ఆయన
రోజూ కవిత్వం రాస్తాడు
రాయని రోజు ఆలోచిస్తాడు
ఆయన యాస బాస ధ్యాస కవిత్వమే
ఆమె
ఆయన ఇంటిముందు
రోజూ ఏడుస్తుంటుంది
చెదిరిన జుట్టూ చిరిగిన బట్టలూ
సమస్త దుఃఖానికీ
చిరునామాలా ఉంటుందామె
ఆమె దుఃఖం
ఈయనకు పట్టదు
ఈయన కవితలు
ఆమెను చేరవు
”దుఃఖాన్ని చేరని, దుఃఖాన్ని తుడవని
కవిత్వమెందుకో”
తిట్టుకుంటూ పోతాడొకడు
ఆయన మాత్రం
కవిత్వం రాస్తూనే ఉంటాడు
సన్మానాల శాలువలు గప్పుకు
వసంతాల నెమరేస్తూ ఉంటాడు
ఆమె దుఃఖం
అలాగే కాలంమీద ఘనీభవిస్తోంది
ఆశయానికీ ఆచరణకీ మధ్య
నోళ్ళు తెర్చిన బీళ్ళలా
దూరం ప్రశ్నిస్తోంది