గతుకుల బాటల ఎంపిక: జండర్‌ రాజకీయార్థిక చిత్రం వసంత్‌ కన్నభిరాన్

విదేశీ పర్యటనల గురించి షా కి ఎప్పుడు చెప్పారు?

క్రమంగా అతనికి చెప్పడం మొదలుపెట్టాం. అతను అంగీకరించక తప్పలేదు. అయితే విదేశీ ప్రయాణమంటేనే మానసిక ఒత్తిడి. మా ఇంట్లో అతిథులు కానీ, బంధువులెవరైనా కానీ ఉన్నప్పుడు షా కి అనుకోకుండా కోపం వచ్చి గొడవ చేస్తాడేమో అని అక్షయకెప్పుడూ చింతగా ఉండేది. మా ఇల్లెప్పుడూ…

అతను మీ ఇంట్లోనే ఉండేవాడా?

లేదు, కానీ రోజూ వచ్చేవాడు. చాలామంది రాజకీయ నాయకులకు మేము తెలుసు. ఒక సాహసవంతమైన రాజకీయ జీవితం గడిపిన షా ఇప్పుడు అనామకుడయ్యాడు. ఇప్పుడు అతనొక గాడిలో పడిపోయాడు. చెప్పిందే చెబుతూ ఉంటాడు. ఇటువంటివాళ్ళు తాము చదివినవన్నీ గుర్తు పెట్టుకుంటారు. మార్క్స్‌ రచనలు మొత్తం కంఠోపాఠం. లెనిన్‌ ఇలా అన్నాడు స్థాలిన్‌ ఇలా అన్నాడు, అదీ ఇదీ అని మాట్లాడుతూ ఉంటారు. నాకు కొత్తగా చదవడానికేమీ లేదు నాకన్నీ కంఠోపాఠమే అంటారు. వీళ్ళు చెప్పినదానికి ఎవరూ స్పందించకపోతే చాలా క్రూరంగా మాట్లాడతారు.

ఇది చాలా బాగుంది

నేను అక్షయతో చెప్పాను. ”నీ జీవితం ఎలాగూ పాడైపోయింది. మిహిర్‌ జీవితం పాడవడం నాకు ఇష్టం లేదు. వాడు

కొన్నాళ్ళు మనకిష్టమైనట్ల్లు, తర్వాత తనకిష్టమైనట్లూ బ్రతకాలి. ఇక్కడుండడానికి షా అనేక సాకులు కనిపెడతాడు. జబ్బు చేసిందంటాడు, ఏదో సమస్య వచ్చిందంటాడు. అప్పుడిక్కడే ఉండాలి. అతను లేనప్పుడు నాకు ఇంత కష్టంగా లేదు. ఒక మనిషి మన ఇంట్లో ఉండి, మనం అతన్ని కనిపెట్టి ఉండాలంటే ఎంత… పైగా చిన్న ఇల్లు, చాలా కష్టమౌతోంది. ఇంటికొచ్చేసరికి బాగా అలసిపోతాను, మళ్ళీ అన్నీ చేయాలి.

మీరప్పటికే పని చేస్తున్నారా?

అవును, అప్పటికే ఉద్యోగం చేస్తున్నాను. అక్షయ కూడా చేస్తున్నాడు. చాలా కష్ట సమయం అది. నేను ఎస్‌ఎన్‌డిటి(2) నుంచి ఇంటికొచ్చేసరికి సాయంత్రం అయిదో, ఆరో అయ్యేది. టీ తాగి కొంచెంసేపు విశ్రాంతి తీసుకునేదాన్ని. కానీ అతనుంటే అతను (షా) నాతో మాట్లాడేవాడు. ”ఏం చేశావివ్వాళ” అని మొదలుపెట్టి దేని గురించో పెద్ద ఉపన్యాసం ఇచ్చేవాడు. ఇది వినడానికి నేను సిద్ధంగా లేకపోయినా, అతనితో నేను అంటీ ముట్టనట్లు ఉంటానని నేనంటే కోపం ఉంది లోపల. కనీస సపర్యలు చేస్తానంతే. దేంట్లోనూ జోక్యం చేసుకోనివ్వను. అతను మాతో ఉండేటప్పుడు ఒకరోజు మేమందరం బాల్కనీలో కూర్చున్నాం. అప్పుడు మా అబ్బాయికి ఎనిమిదేళ్ళు. ఆలిండియా రేడియోలో వివిధ మానవ సంబంధాలపై చర్చ జరుగుతోంది. ఒకటి కుంతీ, ద్రౌపదుల మీద, మరొకటి సీత, ఊర్మిళల మీద… నేను కుందనిక కపాడియాతో ఆమ్రపాలి, యశోధరల మీద చర్చలో పాల్గొన్నాను. చర్చ గుజరాతీలో జరిగింది. ఆ రోజే ప్రసారమైంది. చాలామంది మెచ్చుకున్నారు కూడా. ఆ చర్చ గురించి నేనూ, అక్షయ నవ్వుకుంటూ మధ్య మధ్య చతుర్లు విసురుకుంటూ మాట్లాడుకుంటున్నాం. షా కి అసూయ తన్నుకొచ్చింది. ఆయన ఒక పెద్ద సీన్‌ సృష్టించాడు, కారణం ఏమిటో నాకు గుర్తులేదు.

ఆయన అప్పుడే లోపలికొచ్చి అరవడం మొదలుపెట్టాడా?

అవును. మేము మాట్లాడుకుంటున్నప్పుడు అతను ఇంకో గదిలో నిద్రపోతున్నాడు. మిహిర్‌ మా దగ్గరే కూర్చుని ఉన్నాడు. అతను కేకలు వెయ్యడం మొదలుపెట్టాడు. అక్షయని పిలుస్తున్నాడు. అప్పుడు రాత్రి పదిన్నర అయింది. నేను మిహిర్‌ని తీసుకుని వెళ్ళిపోయాను.

మీరూ, అక్షయా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారని అతను గంతులేశాడన్నమాట.

అవును. అప్పుడు నేను మిహిర్‌ని తీసుకుని బస్సెక్కి మా నాన్నగారింటికి వెళ్ళిపోయాను. అప్పటికప్పుడే నేనొక నిర్ణయానికొచ్చాను. ఈ క్షణమే విడిపోవాలని. ”ఇది ఇంక సాగదు. ఇంక ఏ మాత్రం నేను సహించను” అనుకున్నాను. అప్పుడు నా దగ్గర పర్సు కూడా లేదు. నేను పర్సు మర్చిపోయానని చెబితే నా తోటి ప్రయాణికుడు నాకు టికెట్‌ కొన్నాడు. నన్ను చూసి మా నాన్న ”ఏమైంది?” అన్నారు. చెప్పాను. అక్షయ కోసం అందరం అతన్ని భరించాం. మౌనంగా బాధ పడ్డాం. మా నాన్న ”పోయి పడుకో! నువ్వేం దిగులు పడకు. ఏం జరిగినా నీకు మేమున్నాం” అన్నాడు.

వాళ్ళకంతా చెప్పేశారా?

క్లుప్తంగా చెప్పాను. వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. అంతా తెలుసు. మా వాళ్ళంతా ఇదే అన్నారు ”మీ ఇంట్లో ఏదైనా ముల్లు ఉందంటే ఇదే” అని. నేనొచ్చాక అక్షయ అతనితో చెప్పేశాడు, ”ఇంక నువ్వు మా ఇంటికి రావద్దు. నిన్ను ఆర్థికంగా నేను ఆదుకుంటాను. నేను నిన్ను కలుస్తూ ఉంటాను. నువ్వు ఇక్కడికి రావద్దు” అని. పొద్దున్నే నాకు ఫోన్‌ చేశాడు. ”నువ్వు వచ్చెయ్‌. నేనే వచ్చి నిన్ను తీసుకొచ్చుకుంటాను. ఇంక అతనితో సంబంధం తెంచేసుకున్నాను” అని. ”వస్తాను. కానీ ఒక షరతు మీద. అతను మన ఇంటికి రాకూడదు. అతని దగ్గరికి నువ్వే వెళ్ళాలి. మిహిర్‌ని కలవాలంటే వారానికో, పదిహేను రోజులకో ఒకసారి. అది కూడా బయటే” అని చెప్పాను. అట్లా అతనితో సంబంధం తెగిపోయింది.

ఇదంతా షా ఒప్పుకున్నారా?

ఒప్పుకున్నాడు.

ఆత్మ గౌరవం ఉన్నవాళ్ళెవరైనా అదంతా మర్చిపొమ్మనేవాళ్ళు కదా?

ఏమీ లేదు. ఇదంతా అతను రెండు వందల రూపాయలకు ఒప్పుకున్నాడు. ఈ పని ముందే చెయ్యాల్సిందని అందరూ అన్నారు. ఇదంతా 1947 నుంచీ 1969లో అతను చనిపోయేవరకూ కొనసాగింది. 1968లో నేనూ, మిహిర్‌ యూఎస్‌ వెళ్ళాం. తరువాత అతను చనిపోయాడు. విలువైన 20 సంవత్సరాలిలా వ్యర్థమైపోయాయి. ఈ ఉద్రిక్త వాతావరణంలోనే అక్షయ ఉద్యోగ నిర్మాణం జరిగింది. తెలిసిన వాళ్ళంతా ఇన్నాళ్ళు భరించవలసిన విషయం కాదిది అన్నారు. ఆ తరువాతే అక్షయ వికసించాడు. 1968 నుంచీ 1994 వరకూ ఎన్నో రచనలు చేశాడు. చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. అదివరకు షా అతన్ని క్షేత్రస్థాయి కార్యకర్తలను కలవనిచ్చేవాడు కాదు. సామ్యవాదం గురించి కానీ, సామాజిక శాస్త్రం గురించి కానీ వ్రాయనిచ్చేవాడు కాదు. అతనెప్పుడూ భౌతికంగానూ, మానసికంగానూ ఒక అవరోధంగా ఉండేవాడు.

తరువాత అంతా బాగుందా? మళ్ళీ రావడానికి ప్రయత్నించలేదా?

లేదు. మొదట్లో ఇతర స్నేహితుల మీద ఆధారపడడానికి ప్రయత్నించాడు. కానీ, ఎవరూ మా అంత బాధ్యత తీసుకోలేదు.

మీరిద్దరూ కలిసి ఎలా పనిచేశారో చెప్పండి.

ఒకరు నిర్ణయాలు తీసుకోలేకపోయినప్పుడు రెండో వాళ్ళు సహాయపడితే ఆ ఇద్దరి మధ్యా బంధం పటిష్టమౌతుంది. అది కూడా రెండో వారి అంగీకారం ఉంటే… అది లేకపోతే ఇద్దరి మధ్యా చీలికలు వస్తాయి. మా విషయంలో మా బంధం మరింత పటిష్టమైంది.

నా భర్తకి ఆయన ఆశయాలే ఆయన జీవన విధానం. ఇతరుల భావాల పట్ల సహనమూ, అంగీకారమూ ఉన్నాయి అతనికి. జీవితంలో మృదుత్వాన్ని ఇష్టపడేవాడు. ”నేను వామపక్షీయుడిని కాకపోతే సంగీతకారుడిని అయి ఉండేవాడ్ని” అనేవాడు. తబలా వాయించేవాడు. బరోడాలో ఉండగా ఫయాజ్‌ ఖాన్‌ ఎలా సంగీత సాధన చేసేవాడో తెలుసుకునేందుకు ఆయన ఇంటి పక్క చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. క్రికెట్‌ అంటే ఇష్టపడేవాడు. చారిత్రాత్మక భవనాలంటే ఇష్టం. మతాన్ని కూడా అర్ధం చేసుకోవాలనుకునేవాడు. మార్క్సిస్ట్‌ స్టాలినిస్ట్‌ సాహిత్యాన్ని ఎట్లా ఇష్టంగా చదివేవాడో మత సంబంధమైన సాహిత్యం కూడా అంత ఇష్టంగా చదివేవాడు. సంగీత కచేరీలకు వెళ్ళి తెల్లవారుఝామున నాలుగింటికి ఇల్లు చేరేవాడు. అది అతని వ్యక్తిగత జీవితం. కుటుంబ సంబంధాలు రెండు విధాలుగా పనిచేస్తాయి. అవి ఒకరిమీద ఒకరు ఆధారపడడాన్ని సృష్టిస్తాయి. బలపరుస్తాయి. నాకు సంబంధించినంతవరకూ కుటుంబేతర సంబంధాలు తెచ్చినంత వత్తిడి కుటుంబ సంబంధాలు తేలేదు. మేము వాదించుకుంటున్నట్లూ, విభేదించుకున్నట్లూ కనబడొచ్చు కానీ చివరికి అది మాకు బలాన్నే ఇచ్చింది.

మీ ఉద్యోగాలూ, రాజకీయాలూ కాక సహచరులుగా మీరిద్దరి వ్యక్తిగత జీవితం గురించి చెప్పండి

మేమిద్దరం కలిసి సంగీత కచేరీలకు వెళ్ళేవాళ్ళం. మ్యూజియంలకు కూడా వెళ్ళేవాళ్ళం. అక్షయది సంపద్వంతమైన వ్యక్తిత్వం. ప్రేమాస్పదుడు, ప్రేమించేవాడూ, అందరితో కలిసిపోయేవాడు. రాజకీయ సంబంధమైన స్నేహితులే కాక మాకు మంచి వ్యక్తిగత మిత్రులు ఉండేవారు. వాళ్ళతో కలిసి హిల్‌ స్టేషన్లకి వెళ్ళి నాణ్యమైన సమయం గడిపేవాళ్ళం. సాహిత్య సమావేశాలంటే మా ఇద్దరికీ ఇష్టం. మేమిద్దరం కలిసి గుజరాతీ, మరాఠీ సాహిత్య సమావేశాలకు వెళ్ళేవాళ్ళం. ఇద్దరం పిక్నిక్‌లకు వెళ్ళేవాళ్ళం. 1969 నుంచీ 1994 వరకూ ఒక గాఢమైన మైత్రీ బంధం మాది, సంతృప్తితో కూడిన ఆహ్లాదకరమైన జీవితం.

మీ సంతోష సమయాల గురించీ, విచారపు ఘడియల గురించీ చెప్పండి.

వీటి గురించి చెప్పాలంటే ముందు మా నేపథ్యం చెప్పాలి. లేకపోతే అతనికి కానీ, నాకు కానీ న్యాయం చేయలేను.

మన వ్యక్తిగత స్థాయిలో మనకి మన భావాలనూ, సమస్యలనూ మనసు విప్పి చెప్పుకోగల స్నేహితులు దొరుకుతారు. మీరు కూడా మీ భర్తతో ఈ అనుభవాలను పంచుకునే ఉంటారు. అదేమిటంటే మొదటగా మనం చిన్నవాళ్ళంగా ఉండి మన ఉద్యోగాలలో అభివృద్ధికి కృషి చేస్తున్నప్పుడు ఉద్యోగానికి ఎక్కువ సమయం పెట్టాలా, కుటుంబానికా అనే సందిగ్ధావస్థలో పడతాం. దీనిమీద చర్చలూ వాదాలూ ఘర్షణలూ కూడా సంభవిస్తాయి. మా విషయంలో ఇది తరచూ జరిగేది. ముఖ్యంగా 1970 తరువాత నేను బొంబాయి నుంచీ ఢిల్లీకో, మరోచోటకో ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు. మా యూనివర్శిటీలో స్త్రీల అధ్యయన కేంద్రం ప్రారంభించాక చాలా త్వరగా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అప్పుడే మాకూ వాదనలు జరిగేవి.

కన్న కూడా కల్పన చిన్నప్పుడు ఇలా చెప్పడం నాకు గుర్తొస్తోంది. ”పిల్లలు పెద్దవాళ్ళయ్యే వరకూ నీ రాజకీయ కార్యకలాపాలు కాస్త ఆపుకోవచ్చు కదా” అని. కానీ ఇప్పుడైతే అట్లా అన్న విషయం ఆయనకు గుర్తు కూడా లేదు.

అవును. చాలాసార్లు నేను గ్రామాలకు వెళ్ళినా అభ్యంతరం ఉండేది కాదు. అయితే ఢిల్లీ వెళితేనే అభ్యంతరం ఉండేది. ”నెమ్మదిగా నువ్వు వాళ్ళకు అమ్ముడుపోతున్నావు” అనేవాడు. ”సమావేశాలకు వెళ్ళడం అమ్ముడు పోవడం కాదు” (నవ్వు) అనేదాన్ని. అప్పుడే వాదనలయ్యేవి, కోపాలొచ్చేవి. అయితే పదేళ్ళ తరువాత…

ఒప్పుకునేవారా?

అవును.

మీరు గ్రామాలకు వెళ్తే ఆయనకు అభ్యంతరం ఉండేది కాదన్నారు కదా!

నేను ”శ్రమ శక్తి”లో నిమగ్నమైనపుడు ఒక విషయం జరిగింది. ఇళాబెన్‌ నన్ను టాస్క్‌ఫోర్స్‌లో చేరమని పిలిచినపుడు నేను అహ్మదాబాద్‌లో ఉన్నాను. అక్షయ నాకు ఫోన్‌ చేసి ఇళాబెన్‌ రమ్మన్నారని చెప్పి ”కానీ ఈ కమిషన్లలో వాటిలో నీ సమయం వృధా చేసుకోకు” అన్నాడు. అటువంటి సందర్భం వచ్చినపుడల్లా నేను ”దయచేసి నేనేం చెయ్యాలో నన్ను నిర్ణయించుకోనివ్వు. సలహాలివ్వు, కానీ నిర్ణయం నాకొదిలెయ్‌” అనేదాన్ని. తరువాత ఆ సమావేశం గురించిన రిపోర్ట్‌ వచ్చినప్పుడు చాలా సంతోషించాడు. నువ్వు వెళ్ళొద్దన్నావు కదా అంటే ”అప్పుడప్పుడూ అలా జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఇలా పదవులకూ, సంస్థలకూ అమ్ముడుపోతూ ఉండడం చూశాను కనుక చెప్పాను” అన్నాడు.

‘కానీ మీ నమ్మకాల పట్లా, పనుల పట్లా నేనెప్పుడూ ఇట్లా అనలేదు’ అన్నాను (నవ్వు).

అట్లాంటివి చాలా జరిగేవి. నా జీవితమంతా నల్లేరు మీద నడక అని చెప్పలేను. భిన్నమైన ఆలోచనలు, దృష్టి కోణాలూ ఉంటాయి కనుక జీవితం నల్లేరు మీద నడక కాదు.

ఒక్కొక్క సమయంలో మనం ఎదుటివాళ్ళ అవసరాలను కూడా గమనించాలి. మనని వెళ్ళొద్దని ఎవరైనా చెప్పినప్పుడు మన ఆలోచన కూడా పదునెక్కి నిజంగా వెళ్ళడం అవసరమా అని ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం.

నేను అర్థం చేసుకున్నదేమిటంటే అతను తనలాగే నన్ను కూడా రాజకీయాలను చురుకుగా పట్టించుకోమంటున్నాడని. నేను ఒక సామ్యవాద నేపథ్యం నుంచీ వచ్చాను. అతనిది మార్క్సిస్టు నేపథ్యం. అందువలన ఈ రెండు దృక్కోణాల మధ్య ఉండే ఎడం పెద్దదౌతున్నది. నేను సోమరిగా రాజ్యం పక్షం అవుతానని, రాజీ పడిపోతానని అతనికి ఎప్పుడూ ఒక భయం ఉండేది. మేము జీవించడం ప్రారంభించినప్పుడు మాది రెక్కాడితేనే డొక్కాడని పరిస్థితి. అప్పుడతను సిద్ధార్థ కాలేజీలో అధ్యాపకుడు. ఆ రోజుల్లో కాలేజి అధ్యాపకుల జీతం 150 నుంచీ 200 దాకా ఉండేది. అప్పట్లో నేను పనిచేయడం లేదు. నేను ఎం.ఎ. చదువుతూ నా థీసిస్‌ వ్రాసుకుంటున్నాను. నేను బి.ఎ. చదువుతున్నప్పటి నుంచీ స్వయంగా సంపాదించాలని అనుకునేదాన్ని. అందుకని రాత్రిపూట ట్యూషన్లు చెప్పేదాన్ని. అప్పుడు మా మధ్య బాగా వాదాలు జరుగుతూ ఉండేవి. నేను ఉద్యోగం చేస్తాననీ, సంపాదిస్తాననీ అనేదాన్ని. ”ముందు చదువు పూర్తిచెయ్యి తరువాతే

ఉద్యోగం” అనేవాడతను.

ఆర్థిక స్వాతంత్య్రం అనే నా ఆకాంక్షను నెరవేర్చగలిగేది ఉద్యోగమే అని నా ఉద్దేశం. రెండవ దేమిటంటే నాకు బరోడా వెళ్ళి ఉండడం ఇష్టం లేదు. అతని ఉద్యోగ జీవితం కూడా బొంబాయిలోనే ప్రారంభమైంది. అతను పనిచేసేది సిద్ధార్థ కాలేజీలో(3). అయితే అతని రాజకీయపరమైన ఆలోచనలు అంబేద్కర్‌ ఆలోచనలతో విభేదించడం వలన ఉద్యోగానికి రాజీనామా ఇవ్వవలసి వచ్చింది. రాజీనామా ఇచ్చిన తర్వాత మళ్ళీ బొంబాయి యూనివర్శిటీలో చేరేవరకూ మూడేళ్ళు పట్టింది. అప్పుడతని తండ్రి మమ్మల్ని బరోడా వచ్చి ఉండమనేవారు. నాకు ఉమ్మడి కుటుంబంలో ఉండడం ఇష్టం లేకపోయింది. అది కూడా నన్ను…

అది కూడా ఒక ముఖ్య వివాదాంశమా?

అవును. ఒక రకంగా.

అతనికిష్టమేనా బరోడాకెళ్ళడం?

తప్పని పరిస్థితుల్లో… కానీ అతను ఎప్పుడూ అక్కడికి వెళ్ళాలనుకోలేదు. ”వాళ్ళ సంతృప్తి కోసం దరఖాస్తు పెట్టనీ. ఉద్యోగం వచ్చినా చేరను” అన్నాడు. లక్నోలో ఇంటర్వ్యూ కోసం వెళ్ళాం. ‘నేను లక్నో వెళ్తాను కానీ బరోడా వెళ్ళను’ అన్నాడు. ‘కానీ ఉద్యోగం వస్తే బలవంతపెడతారు కదా’ అన్నాను. తొలి రోజుల్లో ఈ కష్టాలు ఎదుర్కొన్నా మా మధ్య అవగాహన నిలిచి వెలిగింది. భిన్నాభిప్రాయాలు ఉండేవి. నిత్య జీవితానికి సంబంధించీ, ఇతర కార్యకలాపాలకు సంబంధించీ ఎక్కువగా అభిప్రాయభేదాలు ఉండేవి. కానీ ప్రేమా, అవగాహనా, ఒకరిపట్ల ఒకరికి శ్రద్ధా అంతర్వాహినిగా ఉండేవి.

ఏమిటా అభిప్రాయభేదాలు?

చెప్పాను కదా! మొదటది ఉద్యోగం గురించి. రెండవది మా అత్తగారింటి వాళ్ళతో నా సంబంధాలు. అప్పట్లో నేను స్త్రీ వాదిని కాదు, కానీ ఒక స్త్రీనయినందుకు నేను అన్నింటికీ రాజీపడడం ఇష్టం లేదు. అక్కడుండడం నాకిష్టం లేదని అతనితో వాదించేదాన్ని. నాతో అవసరం ఉంటే వాళ్ళకు సహాయం చేయగలను, కానీ వాళ్ళతో కలిసి ఒకే ఇంట్లో ఉండలేను… అదొక వివాదం. మూడవది నా కార్యకలాపాలు. నేను అవన్నీ మానేసి ఒక భద్రమైన మధ్య తరగతి జీవితంలోకి ఒదిగిపోతానని అతని భయం. అప్పుడు కూడా నేను ”దయచేసి నా జీవితాన్ని నువ్వు నిర్ణయించవద్దు. ప్రస్తుతం నా లక్ష్యం ఎవరిమీదా ఆధారపడకుండా ఉండడం, అది నెరవేర్చుకోనివ్వు” అన్నాను.

ఈ పరిస్థితి పదేళ్ళు కొనసాగింది. అతనూ పోరాటం చేస్తున్నాడు. సహోద్యోగులతో పోటీ వారి అసూయను ఎదుర్కోవడం. ముఖ్యంగా డాక్టర్‌ ఘర్యే నుంచీ, ఇక్కడ కాస్త పక్కకి పోదాం. అతను డాక్టర్‌ ఘర్యే పర్యవేక్షణలో ”భారత జాతీయ వాదం యొక్క సామాజిక నేపధ్యం” అనే అంశంమీద థీసిస్‌ పూర్తి చేశాడు. దాన్ని ఆక్స్‌ఫర్డ్‌ పబ్లికేషన్స్‌ ”సామాజిక విశ్లేషణ” శీర్షికతో ప్రచురించాలనుకున్నది. డాక్టర్‌ ఘర్యే దానికి ముఖ్య సంపాదకుడు. ఆ పుస్తకాన్ని తను ఎడిట్‌ చేస్తానని ఆయన అంటే అక్షయ ఒప్పకోలేదు. ”మిమ్మల్ని గౌరవిస్తాను కానీ మిమ్మల్ని ఎడిట్‌ చేయనివ్వను” అన్నాడు. దాంతో ఇద్దరి మధ్యా ఘర్షణ పెరిగింది. డాక్టర్‌ ఘర్యే చాలా శక్తిమంతుడు. ఇతన్ని చివరిదాకా ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు. ఇది 1947 నుంచీ మొదలైంది. డాక్టర్‌ ఘర్యే లండన్‌ వెళ్ళినప్పుడే అక్షయను బొంబాయి యూనివర్శిటీ ఇంటర్వ్యూకు పిలిచింది. ఇదంతా నాకు తెలుసు. పైగా ఇంట్లో షా ఒకడు మాకు. అందుకని అతనికి నేను మరికొన్ని సమస్యలు సృష్టించకూడదనుకున్నాను. అది అతనికొక పరీక్షా సమయం అని నాకు తెలుసు. ఆర్థికంగా కూడా మా పరిస్థితి బాగాలేదు. అక్కడక్కడా అప్పులు కూడా చేశాము. మేము దాదర్‌లో శివాజీ పార్క్‌ దగ్గర ఒక అయిదంతస్తుల భవనం ఎదురుగా ఉండేవాళ్ళం. ఒకటిన్నర గదుల్లో ఉండేవాళ్ళం అద్దెకుండేవాళ్ళందరికీ ఉమ్మడి బాత్‌రూమ్‌. అలా పదేళ్ళు ఉన్నాం. నిజంగా గడ్డుకాలం అది.

నాకూ అది కష్టకాలమే. ఎందుకంటే అన్ని సర్దుబాట్లూ నేనే చేసుకోవాల్సి వచ్చింది. నేను పుట్టి పెరిగిన కుటుంబంలో ఇటువంటి సంఘర్షణలు లేవు. మాది చిన్న కుటుంబం. మాకు బంధువుల బాధ్యతలు కూడా ఉండేవి. కానీ ఎవరూ వచ్చి ఇంట్లో ఉండిపోయేవారు కాదు. అతిథులలాగా ఉండి వెళ్ళిపోయేవారు. మా అమ్మ కూడా మాకు పెద్దగా ఇంటిపనులు చెప్పేది కాదు. ఇంటిపని కూడా నేర్పలేదు. అందువలన ఇది ఒక పెద్ద మార్పు నాకు. మొదట్లో మా ఉద్యోగాల గురించీ, జీవనశైలి గురించీ, అనుబంధాల గురించీ వాదనలు జరిగేవి. మాకు చాలామంది బంధువులున్నారు. వాళ్ళను చూడడం నాకు ఇష్టం. కానీ అతనికి ఆసక్తి లేదు. అందరితో స్నేహంగా ఉంటాడు కానీ వాళ్ళతో సన్నిహితంగా మెదలలేడు. ఇలాంటి సమస్యలే ఉండేవి.

అవును. కన్న కూడా అంతే. చుట్టాలనీ, స్నేహితులనీ కలవడానికి ఇష్టపడేవాడు కాదు. కొంతకాలం తరువాత నాతో రమ్మని అడగడం మానుకున్నాను. చుట్టాలూ లేదు – స్నేహితులూ లేదు. కొంతమందిని మాత్రమే కలవడానికి ఒప్పుకునేవాడు.

ఒక్కొక్కప్పుడు నేను సమానాంతర జీవితం గడుపుతున్నాననిపిస్తుంది. అతను సంప్రదాయ వివాహ మహోత్సవాలకి పూర్తి విరుద్ధం. ప్రత్యేకంగా కన్యాదానం (4) క్రతువుకు మరీ వ్యతిరేకం. అతను మా అన్న పెళ్ళికి రాలేదు. తన స్వంత చెల్లి పెళ్ళి అయినా సరే వెళ్ళడు. కానీ నన్ను వెళ్ళమంటాడు. నేనంటూ ఉంటాను ”నువు వెళ్ళనప్పుడు నన్ను పొమ్మని బలవంత పెడతావెందుకు? వాళ్ళు నీ స్నేహితులు, నువ్వు ఆ పెళ్ళికి వ్యతిరేకం. నేను వెళ్ళను” అని.

ఈ మగవాళ్ళ గురించి నేనేమనుకుంటానో తెలుసా, వసంత్‌! స్త్రీల సమస్యల పట్ల వీళ్ళకెంత సానుభూతి ఉన్నా, తన జీవన భాగస్వామి స్వీయ నిర్ణయాలనూ, స్వాతంత్య్రాన్ని ఒప్పుకోవడానికి కొంతకాలం పడుతుందని.

అవును, చాలా కాలం పడుతుంది

ఇదే నేను గమనించాను. కొంతకాలం తరువాత ఇద్దరికీ మధ్య ఏర్పడే ప్రేమానుబంధాల వలనా సంవేదన వలనా అది సాధ్యమౌతుంది. తన స్త్రీ వాదం తన భార్య నీరా వల్లనే పెంపొందిందని అతను వ్రాశాడు తరువాతొకచోట. నిజంగానే వ్రాసాడు. లేకపోతే మగవాళ్ళు అన్నీ తమ హక్కుగా వచ్చాయనుకుంటారు. ఇవన్నీ ఉండేవి, కానీ చాలా స్వల్పమైనవే!

తరువాతి దశలో వయోభేదం పెద్ద సమస్య అవుతుంది. అతని పదవీ విరమణ అయినాక కూడా నేను పనిచేస్తున్నాను. అతను నాకన్నా పదేళ్ళు ముందు రిటైరయ్యాడు. నేను పనికి వెళ్తే అతను ఇంట్లో ఉండేవాడు. సహజంగానే నేను ఎందుకింకా ముందు రాలేదనేవాడు. మీకో చిన్న ఉదాహరణ చెబుతాను. ఇంటికి రాగానే ”నాకేమైనా ఉత్తరాలొచ్చాయా?” అని అడిగేదాన్ని. నేను చూశాను, అంత ముఖ్యమైనవేమీ లేవు అనేవాడు. అలా ఒకటి, రెండుసార్లయ్యాక ఒకరోజు ”అవి ముఖ్యమో కాదో నువ్వెలా నిర్ణయిస్తావు?” అని అడిగాను. ”లేదు, ఏమీ లేదు అందులో” అన్నాడు మళ్ళీ. బహుశా నేను వ్యక్తివాదినో లేదా అతనికి నామీద ఎక్కువ శ్రద్ధో, ఏమైనా కానీ ఇటువంటి చిన్న చిన్న విషయాలు చాలా ముఖ్యమైనవని ఎప్పుడూ అనిపించేది.

మీ ఉద్దేశ్యం ఏమిటి? అవి ముఖ్యమైనవి కాకపోతే అతను ”కంగారు పడకు” అనాలనా?

కాదు. ముఖ్యం కాదంటే అందులో నాకేదైనా పని చేయమని అభ్యర్థించేవి ఏమీ లేవని. అంటే అందులో ఒక సమావేశపు ఆహ్వానమో, మరేదో ఉంటే అది ముఖ్యం కాదు. ఒక ప్రకటన కూడా కావచ్చు. ఎక్కువ ఉత్తరాలు నా ఆఫీసుకే వస్తాయి. ముఖ్యంగా గుజరాత్‌ నుంచీ ఆహ్వాన పత్రికలు కానీ ఏదైనా వ్రాయమనే అభ్యర్థనలు కానీ ఇంటికొస్తాయి. చాలామంది వ్యక్తులు కూడా వ్రాస్తూ

ఉంటారు. ఏమైనా కానీ ఏమొచ్చాయో నన్ను చూడనిమ్మంటాను. ఇది చాలా చిన్న విషయమే కానీ…

నాకర్ధం అవుతోంది… సరే. ఇంటి పని ఎలా నిభాయించేవారు?

మొదటి నుంచీ నాకు పనిమనిషి ఉంది. మొదట్లో కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయేది. తర్వాత పూర్తి సమయం పెట్టుకున్నాను. అతను కూడా బాగా సహాయం చేసేవాడు. అతనెప్పుడూ ఇంటి పని చేసి ఉండలేదు కనుక కష్టంగా ఉండేది. సాయంత్రమప్పుడు నేను వంట చేస్తుండగా వచ్చి ”పప్పు ఎక్కడుంది?” అని అడిగేవాడు. ”నన్నలా అడగొద్దు. నాకేం సాయం అక్కర్లేదు, వెళ్ళి విశ్రాంతి తీసుకో” అని చెప్పేదాన్ని.

ఒక విషయం మాత్రం నన్ను బాగా కదిలించింది. 1930లో గాంధీ ”మీకు బాగా ఇష్టమైన ఆహారాన్ని పరిత్యజించండి” అని పిలుపు ఇచ్చినప్పుడు, అక్షయ చాలా చిన్నవాడు. అతను టీ వదిలేశాడు. ఇరవై ఆరు సంవత్సరాల పాటు తాగలేదు. మా పెళ్ళి తర్వాత, మా ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం పెరిగిన తర్వాత నాకు టీ అంటే చాలా ఇష్టమని గుర్తు తెచ్చుకుని అతనూ తాగడం మొదలుపెట్టాడు. ఒకరోజు హఠాత్తుగా అన్నాడు ”ఒంటరిగా టీ తాగకు. నేనూ తాగుతాను” అని.

నేను సాయంత్రం ఇంటికి రాగానే అతను టీ పెట్టేవాడు. ఉదయం నాలుగింటికి నిద్ర లేచేవాడు. నేను ఏడింటికి లేచేదాన్ని. అతనే ఉదయం టీ, ఫలహారం కూడా చేసేవాడు. నన్ను బాగా పట్టించుకునేవాడు. మా అనుబంధం పరిణతి చెందుతున్న కొద్దీ నాకు అర్థమయింది ఏమిటంటే మా మధ్య ఒకప్పుడు తలెత్తిన అభిప్రాయభేదాలు కేవలం సంస్కృతికి చెందినవి… కాలం గడిచి ఒకరికొకరు మరింత దగ్గరయ్యాక ఎక్కువ వాదనలూ లేవు. మేం ఒకరినొకరం అర్థమయ్యాం. అతను నన్నెలా రాజకీయ స్పృహతో చురుకుగా

ఉండమనేవాడో మిహిర్‌ని కూడా అలాగే… (రుద్ధమైన గొంతుతో)

ఆశీర్వాదం ఎప్పుడూ వ్యర్థం కాదు

ఇప్పుడు అతను లేని లోటు బాగా తెలుస్తున్నది. ఒకటి రెండు విషయాలు అతన్ని బాగా సంతోషపెట్టి ఉండేవి. ఒక్కొక్కప్పుడు అతను మరణించిన తీరు అతనికి మంచి చేసిందనిపిస్తుంది. నా చెల్లెళ్ళతో అతనెంతో చనువుగా, స్నేహంగా ఉండేవాడు. వాళ్ళ గత విషయాలన్నీ ప్రేమ వ్యవహారాలతో సహా అతనికే ఎక్కువ చెప్పుకునేవారు. మేం ముగ్గురం అక్కచెల్లెళ్ళం పూణే వెళ్ళినప్పుడు అతని గురించి చెప్పుకున్నాం. మేమందరం ఏవేవో రుగ్మతలతో బాధపడుతున్నాం. పైగా నేను వృద్ధాప్యంలో ఈ దుఃఖాన్ని భరించవలసి రావడం, ఆ విషయాలు మాట్లాడుకున్నాం. అతని మరణం మా అందరికీ దిగ్భ్రాంతి కలిగించింది. కానీ అతనికది మంచిదే. ఏమీ బాధపడకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడతను ఉండివుంటే రెండు, మూడు విషయాలు అతన్ని బాగా సంతోషపెట్టేవి. ఒకటి మిహిర్‌ మానవహక్కుల కోసం పనిచేయడం. మిహిర్‌ పూర్తిగా ఉద్యోగం మానుకుని ఇందుకోసమే పనిచేస్తున్నాడు. రెండవది అతని ఆర్థిక స్థిరత్వం. మిహిర్‌ కారు పిలిపించుకుని వెళదాం అని నేను అనగలను కానీ అతను ఆ ఆనందాన్ని కోల్పోయాడు. శాంతి పురస్కారం కోసం వెయ్యిమంది మహిళలలో (5) నన్నూ ఒకదానిగా ఎంపిక చేసినందుకు అతనెంత సంతోషించేవాడో! ఇంకా ఎన్నో విషయాలకు వివిధ పురస్కారాలొచ్చాయి. కానీ అన్నీ ఆలస్యంగా వచ్చాయి. అతనుంటే అన్నింటికీ సంతోషపడేవాడు. అతను లేకపోవడం తీరని లోటు.

నా సహోద్యోగి అయిన గుజరాతీ ప్రొఫెసర్‌ నాకు 1994లో ఈ డైరీ ఇచ్చారు. ”నీరాబెన్‌ ఇందులో మీ అనుబంధాన్ని గురించి మాత్రమే వ్రాయండి. మీ మనసులోకి ఏమొస్తే అది వ్రాయండి” అన్నారాయన. అప్పటినుంచీ ఇందులో నాకు తట్టిన భావాలన్నీ వ్రాస్తున్నాను. ఎప్పుడనిపిస్తే అప్పుడు తీసి చదువుతూ ఉంటాను. ఏదైనా మంచి విషయం జరిగినప్పుడు అతను లేని లోటు బాగా అనిపిస్తుంది. మా ఇంట్లో ముప్ఫై సంవత్సరాలుగా పనిచేస్తున్న జిజా కూతురుకి పెళ్ళి. అతనుంటే ఎంతో ఆనందించేవాడు. ఇలాంటివన్నీ వ్రాస్తూ ఉంటాను. మాకు ముఖ్యమైన సందర్భాల గురించి అతనితో మాట్లాడడం కూడా ప్రారంభించాను. మా వివాహ వార్షికోత్సవమూ, అతని పుట్టినరోజూ ఏప్రిల్‌ 16న, మిహిర్‌ పుట్టిన రోజు ఏప్రిల్‌ 21న. ఈ రెండూ అత్యంత ప్రధానమైన రోజులు నాకు. మా ప్రత్యేకమైన రీతిలో వీటిని జరుపుకుంటాటం మేము… నా పుట్టినరోజు కూడా ముఖ్యమే కానీ ఈ రెండూ ఇంకా ముఖ్యం. 1997కి మా వివాహమై యాభై ఏళ్ళవుతుంది. కానీ యాభై ఏళ్ళవరకూ ఎందుకు ఆగాలి? నలభై ఏడేళ్ళు కూడా తక్కువేం కాదు అని 1994లోనే మేము నలభై ఆరేళ్ళ వార్షికోత్సవం జరుపుకుంటున్నామని అందరికీ చెప్పేశాం.

జరుపుకోవాలని నిర్ణయించారన్నమాట!

కానీ జరుపుకోలేకపోయాం. అక్షయ 1994 నవంబరులోనే మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మా వివాహ వార్షికోత్సవానికి కొన్ని నెలలముందే.

వార్షికోత్సవాలు ఎలా జరుపుకునేవారు?

తడవకొక్క తీరుగా. ఒక్కొక్కసారి మేమిద్దరం ఏదైనా ప్రముఖ ప్రదేశానికి వెళ్ళేవాళ్ళం, లేదా బొంబాయిలో బయటికి వెళ్ళేవాళ్ళం. ఎక్కడైనా కచేరీ ఉంటే వెతుక్కుని వెళ్ళేవాళ్ళం. లేదా మామూలుగా బయటికి వెళ్ళి ఆనందించేవాళ్ళం.

మీ జీవితంలోని అందమైన క్షణాల గురించి వినాలని ఉంది.

తప్పకుండా! కానీ ముందు ఇంకో సంగతి చెప్పనివ్వండి. నా పదవీ విరమణ తర్వాత అయిదేళ్ళకు ఎందుకో మా సహజీవనం ఇంకా కొద్ది రోజులేనేమో అనిపించింది నాకు… మాలో ఎవరో ఒకరు పోతామనిపించింది.

అందుకేనా త్వరగా వార్షికోత్సవం జరుపుకోవాలనుకున్నారు?

అతను కూడా చాలా అసహనంగా ఉన్నాడు. రాజకీయ పరిస్థితులు చాలా నిస్పృహ కలిగిస్తున్నాయి. మతతత్వమూ, బాబ్రీ మసీదు కూల్చివేత చాలా మనస్థాపాన్ని కలిగించాయి. ఈ సంఘటనలన్నింటి గురించీ అతను వ్రాస్తూ ఉండిపోయాడు. ”నేనింకా అయిదేళ్ళు బ్రతికితే నా పని పూర్తవుతుంది” అనేవాడు. నేను నవ్వుతూ ”ఆ పని పూర్తయ్యాక మరో అయిదేళ్ళు అడుగుతావేమో” అనేదాన్ని. ”లేదు, లేదు అయిదు చాలు” అనేవాడు. తరువాత నేనూ మారడం మొదలుపెట్టాను (నవ్వుతూ).

చివరి రెండు, మూడేళ్ళూ మేము ఆహ్లాదంగా గడిపాము. మాకు రెండు వార్తాపత్రికలొచ్చేవి. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఒకటి, మరొకటి గుజరాతీ పత్రిక. అతను గుజరాతీ పత్రికలో కాలమ్స్‌ వ్రాసేవాడు. తనకు ముందు గుజరాతీ పత్రిక చదవడం ఇష్టమనేవాడు. నన్ను ఇంగ్లీష్‌ చదవమనేవాడు. ”నీకు గుజరాతీ పత్రిక ముందు కావాలి కనుక నాకిది ఇస్తున్నావా?” అనేదాన్ని. బాగుండేవి. కానీ పత్రిక చదివి బాధపడేవాడు, ఉద్రేకపడేవాడు. అప్పుడిద్దరం రాజకీయ పరిణామాల గురించి వాదించుకునేవాళ్ళం. అప్పుడొక రోజు చెప్పాను. ”మనం ఎన్నాళ్ళు కలిసి బ్రతుకుతామో తెలియదు. అందుకని మంచి జ్ఞాపకాలు పంచుకుందాం. ఈ రాజకీయాలను గురించిన వాదనలకు విలువలేదు. మనమేమిటో, మన విలువలేమిటో మనకు తెలుసు” అని. అతను అంగీకరించాడు. తరువాతెప్పుడూ వాదాలూ, ఉద్రేకాలూ లేవు. నేను చెప్పింది నిజమనిపించింది అతనికి. వి.పి.సింగ్‌ (6) సమస్యలు సృష్టిస్తే మనమెందుకు వాటి గురించి పోట్లాడుకోవాలి?

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.