నీరు పల్లమెరగదా…! -పి. ప్రశాంతి

ట్విట్టూ… ట్విట్టూ… కిష్‌ కిష్‌ కిష్‌ కీష్‌… కిచకిచ… కిచకిచ… కుహూ… కుహూ… తెరచి ఉంచిన కిటికిలోంచి వినిపిస్తున్న పిట్టల సామూహిక గానానికి ఒక్కసారిగా మెలుకువ వచ్చింది శాంతికి. రాత్రి పడిన వర్షానికి వాతావరణం చల్లబడ్డంతో రోహిణీ కార్తిలోనూ ఏసి అవసరం అనిపించక కిటికీలు తెరిచేసి ఫ్యాన్‌ మాత్రం వేసుకుని పడుకోవడంతో తెలతెలవారుతుండగానే పిట్టలన్నీ గుంపుగా చేరి కిల కిల రావాలతో ప్రేమగా తనని లేపుతున్నట్లనిపించింది. ఠక్కున లేచి కిటికి దగ్గర చేరింది. చల్లటి గాలి ముఖాన్ని తాకుతుంటే ఎంతో ఆహ్లాదంగా అనిపించింది. అపార్ట్‌మెంట్‌ చుట్టూ కాంపౌండ్‌ లోపల పూల మొక్కలతో పాటు జామ, సీతాఫలం, వేప, పంపరపనస, సువర్ణ గన్నేరు లాంటి చెట్లు కూడా పెంచడంతో అపడప్పుడూ అయినా ఇలా పిట్టల పాటలు వినే అవకాశం దక్కుతోందని సంతోషపడింది.

శ్రద్ధగా వింటూంటే ఆ పిట్టల పాటల్లో అలజడి వినిపించింది. అంతలోనే చుట్టు పక్కలెక్కడో చెట్లు అల్లాడు తున్నట్లనిపించింది. ఈదురు గాలి లేదు మరి ఈ శబ్దాలేంటి అనుకుంటూ తలుపు తెరిచి బల్కనీలోకొచ్చింది. ఆ ఉషోదయపు వాతావరణం అద్భుతంగా అనిపించింది. ఈ మహానగరంలో ఎప్పుడో కానీ ఇలాంటి అనుభవం కలగదు. వాహనాల చప్పుళ్ళు, హారన్‌ల మోతలు, అవొదిలే పొగ, ఏసిల వేడి గాలులు… శరీరాన్ని మనసుని కూడా కలతపరుస్తుంటాయి అనుకుంటుండగానే చెట్ల హాహాకారాలు గలగల చప్పుళ్ళుగా వినిపించి ఎట్నించా అని శ్రద్ధగా వినడానికి ప్రయత్నించింది. అర్థమయింది. నిన్న సాయంత్రం గాలులకి చెట్ల కొమ్మలు కరెంట్‌ తీగలకి రాసుకుంటున్నాయని ఇవాళ తెల్లవారుతూనే ఆ కొమ్మల్ని కొట్టేస్తున్నారని. రెండ్రోజుల క్రితం ఆ కాలనీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్‌ వచ్చి ఇచ్చెళ్ళిన కరపత్రం గుర్తొచ్చింది – స్వచ్ఛ భారత్‌ క్యాంపెయిన్‌లో భాగంగా వచ్చే ఆదివారం ఆ ప్రాంతం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కాలనీలో మొక్కలు నాటుతారని, వాతావరణ పరిరక్షణలో భాగంగా ఇంకుడు గుంతలు తవ్వుతారని…

ఉన్న చెట్లని కాపాడుకోలేని మనం, సరిగ్గా కరెంట్‌ వైర్ల కిందే మళ్ళొక సారి మొక్కలు నాటి అవి ఎదిగి కొమ్మలు కరెంట్‌ వైర్లకి రాసుకునేంతవరకు కాపాడి ఆపైన వాటి తలలు నరికేయడం. అసలు రోడ్లమీదకి మట్టే రాకూడదని ఇంచి కూడా వదలకుండా ఆ చివర్నించి ఈ చివరిదాకా సిమెంట్‌ రోడ్లేసేసారు. చెట్లకోసం మాత్రం రెండడుగుల వైశాల్యంతో అక్కడక్కడ ఫుట్‌పాత్‌లపైన సిమెంట్‌ చేయకుండా కన్నాల్లాగా వదిలారు. మొక్కలైతే సర్దు కుంటాయి, కాని చెట్లు ఇరుక్కోవాలి. లోతుగా వేళ్ళూనుకొని నిలవడానికి దారిలేక ప్రతి సీజన్‌లో గట్టి గాలులొస్తే ఆ చెట్లు నేల కొరగడం… ఇంతకు ముందైతే డ్రైనేజిపైన మ్యాన్‌హోల్స్‌ని సిమెంట్‌ జాలీల్లాంటి వాటితో మూసేసేవారు, వర్షాలకి, గాలులకి చెత్తంతా ఆ జాలీల్లో ఇరుక్కు పోతోందని చాలా చోట్ల వాటిని కూడా మూసేసారు. ఇక నాలుగు చినుకులు పడ్డా భూమిలోకి ఇంకే దారిలేక రోడ్లపైనే పారడం, ఎక్కడికక్కడ డ్రైనేజిలోకి వెళ్ళిపోయే అవకాశంలేక కాస్త పల్లంగా ఉండే రోడ్లన్నీ నీటికుంటలైపోవడం, నీరుతప్పించుకుని వెళ్ళే ప్రయత్నంలో వాహనాలన్నీ ఓ పక్కగా కిక్కిరిసిపోవడం, ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ జామ్‌లు… పాదచారుల పైన నీటి జల్లులు…

మరి ఇన్ని సమస్యలకీ మూల కారణాన్ని వదిలేసి పైపై లేపనాలుగా ఎప్పటి కప్పుడు తాత్కాలిక మరమ్మత్తులు చేసినంత మాత్రాన, మళ్ళీ మళ్ళీ పర్యావరణ పరిరక్షణ పేరిట మొక్కలు నాటినంత మాత్రాన, స్వచ్ఛ భారత్‌ పేరిట డ్రైనేజి మూతలు శుభ్రం చేసినంత మాత్రాన, నీటి పరిరక్షణ పేరుతో అశాస్త్రీయంగా ఎక్కడపడితే అక్కడ ఇంకుడు గుంతలు తవ్వినంత మాత్రాన… నీరు పల్లమెరగదా! ఆక్రమించిన నీటికుంటలని, చెరువులని, తను పారే దారుల్ని వదిలేస్తుందా!! శాంతి మదిలో రొద చేస్తున్న ఆలోచనలు…

చేతుల్లాంటి కొమ్మల్ని సాచి తలలూగిస్తూ మబ్బుల్ని ఆహ్వానించే వృక్షాలు మబ్బులొచ్చి వానలు కురవకముందే భవనాలకి, ఇంకింత వెడల్పయ్యే రోడ్లకి బలై పోతున్నాయి. పట్టణాల్లో మట్టి కరువై వేళ్ళ లోని తమ ప్రాణాల్ని ఎక్కడ నిలుపుకోవాలో పట్టుదొరక్క ఓ మాదిరి గాలులకే నేలకూలు తున్నాయి చెట్లు. నాలుగు చినుకులు పడితే తాము నిండి ప్రాణుల కడుపు నింపాలని చూసే నీటి వనరులు బిల్డింగుల పునాదుల్లో కప్పడిపోతున్నాయి. ఎక్కడెక్కడి జలజీవ నాడుల్ని జుర్రుకుంటున్న పట్టణ ఆవాసాలు పెరిగేకొద్దీ భూతల్లి ఆధారంగా బ్రతికే రైతు మాయమై, పంట పొలాలు కరిగిపోయి కాంక్రీటు కింద మగ్గిపోతే మరి ప్రజల కడుపుకు బువ్వెక్కడందుతుంది. అడవులు అంతరించి కర్మాగారాలుగా మారుతుంటే అడవి మరుగున బతికే కోతులు, నెమళ్ళు, పాలపిట్టలు, పురుగూపుట్రా గ్రామాలకి, అట్నుంచి పట్టణాలకి వలసపోతుంటే… జీవజలం విషతుల్యమౌతుంటే… ఎన్నివేల ఇంకుడు గుంతలు తవ్వితే భూతల్లి కడుపున జలం ఊరి, మబ్బుల్లో నీళ్ళై రైతు కంట నీటినాపాలి!! ఏసి గదుల్లో, నోట్ల కట్టల వాసనల్తోనే బతికే కాంట్రాక్టర్లు… రాజకీయ లబ్దికోసం మాత్రమే సగటు పౌరుడిపై కంటిచూపు సారించే ‘నాయకులు’… ఏడాదికోసారి ఓ మొక్కనాటి బురదంటు కుందని చీదరించుకునే ‘పెద్దమనుషులు’… నల్లకళ్ళద్దాలు అడ్డొచ్చి… చితికిన బతుకుల ఆకలి కేకలు వినిపించవు, పిట్టల పాటలు చెవి చేరవు, ఎర్రబడ్డ ఇంద్రధనస్సులు కనిపించవు… మరైతే నీరు పల్లమెరగదా! కాంక్రీటు గుంతల్లో నీళ్ళింకునా!! పిట్ట పాటాగునా!!! రైతే రాజౌనా!!!!

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.