సొంతూరు -అయ్యగారి సీతారత్నం

 

పండక్కి సొంతూరు వెళ్ళాల్సిందేనని తాత పట్టుదల. పెద్ద పండక్కి వెళ్ళి మా పాత ఇల్లు శుభ్రం చేసుకుని పెద్దలకి బట్టలు పెట్టాలి. రెండు గదుల నడవాతో పెంకుటిల్లు మాది. దాని వెనకాతల వంటకి కమ్మలిల్లు. దానికి కాస్త దూరంగా పశువుల శాల… అది పడిపోయింది. పండక్కి ఎల్తే కమ్మలిల్లు బూజు దులిపి పేడ అలికి వంట చెయ్యాలి. పెంకుటిల్లుకి సున్నం ఎయ్యాల. ఇత్తడి సామాను తోమాల, అవన్నీ చేసి అరిసెలొండి పెద్దలకు బట్టలు పెట్టాలి. అమ్మ ఒళ్ళు విరిగిపోవాల్సిందే. అది చెయ్యకపోతే కొంపలు మునుగుతాయ్‌ అంటాడు. నేను చెప్పాను ఇంటర్‌ పరీక్షలు, అక్కడ కరెంటుండదు కాబట్టి నేను రానని. నేను రాకపోతే అమ్మ రాదు. అమ్మ రాకపోతే దీపం పెట్టేవాళ్ళు లేరు. అయ్యమ్మ చచ్చిపోయింది. తాత మళ్ళీ చెప్పాడు. బ్రతిమాలాడు మా సొంతూరు రమ్మని. మళ్ళీ మళ్ళీ కరెంటు లేదంటే తాతకి కోపమొచ్చింది. ”స్మార్ట్‌ సిటీలాగ మా ఊరికి కోట్లు మంజూరయి విడుదలయితే మేమూ అట్టాగే కరెంట్‌ వాడతాం. ఏసిన రోడ్డే ఏస్తూ పూసిన రంగే పూస్తూ వేసిన మొక్క తీస్తూ తీసిన మొక్క ఏస్తూ – కమ్మటి కబుర్లు సెబుతాం. మన ఊరిని ఎవరయినా దత్తు చేసుకోవాలి. దానికోసమే ఏ బాబైనా వత్తాడేమోనని ఏయికళ్ళతో చూస్తున్నాం. వెంకయ్యనాయుడు చేపలుప్పాడ, గంటా మంత్రి చంద్రగిరి దత్తు చేసుకున్నారా! అట్టాగన్నమాట.”

”అలాగా, తాతా చూడు. వందల గ్రామాలు అనాధల్లా ఉన్నాయి. రారండి, రారండి, దత్తు చేసుకొండని అన్ని వందలమంది

ఉత్తరాంధ్ర వైపు కన్నెత్తి చూస్తారా అని! అనాధ శరణాలయాల్లోని పిల్లల్లో ఒక్కరో, ఇద్దరో దత్తుకి ఎళ్తారు. మిగతా వాళ్ళు అలానే ఉంటారు. గ్రామాలూ అంతే.”

”ఆ ఒకటి, రెండు గ్రామాల్లో మన సొంతూరుంటుందిరా చూడు. మన సంకురాతిరికి ఎట్టా ఉంటుందో సొంతూరు సొంతూరే గదరా.”

”ఆశకి అర్ధం ఉండాలి తాతా! విజయనగరంలో 1520 గ్రామాలు, 34 మండలాలున్నాయి. శ్రీకాకుళంలో 2026 గ్రామాలు, 38 మండలాలు ఉన్నాయి. విశాఖలో 220 గ్రామాలున్నాయి, 43 మండలాలు… మొత్తం ఉత్తరాంధ్రలో ఇన్ని గ్రామాలున్నాయి. దత్తు చేసుకోవాలంటే ఇంతమంది డబ్బున్నోళ్ళు, పలుకుబడి ఉన్నోళ్ళు, అధికారం ఉన్నోళ్ళు ఉండాలి. వారికి మంచితనం ఉండాలి. ఇది జరుగుతుందా? వీటన్నింటినీ దత్తు చేసుకొంటారా? నీ పిచ్చిగానీ సిటీ బాగుంది. సిటీలోకి వచ్చేద్దాం అందరం పల్లె ఖాళీ చేసేద్దాం.”

”ఒరేయ్‌ అవేం మాటలురా, పల్లె లేందే బువ్వ లేదురా. పల్లె పల్లే గదరా! ఏమైనా పల్లె అందం పల్లెదే.. పచ్చని పైరులు, పచ్చిక వాసన, బండెనక బండి, దానిమీద చెరుకుగడలు… అలా వరసగా వెళ్తుంటే ఒక్క బంగారుతీగ లాక్కుని కసుక్కున కొరికి పరపర నవిలి వచ్చే రసం అలా తియ్యగా గొంతులోకి జారితే ఎంత రుచిరా.”

”అబ్బా, తాతా నిజంగా పల్లె అలా ఉందా? గోరేటి ఎంకన్న పాట పాడడానికీ, దరువుకీ, ఇనడానికి బాగుంటుందిలే. కానీ పచ్చని పైర్లు, వెచ్చని ఊసులు, గెడ్డ పెరుగులు, గోంగూర పచ్చళ్ళు, స్వచ్ఛమైన మనసులు ఇవన్నీ కవులు సెప్పేవి. అవి వాళ్ళ ఊహలు. నిజమేంటంటే ఊర్లో రోడ్ల మీద గేదెలు, ఆవులు వాటి రొచ్చులు పేడ, ఎగిరే గడ్డి పరకల ధూళి, ఆ యీదిలో తెలుగుదేశం, ఈ యీదిల కాంగ్రెసు, అల్లక్కడ ఎర్రజెండా… ఊసులు, గొడవలు… ఆడంటే ఈడికి పడదు, ఈడంటే ఆడికి పడదు. అప్పులు, ఫైనాన్సీలు. అప్పు తీర్చలేక ఆత్మహత్యలు… ప్రేమలు..”

”ఒరేయ్‌. మరీ యిడ్డూరంగా మాట్లాడుతున్నావు. పల్లెలేందే బువ్వ లేదు, పల్లె లేందే పార్టీల గెలుపులూ లేవు. మీ సిటీలోళ్ళు సరిగ్గా ఓటే ఎయ్యరు పల్లె వలనే గెలుస్తాయి. గుర్తు పెట్టుకో.. ఆవుపేడ, రొచ్చు… పాలు ఎట్టా వొస్తాయట” అన్నాడు కోపంగా.

”పల్లెలో ఎన్నిపాలో… నాకు తెల్దు మరి… నువ్వు ఊరెళ్ళగానే వీథిలో నులకమంచం వేసుకుని హుషారుగా ఒరేయ్‌ ఈరిగా రారా… ఒరేయ్‌ పోలిగా రారా… అంటే వారు వచ్చి కూర్చోగానే… కోడలు పిల్లా… టీ పట్రా… మా కోడలు టీ బాగా పెడుతుందని గొప్పలు సెబుతావుంటే అమ్మ టీకి పాలు లేక నన్ను పిలిచి… ‘ఒరేయ్‌ గిద్దెడు పాలు నాయురాలింటికి ఎళ్ళి పట్రా’ అంటుంది. నేను వెళ్తుంటే వెనక్కి పిలిచి మరీ ‘ఒరేయ్‌, పెరట్లో నుండీ ఎళ్ళు యీధి గుమ్మాన ఎళ్ళి పరువు తియ్యక…’ అని ఎలకాతలొచ్చి చెబుతుంది. పెరట్లో ముళ్ళ కంపలన్నీ దాటుకుంటూ వెళ్ళి అడిగితే నాయురాలు లేవంటే తిరిగొచ్చా. అమ్మ మళ్ళీ’ ‘ఒరేయ్‌, బాపనమ్మ ఇంటికి ఎళ్ళి పట్రా’ అంటే ఎళ్ళానా, బాపనమ్మ ‘తోడుకు ఉంచిన పాలురా’ అని గొణుక్కుంటూ ఇస్తే ఆ గిద్దెడు పాలు అమ్మకి ఇస్తే ఆటితో టీ కాచింది.

తాతా, అందరికీ ఒక సంగతి తెలుసు పొద్దున్నే పాలు డైరీకి పోస్తే తర్వాత దూడ నోరు కొట్టి కాసిని పాలు తీస్తారు. అవి తొమ్మిదింటి లోపు చంటాళ్ళ పాలు, ముసలోళ్ళ టీలకి అవగొట్టేస్తారు. అందరికీ తెలుసు, తర్వాత పాలుండవని. కానీ పరువు. ముళ్ళ డొంకలు గణుతుంటే ఎనకదారిన ఎల్లి తేవాలి. ఏటో మీ మర్యాదలు… పరువులు…”

తాతకి ఒళ్ళు మండిపోయింది. ”ఏటంటావ్‌. రానంటావ్‌ అంతేనా, రానంటే నేను మళ్ళీ మీతో రాను. ఈ కూలి అక్కడే సేసుకుంటూ ఒంటి పొట్ట పోసుకోలేకపోను. అసలు ముసిల్దాన్ని అనాలి నన్ను ఒంటరోడ్ని చేసి చక్కా పైకి పోయింది. అది అదృష్టవంతురాలు పల్లెని తిట్టే దినాలొస్తాయని, మనవడు పుట్టిన వూరికి రానంటాడని – ఈ ముదనష్టం సూడక్కర్లేక పోయింది” అని గబుక్కున ఎర్రబారిన ముఖంతో పైన తువ్వాలు తీసి గట్టిగా జాడించి పైకి లేచాడు.

అమ్మ గబాల్న లేచి వచ్చి… ”ఒరేయ్‌ ఆ వాదులాటేంటి… పెద్దా సిన్నా లేదూ, నీకు చదువుకోవాలి అంతేకదా, ఛార్జి లైటు కొని తెస్తాలే… ఇబ్బంది ఉండదు” అంది.

”అద్గదీ, కోడలు పిల్లంటే… పండక్కి ఎళ్తున్నట్టేనా… అల్లాగుండాలి… మీ యత్త పైనుండి దీవెనలిస్తుందిలే… నా తల్లే…”

బంధాలు పోకుండా చూసేది ఎప్పుడూ అమ్మే. ఏ యిద్దరి మధ్య గొడవొచ్చినా మధ్యవర్తిత్వం చేసి సర్దుబాటు చేస్తుంది.

”సర్లే, వస్తాలే తాతా.”

”వచ్చాక మా సొంతూరు కబుర్లు సెబుతా” అన్నాడు తాత మీసం మెసేలి… ఆశగా… గర్వంగా సొంతూరు తలుచుకొని.

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.