భూమిక ఎడిటర్ గారికి,
ఆదర్శాలు ఉండటం వేరు వాటితో 25సంవత్సరాల సుధీర్ఘ ప్రయాణం, అందులోనూ విలువలతో ఎక్కడా రాజీపడకుండా
ఉండడం వేరు. కలకాలం అణగారిన అట్టడుగు వర్గాల సమస్యల్ని స్త్రీ సమస్యల్ని ఓన్ చేసుకుని ఆయా వర్గాలకి బాసటగా నిలవడం సామాన్యమైన విషయమేమి కాదు. విరామమెరుగని ఈ అవిశ్రాంత సుదీర్ఘ ప్రయాణం ఎన్ని గుండెల్లో ధైర్యాన్ని నింపిందో, మరెన్ని గుండెల్లో వెలుగు రేకల్ని ప్రసరించిందో…
హింస, దోపిడీలు కొత్త రూపాల్ని సంతరించుకుంటున్న ఈ హైటెక్ యుగంలో బహుశా మీ బాధ్యత మరింత పెరిగిందేమో… గడచిన 25సంవత్సరాలకన్నా రాబోయే కాలం మరింత సంక్లిష్టంగా కనిపిస్తుంది.
7 సంవత్సరాల పసిపాపని ఓ మానవ మృగం కాటేస్తే ఆ నేరం ‘రేరెస్ట్ ఆఫ్ ది రేర్ క్రైం’ కాదని, ఆ నేరస్థుడికి సామాన్యమైన శిక్ష విధించినా ప్రశ్నించని కుహనా మేధావులు ఉన్న డెమోక్రసీ మనది. అలాంటి విషాదకరమైన వాతావరణంలో స్త్రీత్వం మీదా, బాల్యం మీదా, గూడెం మీదా, అడవి మీదా సమాజం, రాజ్యం జరుపుతున్న హింసనీ, దాడినీ, యుద్ధాన్నీ అక్షరాల్లో ఆవిష్కరిస్తూ, ఆయా పీడిత వర్గాల ప్రజలకు ధిక్కార స్వరాల్ని, అనురాగపు స్పర్శల్నీ అందిస్తున్న భూమిక టీం నిజంగా అభినందనీయం…
మట్టి చేతులు మాత్రమే పిడికిలెత్తి ప్రశ్నించగలవు. కేవలం ఆ మట్టి చేతులు మాత్రమే అనురాగపు పరిమళాల్నీ వెదజల్లగలవు…
– వెంకట్రెడ్డి, హైదరాబాద్