ఇటీవల ఆంధ్రప్రదేశ్ మహిళా కమీషన్ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి ఒక సంచలన ప్రకటన చేశారు. తాను ఒక రాజ్యాంగబద్ధ వ్యవస్థలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాననే విషయాన్ని మర్చిపోయి ఆంధ్రప్రదేశ్లో పురుషుల మీద హింస పెరిగిపోయిందని, భార్యలు భర్తల్ని చంపేస్తున్నారని మాట్లాడుతూ పురుషుల కోసం కూడా ఒక కమీషన్ వేయాలని చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరంలో జరిగిన రెండు, మూడు చెదురు మదురు సంఘటనలను ఉటంకిస్తూ ఆమె పై ప్రకటన చేశారు. మహిళా కమీషన్కి ఛైర్పర్సన్గా ఉన్న వ్యక్తి పురుషుల పక్షాన మాట్లాడిన మాటలు సభ్య సమాజాన్ని నివ్వెరపరచి ఉండాలి, కొంతమందిని సంతోషపరిచి
ఉండాలి, భార్యా బాధితుల సంఘంలాంటి తిరోగమన సంఘాలు సంబరాలు చేసుకుని ఉండొచ్చు కూడా. ”సేవ్ ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ” లాంటి 498 ఎ చట్టాన్ని నీరుగార్చిన స్త్రీ వ్యతిరేక సంస్థలు వీథుల్లోకి వచ్చి నృత్యాలు చేసి ఉంటారు కూడా.
‘ముందే కోతి… ఆపై కల్లు తాగింది, తాగి నానా బీభత్సం చేసింది’ లాగా ముందే స్త్రీల పురోభివృద్ధిమీద దాడి చేస్తున్న ఇలాంటి తిరోగమన సంస్థల చేతికి నన్నపనేని స్త్రీలకు వ్యతిరేకంగా తానే తయారుచేసిన ఆయుధాన్ని అప్పనంగా అప్పగించినట్లయింది.
మహిళా కమీషన్ ఎందుకేర్పడింది? దాని పనేమిటి? స్త్రీల అభ్యున్నతి కోసం ఏం చేయాలని అందులో నిర్దేశించారు? సవాలక్ష హింసలనెదుర్కొంటున్న స్త్రీల కోసం ఎలాంటి పరిహారాలు అందించగలిగాలి? స్త్రీల రక్షణ కోసం ఏర్పడిన చట్టాల మీద ఎలాంటి అవగాహన కలిగించాలి? లాంటి అంశాల మీద నిరంతరం, నిబద్ధతతో పనిచేయాల్సిన మహిళా కమీషన్ని ఒక కౌన్సిలింగ్ సెంటర్లాగా దిగజార్చిన వైనం చూశాం. స్త్రీల అంశాల మీద, చట్టాల మీద అవగాహన ఉన్న వ్యక్తుల్ని కమీషన్ ఛైర్పర్సన్గా, సభ్యులుగా నియమించాల్సి ఉండగా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి కమీషన్ పునరావాస కేంద్రంగా మారడం, తమ పార్టీ వ్యక్తుల్ని నియమించడం పరిపాటైంది. అధికార పక్షంలోని వ్యక్తిగా తప్ప స్త్రీల అంశాలపై నిబద్ధతతో పనిచేసిన అనుభవం లేని నన్నపనేనికి కమీషన్ ఛైర్పర్సన్గా నియమించడం వల్లనే ఆమె ‘పురుష కమీషన్’ అని డిమాండ్ చేయగలిగింది. అలాగే లైంగిక అత్యాచారాలు చేసిన వాళ్ళను నడిరోడ్డు మీద కొట్టి చంపాలనే అనాగరిక డిమాండ్ కూడా ఆమె చేసింది. ఇది చాలా దౌర్భాగ్యకరమైన స్థితి. ఎన్నో రకాల హింసల్లో మగ్గుతున్న మహిళలకు ఇలాంటి సెన్సిటివిటీ లేని ఛైర్పర్సన్ దాపురించడం దురదృష్టకరం.
మహిళా కమీషన్ లాంటి వ్యవస్థలు ఊరికే గాల్లోంచి ఊడిపడలేదు. ఎన్నో అంతర్జాతీయ కన్వెన్షన్లు, తీర్మానాల ఫలితం. దేశంలోని స్త్రీల స్థితిగతుల్ని అధ్యయనం చేయడానికి, తగు రక్షణ చట్టాలు రూపొందించేలా ప్రభుత్వాలతో నిరంతర సంభాషణ జరపడానికి, అమల్లోకొచ్చిన చట్టాల మీద అవగాహన కల్పించడానికి, హింసలనెదుర్కొనే స్త్రీలకు అండగా ఉండడానికి మహిళా కమీషన్లు ఏర్పాటయ్యాయనే అవగాహన కూడా లేని, రాజకీయ నేపథ్యం మాత్రమే ఉన్నవాళ్ళని మహిళా కమీషన్లో నియమిస్తే జరిగే అనర్థానికి నిలువెత్తు నిదర్శనం నన్నపనేని పురుష కమీషన్ డిమాండ్.
భారతదేశం మహిళలకు భద్రమైంది కాదు, మహిళల మీద అమలవుతున్న హింస ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతోంది అంటూ ఇటీవల విడుదలైన ఒక అంతర్జాతీయ సర్వే ఫలితాలను పెద్ద పెద్ద అక్షరాల్లోకి మార్చి, పురుషుల కష్టాలు మాత్రమే కనబడుతున్న నన్నపనేని కళ్ళముందు ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ఆమెకు ఏ మాత్రం అభిమానం, పౌరుషం ఉన్నా వెంటనే బేషరతుగా ఆంధ్ర మహిళలకు క్షమాపణ చెప్పి, పదవికి రాజీనామా చేయాలి.
రాయిటర్ థాంప్సన్ బహిర్గతం చేసిన సర్వే ఫలితాలను ఏకపక్షంగా తిరస్కరించిన జాతీయ మహిళా కమీషన్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, కేంద్ర ప్రభుత్వం తామే ఎందుకు ఒక సర్వే నిర్వహించకూడదు? భారతదేశంలో స్త్రీల హోదా, స్థితిగతుల మీద సర్వే నిర్వహించమని డిమాండ్ చేద్దాం. స్త్రీల రక్షణార్ధం ఏర్పాటైన వివిధ వ్యవస్థల పనితీరును కూడా మధించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మహిళా కమీషన్ తన పాత్రను సమర్దవంతంగా స్త్రీల పక్షాన నిర్వహిస్తున్నదా? లేదా? అనే అధ్యయనం కూడా జరగాల్సి ఉంది.
రాయిటర్ థాంప్సన్ సర్వే వెల్లడించిన భయానక ఫలితాలను ప్రమాద ఘంటికలుగా తీసుకుని, ఆ బీభత్స స్థితి నుండి మహిళల్ని ఎలా రక్షించాలి అనే ఆలోచన కాకుండా, వాటిని తిరస్కరించడం, పురుష కమీషన్లు కావాలని డిమాండ్ చేయడం, మా దేశంలో స్త్రీలు సుఖశాంతులతో వర్ధిల్లుతున్నారని బుకాయించడం చూస్తుంటే… ఈ మహిళా కమీషన్లు మనకెందుకు? దండగ… మహిళలకి అండగా
ఉండని మహిళా కమీషన్లు ఉండీ లేనట్టే … కదా!!!