ఒక రాజు ఉండేటోడు. ఆయనకు వేటాడుడు అంటే చాలా ఇష్టం. రోజూ అడవికి పోయి ఏదో ఒక జంతువును చంపేటోడు. అట్లా చంపనిది ఆయనకు నిద్ర పట్టేది కాదు.
ఒకనాడు పొద్దుగాలనే లేచిన రాజు కండ్లు నలుముకుంటూ కొండమీదికి ఎక్కిండు. అటూ ఇటూ జూస్తుంటే తొవ్వ బంటి వస్తున్న ఒక బిచ్చగాడు కనపడ్డాడు. రాజు, బిచ్చగాడు ఒకరి మొగం ఒకలు జూస్కున్నరు. అటెంక బిచ్చగాని తోవల బిచ్చగాడు పోంగ రాజు వేటాడేందుకు అడవిలకు బొయ్యిండు. అయ్యాల ఏమైందో ఏమోగాని రాజుకు ఒక్క జంతువు కాదు గదా చిన్న పిట్టె గూడ గనబడలే. అడవిల రోజూ పోయేకాడికన్నా ఇంకింత లోపల్కి పోయ్యి గూడ జూసిండు ఐనా కూడా ఏం కనబడలే. ఎన్నో ఏండ్లనుండి వేటాడుతున్న ఇలా ఎన్నడు గాలే. పొద్దుగుంకిన దాంక తిరిగినా లాభం లేకుండ బొయ్యింది, దాంతో రాజు ఇంటి తొవ్వ పట్టిండు.
ఇగ రాజు మనసు మనసుల లేదు. ఏదో పోగొట్టుకున్నట్టు దిగాలుగ గూసుండు. ఇయ్యాల పొద్దుగాల లేచి ఎవరి మొకం జూసిననో ఏమో? గిట్లయిపాయే అనుకుంటుండగా రాజుకు బిచ్చగాడు యాదికొచ్చిండు. అరే ఆని మొకం జూసినందుకే గిట్టైంది అనుకున్నడు. వెంటనే పొయ్యి ఊరంతా దేవులాడి ఆడు ఎక్కడున్నా పట్కురమ్మని భటులకు చెప్పిండు. దాంతో భటులు కొద్దిసేపట్లనే బిచ్చగాన్ని
కట్టేసి తీస్కొచ్చిండ్రు.
రాజు బిచ్చగానితో అరేయ్! నీ దరిద్రపు మొగం చూసినందుకు ఇయ్యాల నాకు ఒక్క జంతువు గూడ కనపడలే. అందుకని నీకు శిక్ష దప్పదు అన్నడు కోపంగా. వెంటనే భటులతో ఈడ్ని దీస్కపోయి ఉరి తియ్యండ్రి అన్నడు కోపంగా. అది ఇన్న బిచ్చగాడు దిమ్మెరపోయిండు. కొద్దిసేపయినంక నిమ్మలపడి రాజు దిక్కు సూటిగ జూస్కుంట ‘రాజా! నా మొహం జూసినందుకు నీకు ఒక్క జెంతువు గూడ పడలే. అది నిజమే గావొచ్చు కాని ఇయ్యాల నీ మొహం జూసినందుకే నా పానం పోతుండే. ఇప్పుడు జెప్పు! దరిద్రపు మొహం ఎవరిదో” అన్నాడు. అంతే ఆ మాటలు ఇనంగనే రాజుకు దిమ్మదిరిగి పోయింది. మారు మాట్లాడకుండ బిచ్చగాన్ని ఇడిసిపెట్టిండు. మొహం కిందికేస్కుని లోపల్కి పొయ్యిండు.