నిర్జన వారధి – కదిలించిన ఆత్మకథ – దాసరి సుబ్రహ్మణ్యేశ్వర రావు

మరి కొందరి జ్ఞాపకాలు

ముళ్ళు ముళ్ళుగా గుచ్చుకుంటాయి

గుండెల నిండా దిగుళ్ళు నింపి

ఊపిరిని స్తంభింపచేస్తాయి.

మనోఫలకంపై కత్తిగాటులా పడి

పచ్చిపచ్చిగా సలుపుతూనే ఉంటాయి

ఆశలు, ఆశయాలన్నీ ఆవిరై

అడగనివేవో అదాటున మీదపడి

శకలాలుగా విడిన జీవితం ఒక వెంటాడే జ్ఞాపకమై

గుండె భళ్ళున పగిలిన అద్దమయిపోతుంది

ఇవిగో, ఆ పెంకుల నుంచి పేర్చిన జ్ఞాపకాలే ఇవన్నీ

అంటూ మొదలవుతాయి ఆమె జ్ఞాపకాలు.

నిర్జన వారధి – మనుషుల్లేని వంతెన. ఈ పుస్తకం గురించి మొదట విన్నప్పుడూ, పుస్తకం చదివాక కూడా, ఈ పేరు గుండెను తొలిచేస్తూ ఉంది. ఈ మాటను తలుచుకున్నప్పుడల్లా ఏదో అస్పష్టమైన విచారం కమ్ముకొస్తుంది. ఒక విషాద దృశ్యం కళ్ళముందు పరుచుకొంటుంది.

కానీ మనుషులు లేనంత మాత్రాన వంతెన కూలిపోదు, స్థిరంగా అలాగే నిలిచి ఉంటుంది తర్వాత రాబోయేవారిని అవతల దరి చేర్చడం కోసం. విషాదం వారధిది కాదు, వారధిని వాడుకోలేని వారిది.

మూడు తరాలకు వారధి అయినా ఒంటరిగా మిగిలిపోయిన కోటేశ్వరమ్మగారి స్వీయకథ చదువుతుంటే విషాదం పెళ్ళుకు వచ్చేమాట నిజమే అయినా, ఆమె మీద కలిగేది జాలి, సానుభూతి మాత్రమే కాదు, ఆమె సాహస ప్రవృత్తి, ఉద్యమ నిబద్ధత, ఆత్మాభిమానాల పట్ల ఆరాధనాభావం. కల్పిత కథ కాని ఒక వ్యక్తి నిజ జీవితంలో ఇంత విషాదమూ, ఇంత ధైర్యమూ ఉంటుందంటే ఎంతో ఆశ్చర్యం.

తొంభై వసంతాలు చూసిన కోటేశ్వరమ్మ చాలా శిశిరాల్ని కూడా చూశారు. మన చరిత్రలో కొన్ని ముఖ్య ఘట్టాలకు ఆమె ప్రత్యక్ష సాక్షి. ఈ కాలంలో చరిత్రతో పాటు ఆమె జీవితమూ అనేక మలుపులు తిరిగింది. స్వాతంత్రోద్యమం, సంస్కరణోద్యమం, కమ్యూనిస్టు

ఉద్యమం, మహిళా వ్యక్తిత్వ జాగరణోద్యమం, నక్సలైటు ఉద్యమాలతో ఆవిడకు ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలున్నాయి. నాలుగు తరాల మనుషుల మధ్యే కాదు, కోటేశ్వరమ్మ గారు ఈ ఉద్యమాల మధ్య కూడా వారధే.

కోటేశ్వరమ్మ గారు కృష్ణాజిల్లా పామర్రులో 1920లో పుట్టారు. నాలుగైదేళ్ళ వయసులో మేనమామతో పెళ్ళయింది. పెళ్ళైన రెండేళ్ళలోపే భర్త మరణించాడు.

ఏడేళ్ళ వయసులో వితంతువు. తర్వాత చిన్న వయసులోనే జాతీయోద్యమంలో పాల్గొనటం, సంప్రదాయాలకు, ఊళ్ళోవారి మనోభావాలకు వ్యతిరేకంగా పునర్వివాహం, కమ్యూనిస్టు భావాలతో ఉత్తేజితుడై, దీక్షగా, కార్యకర్తగా పనిచేస్తున్న భర్త కొండపల్లి సీతారామయ్యతో మమేకమై తాను కూడా పార్టీ కార్యకర్తగా, సాంస్కృతిక ప్రదర్శకురాలిగా ఎదగడం, జైలు పాలవడం, పార్టీ నిషేధంలో ఉన్నప్పుడు బందరు, ఏలూరు, విశాఖపట్నం, పూరీ, నాగపూర్‌, రాయచూర్‌, గోంధియాలలో భర్తకూ, పిల్లలలకూ దూరంగా అజ్ఞాతంగా రహస్య జీవనం సాగిస్తూ పార్టీకి సహాయపడటం, నిషేధం తర్వాత పార్టీ కార్యకర్తగా ఊరూరూ తిరగడం.

ఇంతా చేశాక, ఏదో కారణంతో సీతారామయ్య ఆమెను విడచి, వేరే ఊరు (వరంగల్‌) వెళ్ళి అక్కడ వేరే ఆమెతో ఉండటం ప్రారంభించాడు. పిల్లల్నిద్దర్నీ తన దగ్గరే ఉంచుకున్నాడు. హైస్కూల్‌ చదువు కూడా లేని ముఫ్పై ఐదేళ్ళ కోటేశ్వరమ్మకు ఆర్థికంగా ఏ ఆలంబనా లేకుండా పోయింది. నిషేధకాలంలో కమ్యూనిస్టు పార్టీ అవసరాల కోసం అమ్మిన నగల విలువను పార్టీ ఆమెకు తిరిగి ఇవ్వబోతే సీతారామయ్య ఆమెను తీసుకోనివ్వలేదు. ఎవరి సహాయమూ తీసుకోకుండా స్వశక్తితో తన కాళ్ళపై తాను నిలబడడానికి నిశ్చయించుకొని, ఆ వయసులో ఆమె హైదరాబాద్‌ ఆంధ్ర మహిళా సభలో మెట్రిక్‌ చదవడానికి చేరింది. ప్రభుత్వం వారిచ్చిన స్టైఫండ్‌ ఫీజులకు సరిపోతే, రేడియో నాటకాలలోనూ, కార్యక్రమాలలోనూ పాల్గొంటూ, కథలు వ్రాస్తూ సంపాదించుకున్న కొద్ది డబ్బు మాత్రం స్వంత ఖర్చులకు సరిపెట్టుకునేవారు. పరీక్షలు వ్రాసి మెట్రిక్‌ పాసయ్యారు. ఇంకా చదవడానికి వీలుకాక, కాకినాడ గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌ కాలేజి గరల్స్‌ హాస్టల్లో మేట్రన్‌ ఉద్యోగంలో చేరారు. కాకినాడలో సాహితీ సభలలో పాల్గొంటూ, రచనా వ్యాసంగం చేయడం మొదలుపెట్టారు.

వరంగల్‌ మెడికల్‌ కాలేజీలో చేరిన కుమార్తె కరుణ ఆమె సహాధ్యాయి కావూరి రమేష్‌ బాబు ప్రేమ వివాహం చేసుకున్నారు. కోటేశ్వరమ్మ గారి సమ్మతితోనే ఈ వివాహం జరిగినా, వరంగల్‌లో జరిగిన ఆ వివాహానికి ఆమెకు ఆహ్వానం రాలేదు, ఆమె వెళ్ళలేదు.

కొండపల్లి సీతారామయ్య నక్సలైట్‌ ఉద్యమానికి నాయకుడయ్యాడు. వరంగల్‌ రీజనల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో చదువుతున్న కుమారుడు చందు (కొండపల్లి చంద్రశేఖర్‌ ఆజాద్‌) విప్లవోద్యమంలో చేరాడు. గుత్తికొండ బిలంలో చారు మజుందార్‌తో సమావేశానికి హాజరైన వారిలో కె.జి.సత్యమూర్తితో పాటు చందు కూడా ఉన్నాడు. తండ్రిని వ్యక్తిగా గౌరవించకపోయినా ఉద్యమానికి నాయకత్వం వహించినందుకు గౌరవించాడు చందు. పార్వతీపురం కుట్ర కేసులో కొంత కాలం జైలులో ఉన్న చందు ఒకరోజున మాయమయ్యాడు. కొన్నేళ్ళ తర్వాత ఎవరో పోలీసులు వచ్చి చందు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఆ కబురులో నిజమెంతో ఆమెకు తెలియదు. కుమారుడి శవాన్ని కూడా కోటేశ్వరమ్మ చూడలేక పోయింది. కుట్ర కేసులో బెయిల్‌లో ఉన్నప్పుడు విజయవాడలో తనతో గడిపిన ఒక్క సంవత్సరమే ఆమె ”చందు నుంచి అందుకున్న సంతోష సంపద.” కరుణ, రమేష్‌బాబు ఢిల్లీలో ఉద్యోగంతో పాటు తాము స్థాపించిన ఆంధ్ర ఎడ్యుకేషన్‌ సొసైటీ ద్వారా తెలుగువారికి సహాయం, తెలుగు సాహిత్యానికి సేవ కూడా చేస్తూ ఉండేవారు. గురజాడ మీద మంచి సావనీర్‌ ప్రకటించిన డా.రమేష్‌ బాబు, గిడుగు రామ్మూర్తిపై ఇంకో సావనీర్‌కు వివరాలు సేకరించడానికి తిరుగుతూ విజయవాడ వచ్చి వడదెబ్బతో ఆకస్మికంగా మరణించాడు. ఆ మానసిక విఘాతాన్నుంచి కోలుకోలేకపోయిన కుమార్తె డా.కరుణ కొన్నేళ్ళ తర్వాత ఆత్మహత్య చేసుకుంది. ”పేదరికంలో ఉన్న రోగుల్ని ఆదుకుంటూ సంఘమిత్రగా జీవిస్తుందనుకున్న కరుణ, చెడును వేలుపెట్టి చూపుతూ తర్జని కథలు రాస్తూ బతుకుతుందనుకున్న కరుణ, తండ్రిలేని తన పిల్లలకు తల్లిని కూడా లేకుండా చేసి వెళ్ళిపోయింది”.

చిన్నప్పటినుంచి కోటేశ్వరమ్మకి బాసటగా నిల్చిన తల్లి అంజమ్మ కూడా కరుణకంటే ముందే మరణించారు. కోటేశ్వరమ్మ ఒంటరిగా మిగిలింది.

ఈ లోపు సీతారామయ్య నిర్మించిన పీపుల్స్‌ వార్‌ పార్టీ ఆయననే బయటకు నెట్టింది. ప్రభుత్వం ఆయనను జైల్లో పెట్టింది. బంధువెవరో వచ్చి ”సీతారామయ్యగారికి నిన్ను చూడాలని ఉందట, తీసుకెళ్తాను వస్తావా” అని అడిగితే ”ఆయనకు చూడాలని ఉంటే నాకాయన్ని చూడాలని ఉండొద్దా? లేదు కాబట్టి రాలేను” అని జవాబిచ్చింది కోటేశ్వరమ్మ.

జైలు నుంచి విడుదలైన సీతారామయ్యని మనవరాళ్ళు (కరుణ కుమార్తెలు) ఇంటికి తీసుకొచ్చారు. సీతారామయ్యని చూడడానికి ఆమె ముందు నిరాకరించినా, కాళోజీ నారాయణరావు, కాట్రగడ్డ నారాయణరావు, మహిధర రామ్మోహనరావుల ప్రోద్భలంతో ఆమె సీతారామయ్యను చూడ్డానికెళ్ళింది. అన్నేళ్ళ తర్వాత చూస్తున్నప్పుడు సీతారామయ్య ఆమె కళ్ళకి మామగారిలా కనబడ్డాడే కానీ, సీతారామయ్యలా కనపడలా. మతి స్థిరత్వం తగ్గిన సీతారామయ్యను చూడడం బాధగా అనిపించి హైదరాబాద్‌ వెళ్ళి అక్కడ చండ్ర రాజేశ్వరరావు వృద్ధాశ్రమంలో జీవించడం మొదలుపెట్టింది.

కొన్నాళ్ళకు సీతారామయ్య కూడా మరణించాడు. ఎనభై ఏళ్ళ జీవితాన్ని ఉద్యమం కోసం, ప్రజల కోసం ధారపోసిన మనిషి చనిపోతే చూడ్డానికి కూడా పార్టీవాళ్ళెవరూ రాలేదు. కోటేశ్వరమ్మను సీతారామయ్య తనకనుకూలంగా లేదని చెప్పి ఆనాడు వదిలేశాడు. ఇప్పుడు సీతారామయ్యను పార్టీవాళ్ళు వదిలేశారు. ఇంతేనా జీవితం?

గత కొన్నాళ్ళుగా కోటేశ్వరమ్మ విశాఖపట్నంలో మనవరాళ్ళ దగ్గర ఉంటున్నారు.

సీతారామయ్యతో ఆమె విజయవాడలో ఉన్నప్పుడు ఆమె ఇల్లు కమ్యూనిస్టు పార్టీ సాంస్కృతిక కార్యకలాపాలకు వేదికగా ఉండేది. కుమార్తె డా.కరుణతో కలిసి ఉన్న రోజుల్లో ఆమె ఇల్లు విప్లవ రచయితలకు, సానుభూతిపరులకు కేంద్రంగా

ఉండేది. మనవరాలు, ఆమె భర్త మానవ హక్కుల వేదికలో కార్యకర్తలుగా ఉండడంతో ఇప్పుడు ఆమె ఉంటున్న చోట ఆ సంప్రదాయం ఇంకా కొనసాగుతూనే ఉంది.

”భూత, భవిష్యత్తులకు పట్టుగొమ్మగా నిలిచి అటు తల్లి తరానికి, ఇటు బిడ్డల తరానికి బ్రతుకును వారధిగా చేసి దానిపై నుండి అటొకరు, ఇటొకరు వెళ్ళిపోతే కోటేశ్వరమ్మ నిర్జన వారధిగా మిగిలిపోయింది” అన్నారట కవి మిత్రుడు సోమసుందర్‌. ఎందరి బలవంతం చేతనో ఆమె రాసిన ఆత్మకథకు సోమసుందర్‌ మాటనే శీర్షికగా ఎంచుకున్నారు కోటేశ్వరమ్మ.

ఈ కథలో ముఖ్య పాత్రలు ముగ్గురు, కోటేశ్వరమ్మ, ఆమె తల్లి అంజమ్మ, సీతారామయ్య. భర్త వద్దంటున్నా, ఊరు కాదంటున్నా పట్టుబట్టి కూతురికి పునర్వివాహం చేయించింది అంజమ్మ గారు. తాను చనిపోయేవరకూ కూతురికి, కూతురి బిడ్డలకు అండగా నిలబడింది ఆవిడ. అనేక సందిగ్ధ సమయాల్లో అంజమ్మగారి కామన్‌సెన్స్‌, సలహాలే కోటేశ్వరమ్మ గారికి దిశానిర్దేశం చేశాయి. కూతురి కుటుంబంతో పాటు ఆమె పార్టీ అభివృద్ధికి, కార్యకలాపాలకి ముఖ్యంగా రహస్యపు రోజుల్లో ఆమె చాలా కృషి చేసింది. చనిపోవడానికి వారం రోజుల ముందు ఆవిడ వెల్లడించిన చివరి కోరిక ఉభయ కమ్యూనిస్టు పార్టీలను కలిసి పనిచేయమని, ఉభయ పార్టీల వారికీ ఆమె గుర్తుగా చెరొక వెయ్యి రూపాయిలివ్వడానికి ఏర్పాటు చేసి మరీ చనిపోయింది ఆవిడ.

కొండపల్లి సీతారామయ్య వ్యక్తిత్వము, జీవిత పరిణామాలు ఈ పుస్తకంలో ఆవిష్కృతమవుతాయి. వివాహపు తొలి రోజుల్లోనూ, పార్టీ నిర్మాణ క్రమంలోనూ, నిషేధపు రోజుల్లోనూ ఆదర్శ జీవితం గడపడానికి నిరంతరం ప్రయత్నిస్తున్న ధీరోదాత్త త్యాగమూర్తిలా ప్రకాశిస్తాడు (సంపన్నుడు కాకపోయినా త్యాగ సంపన్నుడు అని ఒకసారి కోటేశ్వరమ్మ అనుకుంటుంది అతని ఆస్తిని కమ్యూనిస్టు పార్టీకి రాసిచ్చేసిన సంఘటనను గుర్తుచేసుకుని) పార్టీతో గొడవలు పెట్టుకుని కోటేశ్వరమ్మను ఒంటరిగా వదిలేసి, ఆవిడ ఇబ్బందుల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయినప్పుడు మొండివాడిగా, నిర్దయుడిగా, దుర్మార్గుడిగా కనిపిస్తాడు. కుటుంబాన్ని నిర్లక్ష్యంచేసి ప్రజలకు, ఉద్యమానికి జీవితాన్ని అంకితం చేస్తే ఆ ప్రజలు, ఉద్యమము మతి స్థిమితం తప్పి ఆసరా అవసరమైన రోజుల్లో అతన్ని పట్టించుకోకుండా వదిలేశారు. చివరకి మనుమరాలు చేరదీసి సేవ చేయవలసి వచ్చిన దైన్యావస్థ చూస్తే జాలేస్తుంది. ”అతను కూడా సుఖంగా బతకలేదు. అతడు దుర్మార్గుడు కాదు. అతని బలహీనతలు చూడకుండా అతనిలో ఉన్న ఉద్యమకారుడ్ని, త్యాగ నిరతిని చూసి గౌరవించమనే” వారి మాటను తోసివేయలేము.

కోటేశ్వరమ్మ వంటి నాయికను ఏ రచయిత అయినా సృష్టిస్తే అబ్బురపడుతూ ఆ కథను చదువుతాం. ఎంతటి చిత్రమైన జీవితం? ఇంత జరిగినా ఆమె ఎవరి గురించీ కోపంతో, ద్వేషంతో, కసితో రాయలేదు. క్షమించే తత్వం పుష్కలంగా ఉంది ఆమెలో. సీతారామయ్య చివరి రోజుల గురించి మాట్లాడుతూ ఆయనంటే ”అప్పటికి నాకే ఆసక్తీ లేదు, ప్రేమా లేదు, ద్వేషమూ లేదు. మొదట్లో ఇంత దుర్మార్గమా అనుండేది కానీ ఆ తర్వాత ఏమోలే అతను మాత్రం ఏం సుఖపడ్డాడు అనుండేది” ఆంటారు. సీతారామయ్యను చూడడానికి ముందు నిరాకరించినా, తర్వాత జాలిపడి కలత చెందారు. అతనికి తానేమీ సేవలు చేయలేదని చెప్తూనే తన పిల్లలకు వండి పంపినట్లే అతనికి ఇష్టమైన కూర వండి పంపేదాన్నంటారు. సీతారామయ్య మృతదేహాన్ని చూసినప్పటి ఆమె ఆలోచనలు చదివి తీరాలి. అతని ముఖం ఆఖరిసారిగా చూసినపుడు ఆమెకు గుర్తుకు వచ్చింది అతను తనకు చేసిన అన్యాయం కాదు, 1940 మేడే నాడు గొంతెత్తి ఎగరాలి, ఎగరాలి మా ఎర్రజెండా అంటూ అతను పాడడం.

జీవిత క్రమంలో ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా జీవితమంతటా ఆమె తనను ఉద్యమకారిణిగా, కార్యకర్తగానే భావించుకుంది. అలానే జీవించింది. ఆర్థికంగా కష్టాలు పడుతున్న రోజుల్లో ఆమెకు సహాయపడడానికి సిద్ధమైన ఆప్తులను సున్నితంగా తిరస్కరించడానికి ఎంతటి ఆత్మాభిమానం, మనో ధైర్యం కావాలి? ఉద్యమ నాయకురాలిగా, కళాకారిణిగా జేజేలు అందుకున్న మనిషిలో ముఫ్పై ఏడేళ్ళ వయసులో పదవతరగతి పాఠశాలలో చేరడానికి ఎంతటి ధైర్యం కావాలి?

ఈ పుస్తకానికి అనుబంధాలుగా సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, మద్దుకూరి చంద్రశేఖరరావు, సుంకర సత్యనారాయణ, తాపీ రాజమ్మ, మోటూరు ఉదయం వంటి తొలి తరం కమ్యూనిస్టు నాయకుల గురించి కోటేశ్వరమ్మ వ్రాసిన స్మారక వ్యాసాలు, వివిధ సందర్భాలలో వ్రాసిన ఇతర వ్యాసాలు, చందు పెంచిన చెట్టు, మనది తెలుగుదేశమమ్మా కవితలు ఉన్నాయి. ఈ వ్యాసాలలో ఉన్న విషయాలు (ముఖ్యంగా ఉదయం గారి గురించిన వ్యాసం) చదువుతుంటే కోటేశ్వరమ్మ ఈ పుస్తకంలో తన అనుభవాలని కొద్దిగానే చెప్పారని, ఆవిడకు తెలిసిన విషయాలన్నీ చెప్పి ఉంటే ఇది నిజంగానే పెద్ద గ్రంథమే అయ్యేదని, ఆ కాలపు చరిత్రను మరింత క్షుణ్ణంగా తెలుసుకోవడానికి వీలయ్యేదని అన్పిస్తుంది. తొంబై ఏళ్ళ కోటేశ్వరమ్మ గారిది ఇప్పటికీ వెనుక చూపు కాదని, ఆమెకు వర్తమానం పట్ల అలజడి, భవిష్యత్తుపై నమ్మకం ఉన్నాయని ఆమె వ్యాసాలు చెప్తాయి. విస్తృతంగా చదివారని, మంచి జ్ఞాపకశక్తి ఉందని అర్థమవుతుంది ఆమె రచనలు చూస్తే. సాహితీ వ్యాసంగంపై ఆమె లక్ష్యం నిలిపి ఉంటే ఆమెకూ, సాహిత్యానికీ లాభించేది.

సీతారామయ్య విడిపోయి వెళ్ళిపోవడానికి కారణాలు, అప్పటి సంఘటనల క్రమం సరిగా అర్థం కాలేదు (సరిగ్గా వివరించలేదు). పుస్తకంలో మరెక్కడా చూపని దాపరికం, తమ వివాహంలో మూడవ వ్యక్తి అయిన ‘ఆమె’ విషయంలో చూపారు ఎందుకో. ‘ఆమె’ గురించి ఎక్కడా ఒక్క మాట కూడా విమర్శనాత్మకంగా రాయకపోవడాన్ని కోటేశ్వరమ్మ గారి సంస్కారానికి నిదర్శనంగా అర్థం చేసుకున్నాను.

మరణం

విశాఖపట్నం నగరం మద్దిలపాలెంలోని కృష్ణా కాలేజీ ఎదురుగా మనవరాలు అనూరాధ ఇంట్లో ఉంటున్న కోటేశ్వరమ్మకు కొద్ది రోజుల క్రితం బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చింది. కేర్‌ ఆస్పత్రిలో చేర్పించినా పరిస్థితి విషమించడంతో 2018 సెప్టెంబర్‌ 19 బుధవారం వేకువజామున ఇంటివద్ద తుది శ్వాస విడిచారు. కోటేశ్వరమ్మ దేహాన్ని వైద్య విద్యార్థుల పరిశోధన కోసం ఆంధ్ర మెడికల్‌ కళాశాలకు అప్పగించారు.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.