ఒకరోజు కొంగకి బాగా ఆకలి వేసింది. చెరువులో నుంచొని ఏ చేపను తినాలా అని ఆలోచిస్తూ ఉంది. ఆ రోజు చెరువులో చాలా చేపలు ఉన్నాయి. కానీ ఆ రోజు కొంగ చాలా అసంతృప్తిగా ఉంది. ఎందుకంటే… తాను చూసిన ప్రతి చేపకూ కొంగ ఏదో ఒక వంక పెట్టుకుంది. పక్క నుంచి ఒక చేప వెళ్తుంటే ‘ఈ చేప మరీ చిన్నగా ఉంది’ అనుకొని వదిలేసింది. ‘ఏదైనా మంచి, పెద్ద చేప పడదాం’ అనుకొని వేచి చూస్తూ ఉంది. మరో చేప రావడంతో ‘ఈ చేప మరీ సన్నగా ఉంది’, మరొకటి రాగానే ‘ఈ చేపకు చారలున్నాయి’, ‘ఈ చేపకు అస్సలు చారలు లేవు’, ‘ఇది ఇంకా చిన్నగా ఉంది’, ‘ఇది మరీ లావుగా ఉంది నా నోటికి పట్టదు’ అని వంకలు పెట్టుకుంటూ ఏ చేపనీ పట్టలేదు, తన దగ్గరికొచ్చిన అన్నింటినీ వదిలేసింది. ఏదైనా మంచి తనకోసం రాదా అనుకుంటూ చేప కోసం ఎదురుచూస్తూ కొంగ జపం చేస్తూ కూర్చుంది. మధ్యాహ్నయ్యేకొద్దీ ఎండ ఎక్కువయ్యింది. ఒడ్డు దగ్గరున్న చేపలు మధ్యలో నీళ్ళలోకి వెళ్ళిపోయాయి. కొంగకి ఏ చేపా కనిపించలేదు. చివరకు ఒక నత్త కూడా దొరకక ఏమీ తినకుండానే ఆకలి మంటతో వెళ్ళిపోయింది.
కథలోని నీతి:
ఒక్కొక్కసారి మనకు దక్కినదానితో సంతృప్తి పడాలి. మరీ ఖచ్చితంగా ఉంటే మనకు నచ్చినది దొరకకపోవచ్చు.