జయతీ… నేనూ… ఒకరోజు – బి. పద్మావతి

జయతి నా కల. తను ముందే చేరుకుంది అక్కడికి. తన దగ్గరికి ఎక్కువెక్కువ మాటలు, ఎక్కువెక్కువ పుస్తకాలు తీసుకెళ్ళకూడదు. జయతికి మనలాగే చాలా తెలుసు, మనకు తెలిసిన మాటలు కూడా. కానీ జయతి దగ్గర మనకు తెలియంది, మనకు తెలిసిన మాటల్లో చెప్పలేంది ఏదో ఉంది. జయతి ఆకర్షణ తప్పించుకోవడం చాలా కష్టం.

పరోక్షంగా పరిచయమయిన ఈ సంవత్సరం నుండి చూడాలనే! దగ్గర్లోనే ఉంది. తలుచుకుంటే రెండు గంటల్లో పోవొచ్చు. కానీ ఈ ఇల్లు, ఈ కిటికీ వెనక గాలికి ఊగే వేపచెట్టు, కిటికీ పక్కన ఈ పారిజాతం, పిల్లలు, ఈ శాంతి నేను కలలు కని వెతుక్కుని తెచ్చుకున్నవి. భూమ్మీదకు బరువుగా లాగే ఎముకల్లాగే ఇవన్నీ నాకు సహజమయినవి. ఊర్ధ్వ లోకపు ఆమె ఇవ్వన్నీ చెదరగొడుతుందేమో అనే అయిష్టం.

నేను ఆడవాళ్ళతో తొందరగా ప్రేమలో పడలేను. పసుపు రాసిన గడపలు, కుంకాలు, పట్టుచీరలు, నగలు, ఏర్పడిన… ఏర్పడబోయే మూడో, నాలుగో ఇల్లు, ఎక్కువ తక్కువ కొలతలు, అవతలి వాళ్ళమీద అయిష్టం, పరోక్ష నిందారోపణ… ఇవన్నీ నన్ను భయపెడతాయి, బలహీనపరుస్తాయి.

ఎప్పుడో అరుదుగా ఏ ఊహించని సందర్భంలోనో ఒకరు ”జీవితమంటే నెట్టుకుంటూ పోకూడదు పద్మా జీవించాలి. నేను ఈ ఇరవై ఏళ్ళ నుండి నెట్టుకుంటూ పోయాను, జీవించలేదు” అన్న ఏ అరుదయిన క్షణానో వాళ్ళతో ప్రేమలో పడతాను. ఇరవై ఏళ్ళుగా నెట్టుకుంటూ పోయిన ఆ బలం, ఆ సౌందర్యం నన్ను స్వాధీనం చేసుకుంటుంది.

‘ఆపిల్‌ పండ్ల ధర కిలో వంద రూపాయలున్నప్పుడు’ చదివాక జయతి ఊర్ధ్వలోకపు మనిషన్న భయాన్నుంచి నేను చూడని దేన్నో చూసిందన్న బలం నన్ను జయతి దగ్గరకు లాక్కెళ్ళింది.

వదులుకోవడం మొదలుపెట్టాకే కావలసినదాని కోసం కలగనగలం. కావాల్సిన దానికోసం ఒక్క అడుగు దగ్గరగా వెళ్ళాలంటే ఒకటేదో వదులుకున్న తరువాతే ఆ అడుగు ముందుకి పడుతుంది. పాత దుప్పటి ముక్క కూడా వదులుకోలేం ఇల్లు తుడవడానికి పనికొస్తుందని. డబ్బులు, ఉద్యోగం, వస్తువులు, కొంత ప్రయత్నం మీద వదులుకోగలం. ఒక్కోసారి అవి హృదయాలు కూడా అయితే?

”అమ్మ బ్రతికున్నన్ని రోజులూ నాకు సంబంధించిన అన్నిటినీ పంచుకుంటూనే ఉండేదాన్ని. నేను తీసిన ఫోటోలు, వాటి గురించి నేను రాసిన రాతలూ.. అన్నీ ఆనందించేది. ఇద్దరం దూర దూరంగా ఉన్నా ఇద్దరికీ ఏదో కనెక్టివిటీ ఉండేది.

ఆమెకూ ఏవో కలలుండే ఉండాలి నా గురించి. ఆమె చదివిన చలం గురించి నాకు చెప్పింది. ఇప్పటికీ చలాన్ని చదవలేదు నేను. అనారోగ్యం, ట్యూమర్‌ మంచంమీద కొన్నేళ్ళు. కొన్నాళ్ళు ఉన్నాను అక్కడ. కానీ నా ఈ ప్రపంచం, అప్పట్లో స్కూలు, నన్ను పిలిచే అడవి ఇవ్వన్నీ వదిలి నిలవలేను అక్కడ. వచ్చేసాను అక్కడ్నుంచి. వచ్చినా, ఇక్కడున్నా బాధ, ఏ క్షణం ఫోన్‌ వచ్చినా భయం, ఆమెకు ఏమైందో అని. కానీ ఆమె అక్కడుండి ఎంత బాధపడిందో, నేను ఇక్కడుండి అంతే బాధపడ్డాను ఆమె కోసం” అన్నారు జయతి లోపల్లోపల సంభాళించుకుంటూ.

మొదటినుంచీ ఇలానే ఉన్నారా? అవి కావాలి, ఇవి కావాలి అనిపించలేదా మీకు మిగతావాళ్ళలాగా అన్నాను. అనిపించేది. బలంగా అలా ఉండాలని కోరుకోకుండానే ఇంటికి సంబంధించి ఏవో ఒకటి

ఉండాలంటుండేదాన్ని. లోహి ఇది అవసరమా, వద్దు అనేవారు. అలా కొనడం తగ్గించడం, కొన్నవి ఎవరికయినా ఇచ్చేయడం జరిగేది.

ఒకరోజు విజయనగరం నుంచి వైజాగ్‌కి కెమెరాలో బాటరీ కోసం వెళ్ళాము. బాటరీ కొన్నాక నీకేమయినా కొనుక్కో అన్నారు లోహి. ఏమీ అవసరం అనిపించలేదు. నెమ్మది నెమ్మదిగా నా కోసం కొనడం మానేశాను. సైకిల్‌ యాత్ర మొదలుపెట్ట్టే ఏడాదిన్నర ముందు మా దగ్గరున్న డబ్బులన్నీ పెట్టి హోమ్‌ థియేటర్‌ కొన్నాము. ఒక సంవత్సరం పాటు వరల్డ్‌ సినిమా చూశాము. సైకిల్‌ తొక్కడం నేను అప్పుడు నేర్చుకున్నాను. హోమ్‌ థియేటర్‌, టి.వి. అన్నీ అమ్మేశాము. ప్రయాణం కోసం ఉంచుకున్నవి కూడా ఎక్కువేననిపించాయి. అందులో కూడా సగం అక్కడే వదిలేశాము.

అప్పుడూ, ఇప్పుడూ లోహి ప్లాన్డ్‌గా ఉండలేరు. ఎక్కడికయినా వెళ్ళాలంటే ట్రైన్‌ కలరిజర్వేషన్‌ చేయించుకోవడం అలాంటివి కూడా చెయ్యడం ఇష్టముండదు. బియ్యం కూడా రెండు కేజీలకు మించి ఇంట్లో ఉంచుకోం. రేషన్‌ బియ్యమే తింటున్నాం. కూరలు, ఈ చుట్టుపక్కల దొరికే ఆకు కూరలు లాంటివి. ఈ రోజు కూడా అదే వండాను. పిండి కూర ఆకు కూర.

చాలామందికి రేపెలా అనేది పెద్ద ప్రశ్ననే కదా. మరి మీకెప్పుడూ అనిపించలేదా రేపెలా అని? అన్నాను.

లేదు. రేపు అనే ఆలోచన నాకు ఎప్పుడూ రాదు. ఆలోచించలేదు. ఆ భావనే నాకు కలగదు. ఈ రోజు ఇలా ఉన్నాము. రేపు ఉన్నా చింత లేదు అన్నారు.

మీ ఆరోగ్యం గురించి, ఏమైనా అయితే లక్షలు, లక్షలు ఖర్చు కదా! మరి అలాంటి పరిస్థితి వస్తే అప్పుడేం చేస్తారు? అని అడిగాను.

ఇప్పటికి ఏ ఆరోగ్య సమస్యలు లేవు. రేపేదన్నా అవుతుందని ఆలోచించను. ఇవాళ నేను ఆరోగ్యంగా ఉన్నాను. నేనెలాటి వత్తిడి పెట్టుకోను. ఎండ…ఎండలో తిరుగుతాను కదా. ఎండతో చాలా ఆరోగ్య సమస్యలు పోతాయి. వస్త్తే? లోహికి చెప్పాను నాకేదయినా అయితే నన్న అలాగే వదిలేయమని. నన్ను ఏ హాస్పిటల్‌కీ తీసుకెళ్ళొద్దని.

ఇంతకు ముందు ఈ ఖాళీ స్థలంలో కూరగాయలూ, ఆకుకూరలూ అవీ పండించి ఇంట్లోకి వాడుకునేవాళ్ళం. ఇప్పుడదీ మానేశాము. చుట్టుపక్కల దొరికే ఆకుకూరలే వండుకుంటున్నాం. కట్టెల పొయ్యి మీదనే వంట. మనకు దొరికే వాటితోనే బ్రతకాలని ప్రయత్నం అది.

కొంచెంసేపు ఆగి, నేను ఇలా చెప్పడం వలన నేను చెప్పేదే కరెక్ట్‌ అని, అందరూ ఇలాగే బ్రతకాలి అని నేను చెప్పినట్లు అనుకోవడం లేదు కదా మీరు అని అన్నారు.

లేదు, అలా ఏమీ అనుకోవడం లేదు. మీకు అది సాధ్యమయింది చేస్తున్నారు. సాధ్యం కాకపోతే వెనక్కొచ్చేస్తారు.

నాకూ చాలాసార్లు సందేహం కలిగింది. అందరూ దేశ దిమ్మరి బ్రతుకు ఎంచుకుంటే నాగరికత ఏమవుతుంది? వస్తువులు ఎవరు చేస్తారు? పంటలు ఎవరు పండిస్తారు? అలా బ్రతకడం సాధ్యమేనా అనే ప్రశ్నలు వచ్చాయి. కానీ మీ వరకు ఆ ప్రశ్నలు పక్కన పెట్టి వచ్చాను. చాలామంది జయతులు లేరు.

ఉన్నదొక్కతే జయతి. అందరు ఆడవాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు ఎంతో కొంత మీరు బ్రతికినట్లు బ్రతకాలని ఒక్కసారయినా అనుకుంటారు. వాళ్ళందరికీ సాధ్యం కానిది మీకెలా సాధ్యమయింది అనే అబ్బురమే మీ దగ్గరకు నడిపించింది నన్ను అని అన్నాను.

నేను ఎనిమిదేళ్ళ వరకు బోధన్‌లో ఉన్నాను. అప్పుడంతా బాగుండేది. ఆ తరువాత ఊరు మారిపోయాము. బోర్డింగ్‌ స్కూల్‌లో చేర్పించారు. అందరితో పాటు చదువుతూనే ఉండేదాన్ని. ఉన్న పరిస్థితి నచ్చేది కాదు. వ్యతిరేకత కూడా పెద్దగా ఉండేది కాదు. ఇప్పుడనిపిస్తుంది అన్నేళ్ళు అందులో దేనికోసమో దిగులు బెంగ ఉండేదని. అనేక ఆంక్షలూ, కట్టుబాట్లు, కనపడని భయాలూ. అందులోనుండే బయటినుండి పిలుపులు చెట్లూ, పుట్టలూ రా రమ్మని. పక్కన ఎవరంటే వాళ్ళని రమ్మని పోదామనేదాన్ని. ఎవరూ ఇంట్రెస్ట్‌ చూపించేవాళ్ళు కాదు.

అలా ఒక ఇరవై ఏళ్ళపాటు డార్క్‌, కన్ఫ్యూజన్‌ స్టేట్‌. నేను ఎలా ఉన్నానో కూడా నాకు సరిగా గుర్తు లేదు. ఏమీ తెలిసేది కాదు. ఎవరితో మాట్లాడాలన్నా భయం కలిగేది. లోహి నా లైఫ్‌లోకిచ్చారు. అప్పటినుండి మారిపోయింది. ఇద్దరమూ ఉద్యోగాలు చేసేవాళ్ళం. మా పనిని మేము ఆనందించేవాళ్ళం. స్కూల్‌ పిల్లలతో చాలా అటాచ్‌మెంట్‌ ఉండేది. ఆ స్కూల్‌ పనిని ఇష్టంగానే చేసేవాళ్ళం. పెద్దగా వెలితి

ఉండేది కాదు. శని, ఆదివారాల్లో మైదుకూరు నుండి కడపకు వస్తుండేవాళ్ళం. వచ్చేటప్పుడు, వెళ్ళేటపుడు పొలాలు, రోడ్లమ్మట చెట్లూ, పుట్టలూ అప్పుడు నా లోపల ఉన్న ఆ దాహాన్ని తీర్చేవనుకుంటా.

ఛత్తీస్‌ఘడ్‌ వెళ్ళాక ఒక్కసారిగా మారిపోయింది. నన్ను నేను చూసుకోవడం మొదలయింది. నాకు నేను తెలియటం మొదలయింది. నేను చాలా బిడియస్థురాల్ని. ట్రైన్‌ టిక్కెట్‌ కూడా లోహినే తీసుకొచ్చేవారు. ఇప్పుడయినా నా గురించి బాధ్యత పడడం, నా గురించి మంచీ చెడూ పట్టించుకోవడం తనకిష్టం. భయమెందుకు

వెళ్ళు అని ఎంకరేజ్‌ చేసేవారు. కెమెరా నా కోసం తను కొన్నదే. అప్పట్నుండీ ఆ కెమెరా ద్వారా నేను ప్రపంచంతో మాట్లాడం మదలుపెట్టాను. ఆ అడవిలోంచి, పురుగుల్లోంచి, ఆకుల్లోంచి నాకేదో కనెక్టివిటీ దొరికేది. ఆ కనెక్టివిటీ లోంచి ఈ ప్రపంచంతో జరిపే నా సంభాషణ ఈ కెమెరా.

కెమెరా కొనిచ్చింది తనే. లోహీకి మొదట్లో ఇదంతా పెద్దగా అర్థమయ్యేది కాదు. కానీ నా ఫోటోలన్నీ జాగ్రత్తగా సేవ్‌ చెయ్యడం అదీ చేసేవారు. నేను అందరితో షేర్‌ చెయ్యటం, రాయటం మొదలుపెట్టాక తను కూడా ఇదంతా బాగా ఇష్టపడ్డారు. ఇప్పుడు కూడా అరుణాచల్‌ ప్రదేశ్‌కి వెళ్ళారు. నాకు హిమాలయాల పర్వత పాదాలకింద ఒక చిన్న ఊళ్ళో వాళ్ళతో కలిసి పనిచేస్తూ, వాళ్ళతో కలిసి

ఉంటూ అక్కడ తిరుగుతూ ఆ పర్వతాల్లో జీవితాన్ని తెలుసుకోవాలని ఉంది.

చాలా మంది మీ ఇద్దరూ ఒకలాంటి అభిరుచులు కలవారనీ, అలాగే కలిశారనీ అనుకుంటారు. కానీ కొంచెం భిన్నంగా ఉందే మీరు చెప్పింది. మీరు కలిసి ప్రయాణం మొదలుపెట్టిన తరువాతే ఎక్కువగా ఒకరికి తగిన విధంగా ఒకరు మారుకుంటూ ప్రయాణిస్తున్నట్లు అనిపిస్తుందే?

కొన్ని విషయాలు కలవకుండా ఏ ప్రయాణమూ మొదలవ్వదు. అట్లాగే అన్నీ కలవవు కూడా. కలిసి ప్రయాణిస్తూ ఎవరికి వాళ్ళమూ ప్రయాణిస్తాం. మీరు చూడండి. మిమ్మల్నీ, నన్నూ కలిపినవేవో మిమ్మల్ని ఇక్కడిదాకా తీసుకొచ్చింది. మన ప్రయాణం ఇప్పుడు మొదలయ్యింది. ఏమో ఇది ఎప్పుడో మొదలయ్యిందేమో ఒకలాంటి అభిరుచుల వల్ల. ఇదిలా సాగుతూ ఉంటుంది.

మనుష్యులందరూ ఇంతేకదూ మీకు. మీ ప్రయాణంలో కలుస్తారు వాళ్ళు. వాళ్ళని మీరు గాఢంగా హత్తుకుంటారు. వాళ్ళతో ఎంతకాలం ప్రాప్తమో అంతకాలం ప్రయాణిస్తారు. మళ్ళీ కొత్త చోటుకు వెళ్ళాక దొరికినవాళ్ళని అంతే గాఢంగా హత్తుకుంటారు. అయినా దూరమవుతాయంటే భయపడే అనుబంధాలున్నాయా మీకు?

ఇంతకు ముందు అమ్మా, లోహి. అమ్మ రెండేళ్ళ క్రితం పోయారు. ఇప్పుడు లోహి. లోహి లేని స్థితిని నేను ఊహించలేను. ఒకవైపు మనసుని సిద్ధం చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు లోహి ఇక్కడ లేరు, లేనట్టూ లేదు. అమ్మ కూడా భూమ్మీద లేకపోయినా నాతో ఉన్నట్లే ఉంటుంది. ఆమెను అన్నిట్లో చూడడం తెలుసుకున్నాను. ఈ వైటీకి కూడా చెబుతూ ఉంటాను. మేము ఎప్పుడూ నీతో ఉండము, మేము లేకుండా నీకు నువ్వుగా ఉండాలని. వైటీ మాతో అట్లానే ఉంటూ వచ్చింది.

మిమ్మల్ని ఎక్కువెక్కువ ప్రశ్నలు అడుగుతున్నానా, చాలా మాట్లాడించానా. ఈ రోజు మీరు నాతో మాట్లాడినన్ని మాటలు గత ఆరు నెలల్లో మాట్లాడి ఉంటారా? ఎవ్వరికీ సాధ్యం కానిది మీకెలా సాధ్యమైంది? ఈ అభ్యంతరాలు మీరెలా దాటగలిగారనే కుతూహలమే నన్ను ఇన్ని ప్రశ్నలు వేయించింది అన్నాను.

నవ్వుతూ… ఈ రోజు చాలా మాట్లాడాను. ఒక సంవత్సరమంతా కలిపి కూడా ఇన్ని మాటలు మాట్లాడి ఉండనేమో అన్నారు.

మీరు మనుష్యుల్ని భరించలేకపోవడం లాంటిది ఏమీ లేదు కదా? మీకు మీరే ఉండాలనిపించటం అలా ఏమైనా అనిపిస్తుందా మీకు అన్నాను.

లేదు. అవసరమైనంతవరకు మాటలు ఇష్టం. ఎక్కువ మాట్లాడడం ఇష్టముండదు. ఆ మాటలు నాలో ఉన్న దేన్నో డిస్టర్బ్‌ చేస్తాయి. ఇలా నిశ్శబ్దంగా చెట్టు నీడలో కూర్చుని గాలి చేసే ఈ చప్పుడునీ, ఈ వెదురాకుల కదలికల్నీ చూస్త్తూ. ఇప్పుడిలా ఉంటుందా ఇంకొంచెం సేపటికి గాలి పెరుగుతుంది, ఆ సందుల్లోంచి వెలుతురు రంగు రంగుల చిన్నెలు మార్చుకుంటూ… ఒక మత్తు, నిషా… ఇలా ఎంతసేపయినా గడపగలను.

శబ్దాన్ని భరించలేను. ఇబ్రహీంపట్నం వరకు కూడా వెళ్ళాలనిపించటంలేదు ఇప్పుడు. ఎక్కడికీ శబ్దాల్లోకి వెళ్ళలేను. ఎవరినయినా రమ్మనే అంటాను. ఫోన్‌ కూడా తెచ్చుకోకుండా నిశ్శబ్దంగా ఒకరోజు వచ్చి గడపమంటాను. నేనూ, లోహి కూడా ఎక్కువ మాట్లాడుకోము. ఈ ఎండా, గాలీ… ఇలా అన్నీ కలసే పంచుకుంటాము అని అన్నారు.

గాలికి బలంగా ఊగే ఆ వెదురుబొంగుల లేతాకు పచ్చ వెలుతురు మధ్య ఇద్దరమూ ఆ అరుగుమీద పడుకుని ట్రైన్‌ ఎక్కి ఏదో ఒక స్టేషన్‌లో దిగి ప్లాట్‌ఫారం మీద పడుకుని వెయిటింగ్‌ రూమ్‌లో స్నానంచేసి దొరికింది తిని, ప్లాట్‌ఫారం మీదకు వచ్చీపోయేవాళ్ళను కొన్ని వందలమందిని గమనిస్తూ… ఎంత జీవితం, ఆ కాశీలో గంగ ఒడ్డున కూర్చుని చూస్తుంటే వచ్చీపోయే అన్ని వేలమందిలో ఎంత జీవితం… దొరికింది తిని మళ్ళీ ఇంకో ట్రైన్‌ ఎక్కి అలాగే పోతూ పోతూ దేశమంతటా ట్రైన్‌ ద్వారా తిరిగే దేశదిమ్మరి కలగన్నాము.

జయంతి.. నేను.. ఒకరోజు – 3

చంద్రకాంత పువ్వుల వెనకాల మెరుస్తున్న ఆ ఎండ, ఏదో ఒక దివ్య లోకానికి ఆహ్వానం పలుకుతున్నట్లు వెదురు పొదల కిందనుండి మమ్మల్ని బయటకు లాక్కెళ్ళింది. అడవిలాంటి ఆ పెద్ద ఆవరణలోకి నడిచాము.

రెండువందల యాభై ఎకరాలు. అందులో ఒక స్కూలు. ఎకరం ఎంతక్కొన్నారో? ఇప్పుడు ఎంతుందో? మనసుకి అలవాటయిన లెక్కలు.

దున్నిన బత్తాయి తోట, జామ తోట. వాడడం మానేసిన పాలీ హౌస్‌కి చిరిగి వేళ్ళాడుతున్న తెరలు.

ఇప్పుడు ఇవి దున్నేశారు, ఏవో వేస్తారు. అవి కొన్నాళ్ళుంచి అవీ దున్నేసి మళ్ళీ ఏవో వేస్తారు అంది జయతి. ఈ గొడవంతా ఎందుకని యూకలిప్టస్‌ చెట్లు వేసేసారు అన్నాను నేను.

యూకలిప్టస్‌ చెట్లమీద పడుతున్న ఎదురెండ. మెరుస్తున్న యూకలిప్టస్‌ చెట్లు. నీలాకాశంలో తేలుతూ పోతున్న తేలికపాటి మబ్బులు. కింద నేలమీంచి పైకెగిరిన కొంగ. తీతువు ఒక్కసారిగా చక్కర్లు కొట్టింది.

నేను ఒక్కసారిగా తనవైపు తిరిగి మీకు అడవీ, ఆకాశమేనా? నదులూ, సముద్రం కూడా ఇష్టమేనా అన్నాను. నదులంటే చాలా ఇష్టం. ఎంతో జీవితం నది పొడుగునా. ఆ మనుషులందర్నీ కలవాలనుంటుంది. సముద్రం ఒక్క తీరుగా ప్లెయిన్‌గా ఉన్నట్లుంటుంది. సముద్రం ఎదుట ఎక్కువసేపు ఉండను. మళ్ళీ సముద్రం అడుగున, అందులో జరిగే కదలికలు ఇష్టం అన్నారు జయతి.

పరుపుబండ ఎక్కలేని సడులుతున్న కీళ్ళు. బండమీద ఎక్కి లోపలికి వెళ్ళాము. చుట్టూ పరుచుకున్న చెట్లతో చిన్న మైదానంలా

ఉంది లోపల. అక్కడ ఒక రాయిని చూపిస్తూ పొద్దున్నే ఈ బండ మీద ఎండపడి ఎలా మెరుస్తుందో ఎవరూ ఉండరు. పొద్దున్నే వచ్చి ఇక్కడ కూచుంటాను నాకు నచ్చినంత సేపు అన్నది జయతి.

కొంచెం ముందుకు నడిచి ఒక బండ అంచున చెట్ల నీడలో, ఆ గడ్డి మట్టిలో పడుకుని ఆకాశంలో కనపడే ఆ నీలిమను చూస్తూ, అక్టోబర్‌ వచ్చిందంటే ఆ మెరుపు ఎండ నన్ను నిలవనీయదు, రా రమ్మని పిలుస్తుంది అంది జయతి. నేను కూడా టాగోర్‌ వర్ణించిన ఆ ‘శరత్‌ దివసాల గ్రీష్మ యామినులన్నింటినీ, నేను విరామం లేకుండా ఆర్జించిన మధుర మధువునంతా’ గుర్తుచేసుకున్నాను.

కొంచెంసేపున్న తరువాత మాకంటే ముందే వెళ్ళిపోయిన వైటీని వెతుక్కుంటూ బయటపడ్డాము. దాగుడుమూత లాడుతూ ఒక మంటపంలోకి వెళ్ళింది వైటీ. మేము కూడా లోపలికెళ్ళి ఒక దగ్గర కూర్చున్నాము. నా ఫోన్‌తో జయతిని ఒక్క ఫోటో తీసుకోవాలని ప్రయత్నిస్తూ.. లాభం లేదు. తేనెధారలు చిప్పిల్లే మీ గొంతు, మృదువయిన మీ చూపులు ఈ కెమెరాలో రావటంలేదు. ఎవరోలాగా కొత్తవాళ్ళలాగా కనిపిస్తున్నారు. మీ ఏజ్‌కంటే కూడా ఎక్కువగా కనిపిస్తున్నారు అన్నాను.

ఏమో, ఇప్పుడున్న వయసుకంటే ఎక్కువేనేమో, నేను పెద్దదాన్నేమో అనిపిస్తుంది నాకు. I శ్రీఱఙవస వఅశీబస్త్రష్ట్ర అన్నారు జయతి.

నేను ఉలిక్కిపడి అదేంటి అన్నాను.

ఇదేమీ విరక్తితో అంటున్న మాట కాదు. ఏదో నన్ను నడిపించేది ఎక్కడికో. నేనక్కడున్నానిప్పుడు. ఇప్పుడేదో చెయ్యాలని ఎక్కడికీ వెళ్ళాలని అనిపించదు. నర్సీపట్నంలో ఉన్నప్పుడు తూరుపు కనుమలు నాకు పదిహేను కిలోమీటర్ల దూరంలో

ఉండేవి. నా చిన్నప్పుడివేవీ నాకు దగ్గర కాదు. ఎంతో దూరం. నాకు ముప్ఫయి ఏడు ఏళ్ళు రావాల్సొచ్చింది నాకు అడ్డుపడేవి తొలగించుకుని అడుగు ముందుకు వెయ్యటానికి.

సైకిల్‌ యాత్ర మొదలుపెట్టినపుడు ఇంక వెనక్కి తిరిగి మళ్ళీ వస్తామనుకోలేదు. అలా ప్రయాణిస్తూనే పోతూ ఉంటామనిపించింది. పులికాట్‌ దాకా ప్రయాణించాం. ఇప్పుడు ఆ కొండలు ఎక్కలేకపోయానే అనేది ఎక్కువ బాధించట్లేదు. పదహారు వేల కిలోమీటర్లకు ప్లాన్‌ చేసుకున్నాను ఊర్లు తగలకుండా అడవి అంచునే, కొండల అంచున దేశమంతా ఆగకుండా అలా ప్రయాణం చేస్తూ వెళ్తూనే ఉండాలని. ఇక్కడ ఆగిపోయాము. ఆ ప్రయాణం చెయ్యగలుగుతామా? చేస్తామేమో. నాతో పాటు నన్ను తీవజూతీవరవఅ్‌ చేసే పుస్తకాలు ‘అమృత సంతానం’, ‘షaశ్రీశ్రీ శీట ్‌ష్ట్రవ షఱశ్రీసః, ఃIఅ్‌శీ ్‌ష్ట్రవ షశీశీసర’ ఎప్పుడూ ఉంచుకోవాలనుకున్నాను. ఏవి లేకున్నా అవి ఉండాలనుకుంటాను. ఇప్పుడలా కాదు ఆ హిమాలయాల పర్వత పాదాల కింద ఇలాంటి చోట్లో ఏదో ఒక చోట ఉంటాను. అలా అని అనుకుంటున్నాను అని అన్నారు.

అప్పటిదాకా ఏదీ వినకుండా అక్కడక్కడ తిరుగుతున్న నా కొడుకు ‘ఆంటీ ఈ వైటీ మీలాగే ట్రావెల్లర్‌. మీతోపాటే అదీ వస్తుంది. మీరు దాన్ని వదిలిపెట్టి ఉండలేరు. అదీ మిమ్మల్ని వదిలిపెట్టి ఉండలేదు. ఏరోప్లేన్‌లో అయినా తీసుకెళ్తారు’ అన్నాడు ముక్తాయింపుగా.

బయలుదేరి వచ్చేశాము. ఆ రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అలా మాట్లాడుతూనే ఉన్నానా! ఎక్కువ మాట్లాడలేని నేను, ఎక్కువ మాట్లాడలేని జయతి మాటలతో అర్థం చేసుకోవడానికి మాట్లాడుకుంటూనే ఉన్నాము. కానీ ఇంటికొచ్చాక ఎందుకో మాటలు కాదు ఆ వెదురు ఆకుల గలగలల మధ్య నిశ్శబ్దాన్ని ఎక్కువ పంచుకున్నట్లు అనిపించింది.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.