గలగలా నవ్వేదా అమ్మాయి
నిండు గోదారిలా
తియ్యగా పాడేదామె…తేనె వానలా
మందారం పూసినా, మరుమల్లె విరిసినా
పరవశాన తానే ఓ పాటయ్యేది!
శీతగాలులతో సరసమాడే ఏటి అలల
ఊసులేవో వినాలనీ
తుమ్మ కొమ్మల తూగాడే
పిచ్చుకలకు లాలిపాటలేవో పాడాలనీ
ఊరించే ఊహలకు ఊపిరి పోసేదామె
పండు వెన్నెల గురించో, పాపాయి నవ్వుల గురించో
పాటలల్లుకుంటుండగా…
వచ్చాడా అబ్బాయి… భర్త అనే బురఖాలో!
అనుభవానికీ అనుభూతికీ
తేడా తెలీని (అ)మాయకుడతను
బ్రతకడమన్నా జీవించడమన్నా
ఒకటేనంటాడా బుద్ధిజీవి!
హరివిల్లు విరిసినా, ఆకాశం మురిసినా
మామూలే వాడికి
వసంతమైనా, హేమంతమైనా అసంగతమతడికి
అందుకే కదూ…
పాటలెందుకు పని చూడమన్నాడు
అనుభూతులెందుకు
ఆదాయం పెంచమన్నాడు
అనుభవించాలే కానీ దేన్నయినా
ఆస్వాదిస్తే చాదస్తమన్నాడు!
బిత్తరపోయిందామె, చిత్తరువయ్యింది
ఇక గోదారంతా ఇసుక మేటలే…
సెలయేటి పరవళ్ళకిక సంకెళ్ళే!
రాతిమేడలో రాగాల సమాధుల్ని
రూపాయలతో అలంకరిస్తూనే…
అమ్మయిందా అమ్మాయి
ఓ రోజు –
”అమ్మా! జోల పాడవూ…” అడిగాడా చిన్నారి
కోయిల తన కంఠం తెగ్గోసుకున్నాక!!
”యేరు ఎండిపోయింది నాన్నా
ఇక రమ్మన్నా వాన రాదు కన్నా”
చెప్పిందా అమ్మ… మమతల మరబొమ్మ!!