సంపాదకీయం రాద్దామని కూర్చున్నప్పుడు నా మనస్సు అల్లకల్లోలంగా ఉంది. కళ్ళలోంచి ఆగకుండా కన్నీళ్ళు ఉబికి వస్తున్నాయి. ఎన్నడూ ఎరగని ఓ భయం నన్ను ఆవహించింది. గుండె రగులుతున్న కొలిమిలా ఉంది. రాత్రంతా నిద్రలేక కళ్ళు ఎర్రబడి మండుతున్నాయి. కళ్ళు మూసిన కాసేపటిలోను పీడకలలు… విధ్వంస దృశ్యాలు. గాజుకళ్ళ తల్లులు బారులు కట్టి కన్నీరు మున్నీరవుతున్న విషాద దృశ్యాలు. ఎటు పోతున్నాం? మనమేం చేస్తున్నాం? మానవ సంబంధాలెందుకు ఇంతగా దిగజారిపోతున్నాయి? మనుష్యులుగా కాక మరబొమ్మల్లా ఎందుకు తయారవుతున్నాం? మార్కెట్‌ను ముంచెత్తుతున్న వస్తు సముదాయం ముందు మమతలు, మానవీయతలెందుకు వంగి వంగి సలామ్‌లు చేస్తున్నాయి? నా ఈ ఆవేదనకి, అంతరంగ సంఘర్షణకి కారణాలు మీతో పంచుకుంటేనే కానీ నా గుండె భారం తగ్గేట్టు లేదు.
నిన్నటిరోజు ‘భూమిక హెల్ప్‌లైన్’కి వచ్చిన కాల్స్‌లో అధిక శాతం అమ్మల నుండే రావడం, ఒక్కో తల్లి తన హృదయ విదారక గాథను విన్పించడం నన్ను తీవ్ర మనస్థాపానికి గురి చేసింది. ఓ వార్తా పత్రిక ఆదివారం మ్యాగజైన్‌లో హెల్ప్‌లైన్ గురించి ఓ కథనం ప్రచురించి, మీ సమస్యలు మాతో పంచుకోండి, మీకు కావలసిన సలహా, సమాచారం, కౌన్సిలింగ్ ఇస్తాము అని మేము ఆ కథనంలో చెప్పడంతో ఉదయం నుంచి అర్థరాత్రి వరకు కాల్స్ వెల్లువెత్తాయి. వందలాది స్త్రీల దుఃఖ గాధలు కౌన్సిలర్‌ల చెవుల్లో పోటెత్తాయి. ఎన్నెన్నో సమస్యలు, పరాష్కారం కోసం ఎదురుచూపులు, తమ కష్టాన్ని పరిష్కరించడం తర్వాత సంగతి, కనీసం వినేవాళ్ళు, అర్థం చేసుకునే
వాళ్ళు లేక అల్లాడుతున్న నేపథ్యాలు, హింసాయుత జీవితాలు.
ఇంతకాలం గృహ హింస అంటే భార్యల్ని హింసిస్తున్న భర్తల విషయమే ఎక్కువ మాట్లాడుతున్నాం. భార్యా భర్తల సంబంధంలోని అసమానత్వం, పురుషాధిక్య భావజాలం మహిళల ముఖ్యంగా భార్యల జీవితాలను ఎంత సంక్షోభమయంగా చేస్తున్నాయో మనం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ వందల సంఖ్యలో స్త్రీలు గృహ హింసకు బలవుతున్నారు. ఈ హింసకు చాలావరకు కారణాలు మనకు కూడా తెలుసు. నిరక్షరాస్యత, ఆర్థిక పరాధీనత, పితృస్వామ్య భావజాలంతో పాటు మార్కెట్ ఎకానమీ – వస్తు వినిమయ సంస్కృతి కూడా చాలావరకు కారణాలే. హింసిస్తున్న భర్తను తిరిగి తన్నగల సత్తా ఉన్న మహిళ కూడా పురుషాధిక్య భావజాలం నరనరాన నూరిపోయడం వల్ల నిస్సహాయంగా హింసను భరిస్తుంటుంది. కిరోసిన్ పోసి నిప్పంటిస్తున్నా తిరగబడక మౌనంగా ప్రాణాలు విడుస్తుంది. ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా తిరగబడనీయకుండా అణిచి ఉంచుతున్న పురుషాధిక్య భావజాలం ఎంతగా మనలో ఇంకిపోయి ఉందో, దీన్ని ఒదిలించుకోవాలంటే ఎంత పోరాటం చేయాలో, స్త్రీల ఉద్యమం ఈ దిశగా ఎంత కృషి చెయ్యాలో స్పష్టంగా అర్థమవుతోంది.
అయితే కుటుంబ హింసకి గురవుతున్న భార్యల సరసన తల్లులు కూడా చేరడం నాకు తీవ్ర దుఃఖాన్ని కలిగిస్తోంది. జన్మనిచ్చిన తల్లిని, లాలి పాడి నిద్రపుచ్చిన తల్లిని, రక్తాన్ని పంచిచ్చి, గోరు ముద్దలు తినిపించిన తల్లిని హింసించే కొడుకుల క్రూరత్వం నన్ను వణికిస్తోంది. నిన్నటిరోజు హెల్ప్‌లైన్‌కి ఫోన్ చేసి తమ దుఃఖాన్ని, తమ బాధను పంచుకున్నన ఈ వృద్ధ మహిళల ఆవేదన ఎవరిచేతైనా కంట తడి పెట్టిస్తుంది.
ఓ తల్లికి ఎనభై సంవత్సరాలు. ఈ వయస్సులో కూడా కొడుక్కి ఒండి పెట్టాలి, వాడికి నచ్చినట్లు ఒండాలి, లేకపోతే కొడతాడు. కంచాలు విసిరేస్తాడు. ఇల్లు పీకి పందిరేసినట్టు రెచ్చిపోయి నోటికొచ్చిన తిట్లతో హింసిస్తాడు. వాడు సాదాసీదావాడు కాదు. కవిత్వాలు రాస్తాడు. నాటకాలేస్తాడు. మాతృత్వం మీద కవితలు రాసి బహుమతులు కొట్టేస్తాడు. ఇంటికొచ్చి ముసలి తల్లిని కొడతాడు.
ఇంకొక కొడుకు తల్లిని చంపేస్తానని బెదిరిస్తాడు. ఉద్యోగ విరమణ చేయగానే వచ్చే డబ్బంతా తనకివ్వకపోతే చంపేస్తానని రోజూ బెదిరిస్తాడు. ఆ డబ్బుతో కారు కొనుక్కోవాలని ఆ కొడుకు దురాశ.
నువ్వు చచ్చిపోతే నాకు ఉద్యోగం వస్తుంది. ఇంకా బతికి ఎవర్ని ఉద్ధరించాలి. గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే కష్టం. నువ్వు చస్తే నీ ఉద్యోగం నాకొస్తుంది కదా! కన్న కొడుకు కోసం ఆ మాత్రం త్యాగం చెయ్యాలేవా అంటూ రోజూ ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసే కొడుకు. ఎన్నని రాయను. ఎన్ని గుండె ఘోషల్ని మీకు వినిపించను. మాతృదేవోభవ అని మనం గప్పాలు కొట్టుకుంటాం కదా! అమ్మంటే దేవత, అమ్మంటే అమృతమూర్తి అంటూ కవిత్వాలు ఒలకపోస్తాం కదా! వాస్తవంలో జరుగుతున్నదేంటి? వస్తు సముదాయం ముందు ప్రాణం గడ్డిపరకేనా? డబ్బు, బంగారం, ఆస్తులు, కార్లు, బంగళాలతో పాటు గజ్జి కురుపుల్లా పుట్టుకొచ్చిన మహా మాల్స్‌లోని మహా చెత్త ముందు మనిషి ప్రాణం చవకేనా? ఎనభై ఏళ్ళ పండు ముసలి తల్లి మీద చేతులెత్తే ఈ భయానక సంస్కృతికి మందెక్కడుంది? కళ్ళని జిగేల్‌మన్పిస్తున్న కార్పొరేట్ క్రూరత్వాన్ని అడ్డుకునేదెలా; కుప్పకూలుతున్న మానవ సంబంధాల విధ్వంస దృశ్యం మనలో మంటల్ని సృష్టించకపోతే మనమూ అందులో భాగస్వామ్యులమయ్యే ప్రమాదం మరెంతో దూరంలో లేదు.