అనగనగా ఒక ఊళ్ళో తుంటరి నక్క ఒకటి ఉండేది. దానికి ఒంటె మాంసం తినాలనిపించింది. అందుకు ఒంటెతో స్నేహం చేసింది. ఒకరోజు ఒంటె దగ్గరికి వెళ్ళి ‘ఒంటె బావా… ఒంటె బావా…! అవతలి చెరువు గట్టున చెరకు తోట ఉంది, వెళ్ళి హాయిగా తిరిగొద్దామా’ అంది. నక్క వంకర బుద్ధి గమనించిన ఒంటె అయినా అదేం చేస్తుందిలే అన్న ధీమాతో ‘సరే’ అంది. చెరకుతోటకు వెళ్ళాలంటే ముందు గట్టు దాటాల్సిన అవసరం ఉంది. ఆ గట్టు దాటడానికి ఒంటెవీపు మీద నక్క కూర్చొంది. చెరకు తోటలోకి వెళ్ళిన వెంటనే తోట యజమానిని చూసిన నక్క కావాలనే కూత పెట్టింది. అంటే యజమాని వెంటపడి ఒంటెను చంపేస్తే ఎంచక్కా దాని మాంసం తినవచ్చనేది నక్క పన్నాగం. తోట యజమాని రావడంతో నక్క పారిపోయింది. అక్కడే ఉన్న ఒంటె పరిగెత్తలేక పోయింది. ఆ తోట యజమాని ఒంటెను చితకబాది వెళ్ళిపోయాడు. ఒంటె చనిపోయుంటుందని భావించిన నక్క దాని దగ్గరికి వెళ్ళి చూసింది. ఒంటె బతికే ఉందని గమనించింది. ఇంకోసారి పథకం వేయవచ్చులే అనుకుంది. అయితే దాని దురాలోచనను పసిగట్టింది ఒంటె. దానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంది. చెరువు దాటేట ప్పుడు నీరు ఎక్కువగా ఉన్న చోటకు తీసుకెళ్ళి ‘నాకు చాలా ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి. నేను ఇక నిన్ను మోయలేను’ అని నక్కను నీళ్ళలో వదిలేసింది. ఆ నీటి ప్రవాహంలో నక్క కొట్టుకుపోయింది. చూశారా! దురాశ దుఃఖానికి చేటు అంటారు ఇందుకే.