర్వాత, అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘భూమిక రజతోత్సవ ప్రత్యేక సంచిక’ ఆవిష్కరణ వేదిక మీదున్న అతిథులందరి చేతుల మీదుగా జరిగింది. పాతికేళ్ళ ప్రయాణానికి సూచికగా భూమిక రజతోత్సవ ప్రత్యేక సంచిక కవర్‌పేజీని తయారుచేయడం బాగుంది. భూమిక ప్రారంభ సంచిక ముఖచిత్రం, రజతోత్సవ సంచిక ముఖచిత్రం జంటగా కూర్చి, మట్టి, రాళ్ళు, చెట్లు, పంటచేలగుండా ప్రయాణిస్తున్న రైలుబండితో కలిపి… పాతికేళ్ళ భూమిక ప్రయాణాన్ని స్ఫురణకు తెస్తున్నట్లు
ఉంది.
అనంతరం గతంలో భూమిక నిర్వహించిన సాహితీ యాత్రల గురించి అనిశెట్టి రజిత, భండారు విజయ మాట్లాడుతూ భూమిక నిర్వహించిన సాహితీ యాత్రలు ఎందరో రచయిత్రులకు స్ఫూర్తినిచ్చాయని, అటువంటి యాత్రల వల్ల అట్టడుగు స్థాయిలో జరిగే ఉద్యమాలను ప్రత్యక్షంగా చూసి కథో, కవిత్వమో రాయడానికి ప్రేరణనిస్తుందని, ఈ యాత్రలను పునరుద్ధరించాలని కోరారు. అలాగే దాదాపు 15 సంవత్సరాలుగా భూమిక నిర్వహిస్తున్న ‘రచనల పోటీ’ల గురించి శాంతి ప్రభోద మాట్లాడారు. కొత్త రచయిత్రులను ప్రోత్సహించడానికి ఇలాంటి పోటీలు అవసరమని, పిల్లల రచనల్ని కూడా ‘పిల్లల భూమిక’లో ప్రచురిస్తూ కొత్త రచయితలని భూమిక తయారుచేస్తోందని వివరించారు.
అందరూ మాట్లాడడం అయినాక సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇవి కూడా ప్రత్యేకమైనవి, విలక్షణమైనవి కూడా. ఇద్దరితో ప్రారంభమైన ఒకనాటి భూమిక ‘ఇంతింతై, వటుడింతై’ అన్నట్లు పెరిగి 50 మంది ఉద్యోగస్తులతో పనిచేసే దశకు చేరుకుంది. భూమిక ఉద్యోగులందరూ ఒక సామూహిక గానంగా, సామూహిక నృత్యాన్ని చేశారు. నృత్యకారిణులు ఎవరూ లేరు. ఆనందాన్ని పంచుకుందామన్న ప్రయత్నంలో ‘దేవి’ పర్యవేక్షణలో నేర్చుకుని ప్రదర్శించారు. ఒక టీమ్వర్క్కిది నిదర్శనంలా నిలిచింది.
ఆ తర్వాత, దేవి రచించి, శాంతారావు దర్శకత్వం వహించిన ‘అమ్మే ఆది’ నృత్యనాటిక అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. అనాది దశ నుంచి ఈనాటి వరకూ స్త్రీ ఏయే దశలో ఎలా దోపిడీకి, పీడనకు, భావదాస్యానికి గురైందో సహేతుకంగా, అద్భుతంగా వివరిస్తూ సాగింది నృత్యనాటకం. ఇందులో పాల్గొన్నవాళ్ళు కూడా 9, 10, ఇంటర్ చదువుతున్న ఆడపిల్లలు. కూలికి పోతున్న, చిన్న చిన్న
ఉద్యోగాలు చేస్తున్న లేత పిల్లలు. వాళ్ళని వాళ్ళు ఒక్కొక్కళ్ళూ పరిచయం చేసుకుంటుంటే సంతోషంతో ఒళ్ళు గగుర్పొడిచింది.
భూమిక జరుపుకుంటున్న పండగలో ఈ కార్యక్రమం
ఉండడం ప్రేక్షకులక్కూడా ఆనందాన్ని మిగిల్చింది.
చివరగా, శిలాలోలిత వందన సమర్పణతో సభ ముగిసింది.
అందరి ఆనందోత్సాహాల మధ్య భూమిక టీమ్, పాల్గొన్న కళాకారులతో గ్రూప్ ఫోటోలు తీసుకోవడంతో వేడుక సంబరాలు ఎక్కువై ఈలలు, ఆరుపులతో, అభినందనలతో ఉత్సాహం రెట్టింపయింది. ఎవరికి వారే భూమిక సత్యవతులైనందుకు,
ఉద్యోగులైనందుకు, అభిమానులయినందుకు తమని తామే అభినందించుకున్న ప్రత్యేక సందర్భమిది. ఈ సంవత్సరపు నిజమైన పండగ రోజిది.