చిగురించిన శిశిరం -ఆకెళ్ళ భవాని

ఈ నెంబర్‌ నుంచి నా మొబైల్‌కి ఫోన్‌ రావటం నేను ఆఫీసుకి వచ్చాక ఇది మూడోసారి. అరగంట అరగంట విరామమిచ్చి మోగుతూనే ఉంది. పని ఎక్కువగా ఉండటం వలన తీసి హలో అనడానికి కూడా సమయం లేకుండా పోయింది. ఆ కాల్‌ కాలేజీలో నా స్నేహితురాలైన శిశిరకి బాల్య స్నేహితురాలైన శ్రావణి నుంచి. కొంచెం హడావిడి తగ్గాక నేనే తిరిగి కాల్‌ చెయ్యచ్చు అని అనుకున్నాను కానీ ఇంతలో మళ్ళీ ఇంకొకసారి మోగింది. ఇంక లాభం లేదనుకుని ఫోన్‌ తీసుకుని బయటికి నడిచాను. మా ఇద్దరి ఆఫీసులు పక్క పక్కనే ఉండడం వలన అప్పుడప్పుడూ ఎదురు పడుతూ ఉండేవాళ్ళం. అలా ఎదురైనప్పుడు పలకరించుకోవడం తప్ప అంతకు మించి మా మధ్య పెద్ద సాన్నిహిత్యం కానీ, అరమరికలు లేకుండా మాట్లాడుకోగల అనుబంధం కానీ ఏమీ లేదు. మరి ఇంత అత్యవసరంగా మాట్లాడవలసిన విషయం ఏమై ఉంటుందబ్బా అనుకుంటూనే ”హలో శ్రావణి ఎలా ఉన్నావు” అంటూ పలకరించాను. ”బావున్నాను స్వాతి నువ్వెలా ఉన్నావు” అంది. ”బావున్నాను. ఆఫీసులో పనెక్కువగా ఉంది. ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేకపోయాను. నేను చేద్దామనుకుంటుండా మళ్ళీ చేశావు. ఏంటి విశేషం? ఇంత హడావిడిగా కాల్‌ చేస్తున్నావు” అన్నాను. ”అయ్యో! ఐతే నీ పని చెడగొట్టానన్న మాట” అంది నొచ్చుకుంటూ. ”పని వత్తిడిలో ఉన్నప్పుడు నేను మాట్లాడలేను కదా” నవ్వాను. ”పర్లేదు. ఇప్పుడు కొంచెం వత్తిడి తగ్గింది. చెప్పు. ఏంటి విశేషం” అన్నా. ”ఏమీ లేదు. శిశిరని కలిసావా ఈ మధ్య” అంది. ”చాలా రోజులయ్యింది శ్రావణి. ఒక నెల రోజుల క్రితం మేము చిన్న యాత్రకి వెళ్ళాము. వాళ్ళ ఊరిమీదుగానే వెళ్ళడం వలన ఒక రాత్రి వాళ్ళ ఇంట్లో ఉన్నాము ఏం?” అన్నాను. ”అవునా? అప్పుడు ఎలా ఉంది శిశిర? అని అడిగింది. ”బానే ఉందే? ఏంటి? ఇప్పుడేమైంది?” కంగారుగా అడిగాను. ”తనకేం కాలేదు. బానే ఉంది. కంగారు పడకు. వాళ్ళ ఆయన

ఉన్నాడా అప్పుడు ఇంట్లో?” ఆరాగా అడిగింది. ”లేడు. ఏదో పనిమీద ఊరెళ్ళాడని చెప్పింది” అన్నాను. ”ఎన్నాళ్ళు, ఎంతమందికి ఇట్లా అబద్ధాలు చెప్పాలనుకుంటోందో” అంది. ”ఏమయ్యింది శ్రావణి? ఏమయ్యాడు అతను” అనుమానంగా అడిగాను. ”చాలా జరిగాయి స్వాతి. మీరు ఇద్దరు చాలా సన్నిహితంగా ఉంటుంటారు కదా. ఎప్పుడు వచ్చినా నీ దగ్గరే దిగుతుందని నేను గొడవ వేసుకుంటూ ఉంటాను కదా. అలాంటిది నీకు తెలియకపోవడం ఏంటి?” అంది. ”అబ్బా శ్రావణి దయచేసి అసలేం జరిగిందో చెప్పు” అన్నాను చికాకు అణుచుకుంటూ. ”అతను ఇంకో పెళ్ళి చేసుకున్నాడు. అంతేకాదు ఆ తర్వాత Iూ కూడా పెట్టేసి ఊరొదిలి వెళ్ళిపోయాడు”. ఒకటి కాదు రెండు చావు కబుర్లు చల్లగా చెప్పి తన పనైపోయిందన్నట్టు ”ఉంటాను” అని ఫోన్‌ పెట్టేసింది. నా బుర్ర వాటిని జీర్ణించుకోవడానికి చాలా సమయమే పట్టింది. అసలు శ్రావణి చెప్పేదంతా నిజమేనా? శ్రావణి భర్త చనిపోతే ఆయన ఉద్యోగం తనకి ఇచ్చారు. తను, ఇద్దరు పిల్లలతో ఈ ఊళ్ళోనే ఉంటోంది. శిశిర ఎప్పుడు వచ్చినా నా దగ్గరే దిగేది. వచ్చిన ప్రతిసారీ వెళ్ళి శ్రావణిని కలిసి ఒకపూట భోజనం మాత్రం చేసి వచ్చేది. ”ఇక్కడైతే మేము ముగ్గురమే కదా, ఫ్రీగా ఉంటుంది, ఇక్కడే దిగచ్చు కదా” అని తను ప్రతిసారి అడిగేది. అయినా శిశిర నా దగ్గర ఉండడానికే మొగ్గు చూపేది. దానికి నాకు అనిపించే ముఖ్య కారణం శ్రావణి వాళ్ళ మేనత్త. ఆవిడ కూడా ఆ పక్క వీథిలోనే ఉండేది. అవతలి వాళ్ళ విషయాలు సేకరించటం ఆవిడకు మహా సరదా. ఎలాగో కూపీ లాగి మొత్తం విషయాలు వెలికితీసి ప్రచారం చేస్తేనే కానీ ఆవిడకి నిద్ర పట్టదు. మేమంతా ఆవిడని ముద్దుగా బిబిసి అని పిలుచుకునేవాళ్ళం. కాలేజి రోజుల్లోనే ఆవిడని చూస్తే చాలు ఆమడ దూరం పారిపోయేది శిశిర. ఇప్పుడు కూడా ఆ రిస్క్‌ తీసుకోవడం ఇష్టం లేకేనేమో శ్రావణి దగ్గర ఉండేది కాదు అని నేను నవ్వుకుంటూ ఉండేదాన్ని. అసలు ఇప్పుడు ఈ విషయం కూడా ఆవిడ ద్వారానే ప్రసారం అయ్యుంటుంది. అసలు ఇదంతా నిజమేనా? ఐనా అబద్ధం చెప్పవలసిన అవసరం శ్రావణికి ఏంటి? రకరకాల ఆలోచనలు బుర్రలో మహా స్పీడ్‌గా తిరుగుతున్నాయి.

ఏడుగురు అమ్మాయిలున్న బృందంలో ముందుగా ఉద్యోగం వచ్చింది నాకే. కాలేజీలో డిగ్రీ చివరి సంవత్సరంలో ఉండగానే నాకు ఉద్యోగం వచ్చేసింది. ఆ రోజు ఇంటర్వెల్‌లో మిగతా స్నేహితులంతా ఆనందంగా అభినందిస్తుంటే శిశిర మాత్రం ”ఆడవాళ్ళకి ఉద్యోగాలు ఎందుకబ్బా? ఊరికే నిరుద్యోగాన్నిపెంచడానికి తప్పించి” అంది. ”ఇదిగో శిశిర నీకు ఇష్టం లేకపోతే హాయిగా పెళ్ళి చేసుకుని వంట చేసుకుంటూ, గిన్నెలు తోముకుంటూ కూర్చో. అంతేకానీ ఆడవాళ్ళకి ఉద్యోగాలు ఎందుకు అంటూ స్పీచ్‌లు ఇవ్వకు” అశ్విని విసురుగా అంది. ”అబ్బో! ఉద్యోగాలు చేస్తుంటే వంట చేయరేమో, గిన్నెలు తోమరేమో” నవ్వుతూనే రెచ్చగొడుతోంది శిశిర. ”ఉద్యోగాలు చేసో, వ్యాపారాలు చేసో ఎలాగో అలా స్వయం సంపాదన అంటూ ఉంటే వండాలా వద్దా, తోమాలా వద్దా అనే నిర్ణయం కనీసం మన చేతిలో ఉంటుంది. లేదనుకో చచ్చినట్టు అక్కడే మగ్గాలి” అదే విసురుని కొనసాగించింది అశ్విని. మిగతా అందరూ అశ్వినినే బలపరిచినా శిశిర మాత్రం ”ఏమో తల్లీ! ఎటూ ఇంట్లో పనులన్నీ మనమే చెయ్యవలసి వచ్చేటపుడు ఆ ఉద్యోగాలు కూడా నెత్తినేసుకుని, అవీ ఇవీ అన్నీ చెయ్యలేక చేస్తూ… బతుకు భారం అయ్యి… ఎందుకీ తిప్పలు? నేను మాత్రం చెయ్యనంతే” అంది శిశిర. ”ఆ పనులన్నీ ఇంటి పనులు. ఆడవాళ్ళ పనులు మాత్రమే కాదు. నువ్వు ఉద్యోగం చేస్తే ఆ పనులు అందరూ పంచుకోవాలి. మొత్తం భారాన్ని నువ్వొక్క దానివే ఎందుకు మోయాలి” మిగతావాళ్ళు ఒక పరిష్కారం సూచించారు. ”అవన్నీ అయ్యేవి కాదు కానీ, నేను మాత్రం ఆ ఉద్యోగాన్ని తగిలించుకోను” శిశిర మళ్ళీ అదే పాట మొదలెట్టింది. ”సరే, నువ్వు చెయ్యకపోతే మానెయ్యి కానీ ఆ స్టేట్మెంట్లు ఇవ్వడం మాత్రం ఆపు. ఐనా ఉద్యోగం చెయ్యనప్పుడు ఇంత ఖర్చు పెట్టి చదవడం మాత్రం ఎందుకో? హాయిగా ఇంట్లో కూర్చుని ఆ తోమడాలు, ఆ వండటాలు ప్రాక్టీస్‌ చేసుకోవచ్చు కదా?” అన్నారు అందరూ. ”నాకు పుట్టబోయే పిల్లలకి చదువు చెప్పుకోవటం, చాకలి పద్దులు, పాల లెక్కలు, వార్తా పత్రికలు చదవడం, వీటికి చదువు కావాలిగా” నవ్వుతూనే అంది శిశిర. ”ఆ పద్దులకి, లెక్కలకి ఇంత చదువు అవసరం లేదకునుంటా. పదో క్లాస్‌ కూడా అక్కర్లేదు. ఐనా గిన్నెలు తోముకోవడమే జీవిత ధ్యేయం అయినవాళ్ళు వార్తా పత్రికలు చదవటం మాత్రం ఎందుకమ్మా? ఇంక నీ సమయం అంతా ఉతకడానికి, కడగడానికి, వండటానికి సరిపోతుంటే పిల్లల్ని ఏం చదివిస్తావులే? అయితే ఒక దానికి మాత్రం పనికి వస్తుంది. రేప్రొద్దున్న నీ పిల్లలు అమ్మ వేలి ముద్ర అని చెప్పుకోకుండా, లేదూ పదో క్లాస్‌ అని చెప్పుకోవాలన్నా నామోషీ ఫీల్‌ అవుతారు కాబట్టి ఏదో డిగ్రీ పాస్‌ అని చెప్పుకోవడానికి  ఉపయోగపడుతుంది” వ్యంగ్యంగా అంటూ క్లాస్‌కి టైం అయ్యిందని వెళ్ళిపోయారు. నేను, శిశిర మాత్రం మిగిలాము. ”ఎందుకు శిశిర అలా ఆలోచిస్తావు. కనీసం మన కాళ్ళమీద మనం నిలబడితేనే కదా మన మాటకి ఒక విలువ ఉంటుంది” అన్నాను. ”స్వాతీ, సంపాదిస్తే తప్ప మనిషికి ఏ విలువా ఉండదంటావా? కుటుంబం, బంధాలు… వీటికేం విలువ ఉండదా?” అడిగింది. ”సంపాదించినా కూడా విలువ ఉండటం లేదు. అసలు మన ఆడవాళ్ళు తమ విలువని తామే గుర్తించలేకపోతున్నారు. అయినా, ఏమీ సంపాదన లేని ఒక అబ్బాయి, బాగా సంపాదన, ఆస్తి ఉన్న మరో అబ్బాయి, ఈ ఇద్దరూ ఒకే రకమైన ప్రేమతో నిన్ను పెళ్ళి చేసుకుంటానని ప్రతిపాదిస్తే నువ్వు ఎవరిని ఎంచుకుంటావు” అడిగాను. తను ఏమీ మాట్లాడలేదు. ”చెప్పు. ఎవరిని చేసుకున్నా నీకు కుటుంబం ఏర్పడుతుంది. మిగతా గుణాలన్నీ ఒకటిగానే ఉన్నాయనుకుంటే ఖచ్చితంగా సంపాదన ఉన్న అబ్బాయినే నువ్వు అంగీకరిస్తావు కదా. పోనీ మీ ఇంట్లో వాళ్ళైనా అతనినే ఓకే అంటారు కదా” అన్నాను. మర్చిపోయిన పుస్తకం తీసుకోవడానికి వెనక్కి వచ్చిన అశ్విని ”ఇదిగో నువ్వెంతసేపు నచ్చచెప్పినా తన అభిప్రాయం మార్చుకుని నీకు ఉద్యోగం వచ్చిందని మెచ్చుకోదు కానీ పదండి క్లాసుకి టైం అవుతోంది. ఇప్పుడు మ్యాథ్స్‌ క్లాస్‌. అసలే ఈ లెక్కల మాస్టార్కి కోపం ముక్కు మీద ఉంటుంది. లెక్కలేకుండా తిట్టిపోస్తారు” అంటూ హడావిడిగా వెళ్ళిపోయింది. ”నిన్ను మెచ్చుకోకూడదని కాదు స్వాతీ. నీ ప్రతిభకి ఉద్యోగం రావడం పెద్ద విశేషం కాదు. నేను జనరల్‌గా నా అభిప్రాయాన్ని చెప్పాను అంతే” అంది చిన్నబుచ్చుకున్న శిశిర. ”నువ్వు మెచ్చుకోలేదని నేనేమైనా అన్నానా, అనుకున్నానా ఇప్పుడు? ఎందుకలా చిన్నబుచ్చుకుంటావు? పద క్లాసుకి వెళదాం. టైం అవుతోంది” అని బయలుదేరదీశాను.

ఆ తర్వాత నేను ఉద్యోగంలో చేరటం, పెళ్ళి… తెలియకుండా ఒక పదిహేనేళ్ళు కళ్ళు మూసి తెరిచేలోపు అన్నట్లు గడిచిపోయాయి. నాకు మొదటి కాన్పు ఐన మూడు నెలలకి శిశిర పెళ్ళి జరగటం వలన, చంటి పిల్లతో ప్రయాణం చెయ్యలేక, వెళ్ళలేకపోయాను. అతను మంచి పేరున్న లెక్చరర్‌ అని, చక్కని సంపాదన అని విన్నాను. శిశిర పదో తరగతిలో ఉండగానే తండ్రిని పోగొట్టుకుంది. ఒక్కతే కూతురవటం వలన పల్లెలో ఉన్న ఇల్లు, కొద్దిపాటి పొలం అన్నీ కూతురి చేతిలో పెట్టి తన తల్లి కూడా శిశిరతో పాటే ఉంటోందని తెలసి చాలా సంతోషపడ్డాను. తాను అనుకున్నట్టే ఇంటిపట్టున ఉండి పిల్లల్ని, తల్లిని, అత్తమామల్ని, భర్తని చూసుకుంటూ హాయిగా కాలం గడుపుతోంది. పద్ధతి ఏదైతేనేంటి తృప్తిగా బతకడం ముఖ్యం కదా అనుకున్నాను. తనకి ఇద్దరు పిల్లలు. కూతురు నా చిన్న కూతురి వయసు. కొడుకు కూతురి కంటే ఇంకో మూడేళ్ళు చిన్నవాడు. మధ్యలో ఒకటి రెండు సార్లు భర్త, పిల్లలతో కలిసి ఇంటికి కూడా వచ్చింది. ”ఐతే నువ్వనుకున్నట్టే వండటం, కడగడం, తుడుచుకోవడంతో సంతోషంగా ఉన్నావన్నమాట” అని ఆటపట్టిస్తూ ఉండేదాన్ని. ”మీలాగా ఇంట్లో పని, బయట పని చేసుకునే శక్తి, తెలివి నాకు లేదులేబ్బా” అని తేల్చేసింది.

అంతా బానే ఉంది అనుకునే సమయంలో అకస్మాత్తుగా ఈ ఎదురుదెబ్బ ఏంటా అని మధనపడుతూ అన్యమనస్కంగానే ఆఫీస్‌ పని ముగించుకుని బయటపడ్డాను. నేరుగా ఇంటికి వెళ్ళబుద్ధి కాక, బడినుంచి పిల్లలు ఇంటికి రావడానికి ఇంకా సమయం కూడా ఉండడంతో పక్కవీధిలోనే ఉన్న అమ్మ దగ్గరికి వెళ్ళాను. దారి పొడుగునా ఆలోచనలే. ఆ మధ్య ఒకసారి నేను ఇలాగే ఆఫీసులో ఏదో పని వత్తిడిలో ఉన్న సమయంలో ఫోన్‌ చేసింది. తియ్యంగానే ఉపోద్ఘాతం ఏమీ లేకుండా ”నాకేదైనా ఉద్యోగం ఇప్పిస్తావా?” అని అడిగింది. ”ఏంటి ఎగతాళా? నా దగ్గర ఉద్యోగాలేమైనా కుప్పలు పోసున్నాయా? నేనే పరీక్ష రాసి ఉద్యోగం తెచ్చుకున్నదాన్ని. నా దగ్గరేముంటాయి ఉద్యోగాలు” అన్నాను. ”ఎగతాళి ఏమీలేదు. నిజంగానే అడుగుతున్నా” అంది. నేను పని వత్తిడిలో ఉండి ఇంక ఎక్కువ వాదించకుండా ”నాకు పరిచయం ఉన్నవాళ్ళతో మాట్లాడి ఏదో ఒక ఉద్యోగం చూడటం పెద్ద విషయం ఏమీ కాదు కానీ ఇప్పుడేంటి అంత అవసరం” అన్నా. ”అర్జెంటు ఏమీలేదు. అడిగి చూడు కొంచెం” అని ఫోన్‌ పెట్టేసింది. నా పని తెమిలాక నేను చేసిన మొట్టమొదటి పని శిశిరతో మాట్లాడడం. ”ఏంటి చెప్పు. ఏం జరిగింది? అంతా బానే ఉంది కదా? అసలు మీ ఊరు వదిలేసి ఈ ఊళ్ళో ఏంటి ఉద్యోగం?” అని అడిగాను. ”మీ ఊర్లో అయితే కాలేజీలు చాలా ఉన్నాయి కదా. లెక్చరర్స్‌కి ఇంకా మంచి అవకాశాలుంటాయని, రావాలని ఆలోచన. సొంత ఇల్లు వదిలి వెళ్తే అద్దె ఇంట్లో, ఖర్చులు ఎక్కువ అవుతాయి కదా, సంపాదన పెరిగినా ఆ ఖర్చుకే సరిపోతుంది. కొంచెం సంపాదన తక్కువైనా ఉన్న ఊళ్ళోనే ఉండడం మేలని మామయ్య ఆలోచన. ఈయనకేమో బయటికి వెళ్ళాలని ”నువ్వు కూడా ఉద్యోగం చెయ్యి అంటారు” అంది. ”మరి నీకు ఇష్టమేనా?” అన్నాను. ”నా ఇష్టంతో సంబంధం లేదు. డబ్బు మంచినీళ్ళలా ఖర్చు పెడుతున్నారు. ఒక తీరు లేదు. చెప్తే ‘నీకేం తెలుసు? నాకు ఆ మాత్రం తెలియదా?’ అంటారు. తక్కువ కష్టంతో ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆశ. ఎంత చెప్పినా వినటం లేదు. ఏం చెయ్యను చెప్పు” అంది. నేనేం మాట్లాడలేదు. మళ్ళీ తనే అంది, ”నిన్ను కూడా ఒకటి రెండుసార్లు ష్యూరిటీ అడిగాను గుర్తుందా? నా ముఖం చూసి ఇచ్చావు. నాకు అది అడగడమే ఇష్టం లేదంటే, ఇంకా అప్పు అడగమంటారు. వీటన్నింటికంటే నేను ఉద్యోగం చేయడమే మేలు కదా” అంది. ”నీకుండే క్వాలిఫికేషన్‌కి ఉద్యోగం పెద్ద కష్టమేమీ కాదు శిశిర. మ్యాథ్స్‌లో పీజీ అంటే ఎవరైనా కళ్ళకద్దుకుని తీసుకుంటారు, ఏ కాలేజీలో ఐనా. సంపాదన బానే ఉంటుంది, దానికి తగ్గ కష్టమూ ఉంటుంది. సరే. అవసరమైతే చెప్పు, నేను ఈలోపు కనుక్కుని పెట్టుంటాను” అని చెప్పాను. అప్పటికే ఈ విషయాలన్నీ జరిగాయా లేకపోతే ఆ తర్వాత జరిగిన పరిణామాలా అని పరి పరి విధాలా ఆలోచిస్తూనే ఇంట్లోకి వెళ్ళాను. ”ఏంటే అట్లా ఉన్నావ్‌? ఏమైంది?” అడిగింది అమ్మ. ”ఏం లేదమ్మా” అంటూనే మొత్తం విషయం చెప్పాను. ”అదేంటే వాళ్ళ అమ్మ కూడా వాళ్ళతో పాటే ఉంటోందన్నావ్‌. మంచి అల్లుడు దొరికాడు, హాయిగా ఉన్నారు అనుకుంటే ఇలా అయ్యింది” అంది అమ్మ. ”ఐనా ఆవిడ కూడా ఈ మధ్య పోయారనుకుంటా కదా” అంది. ”అవునమ్మా. అసలు ఆ తర్వాతే అతను ఇలా తయారు ఐనట్టున్నాడు. అడిగేవాళ్ళు కూడా లేకుండా పోయారు కదా. ఐనా ఆవిడ ఉంటే మాత్రం ఒక లెక్కా ఏంటి అతనికి” అన్నాను. ”ఏంటో అంతా అయోమయంగా ఉంది. ఏమీ అర్ధం కావడంలేదు. అసలు ఏం చెయ్యాలో కూడా తెలియడంలేదు” అన్నాను. ”అసలింతవరకు నీతో కూడా చెప్పలేదంటున్నావు. నీ దగ్గర ఎందుకు మొహమాటపడుతోందో? అసలు ఎంత బాధపడుతోందో? ఒకసారి వెళ్ళిరా పోనీ” అంది. అదే మంచిదనుకుని ఆ వారాంతంలో వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. మూడు గంటలకి మించి ప్రయాణం ఉండకపోవడం వలన శనివారం మధ్యాహ్నం భోజనం చేసి తీరుబడిగా బయలుదేరి వెళ్ళాను. ఫోన్‌ కూడా చెయ్యకుండా వచ్చిన నన్ను చూసి ఆశ్చర్యపోయినా వెంటనే సర్దుకుని ”ఏంటి స్వాతీ, ఇంత దయ కలిగింది మా మీద. తీరిక చేసుకుని ఇంటిని, పిల్లల్ని వదిలి మరీ వచ్చావు” అంటూనే మొహం, కాళ్ళు, చేతులు కడుక్కోమని టవల్‌ తెచ్చిచ్చింది. నేను ఫ్రెషప్‌ అయి వచ్చి తను ఇచ్చిన వేడి వేడి కాఫీ అందుకుంటూ ”ఏంటీ వ్యంగ్య బాణాలు వదులుతున్నావ్‌? పిల్లలు మరీ చిన్నగా ఉన్నప్పుడు ఇల్లు వదలని మాట నిజమే కానీ కొంచెం పెద్దయ్యాక నిదానంగా నన్ను వదిలి ఉండడం అలవాటు చేసి, నాకంటూ ఒక జీవితం ఉంది… అనేట్టు ఉంటానని నీకూ తెలుసు కదా” అన్నాను. ”సరే సరే ముందు కాఫీ తాగు, చల్లారిపోతుంది” అంటూ ”ఇంకేంటి విశేషాలు” అంది. ”విశేషం ఏమీ లేకుండా నిన్ను చూడటానికి రాకూడదా ఏమిటి?” అన్నాను ”అబ్బా! నేను రాకూడదు అన్నానా? విశేషాలు ఏంటని అడిగానంతే. అన్నిటికి ఏదో ఒక వాదన వేసుకునే అలవాటు ఇంకా మారలేదా?” అంది. ”నువ్వు మాత్రం ఆ వ్యంగాలు మానావా ఏంటి? పుట్టుకతో వచ్చినవి పుడకలతో కానీ పోవని తెలుసు కదా, సరే కానీ పిల్లలెక్కడ?” అని అడిగా. ”బాబు బయట ఆడుకుంటున్నాడు, పాప వాళ్ళ నాయనమ్మ దగ్గరే ఉంది. చిన్నప్పటినుంచి వాళ్ళు బాగా అలవాటు కదా దానికి. ఎక్కవ అక్కడే ఉంటుంది. రాత్రికి కూడా అక్కడే ఉంటుంది ఇంక” అంది. ”మీ ఆయనేమో ఊళ్ళో లేడు. అంతేకదా” అన్నాను. ”అవును” పొడిపొడిగా అనేసి ”ఇంకేంటి విశేషాలు పిల్లలు బావున్నారా? ఉద్యోగం ఎలా ఉంది” అంటూ కుశలప్రశ్నలు మొదలుపెట్టింది. ”అవును మరి ఎన్ని విశేషాలు, విషయాలు ఉన్నా తమరు గుంభనంగా గుండెల్లో దాచుకుంటారు. మేమేమో పిచ్చి మొఖాలలాగ అన్నీ చెప్పాలి” అన్నాను. ”సరే. ఇంతకీ నా విషయాలన్నీ మోసింది ఎవరు నీకు. ఆ శ్రావణి వాళ్ళ అత్తేనా” అంది. ”ఎవరో ఒకరు చెప్పారులే. నువ్వు కానప్పుడు ఎవరైనా ఒకటే కదా?” అన్నాను. అది కాదు స్వాతీ అంటుండగానే ”అసలు నేను బతికి ఉన్నానని గుర్తుందా?” కస్సుమని లేచాను. ”ప్లీజ్‌ నేను చెప్పేది విను. నీకు చెప్పానే అనుకో ఏం చేస్తావ్‌? అసలు ఎవరైనా ఏం చేయగలరు చెప్పు? ఊరికే నిన్ను బాధపెట్టడం ఎందుకు అని” అంటుండగానే ”సరే ఇప్పుడు వేరే వాళ్ళ ద్వారా తెలిస్తే అసలు బాధతో పాటు నువ్వు దూరం పెట్టావ్‌ అనే బాధ కూడా కలుగుతుందని తెలియదా? లేదూ అసలు తెలియకుండానే పోతుందనుకున్నావా?” అన్నాను. తిరిగి నేనే అడిగాను ”ఇలాంటి విషయాలు ఎవరికీ తెలియవు, చాలా గోప్యంగా ఉంచాము అని అనుకుంటాం కానీ, జనాలకి ఇతరుల విషయాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది, చిన్న చిన్న విషయాలు కూడా పాకిపోతుంటాయని తెలియదా? ఇంక ఇలా పెళ్ళిళ్ళు, IP లు తెలియకుండా ఉంటాయా. ఐనా ఇప్పుడు నేనేదో చేసేద్దామని రాలేదు కదా. ఇలాంటప్పుడు కూడా కనీసం మాట సహాయానికి కూడా లేకపోతే ఇంక స్నేహితులు, బంధువులు ఎందుకు?” కోపంగా అరిచినట్లే మాట్లాడుతున్న నేను నిర్లిప్తంగా ఉన్న తన ముఖం చూసేసరికి టక్కున ఆగిపోయాను. నవ్వుతూ ”పర్లేదులే తిట్టు” అంది. ”అది కాదు శిశిరా. IP అంటే ఇప్పుడు పెట్టాడు. రెండో పెళ్ళి చాలా రోజుల క్రితమే చేసుకున్నాడట కదా” అన్నాను. ”నిజమే. కానీ నాకు అది అంత సమస్య అనిపించలేదు స్వాతీ” అంది. ”ఏంటీ” అయోమయంగా అడిగాను. ”అవును. ఏదో కలిసి ఉంటున్నాం కానీ నిజం చెప్పాలంటే అంత విడదీయలేని బంధం ఏమీ లేదు మా మధ్య. ఈ అనవసరపు ఖర్చులు, ఇక్కడ డబ్బు తీసి అక్కడ ఇన్వెస్ట్‌ చేయటం, అప్పులు చెయ్యటం, ఇవన్నీ నేను ముందునుంచే వ్యతిరేకిస్తూ ఉండేదాన్ని. ఏం చెప్పినా నన్ను తీసి పారేసేవాడు. మామయ్యగారు గట్టిగా మందలించారని సొంత ఇల్లు ఖాళీ చేసి ఇలా అద్దె ఇల్లు పట్టుకు తిరుగుతున్నాము. అత్తయ్యగారేమో ఈయనకే ఫుల్‌ సపోర్టు. చివరికి ఇప్పుడు IP పెట్టి వెళ్ళాడా? నేను, పిల్లలు ఏమవ్వాలి? తిరిగి ఆ ఇంటికే చేరాలి. మీరంతా చెప్పింది నిజమే. నాకంటూ ఒక సంపాదన ఉంటే ఒక విలువ ఉండేది. ఇలా జరిగేది కాదేమో. ఒకవేళ జరిగినా పిల్లి పిల్లల్ని తిప్పినట్లు నా పిల్లల్ని ఇలా తిప్పవలసి వచ్చేది కాదేమో” అంది బాధగా. ”సర్లే సంపాదన లేని అందరకీ ఇలా జరుగుతుందా ఏంటి? టైం బాలేదు ఏం చేస్తాం? ఇట్లా జరుగుతుంది కాబట్టి ఉద్యోగాలు చెయ్యాలి, అని కాదు మేము చెప్పిన దానికి అర్థం” అన్నాను. ”అది కాదనుకో. ఐనా ముందే నాకు మా అత్తగారింట్లో విలువ తక్కువ. మా తోటికోడలికున్న విలువ నాకు లేదు. ఎందుకు అనేది నాకు తెలీదు. ఒకే ఇంట్లో దగ్గరగా ఉండడం వలనా? లేక తండ్రి, అన్నదమ్ములు లేకపోవడం వలనా? అందుబాటులో ఉండేది ఏదైనా తేలికే కదా? ఏదేమైనా నేనంటే అక్కడ మామూలు పరిస్థితులలోనే విలువ లేదు. ఇంక ఇలాంటి పరిస్థితుల్లో వెళితే ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే దడగా ఉంది” భయంగా అంది. ”అసలు ఈ పరిస్థితికి వాళ్ళకి నీ పట్ల సానుభూతి ఉండాలి. అదీకాక తప్పు వాళ్ళ కొడుకుది పెట్టుకుని నీ ముందు నిలబడి మాట్లాడాలంటే వాళ్ళు ఇబ్బంది పడాలి కానీ నువ్వెందుకు భయపడతావు” అన్నాను. ”ఆవిడ సంగతి నీకు తెలియదు స్వాతీ” అంది. ”మరి ఇంకో ప్రత్యామ్నాయం ఏముంది. మా దగ్గరికి రమ్మంటే అభిమానం ముంచుకొస్తుంది. ఊళ్ళో మీ ఇంట్లో ఉండి, పొలం మీద వచ్చే రాబడితో ”నువ్వూ ఏదైనా ఉద్యోగం చేస్తూ నెట్టుకు రాగలవా” అని అడిగాను. మళ్ళీ నేనే ”ఆ చిన్న ఊళ్ళో చదువులు అంత గొప్పగా ఉండవు. పిల్లలు కూడా హైస్కూల్‌కి వస్తున్నారు కదా, అదీకాక ఆ ఊళ్ళో ఉద్యోగాలు మాత్రం ఏం దొరుకుతాయి?” సాలోచనగా అన్నాను. ”ఇల్లు, పొలం అన్నీ అమ్మేశాం స్వాతి” చిన్నగా గొణిగింది శిశిర. ”ఏంటీ” అర్ధం కానట్టు అడిగాను. ”మరి ఆ డబ్బులు” అనుమానంగా అడిగాను. ”అవును. అతనే తీసుకున్నాడు. ఇదంతా జరిగి చాలా కాలం అయ్యింది. భర్తే కదా అని మొత్తం తన చేతిలో పోశాను. ఇష్టం లేకపోయినా, ఇవ్వను అని చెప్పలేకపోయాను” అంది. ”పే…ద్ద పతివ్రత బయలుదేరింది. ఛా… ” కోపం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటే తల పట్టుకు కూర్చుండిపోయాను. ”అయిపోయిన దానికి ఎందుకులే స్వాతి. ఇప్పుడు నేను కట్టుబట్టలతో ఉన్నాను. ఈ ఇంట్లో సామాను రేపో మాపో అప్పుల వాళ్ళు తీసుకుపోతారు. అత్తగారింటికి వెళ్ళబోతున్నాను కానీ అక్కడ నన్ను ఎన్నాళ్ళు ఉండనిస్తుంది ఆవిడ అనేది అనుమానమే. ఇప్పుడు నిజంగానే నాకు ఏదైనా ఉద్యోగం కావాలి. స్కూల్‌, కాలేజి హాస్టల్లో వార్డెన్‌ లాంటిది ఐతే బావుంటుంది. పిల్లల్ని అక్కడే స్కూల్లో చేర్చచ్చు. నాకు వంటపని, విడిగా ఇల్లు నడిపే పని, ఖర్చు రెండూ తప్పుతాయి” అంది నవ్వుతూనే. నవ్వుతూనే ఉండడానికి తన మనసు అంతర్గతంగా ఎంత కసరత్తు చేస్తోందో తనకైనా తెలుసో లేదో అని మనసులో అనుకుంటూ ”నీ మనస్థైర్యానికి మెచ్చుకోవాలి. అసలు నవ్వెలా వస్తోంది నీకు” అన్నాను. ”ఏం చేయమంటావు చెప్పు. కోర్టులో వెయ్యమంటారు కొందరు. IP పెట్టిన వాడి మీద కేసు వేస్తే, ఇంకా కొంచెం డబ్బులు వదలటం తప్ప ప్రయోజనం ఏమి ఉంటుంది? అసలు దానికైనా నా దగ్గర డబ్బేముంది? అప్పు చెయ్యాలి. అప్పు చేసి మరీ కోర్టులో వెయ్యవలసిన అవసరమేముంది. విడాకులు తీసుకోవచ్చు. తీసుకుని ఏం చెయ్యాలి నేను” అంది. ”ఐనా అతను వేరే పెళ్ళి చేసుకునేదాకా నీకు తెలియలేదా” అడిగాను. ”తెలిసింది. అడిగితే నువ్వు ఒప్పుకుంటే నీకే మంచిది. ఒప్పుకోకపోయినా నేను చేసుకునే తీరతానని అన్నాడు. అసలు అతని మనసు ఎప్పుడైతే వేరే వాళ్ళ మీదకి మళ్ళిందో అప్పుడే నేను మానసికంగా విడాకులు తీసుకున్నాను. లీగల్‌గా తీసుకోవలసిన అవసరం నాకేమీ కనిపించడం లేదు. పిల్లలు ఇంకా డిస్టర్బ్‌ అవ్వడం తప్ప వేరే ఫలితం ఏముంటుంది? సో. చెప్పు. ఇంకేమైనా మార్గం ఉందా? ఇంక ఏదీ కాదంటే అన్నీ వదిలేసి హాయిగా పరలోకాలకి వెళ్ళిపోవాలి” అంది.

ఉలిక్కిపడ్డాను. ”దయచేసి ఆ పని మాత్రం చెయ్యకు. అతను పోతే పొయ్యాడు. పిల్లల్ని ఏం చేస్తావ్‌?” ”నా వల్ల వాళ్ళకి ఏం ప్రయోజనం ఉంది చెప్పు” అంది. ”సంపాయిస్తేనేనా ప్రయోజనం ఉండేది? పిచ్చిగా మాట్లాడకు. వాళ్ళు ఒక దారికి రావాలి. నీక్కూడా ఒక జీవితం ఉందని గుర్తించు. అలాంటి పిచ్చి ఆలోచనలు అస్సలు రానీయకు. నీకెప్పుడు ఏం కావాలన్నా మొహమాటపడకుండా అడుగు. నేను చేయగలిగినంతా చేస్తాను. దీనికైనా నేనున్నానని గుర్తుపెట్టుకో” అన్నాను తన చేయి గట్టిగా పట్టుకుని. ”మీరంతా ఉండబట్టే ఈ మాత్రం ధైర్యంగా ఉన్నాను” అని ”సరే రా భోజనం చేద్దాం” అంది. ”బయటకి వెళ్దామా” అన్నాను. ”ఎందుకు రైస్‌ కుక్కర్‌లో రైస్‌ పడేస్తాను. చట్నీ, సాంబార్‌ ఉన్నాయి. అన్నం ఉడికేలోపు కూర చేసేస్తా” అంది. మిగతా స్నేహితుల గురించి, కాలేజీ రోజుల గురించి కబుర్లు చెప్పుకుంటూ వంట, భోజనం కానిచ్చాము. తర్వాత పిల్లాడితో కాసేపు ముచ్చట్లాడి పడుకున్నాము. తెల్లవారి లేచి టిఫిన్‌ చేసేసి, వంట కూడా కానిచ్చేసి వాళ్ళ అత్తగారిని, మామగారిని పలకరించి, ఊళ్ళోనే ఉంటున్న మిగతా స్నేహితులని కలిసి వచ్చి భోజనం చేశాము. బయలుదేరే ముందు ”ఎటువంటి సమయంలోనైనా నీకు నేనున్నానని మర్చిపోకు. ఎటువంటి సహాయం కావాలన్నా అడుగు. మొహమాటపడవద్దు. డబ్బు కావాలన్నా అడుగు. అంత మొహమాటమైతే అప్పుగా అనుకో. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. మంచి రోజులు వచ్చినప్పుడు తీర్చేద్దువులే వడ్డీతో సహా. ఏ మాత్రం నిరాశ అనిపించినా ఒక్క సెకండ్‌ తట్టుకుని నాకు కాల్‌ చెయ్యి” అని తను సరే అంటున్నా పదే పదే చెప్పిందే చెప్పి విసిగించి మరీ బయలుదేరాను.

రాంగానే అమ్మ అడిగింది ”ఎలా ఉందే శిశిర” అని. ”మానసికంగా ఐతే తట్టుకుని నిలబడిందమ్మా. ఆర్ధికంగా ఐతే పరిస్థితి ఏం బాలేదనే చెప్పాలి. ఏదైనా ఉద్యోగం చూడమంది” అని విషయం అంతా చెప్పాను. ”తన అత్తగారు వాళ్ళని కలిసి వచ్చాను. ఆవిడతో కష్టం అనిపించింది. ఆ అబ్బాయి ఈ పనులన్నీ చేయడానికి కారణం శిశిరనే అన్నట్టు మాట్లాడుతోంది. ఇంత చేసిన కొడుకు మంచివాడేనట. మామగారు కొంచెం genuine గానే ఉన్నారు. ఆ అబ్బాయి ఎంత బెదిరించినా ఆస్తులు అమ్మడానికి ఒప్పుకోలేదు. అవన్నీ ఆయన స్వార్జితం. అతను ఛస్తానంటే కూడా ఈయన బెదరలేదు. నీ ఇష్టం. నీ కోసం ముగ్గురిని బలి చేయలేను అని స్పష్టంగా చెప్పేశారు. పిల్లలు బాగా చదువుకుంటున్నారు. అదే ఇప్పుడు తనకు మిగిలిన ధైర్యం” అన్నాను. నాకెందుకో ఆవిడ తనని అక్కడ ఎక్కువ రోజులు ఉండనివ్వదని అనిపించింది. అందుకే వెంటనే ఉద్యోగం ఏదైనా ఉంటే చెప్పమని పరిచయస్తులందరి దగ్గర చెప్పి పెట్టి ఉంచాను. అకడమిక్‌ ఇయర్‌ మధ్యలో ఉండడం వలన వెంటనే చెప్పలేం కానీ, ఏప్రిల్‌, మే లలో ఏమైనా ఖాళీలుంటే చెప్తామని అన్నారు. అదే విషయం తనకి తెలియచేశాను. ఈలోపు ఏమైనా ఇబ్బంది ఐతే సంకోచించకుండా నా దగ్గరికి వచ్చేయమని కూడా చెప్పాను. నేను వచ్చేసిన మర్నాడే అప్పుల వాళ్ళు ఆ సామాన్లన్నీ తీసుకెళ్ళిపోవడం, తను పిల్లలతో సహా అత్తగారింటికి చేరడం జరిగిపోయాయట. కొన్నాళ్ళు గడిచాక ఒక రోజు శిశిర తనే ఫోన్‌ చేసింది. ”నా స్నేహితురాలు ఒకావిడకి ఆధ్యాత్మికత ఎక్కువ. ఆవిడ ద్వారా ఆశ్రమాల గురించి విన్నాను. అక్కడ చేరితే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. ఒకరోజు వీథిలో వెళ్తుంటే అనుకోకుండా ఒక ఆశ్రమానికి సంబంధించిన బోర్డు కనపడింది. అందులో ఉన్న కాంటాక్ట్‌ నంబర్‌ చూసి మాట్లాడాను. వాళ్ళు రమ్మన్నారు. అడ్మినిస్ట్రేషన్‌ సైడ్‌ ఉద్యోగం ఉందట. ఐతే జీతం ఏమంత ఎక్కువ ఉండదు. ముందు కామన్‌ రూమ్‌ అలాట్‌ చేస్తామన్నారు. కొద్ది రోజులు పోయాక విడిగా రూమ్‌ ఇస్తారట. పిల్లలకి బడి కూడా అక్కడే ఉంది. పదో తరగతి వరకు దిగులు లేదు. ఫీజు కూడా ఏమీ కట్టనక్కరలేదు. బాగా చదువుకుంటే అమ్మాయిలనైతే ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివిస్తారట. చదువు, భోజనం గడిచిపోతే నాకు వచ్చే కొద్దిపాటి జీతంతో ఇతర నిత్యావసరాలు తీరిపోతాయి కదా. మే దాకా అంటే కష్టం అయ్యేటట్టు ఉంది. ముందు నేనెళ్ళి చేరిపోతే, బావుంది అనిపిస్తే జూన్‌లో పిల్లలని తీసుకువెళ్ళాలి అని ఆలోచన” ఏకబిగిన చెప్పి ”ముందు నేను ఒకసారి వెళ్ళి చూసి రావాలి అనుకుంటున్నాను. ఆ ఆశ్రమం మీ ఊరికి దగ్గరే. నిన్ను తోడు రమ్మని అడుగుదామని కాల్‌ చేశాను” అంది. ”దాందేముంది, తప్పకుండా వస్తాను. ఇక్కడికి వచ్చేయి. ఇక్కడినుంచి ఒక గంట ప్రయాణమే. నా బండిలో వెళ్ళేసి వద్దాము” అన్నాను. అనుకున్నట్టుగానే తను రాగానే ఇద్దరం కలిసి వెళ్ళాము ఆశ్రమానికి. చాలా ప్రశాంతంగా ఉందనిపించింది. అన్నీ మాట్లాడుకున్నాక శిశిర చేరాలి అని నిర్ణయించుకుని వాళ్ళకి చెప్పేసింది కూడా. ఇంటికి వెళ్ళి తన బట్టలవీ సర్దుకుని రెండో రోజుకల్లా తిరిగి వచ్చి చేరిపోయింది. అప్పుడప్పుడు ఫోన్‌లో, ఎప్పుడైనా కలిసి మాట్లాడుకుంటూ ఉండటం మానలేదు మేము. ”హాయిగా ఉంది స్వాతీ. ఏ బాదరబందీ లేదు. సమయానికి గంట కొట్టి పిలిచి మరీ భోజనం పెడతారు. స్వచ్ఛమైన వాతావరణం, ఆరోగ్యకరమైన, రుచికరమైన భోజనం, సత్సంగాలు, ఇంకేం కావాలి చెప్పు జీవితానికి. మనుష్యుల తత్వాలంటావా, ఎక్కడైనా ఒక్కటే కదా. అన్ని రకాల వాళ్ళు ఉంటారు. కాకపోతే ఇక్కడెవరూ మన జోలికి రారు. ఇబ్బంది పెట్టరు. హాయిగా ఉంది. ఇంటికన్నా ఆశ్రమమే నయం అనిపిస్తోంది. నా గది వరకు శుభ్రంగా పెట్టుకుని, ఆఫీస్‌ పని సక్రమంగా చేసుకుంటే రోజు గడిచిపోతుంది. ఓపిక ఉందా, ఇంకేమైనా చేసే శక్తి ఉందా, చెయ్యడానికి ఎన్నో పనులు. ప్రాణానికి సుఖంగా ఉంది” అని నవ్వుతుండేది, రోజులు అలా గడిచిపోతున్నాయని. తనకి అక్కడ బాగా అలవాటు అయిపోయింది. కొత్త అకడమిక్‌ ఇయర్‌ ప్రారంభం కాగానే పిల్లల్ని తీసుకువచ్చేసి చేర్చింది. వాళ్ళు పక్కనే ఉన్న పిల్లల హాస్టల్‌లో ఉండేవారు. ఏది ఏమైనా, రోజూ పిల్లలని చూసుకోవడం, వాళ్ళేం చదువుతున్నారో గమనించుకోవటం, ముగ్గురూ ఒకేచోట ఉన్నామనే సంతృప్తితో, ఏ గొడవలు లేని ప్రశాంతతతో కాలం గడిచిపోయేది. ఒక ఆదివారం చూసి వద్దామని వెళ్ళినప్పుడు వచ్చింది తన శ్రీవారి ప్రస్తావన. ఎక్కడో వేరే రాష్ట్రంలో ఉద్యోగం చేసుకుంటున్నాడట. బాగానే సంపాదిస్తున్నాడట. కానీ ఏం లాభం. పైసా పంపితే కదా. పిల్లలున్నారు, వాళ్ళు ఎలా బతుకుతున్నారో అనే ఇంగితం లేదు మనిషికి అనిపించింది. అంత

ఉండేవాడైతే అసలు ఇంతవరకు ఎందుకు వస్తుంది అని కూడా అనిపించింది. రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయికి కూతురు పుట్టింది. చేస్తున్న ఉద్యోగం మాన్పించాడు. ఆ తర్వాత వాళ్ళని గాలికి వదిలేశాడు. వేధించి, వేధించి చంపుతుంటే పడలేక, సరైన ఆసరా లేకపోయినా ఫర్లేదు అనుకుని ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ శిశిరని, పిల్లలని అక్కడికి వచ్చి తనతో ఉండమంటున్నాడట. సెలవుల్లో పిల్లలని పంపమని గొడవ పెట్టి, వాళ్ళని మాలిమి చేసుకోవడానికి విచ్చలవిడిగా డబ్బు ఖర్చుపెట్టి తిప్పడం అవీ చేస్తున్నాడట. ఆ డబ్బుతో ముందు అప్పులు తీర్చెయ్యొచ్చు కదా అంటోందని శిశిర మీద కోపం. ”ఎలా నమ్మను స్వాతి? ఉన్న ఈ చిన్న ఆధారం కూడా పోగొట్టుకుని అతన్ని నమ్ముకుని ఊరు కాని ఊరు వెళ్ళి, అసలు ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఇక్కడైతే ఏదో మీలాంటి వాళ్ళంతా ఉన్నారు. మరీ తప్పదంటే మామగారు ఉన్నారనే ధైర్యం ఉంది. అక్కడా నట్టేట్లో వదిలేస్తే నా గతేమి కాను. అందుకే నిష్కర్షగా రాను అని చెప్పేశాను” అంది. ”మంచి పని చేశావు” అని మెచ్చుకున్నాను. ”ఇప్పుడు ఆ అమ్మాయి కూడా లేదు కదా. ఎవరో ఒకరు కావాలి, అవసరాలు తీర్చి తిమ్మిరి తగ్గించడానికి” కసిగా అంది. అసలు కోపమే తెలియని తను అంత పరుషంగా మాట్లాడుతుంటే అలాగే చూస్తూ ఉన్నాను. ”ఇంకా ఏమన్నాడో తెలుసా? ఇక్కడ నేనెవరినో మరిగి ఉంటానట. ఈ ఆశ్రమంలో బ్రహ్మచారులు, సన్యాసులు తప్ప ఎవరుంటారు అంటే, ఈ కాలంలో ఆశ్రమాల గురించి ఎవరికి తెలియదులే అంటూ ఏదేదో వాగాడు. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనబడుతుందట”. ఎదురుగా కనుక ఆ మనిషి ఉంటే ముక్కలు ముక్కలుగా నరికేసి ఉండేదాన్నేమో అనిపించింది నాకు. ”మంచి ఐడియా ఇచ్చాడు. ఎవరైనా దొరికితే హాయిగా సెటిల్‌ అయిపో” ఈసారి నేను కసిగా అన్నాను. నవ్వేసి ”అదొక్కటే తక్కువ ఇప్పుడు నాకు” అంది. తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళ మామగారు ”పాప పదో తరగతికి వస్తోంది కదా. ఇక్కడ బడి కూడా ఏమంత బాగోలేదు. నేను తీసుకువెళ్ళి చదివిస్తాను” అనడం మొదలుపెట్టాడట. ఆయన కూడా మంచి లెక్చరర్‌. ఇక్కడ బడి అంత బాలేని మాట కూడా నిజమే. ఆలోచించి చివరికి పంపాలనే నిశ్చయించుకుంది.

పిల్ల వెళ్ళిన కొన్నాళ్ళకి మామగారు వీళ్ళని కూడా రమ్మనడం మొదలుపెట్టారు. అప్పటికి చిన్న చిన్న అప్పులు చాలావరకు తీర్చేశారు. శిశిర కూడా తనకొచ్చే కొద్దిపాటి జీతంతోను, బంగారం, వెండి అన్నీ అమ్మేసి తనని చూసి అప్పులిచ్చిన వాళ్ళ బాకీల వరకు తీర్చేసింది. తన ముఖం చూసి డబ్బులిచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనేది తన ఉద్దేశ్యం. మామూలుగానే తను చాలా సామాన్యమైన జీవితం గడపడానికి ఇష్టపడేది. ఇంక ఇప్పుడైతే కనీస అవసరాలు తప్ప ఇంకేవి అక్కరలేదన్నట్టు గడుపుతూ తనని నమ్మి సహాయం చేసినవాళ్ళ దగ్గర మాట రాకుండా కాపాడుకుంది. చీరలు, నగలు, ఇంకా అనేక రకాలైన గొప్పలకు పోవటం లాంటి వాటితో వేధించకుండా, ఉన్నంతలో హాయిగా బతికే శిశిరలాంటి బంగారాన్ని ఇలాంటి స్థితికి తెచ్చిన ఆ పనికిమాలిన వాడిని ఎన్నిసార్లు తిట్టుకునేదాన్నో! ”మీ అత్తయ్యకి కూడా బావుండటం లేదు. నువ్వొస్తే సహాయంగా ఉంటుంది” అని మామగారు పదే పదే అంటుంటే పెద్దవారని ఆయన మాట కాదనలేక ఒక శుభముహూర్తాన శిశిర మళ్ళీ ఇంటిదారి పట్టింది. లోపల మాత్రం ఆవిడ ఎంతకాలం

ఉండనిస్తుందో అనే అనుమానం పట్టి పీడిస్తూనే ఉంది తనకి. నేను ఎప్పటిలానే ఫోన్‌ చేసి క్షేమ సమాచారాలు కనుక్కుంటూ ఉండేదాన్ని. ఆ క్రమంలోనే ఒకరోజు ఫోన్‌ చేస్తే ఎత్తలేదు. ఏదో పనిలో ఉండి ఉంటుందిలే అనుకుని వదిలేసి మరుసటి రోజు చేసినా ఎత్తలేదు. అంతకుముందు ఒకసారి కలిసినపుడు తను చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ”ఏదో మీలాంటి వాళ్ళతో మాట్లాడాలి అని డబ్బా ఫోన్‌ ఐనా ఇది పెట్టుకుంటే, మాట మాటకి ఇతను ఫోన్‌ చేసి విసిగిస్తున్నాడు. పోనీ మాట్లాడితే ఏదైనా ఒక పరిష్కారం ఉంటుందా అంటే ఏమీ

ఉండదు. ఎంతసేపు చెప్పిందే చెప్పి… గొడవ పడిందే పడి… విసుగొచ్చేస్తోంది. ఈ ఫోన్‌ తీసి గోతిలో కొట్టాలనిపిస్తోంది”. కొంపతీసి ఆ పని కానీ చేయలేదు కదా అనుకుని, తనతో చనువుగా ఉండే ఒక లాయర్‌ స్నేహితురాలికి ఫోన్‌ చేశాను. ”మొన్న రాత్రి వాళ్ళ అత్తగారు ఇంట్లోంచి తరిమేసింది స్వాతీ. ఆ రాత్రివేళ పిల్లాడ్ని తీసుకుని ఒక్కతీ బయటకు వచ్చేసింది. మామగారు అడ్డుకోబోతే, మామ కోడళ్ళ గురించి నీచంగా మాట్లాడిందట ఆవిడ. ఇంక పాపం ఆ పెద్దాయన ఏమీ చెయ్యలేక సైలెంట్‌ అయిపోయారు. తనతో కలిసి చదువుకున్న వాడు, స్నేహితుడు అయిన వసంత్‌ ఆ సమయానికి అటుగా వెళ్ళడం వలన చూసి విషయం తెలుసుకుని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. శిశిర కొద్దికాలంగా ఒక ప్రభుత్వ కార్యాలయంలో కాంట్రాక్ట్‌ ఉద్యోగం చేస్తోందని తెలుసు కదా. మరుసటి రోజు సాయంత్రం మామగారు వచ్చి పిల్లాడిని తీసుకువెళ్ళారట. నిజానికి పిల్లల్ని కూడా అక్కడ వదలటం శిశిరకి ఇష్టంలేదు. కానీ గత్యంతరం లేదు కదా. తనకొచ్చే కొద్దిపాటి జీతంతో తాను నెట్టుకురావడమే కష్టం. ఇంక పిల్లల్ని ఏమి పెట్టుకుంటుంది. తను వర్కింగ్‌ ఉమెన్స్‌లో చేరిపోయింది. ముందు నుంచి తను సింపుల్‌గా ఉండడమే ఇష్టపడడం ఇప్పుడు ఉపయోగపడుతోంది. కొద్దిపాటి జీతం అయినా హాయిగా గడిచిపోతోంది. కొంచెం ఆడంబరం ఇష్టపడే వాళ్ళకయితే ఇబ్బందే. ఈ గొడవలో పడి ఫోన్‌ ఎత్తడానికి కుదరలేదో లేక విసుగొచ్చి పక్కన పడేసిందో మరి” ఏకధాటిగా చెప్పుకొచ్చింది. ”ఏంటసలు వీళ్ళు? తనని మరీ బంతి ఆడుకున్నట్టు ఆడుకుంటున్నారు? అసలు ఒక మనిషిలాగానే గుర్తించడం లేదే? ఆవిడ ఎందుకు అలా చేస్తోంది? కోడలు అనేది పక్కన పెట్టినా కనీసం సాటి ఆడది అని కూడా చూడదా? అసలు మనసే లేదా ఆ మనుష్యులకి” నా ఆక్రోశాన్నంతా వెళ్ళగక్కుతూ ఉండగానే శిశిర నుంచి కాల్‌ వస్తున్నట్లు సిగ్నల్‌ చూసి ”సరే ఉంటాను శిశిర ఫోన్‌ చేస్తోంది” అని థాంక్స్‌ చెప్పి కట్‌ చేశాను. వెంటనే శిశిరకి కాల్‌ చేశాను. ఫోన్‌ తీసి విషయం చెప్పడం మొదలుపెట్టంగానే ”నువ్వు రెండు రోజులుగా ఫోన్‌ ఎత్తకపోతే, నీ లాయర్‌ స్నేహితురాలికి కాల్‌ చేశాను. అన్ని విషయాలు చెప్పింది. భలే మనుష్యుల్లా ఉన్నారు. సరే… సరే… వాళ్ళని మళ్ళీ తీరుబడిగా తిట్టుకుందాం కానీ, నీకు అక్కడ ఎలా ఉంది? సౌకర్యంగా ఉందా?” అని అడిగాను. ”బానే ఉంది” అంది. ”ఇప్పుడే మామయ్య ఫోన్‌ చేశారు. పిల్లల చదువు బాధ్యత నేను తీసుకుంటాను. దిగులు పడద్దు అంటున్నారు. నేనొక్కదాన్నే ఐతే ఎక్కడైనా వెళ్ళిపోతుంది. పిల్లల చదువులు ఒక దారికొస్తే చాలు” అంది. ”నిజమే కదా. సరే మరి. జాగ్రత్త. ఇంకా ఏమీ దారిలేదు అనిపించినా సరే, అటువంటి సమయంలో కూడా ఉపయోగపడతానా లేదా అని ఆలోచించకుండా, విపరీతమైన ఆలోచనలు చేయకుండా నాకు ఫోన్‌ చెయ్యి. నేనున్నానని మర్చిపోకు” ఎప్పటిలానే చెప్పి ఇంకా కొంచెంసేపు మామూలు విషయాలు మాట్లాడి పెట్టేశాను.

ఇలాంటి సమయాల్లో ఒకే ఊళ్ళో ఉంటే బావుండేది అని ఎన్నిసార్లు అనుకుని ఉంటానో. ఈ సంఘటన తర్వాత, నేను నా పిల్లల చదువుల కోసం ఇంకా దూరానికి బదిలీ చేయించుకుని రావలసి వచ్చింది. తన విషయాలు మాత్రం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే

ఉంటాను. ఆ కాంట్రాక్టు ఉద్యోగంలో ఎన్నో ఒడిదుడుకులు, భర్త నుంచి విసిగించే ఫోన్లు, అతని దగ్గరికి వెళ్ళి ఉండమని అత్తా మామల నుంచి కూడా వత్తిడి, నలభైల్లో వచ్చే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు… వీటన్నింటి మధ్య తనకున్న ఒకే ఒక ఊరట పిల్లలు బాగా చదువుకోవటం, తనని అర్ధం చేసుకొని బాధ్యతగా ఉండటం. చిన్నతనంలోలా కాకుండా, జరిగిన విషయాలన్నీ అర్థమై వాళ్ళ నాన్న పిలిచినా వెళ్ళడం మానేశారు కూడా. అంత చిన్న వయసులో అంత బాధ్యతగా ఉన్న ఆ పిల్లలని చూస్తే ముచ్చటేసేది. శిశిరకి ఆశ్రమంలో ఉన్నప్పుడు అలవాటైన సత్సంగాలు ఇప్పటికీ వీలు కుదిరినప్పుడల్లా కొనసాగిస్తోంది. ఈ మధ్యే ఆ బృంద సభ్యులతో కలిసి నేనున్న ఊరిలో జరిగే ఒక సమావేశానికి వస్తున్నట్లు చెప్పింది. సమావేశం ముగియగానే వెళ్ళి తనని ఇంటికి తీసుకుని వచ్చాను. తన కూతురిని కూడా ఇంట్లో నుంచి పంపేశారని ఇటీవలే ఫోన్‌లో చెప్పింది. ఆ పాప కూడా శిశిరతో పాటు హాస్టల్లో ఉంటోంది. అంతకంటే షాకింగ్‌ విషయమేంటంటే ఇప్పుడు తన కూతురికి పెళ్ళి చేసేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఇది విన్నాక ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి ఇక్కడికి పంపేయటమే మేలని అనిపించింది. ”ఇంటర్‌ చదువుతున్న పిల్లకి పెళ్ళేంటి?” అరిచాను. ”నామీద అరిస్తే ఏం లాభం? నేనా చేస్తాననేది” అంది కూల్‌గా. ”నేను వసంత్‌తో స్నేహంగా ఉంటున్నా కదా. అందువలన చెడ్డ పేరొచ్చి దానికి పెళ్ళి కాదట, ఇప్పుడేదో అతని వలన మంచిపేరు దశదిశలా మార్మోగుతున్నట్టు. చెయ్యవలసిందంతా చేసేసి ఇప్పుడు కొత్తగా వచ్చే చెడ్డ పేరేంటో. వసంత్‌ నా బాల్య స్నేహితుడు. పెళ్ళి చేసుకుని భార్యాపిల్లల్ని చక్కగా పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు. వీళ్ళలా గాలికి వదిలేయలేదు. నన్ను ఏదో ఒకటి అంటూ

ఉంటేనే వాళ్ళకి ఆనందం, కానీ ఆపదలో ఉన్నానని ఆదుకుంటే, అతని మీదే నింద వెయ్యటం చూస్తే అసహ్యం వేస్తోంది. అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తినానివ్వదులా ఉంది వాళ్ళ పద్ధతి. వసంత్‌ భార్య కూడా చాలా మంచిది. వాళ్ళు ఇవేం పట్టించుకోకపోయినా, నా వలన అతనికి ఇబ్బంది అని బాధగా ఉంది” అంది. ”అతనికి అన్నీ తెలుసు. అర్ధం చేసుకోగలడు కదా. లేనిపోని ఆలోచనలు పెట్టుకుని అతను ఏమనుకుంటాడో అని ఆ కుటుంబంతో స్నేహాన్ని దూరం చేసుకోకు” ఒక ఉచిత సలహా పారేశాను. ”ఆ పిచ్చి పనేం చెయ్యను. అంతేకాదు. నా కూతురికి భరోసా కూడా ఇచ్చేశాను. ఇప్పుడైతే వాళ్ళ తాతగారు చదివిస్తున్నారు. ఇంటర్‌ అవ్వంగానే పెళ్ళి చేయాలని చదివించడానికి వెనకడుగు వేస్తే, మీలాంటి వాళ్ళ సహాయం తీసుకుని, నేను చదివిస్తాను కానీ పెళ్ళి మాత్రం ఇప్పుడే చెయ్యను” దృఢంగా చెప్పింది. ”అవును బాగా చదువుతోంది కదా. డిగ్రీ ఏంటి? ఇంజనీరింగ్‌ ఎందుకు వద్దనుకుంటున్నావు” ప్రశ్నించాను. ఇప్పుడు ఎవరు చూసినా ఇంజనీరింగే కదా. దానికి ఒక విలువంటూ లేకుండా పోయింది. చాలా మంచి కాలేజిలో వస్తే కానీ ఉపయోగం ఉండదు. అంత పెట్టి చదివించే స్థోమత కూడా నాకు లేదు. డిగ్రీ అవ్వంగానే పోటీ పరీక్షలు బోలెడు పడతాయి కదా. వాటిల్లో మంచి దాంట్లో ఏదైనా తెచ్చుకోగలిగితే, ఇంక అంతకంటే కావలసింది ఏముంటుంది చెప్పు. ఈ ఇంజనీరింగ్‌ చదవడానికి పడే కష్టం, అక్కడ పడితే చక్కగా స్థిరపడవచ్చనేది నా ఉద్దేశ్యం. ఏమంటావ్‌?” అంది. నాకూ నిజమే అనిపించింది. తనేమంటోంది అని అడిగా. ”దానికి కూడా అదే ఆలోచన. తొందరగా ఒక మంచి ఉద్యోగం తెచ్చుకుని నువ్వు, నేను ఒక మంచి ఇల్లు తీసుకుని వెళ్ళిపోదామమ్మా. తమ్ముడిని కూడా మన దగ్గరికి తెచ్చేసుకుందాం అంటూ ఉంటుంది” అంది. ”కనీసం పిల్లలైనా సరైన మార్గంలో ఆలోచించడం సంతోషించవలసిన విషయం కదా” అన్నాను. ”ఇంకో విషయం. చాలా సంవత్సరాల పోరాట ఫలితంగా, నా ఉద్యోగం కూడా రెగ్యులరైజ్‌ అయ్యేలా ఉంది” అంది. ”ఇంత మంచి వార్త ఇంత ఆలస్యంగానే చెప్పేది?” అంటూ గోల పెడుతున్నా వినకుండా స్వీట్‌ తెచ్చి నోట్లో కుక్కేశాను. ”మొత్తమ్మీద నెగ్గుకొచ్చావు శిశిరా. నువ్వు, నీ కూతురు కోరుకుంటున్న ప్రశాంతమైన జీవితం త్వరలోనే మీ చేతిలోకి వస్తుంది. ఎంత భయపడేదాన్నో తెలుసా? ఏ నిమిషంలో, ఏ బలహీన క్షణాన నువ్వు డిప్రెస్‌ ఐపోతావో అని” అన్నాను. ”ఆ రాత్రి ఇంట్లోంచి గెంటేసినప్పుడు మాత్రం ఎందుకు ఈ బతుకు అనిపించింది స్వాతీ. వెనకాల గనుక నా కొడుకు లేకపోయి ఉంటే ఏమి చేసి ఉండేదాన్నో?” అంది సాలోచనగా. ”సర్లే సర్లే! దేవుడి దయ వలన ఆ గండాలన్నీ దాటుకుని వచ్చేశావు. నువ్వు కాబట్టి మాత్రమే ఆ పరిస్థితులన్నీ ఓర్పుతో, సహనంతో నెట్టుకు వచ్చావు. సింపుల్‌గా జీవించలేనివాళ్ళు, తమమీద తమకి కంట్రోల్‌ లేనివాళ్ళు ఐతే ఇంత దూరం రాగలిగేవాళ్ళు కాదు. నీ మనస్థైర్యానికి తల వంచాల్సిందే శిశిరా. దేవుడిచ్చిన ఈ జీవితం ఎంత విలువైనది అని గుర్తించగలిగితే చాలు. అన్నీ సమకూర్చి పెడుతున్న తల్లిదండ్రులు, సౌకర్యవంతమైన జీవితం ఉండి కూడా, ఒక్క మార్క్‌ తగ్గిందనో, బాయ్‌ ఫ్రెండ్‌ లేదా గర్ల్‌ ఫ్రెండ్‌ పలకలేదనో, అమ్మో, గురువో ఒక చిన్న మాట అన్నారనో ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించే ఈ కాలం పిల్లలకి నీ జీవిత కథని పాఠ్య పుస్తకంగా పెట్టాలి” అన్నాను. ”అన్నీ తలవంచి భరించడం తప్ప పాఠ్యాంశంగా పెట్టుకునేంత పోరాటం ఏం చేశాను స్వాతీ? పోరాటం ఇప్పుడు మొదలుపెడదామనుకుంటున్నాను. నా వైపు చుట్టాలు, స్నేహితుల సహకారంతో ఆ ఇంట్లో నా పిల్లల స్థానం కోసం పోరాడదలచుకున్నాను. ఇలా అన్నిటికీ తల వంచి జీవితం ఎలా పోతే అలా పోనీలే అని ఉండడం వదిలేసి, వాళ్ళు తరిమినప్పుడల్లా పరుగు పెట్టడం ఆపేసి అక్కడే ఉండి నా హక్కుల కోసం పోరాట బాట పడదామని నిర్ణయించుకున్నా. అంతేకాదు, విడాకులు కూడా తీసుకుందామని అనుకుంటున్నాను” దృఢంగా చెప్తోంది. ”అక్కడికి వెళ్ళి ఉండి విడాకులు ఇస్తావా?” అన్నాను. ”అవును! అక్కడికి వెళ్ళడం పిల్లల కోసం, విడాకులు నా కోసం” అంతే స్థిరంగా అంటూ ”వయసు మళ్ళాకా? అని నువ్వు నవ్వినా సరే” అంటూ ఆగింది. ”ఛ! ఎందుకు నవ్వుతాను శిశిరా? ఇప్పటికైనా విడాకులు తీసుకుంటే అతని నుంచి వేధింపులకు ఒక పరిష్కారం దొరుకుతుందని నువ్వు అర్ధం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. సమయం అనుకూలించనప్పుడు ఓర్పుతో నిలబడి పరిస్థితులకు తలవంచుతూనే, సమయం వచ్చినప్పుడు ఎలా పోరాడాలో నిన్ను చూసే నేర్చుకోవాలి అని ఇప్పుడు చెప్తాను. నీ జీవన గమనం ఎందరికో స్ఫూర్తి కావాలి” మనస్ఫూర్తిగా అభినందిస్తూ, తన అభీష్టం ఏదైనా నెరవేర్చుకోగలిగే శక్తి తనకి రావాలని ఆశిస్తూ ఆత్మీయంగా హత్తుకున్నాను.

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

2 Responses to చిగురించిన శిశిరం -ఆకెళ్ళ భవాని

  1. Uday kiran says:

    చాలా బావుంది. బట్ పద సాహిత్యం ఇంకా భావవ్యక్తీకరణ. కుధారాలి.ok story is good

  2. Phani tej says:

    Chaalaa baagaa raasaaru madam…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో