అర్థమరేత్రి, సూరీడు నిద్దరలేశి పరుగుదీశిండు –
ఇంకా పొద్దుకు యాలకాలే,
గిప్పుడు గీ పరుగులెందుకంటే,
పీకల దాకా తాగిన ఓ పశువు,
కడుపుతో ఉన్నదని కూడా చూడకుండా,
కాళ్ళతో తన్ని,
కంటికి కనిపిస్తె సంపుతనని,
కటిక చీకట్లోకి నెట్టేశాడు, ఆ కాబోయే తల్లిని…
ఏ దారీలేని ఆ ఆడబిడ్డ,
కన్నీళ్ళతో…,
కడుపులో శిశువుతో…,
దారి తెలియని బాట పట్టింది…
తప్పతాగిన మృగాళ్ళు
అడుగుకొకరు ఈ జనారణ్యంలో…,
ఆడదైతే చాలు, ఆమె కాబోయే అమ్మైనా, కాలిపోయే అస్థిపంజరమైనా ఒక్కటే,
ఈ మాయదారి కళ్ళకి…
ఏడుస్తూ ఒంటరిగా పోతున్న నా బిడ్డను చూసి,
ఎకిలి నవ్వు నవ్వుతున్నరు…,
కోర్కెల ఆకలి తీర్చబోతున్నమని తెగ సంబరపడిపోతున్నరు…
చీకటిని చాటుగా చేసుకుని, చెరబట్టాలనుకుంటున్నరు…
ఆ బిడ్డ బతుకుని చీకట్ల కలిపేయాలనుకుంటున్నరు…
నేను పోతే,
పగటికి దిడిశి,
– డా|| సిరి
కళ్ళిప్పుకుని జూసే లోకానికి దడిశి,
ఆ బిడ్డని ఏం జేయకుండ ఇడిశేస్తరని ఒక ఆశ…,
గప్పుడు గిట్ల వదలకపోతే,
నాలో ఉన్న అగ్గంత కురిపించి,
ఆళ్ళను మసి జేసి వస్త…,
ఇప్పుడైతే జల్ది పోవాలె…
నా బిడ్డను కాపాడుకోవాలె…
అని పరుగుదీశిండు..
నాకు ఇప్పటికీ సమజైతలేదు,
ఆడబిడ్డను కాపాడేందుకు
అమ్మలేని సూరీడు పరుగుదీస్తుండు,
మరి,
ఈ మనుషులెందుకు ఏ చలనం లేకుండా,
కళ్ళప్పగించి చూస్తున్నారబ్బా…