ముచ్చెమటల తడిలో ఊరబెట్టిన
ఊబకాయాల్ని అనువుగా
బద్దకంలోకి ముడుచుకొని
వన్నెల తళుకులు వొలికే
ముసుగుల్లో మునగదీసుకుపోతున్నది
సోమరి ప్రపంచం…
నన్ను ఏనాడో మ్ముకున్న ముసుగుల్ని
చీల్చుకొని నా ముఖాన్ని బయటికి తేవాలని
పెనుగులాడుతూనే ఉన్నాను
ఈ ముసుగులెప్పటికైనా చిరిగేనా
లోలోపలి లొసుగులు లొట్టపీసుకాడల్లా తేలిపోయి
నాలోని విసుగులు బయటపడి
ఛూమంత్రమని తుడిచిపెట్టుకుపోయేనా…
ఆ ముసుగుల్ని చించేసుకునేందుకు
మనతో మరెవ్వరూ జతకలవరు
మనిద్దరిమైనా తొడుగుల దాపరికాలు లేకుండా
ఏ గొడుగు నీడనా చేరకుండా
సర్వపరిష్వంగాలను విడదీసుకుందాం
ముసుగుల్ని ఒలిచేసుకుందాం…
ఒక కవితనైనా కూర్చి టీకాలా
వాళ్ళ ముఖాలమీద అచ్చేసి
ఈ లోకంలోకి వెలుతురు ప్రస్థానం
చేయిద్దాం పదవోయ్
సహజంగా బ్రతకడంలోని సౌఖ్యాన్ని
ఆస్వాదన దాకా చేరుద్దాం
ఇప్పుడు మనకు కావాల్సిందీ
మనం నిలువెల్లా కళ్ళతో చూడాల్సిందీ
అందాల్ని చిందులేసే ముసుగుల్నీ
తొడుగుల్నీ కాదు…
మనో సౌందర్యపు నగ్న వ్యక్తిత్వాల్ని
ముసుగులంటూ లేని అసలు ముఖాల్ని
వక్రతలు లేని మనిషి అస్తిత్వాన్ని…
అందుకే ముచ్చెమటల తడిలో
ఊరబెట్టిన దేహాల్ని
నిగ్గుగా ముడుచుకొని
పైపైన వయ్యారాల తళుకులీనే
మునగదీసుకున్న ముసుగుల్లో
నియతిలేని ప్రపంచాన్ని
నటిస్తున్న నిద్రనుండి లేవగొడదాం…
కీచురాయిలా అయినా అరిచి
మినుగురులా అయినా మెరిసి
ఒక్క అడుగైనా ముందుకేసి
జాగొరే అనే నినాదమై పోదాం!
మహా ధ్వనిలా మారిపోదాం!
జాగొరే అనే నినాదమై పోదాం!
మహా ధ్వనిలా మారిపోదాం!