”ఏ సమాజం అయితే వారికోసం ఏర్పడలేదో, వారివల్ల ఏర్పడలేదో ఆ సమాజంలో స్త్రీలు జీవిస్తున్నారు” – ఓషో
నిజమేనేమో… స్త్రీ మూలమే కానీ ఎప్పుడూ ఆమె భౌతిక సమాజపు దృష్టిలో ఒక సెకండ్ గ్రేడ్ సిటిజన్‌గానే గుర్తించబడింది. వేల సంవత్సరాలుగా పురుష సమాజపు గుర్తింపే తన విజయం అనుకునే స్థితిలోనే స్త్రీలు ఉండిపోయారన్నది అత్యంత విషాదకరమైన నిజం…
అయితే కొత్త సమాజపు చూపు కొంత మారుతున్నట్టే ఉంది. రాబోయే తరం ఇంకో అడుగు ముందుకు వేస్తున్నట్టే ఉంది. ”ఆమెలో నేను” అంటూ తన మొదటి కవితా సంకలనాన్ని తెచ్చాడో పిల్లవాడు. ”ఆమె నుంచే నేను” అని కూడా అనిపించిందేమో! నిండా పాతికేళ్ళు లేని పిల్లవాడు స్త్రీ ఇండివిడ్యువాలిటీని కూడా గుర్తించాడు. ప్రేమ కవిత్వమే రాశాడో లేక ఆమె కవిత్వమే రాశాడో కానీ శేషు అనే ఈ కుర్రాడి ఊహలన్నీ సోకాల్డ్ కొత్త సమాజంలో కూడా మిగిలే ఉన్న కొన్ని పాత వాసనలని కొంత తుడిచేసేలాగానే ఉన్నాయి…
ఇంతా చేస్తే ఇదొక 111 పేజీల పుస్తకం, అందులో సగానికి సగం బొమ్మలు… మరి ఆ కాస్తంత స్థలంలో ఏం చెప్పాడు???
Girl is not art
To be as same as every time you look
She had brain behind the beauty
And she is also a human as you …
అంటూ ఆంగ్లంలో కొన్ని లైన్లు ఇంట్రోలాగా రాసుకున్నాడు. అక్కడి నుంచీ ఒక్కొక్క పేజీకి ఒక కవిత, ప్రతి కవితకి ఒకే పేరు… ”అపురూపం” అని. ఇట్లా యాభై ”అపురూపాలు” యాభై అపురూపమైన ఫోటోలతో సహా.
”కోపంలో కాలర్ పట్టుకునే చనువు తనది / ఒంటరితనంలో తోడు నిలిచే తెగువ తనది… అంటూ వచ్చి మరో జన్మ మీద నమ్మకం లేని నన్ను వెతికి పట్టుకొనే పని కూడా తనదే…” అంటూ తన స్వభావాన్ని కూడా చెప్పేసి… ఆ అపురూపం కోసం ఎదురు చూసే ప్రేమ మాత్రం నాదే అంటూ ముగిస్తాడు. (అపురూపం 8)
భాష మామూలుగా ఉండొచ్చు గానీ, కొత్త తరం ఎలాంటి స్త్రీ రూపాన్ని కోరుకుంటుందో చెప్పేస్తాడు. కోపాన్నీ, ఆవేశాన్నీ అణచుకోకూడదు, తానే ముందుగా తన ప్రేమనీ లేదా ఆమె భావాలని ఎదురుగానే చెప్పేయాలి. అలాంటి అమ్మాయిని కోరుకుంటున్నాడు.
స్పందనలు సహించలేదు / బాంధవ్యాలను భరించలేదు / అనురాగాలు అక్కరలేదు / భావోద్వేగాలు ఆపలేదు / కన్నీళ్ళనూ దాచలేదు. (అపురూపం 23)
లోలోపలే తానో త్యాగమూర్తిననీ, సహనానికి మారుపేరనీ కనీసం భావోద్వేగాలకీ దూరమైన నిన్నటి తరం మహిళ కంటే ఎప్పటికప్పుడు స్వేచ్ఛగా తనని తాను ప్రకటించుకోగల స్త్రీ అతని కల… ఆమెనే అతను కోరుకుంటున్నాడు.
తాళి పేరుతో నీ తలవంచను / అదిగో అరుంధతి అని అబద్ధం చెప్పను / నిన్ను దానంగా తీసుకోను / నన్ను ధనంతో కొననివ్వను అంటూ ప్రమాణం చేస్తాడు అపురూపం 29లో. ఇంతకన్నా కొత్త తరం నుంచి ఆశించదగ్గ పరిణామం ఏముంటుంది. ఇది చాలు వారి తర్వాత తరాన్ని ఎట్లా నిర్మిస్తారో చెప్పడానికి. చేయాల్సిందల్లా ఇలాంటి భావజాలాన్ని వారి భాషలో వారిని చెప్పనివ్వడం, మిగతా వారికి చేరనివ్వడం. ఇన్నేళ్ళ అర్థం లేని వివాహపు తంతు మీద అయిష్టతనీ, కట్నాలు, కన్యాదానం వంటి వివక్షాపూరిత పదాల పట్ల ఏహ్యభావాన్నీ వ్యక్తపరిచాడు.
బైక్ నడిపే అమ్మాయి, బల్లి తోక పట్టుకుని ఆడే అమ్మాయి, ఎదిరించి ధైర్యంగా నిలిచే అమ్మాయి… ఇట్లా యాభై రకాలుగా అతను నిజంగా చూసిన యాభై మంది ఆడపిల్లలని కలిపి తానొక ఐడల్ ఉమెన్‌ని ఊహించాడు. ఇలా అపురూపంగా దాచుకున్నాడు. ఈ పుస్తకంలో కనిపించే ఫోటోల్లో కొన్ని ఆయా కవిత రాయించుకున్న అమ్మాయిలవే కావడం వారు ఆనందంగా అంగీకరించడం కూడా ఈ కాలపు ఒకానొక బ్యారికేడ్ బ్రేకింగ్ అని చెప్పుకోవచ్చు.
పాతికేళ్ళ శేషు… ఒక్కడూ ఇలా వ్యక్తపరిచాడేమో కానీ ఈ తరం ఇప్పటికీ ఇలాంటి కొంతమందిని కలుపుకుంది. మరికొంత మందిని తనలా ఆలోచించేలా చేసేందుకే ఈ ప్రయత్నం. అయితే ఇందులో కొన్ని తడబాట్లు ఉండొచ్చు, కవిత అనొచ్చా అనే అనుమానమూ రావొచ్చు కానీ మొదటి ప్రయత్నంలోనే ఇలా రాయగలగటమూ, ఆ రాయటం వెనుక ఉన్న ఉద్దేశ్యమూ చిన్న చిన్న లోపాలని అసలు పైకి కనిపించనీయకుండా చేశాయి. కవి సంగమం ప్రచురణగా వచ్చిన ఈ చిన్న పుస్తకం నిజానికి పెద్ద ప్రయత్నమే. ”ఆమెలో నేను” ఆకట్టుకునే కవర్ పేజీతో 50/- వెలలో అన్ని పుస్తకాల షాపుల్లో లభిస్తుంది, లేదా 7989546568 కి ఫోన్ చేసి కవి నుంచే నేరుగా పొందవచ్చు.