నిన్నటి తలపుల లోగిలి చిమ్మి
మది గదులను అద్దంలా దిద్ది
నిలువెల్లా విశ్వ ప్రేమను నింపుకుని
శుభోదయపు ముగ్గులు వేసి
పరిశుద్ధమైన దీపం వెలిగించి
యధాశక్తి సర్వాంతర్యామి నర్చించి
దేవదేవుని రాబోవు రూపము తలిచి
ఆత్మ నివేదనా తలంపుతో
ప్రహరీ తలుపులు దగ్గరగా వేసి
అదృశ్య రూపునికై నిరంతరాన్వేషినై
అర్థ నిమీలిత ప్రశాంత నేత్రాలతో
ఎదురు చూపుల అరుగుపై నిలబడతాను
కంచె గోడ తలుపులు తన్నుకుని
అహంకారపు ఆవేశంతో కోడె దూడలూ
సంకుచిత, వివక్షా కొమ్ముల దున్నలూ
చెంగు చెంగున లోపలికి జొరబడి
ముగ్గుల వాకిలి కస కసా తొక్కి వేసి
పేడ ముద్దలు జాలువార్చి వెళతాయి
గడియ పెట్టడం మరిచిన పర్యవసానమిదని
తెలిసీ తెలియక చేసిన తప్పిదానికి శిక్ష
తప్పదని
ఒక్క క్షణం స్వామి ఆంతర్యం ఊహ చేసి
అప్రమత్తపు ఇనుప రెక్కలు పొదువుకుని
ప్రహరీ గోడలపై పదునైన గాజుముక్కలద్ది
దుండగుల వెన్ను విరిచే ఆయుధాలు తెచ్చి
చిరునవ్వుతో తిరిగి వాకిలి చిమ్ముకుని
స్వచ్ఛమైన నీళ్ళు మరోసారి చల్లుకుని
కొత్త ముగ్గు మరింత శ్రద్ధగా వేస్తాను
రాబోయే విపత్తుకి సైతం సిద్ధమౌతాను
ప్రతి అనుభవమొక నూతన పాఠమే కదా
అది రేపటి పరీక్షకొక రిహార్సలే కదా