ఆమెను ఆకాశంలో సగం, అవకాశంలో
సగమంటూ,
ఆకాశమంత ఎదిగితే తలెత్తి చూడలేక
తాటాకులు కట్టేవాళ్ళే
నిర్భయంగా నిలబడిందా, వెయ్యి కళ్ళు
వెంటనే వేటాడుతుంటాయి.
నలుగురిలో నవ్విందా, ఓర్చుకోలేని
నయనాలు ఆ నలుగురినీ
అడుగుతూనే ఉంటాయి
ఆమె ఎదుగుదలకు అడుగడుగున
ఆటంకాలే, అవతలకు నెట్టడానికి
నానా హైరాన
ఆమే లేకుంటే కాలుగాలిన పిల్లిలా
ఇంట్లోకి బయటకు నడిచేవాళ్ళే
ఆమె లేని ఇల్లు దీపం పెట్టి
వెతికినా దొరకదు
ఆమే బంధం, ఆమెతోనే జీవితం
కష్టాలతో, కన్నీళ్ళతో కావాలని ముందే వెళ్ళిందా!
తొందరపడింది, నీకేం తక్కువంటూ
చితి ఆరకముందే, మరో చితికి
సంభారాలు సమకూర్చే పెద్దలు
అవునూ, ఆమె మనసు ఎప్పుడైనా
బయట పెట్టిందా?
బయటపెడితే, ‘ఆమె’
ఆమె ఎలా అవుతుంది