అనగనగా ఒక ఊళ్ళో రాజు అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా అమాయకుడు. అదే ఊళ్ళోని వీర్రాజు అనే భూస్వామి దగ్గర రాజు కూలి పని చేసేవాడు. రాజుకి భయం ఎక్కువ. దాన్ని అవకాశంగా తీసుకుని యజమాని వీర్రాజు అన్ని పనులూ రాజుకే చెప్పేవాడు. ఎదురు మాట్లాడడం చేతకాక ఎంత కష్టమైనా రాజు ఆ పనులు చేసేవాడు.
వీర్రాజు ఓ రోజున రాజుని పిలిపించాడు. ‘ఒరేయ్! రాజూ, పక్కూరికి వెళ్ళి పంటను అమ్మేసిరా! రెండు రోజులు పడుతుంది. అక్కడే ఉండాలి. పంట జాగ్రత్త!’ అన్నాడు వీర్రాజు. అందుకు తలూపిన రాజు పక్కూరికి బయలుదేరాడు. మూడు రోజులైనా పంట అమ్ముడు కాలేదు. యజమాని పంట జాగ్రత్త అని చెప్పాడే గానీ, రాజు ఖర్చులకు పైసా కూడా ఇవ్వలేదు. దాంతో అతని దగ్గర ఉన్న కాస్త డబ్బుతో రెండ్రోజులు నెట్టుకొచ్చాడు. ఆ డబ్బు కూడా అయిపోవడంతో రాజుకి తిండి లేకుండా పోయింది. ఆకలికి ఏం చేయాలో తెలియలేదు. మూడో రోజు యజమాని వీర్రాజు అక్కడికి వచ్చాడు. పంట దగ్గరే పడుకున్న రాజుని చూసి ‘ఏరా! హాయిగా పడుకున్నావు. పంట ఎవరన్నా ఎత్తుకుపోతే ఏం చేస్తావు?’ అని కోపంగా అన్నాడు. అసలే ఆకలి మీద ఉన్న రాజుకు ఆక్రోశం ఆగలేదు. ‘పోతే పోయింది, నువ్వు నా కోసం ఆలోచించావా! తిండికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు కానీ, అజమాయిషీకి ఏం తక్కువ లేదు’ అంటూ ఆవేశంగా జవాబిచ్చాడు. ఆ మాటలు విన్న యజమాని నోటి వెంట మాట రాలేదు. వెంటనే డబ్బు ఇచ్చి ఏమైనా తినమని రాజును పంపించాడు.
ఆకలి పిల్లిని కూడా పులిని చేస్తుందని గ్రహించిన యజమాని అప్పటినుంచి రాజు బాగోగులు మంచిగా చూసుకోసాగాడు.