కొయిలీరాయ్ (జననం 1947) కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో పట్టభద్రులు మరియు న్యాయ శాస్త్రంలో ఉన్నతవిద్యనభ్యసించారు. ఆమె 1970 నుంచీ ప్రగతి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. డైరెక్టర్ ఆఫ్ లా మార్టినినరీ (SEOMP) సొసైటీ హోదాలో, ఆమె తూర్పు ప్రాంతపు (SKIP) స్థానిక కార్యదర్శిగా వ్యవహరించారు. స్కిప్, ఒకేషనల్ మరియు సాంకేతిక అధ్యయనశాలల జాతీయ సంస్థ. ఆ సంఘానికి సభ్యురాలిగా, ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఉన్నారు. 1994 నుంచీ కొయిలీ మహిళా సమస్యలపై దృష్టి నిలిపారు. ప్రస్తుతం (NAWO) పశ్చిమ బెంగాల్ శాఖలో ముఖ్య వ్యక్తి. (NAWO)దేశంలోని మహిళలను, మహిళా సంస్థలను ఒక్కచోట కలిపే పెద్ద నెట్‌వర్క్.
చివరలో మొదలుపెట్టి మొదటికి వెళదామనుకుంటున్నారా?
నిజానికి, బెంగాలీలో ఒక వివరణ పత్రం ఇస్తాను. పోయిన క్రిస్టమస్, కొత్త సంవత్సరం ఇక్కడ బొంబాయిలో రేష్మి వద్ద గడపాలనుకొన్నాం. ఇద్దరం కలిసి రాలేకపోయాం. టికెట్ తీసుకొన్నాము, అన్ని ఏర్పాట్లు అయ్యాయి. కానీ నేను ఒంటరిగానే వచ్చాను. ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంది. దాదాపు పది రోజులపాటు వ్రాస్తూనే ఉన్నాను. ఆ తర్వాత కలకత్తా వెళ్ళిపోయాను.
నేను మా సంబంధం గురించి, అన్నింటి గురించి ఆలోచించాను. అది చాన్నాళ్ళ బంధం. మేము మొదటిసారి కలిసినపుడు నాకు పదో, పదకొండేళ్ళో. మేము ఒకేచోట ఉండేవాళ్ళం. అప్పుడు అలీపూర్ చాలా వేగంగా విస్తరిస్తూ ఉన్నది. అది చిన్న పల్లెటూరిలా
ఉండేది. ప్రతి ఒక్కరికీ ప్రతి ఒక్కరూ తెలుసు. మేము అక్కడికి వెళ్ళేసరికే వారక్కడ ఉన్నారు. మా అమ్మకు సంగీతమంటే ప్రాణం. మేము అక్కడికి వెళ్ళిన కొత్తల్లో, అమ్మను దుర్గా పూజల్లో సంగీత కార్యక్రమం ఏర్పాటు చేయమని అడిగారు.
మీకు తెలుసు కదా, కలకత్తాలో దుర్గాపూజ చాలా ముఖ్యమైన పండగ. మావారి కుటుంబం కూడా, సాంస్కృతాభిమానులు. అలా మేమందరమూ స్నేహితులమయ్యాం. మంచి స్నేహితులం.
రెండు కుటుంబాలకు ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. అందరం సన్నిహితులం. వారిరువురివీ రెండు వ్యాపార కుటుంబాలు. కొన్నాళ్ళు మేము ఎవరి పాటికి వారు ఉన్నాం. నేను ‘కుర్సె ఆంగ్’ బోర్డింగ్ స్కూల్లో చదువుకున్నాను. అతను ఇక్కడే ఉండేవాడు. అతను తన గ్రాడ్యుయేషన్ అవ్వగానే పెళ్ళి ప్రతిపాదన చేశాడు. నేను అప్పుడే కాలేజీలో అడుగుపెట్టాను. మా నాన్న ఒక పెద్ద పారిశ్రామిక వేత్త. అందుకే నేనన్నాను, ”నేను ఫలానా వారి అమ్మాయిని. నేను విదేశీ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ చదివిన అబ్బాయినే పెళ్ళి చేసుకుంటాను” అని. కాస్త అటూఇటూగా ఇలాగే అన్నాననుకుంట. నేను సరదాగా ఆటపట్టించడానికి అంటే, అతనా మాట మనసులో పెట్టుకున్నాడు. నెలరోజుల్లో అన్ని ఏర్పాట్లు చేసుకొని, ఇంగ్లండ్‌లో ఇంజనీరింగ్ చదవడానికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఉత్తరాలు వ్రాసేవాడు, ”నీవు నా కోసం వేచి ఉంటే ఇంజనీరింగ్ పూర్తి చేసి వస్తాను” అదీ ఇదీ అంటూ.
నేను అతనికి ఎలాంటి ఒప్పందం చేయలేదు. నా పనిలో నేను నిమగ్నమై ఉన్నా. నా సంగీతం, వక్తృత్వం, నాటకాలు, సంఘసేవ, నేను చాలా ఉత్సాహంగా నా జీవితాన్ని ఆనందిస్తున్నా. ఆ మధ్యలో ఒకసారి అతను వచ్చాడు. అతను చాలా అందగాడు. అమ్మాయిలు అతని అందానికి ముగ్ధులయ్యేవారు. అందుచేతనే, అతను తిరిగి వచ్చినపుడు, నేనూ అతని అందానికి తలవంచాను.
మీ ప్రణయాన్ని గురించి చెప్పండి.
నేను అతడు అందగాడనుకొన్నాను. చాలా అందగాడు. నేనప్పుడు పదమూడేళ్ళ వయసులో ఉన్నాను. ప్రతి ఒక్కరూ అతనంటే ఇష్టపడేవారు. నేను కూడా అతనొక ఫిల్మ్‌స్టార్‌లాగా ఉన్నాడు అనుకొన్నాను. ”నన్ను పెళ్ళి చేసుకుంటావా” అని అడిగాను. ”నువ్వేమయినా క్లియోపాత్రావా” అన్నాడు. నేనది గుర్తుపెట్టుకున్నాను. అతను నన్ను అడిగినప్పుడు అందుకే అలా బదులిచ్చాను.
మీరు కొంత వ్యవధి తర్వాత అతన్ని కలిశారనుకొంటా.
అవును. అతను కొద్దిరోజుల పాటే ఉన్నాడు. బహుశా, రెండు వారాలు. మేము తరచూ ఉత్తరాలు వ్రాసుకొనేవారం. ఇద్దరం ప్రేమలో మునిగి ఉన్నాం. మా ఇద్దరి అభిరుచులు ఒక్కటే. మా కుటుంబాలకు అభ్యంతరం ఉంటుందని అనుకోలేదు. ఇంతలో, స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న మా నాన్న, నాలోని నాయకత్వ లక్షణాలను గమనించి నన్ను రాజకీయాల్లోకి ప్రవేశించమని ప్రోత్సహించారు. నేను కూడా కొన్నాళ్ళు ఆ ఆలోచనలోనే ఉన్నాను. అతనికి అదే మాట వ్రాశాను. ”అయితే, మన దార్లు వేరవుతాయి. నాకు ఆ రంగం అంటేనే అసలు ఊపిరి ఆడదు”. ఈ విషయం గురించి బాగా ఆలోచించాను. నేనప్పటికే అతని ప్రేమలో మునిగి ఉన్నాను. నేను రాజకీయాల్లోకి వెళ్ళకూడదని నిర్ణయించుకొన్నాను. అదే నా మొదటి, సర్దుబాటు అనండి, త్యాగం అనండి. ఏదైనా, కానీ అది పూర్తి స్పృహతో తీసుకొన్న నిర్ణయం.
మీరు ఏమి ఎంపిక చేసుకున్నారు?
నేను ఒక ఎంపిక చేసుకున్నాను. అప్పుడు అతడు తిరిగి వచ్చాడు. ఇక, పెళ్ళి ప్రయత్నాలు మొదలుపెట్టాము.
అతను ఇంగ్లాండ్ నుండి తిరిగి వచ్చేసరికి, అన్నివిధాల అర్హతలున్న వరుడు, చక్కనివాడు. అతను ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ విభాగాల్లో ఇంజనీరింగ్ చేశాడు. ఆ రోజుల్లో డబుల్ డిగ్రీలు చేసేవారు అరుదు. అందులోను, అతను సంపన్న కుటుంబానికి చెందినవాడు. అతనికి పెళ్ళి సంబంధాలకు కొదవలేదు. ఫిల్మ్‌స్టార్స్‌తో సహా వారి అమ్మాయిని చేసుకొమ్మంటూ ప్రతిపాదనలు చేశారు. ఇంటికి వచ్చి కూర్చున్నారు. ఈ మధ్యలో అతనికి ఏదో ఒక ప్రేమ వ్యవహారం నడిచింది. నేను దాన్ని పట్టించుకోలేదు. ఎందుకో కానీ అది నిలిచే వ్యవహారం కాదని నాకు నమ్మకంగా అనిపించింది.
ఏమైనా, మా పెళ్ళికి అనేక అడ్డంకులు. అతని తల్లికి నేను అతని భార్య కావడం ఇష్టం లేకపోవడంతో సహా.
అప్పట్లో అతను ఎందరో కోరుకుంటున్న వరుడు కావడం ఆమెకు గర్వకారణమైంది. ఆమెలో అహంభావాన్ని నింపింది.
అది మా దారికడ్డు పడింది. ఆమె నిర్ణయం తీసుకోవాలని, తన మాటే చెల్లించుకోవాలని ఆవిడ పట్టుదల. చాలామంది పెళ్ళికూతుళ్ళను చూసి, వారిని వద్దనాలని ఆమె కోరిక. దానికి తోడు ప్రసిద్ధ బెంగాలీ తార ప్రతిరోజూ ఇంటికి వచ్చి ఆమె కూతురితో పెళ్ళిచేయమని బ్రతిమిలాడటం. అందుచేత అతను నన్ను వధువుగా ఎంపిక చేసుకోవడం ఆవిడకు ఏ మాత్రం ఇష్టంలేదు. అతని తండ్రికి అలాంటి ఆలోచనలు లేకపోయినా, ఆమె నన్ను స్వీకరించడానికి ససేమిరా అంగీకరించలేదు. ఏమైనా, చాలా ఇబ్బందులు. మేము వేరు కాపురం పెడదామా అన్న ఆలోచనలు చేశాం. చివరికి ఆమె మా పెళ్ళికి అంగీకరించారు. ఎన్నో బాధలను దాటి, ఎంతో కన్నీటితో తడిచి, అనేక ఇబ్బందుల మధ్య మా పెళ్ళి అయ్యింది. నేను ఆ వివరాలన్నింటిలోకి వెళ్ళదలచుకోలేదు. కానీ, అతను నా విషయంలో చాలా గట్టిగా నిలబడ్డాడు. అతను ఎవరి నుంచి ఏమీ తీసుకోలేదు.
ఎంత మేరకంటే, నేనంటే ఇష్టపడే అతని మేనమామ ఒకతను, అతని మనసు మళ్ళించాలని ప్రయత్నించాడు, ”నీకు తెలుసా, నువ్వు ఇంగ్లాండులో ఉన్నప్పుడు ఆమె ఎంతో జల్సా చేసింది” అంటూ. అప్పుడూ తను తిప్పికొట్టాడు, ”ఇది నా వ్యవహారం, నీ జోక్యం అవసరం లేదు” అంటూ.
అంటే, అతని కుటుంబం ముందు నన్ను బాగా వెనకేసుకొచ్చేవాడు. చివరికి మా పెళ్ళయింది. మమ్మల్ని చక్కని జంట అనేవారు అందరూ, చూపులకు కాదు. మా అభిరుచులు, మా చేతలు. అతను చక్కగా నాట్యం చేసేవాడు… నేనూ నాట్యం చేసేదాన్ని. అతను పాటలు పాడేవాడు, నేనూ పాడేదాన్ని. ఇద్దరం కలిసి నాటకాల్లో నటించేవాళ్ళం. అంతా ఎంతో ఆనందంగా సాగిపోతూ ఉండేది. మాకు బోలెడంతమంది మంచి స్నేహితులు ఉండేవారు. ప్రతి ఒక్కటీ ఎంతో సంతోషంగా ఉండేది. మాకు ఇద్దరు పిల్లలు. కానీ, ఇంటిలో బాధలు ఎప్పటిలాగానే. దాదాపు ఏడేళ్ళ తర్వాత మేము వేరు కాపురం పెట్టాము. ఇంటిలో పోరు చాలా మితిమీరింది. పిల్లలపై ప్రభావం చూపడం మొదలెట్టింది. మేం ఇక బయటకు వచ్చేశాం. అప్పటికి మా మామయ్య మరణించారు. కానీ, అది పెద్ద కుటుంబం. మా అత్తగారు, పెళ్ళికాని ఆడపడుచు, మరిది తదితరులు. మా సంబంధం చాలా సంతోషంగా సాగుతుండేది. నేను అతనిలో ఒక వింతకోణం గుర్తించాను. అతనికి జూదం పట్ల మక్కువ ఎక్కువ అని. అంటే, అది ఎలాంటి జూదమైనా రేసులు, పేకాట, దానిని ఏమంటారూ…
రౌలెట్?
రౌలెట్.
అది అతని వర్గానికి సంబంధించినదా?
నాది చాలా సంయమనం కలిగిన మనస్తత్వం. అతనిది విపరీత ధోరణి. అతనకి ఏదైనా నచ్చిందంటే విపరీతంగా నచ్చుతుంది. నచ్చకపోతే, అస్సలు నచ్చదు. అతనికి అంతా నలుపు, తెలుపు వ్యవహారమే. నడుమ బూడిదరంగు లేదు. అది మా మధ్య కొంత వత్తిడిని కలిగించసాగింది. అతను పేకాట వ్యసనంలో మునిగిపోసాగాడు. ప్రతి శని, ఆదివారాలు పేకాటతోనే గడిచిపోసాగాయి. ఇది నన్ను ఇబ్బంది పెట్టసాగింది. అతను బాగా పేరున్న బ్రిడ్జ్ ఆటగాడు. (అలాగని మూడు ముక్కలాటలో అతను అందె వేసిన చేయి కాదని కాదు) ఈ విషయం నన్ను బాగా కలచివేయసాగింది.
మా దాంపత్యంలో బాగా బాధపెట్టిన అంశం అదే. నేను ఒక సంఘటనను మాత్రం చెపుతాను. అతని చిన్న చెల్లెలు స్నానాల గదిలో జారి పడింది. నేను ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్ళాను. అతను కనీసం రానైనా రాలేదు. పైగా, పేకాట ఆడుకోడానికి వెళ్ళిపోయాడు. అది నిజంగా నన్ను నిర్ఘాంతపరిచింది. అదుగో అలాగే, నాకు అతనిలో ఒక కొత్త కోణం తెలియవచ్చింది.
ఇప్పుడు, చాలామంది మగవాళ్ళు అంతే కొయిలీ. భార్య బాధ్యత తీసుకోగానే, మగవారు వారి పనుల్లో వారు సాగుతారు. అది పేకాటే కానివ్వండి, వార్తాపత్రికలలో మునిగి పోవడం కానివ్వండి.
కావచ్చు. కావచ్చు. కానీ నేను దాన్ని అంగీకరించలేకపోయాను. అర్థం చేసుకోలేకపోయాను. కాబట్టి, ఆ ఒక్క విషయం నన్ను బాగా కలిచివేసింది. మిగిలినదంతా బాగానే ఉంది. కుటుంబసభ్యులు ఎక్కువవుతున్న కొద్దీ, మేము దగ్గరయ్యాము. కొన్నాళ్ళలా సాగింది. ఇంతలో నా అనారోగ్యం. చాలా కాలం పాటు, నా వెన్నెముక సమస్య వలన తొమ్మిది నెలల పాటు మంచాన పడ్డాను. అప్పుడు అతను నన్ను చూసుకున్న తీరు… మొదటి నెల రోజుల పాటు పగలొక నర్స్, రాత్రొక నర్స్ ఉన్నారు. ఆ తర్వాత అతనే అన్నీ తానయి సపర్యలు చేశాడు. బెడ్ ప్యాన్ ఇవ్వడం, మసాజ్ చేయడం నుంచీ అన్నీ అతనే చూస్కునేవాడు. అతని పనికి కూడా వెళ్ళేవాడు. అతను లేని సమయంలో మాత్రమే నర్స్ ఉండేది. ఉదయాలు, సాయంత్రాలు అన్నీ నాతోనే గడిపేవాడు. ఎటూ వెళ్ళేవాడు కాదు. ఆ తొమ్మిది నెలలు గడిచేసరికి ఉత్తమ భర్త అన్న కీర్తి సంపాదించేసాడు. అతను ఉత్తమ భర్తే. అతనికా అర్హత ఉంది. అతనికి అతని కుటుంబానికే తొలి ప్రాధాన్యత, అతని భార్య, ఇద్దరు కూతుళ్ళు.
అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రభుత్వ ఆహ్వానంపై నేను ఆ దేశంలో పర్యటించాను. అది చాలా ప్రతిష్టాత్మకమైన ఆహ్వానం.
అక్కడ నేను అయిదు వారాలు ఉన్నాను. అక్కడక్కడా బోధిస్తూ. నేను అతనికి చెప్పాను, అతనికి టికెట్ పంపిస్తానని, అధికార పర్యటన అయ్యాక ఇద్దరం విహారయాత్ర చేద్దామని. అలాంటి అవకాశం మళ్ళీ దొరకదు కదా. అతను అంగీకరించలేదు. అతను ఇద్దరు కూతుళ్ళను వదిలి రావడానికి ఇష్టపడలేదు. కూతుళ్ళతో అతని అనుబంధం అలాంటిది.
ఇంగ్లాండులో డబుల్ డిగ్రీలు సాధించిన ఇంజనీర్‌గా అందరూ అనుకొన్నంత ఎత్తుకు అతను వృత్తిలో ఎదగలేకపోయాడు. అతను చాలా అందంగా ఉండేవాడు. చాలా కష్టపడి పనిచేసేవాడు. మంచి పేరు సంపాదించుకున్నాడు. కానీ, అతనిలో ప్రేరణ కానీ, తృష్ణ కానీ లేవు. అతను ఉన్నదానితోనే సంతోషపడేవాడు.
బహుశా అతను తటస్థంగా వ్యవహరించే వారి కోవకు చెందుతారేమో…
అవును. కానీ నేను ఎలా చెప్పాలి. నేను ముందుకు తోసే మనిషిని. అతనిని నేనెప్పుడూ ముందుకు తోయలేదు. కానీ, కొన్నిసార్లు అనిపించేది నేను ముందుకు వెళుతున్న తీరు అతనికి నచ్చదని. నాకు అలాంటి అపనమ్మకాలు ఉండేవి. తరువాత మా సన్నిహిత మిత్రులు చెప్పిందేమిటంటే, అతనెప్పుడూ నా గురించి సగర్వంగా చెప్పుకునేవాడట. కానీ, నా ముందెప్పుడూ బయటపడలేదు .
అందుచేత, నాకెప్పుడూ తెలియలేదు అతనికి నా పనులు నచ్చాయో లేదో. కానీ, నేను కొంత అమాయకురాలినేమో. అతను ఇంటినీ, పిల్లలనూ, ఇతర వ్యవహారాలనూ చూసుకుంటున్న తీరును బట్టి అతని అభిప్రాయాలను గ్రహించవలసింది. కానీ, నేనెప్పుడూ అతను నన్ను మెచ్చుకోలేదన్న అసంతృప్తితో ఉండేదాన్ని. అదొక సమస్య కాదు, కానే కాదు.
మగవారెప్పుడూ ఉన్న వాటికి సంతోషపడినట్లు కనబడరు కదా?
ఎన్నడూ, కానీ ఒక సందర్భంలో నేను అతని నుంచి విడిపోవాలా అని ఆలోచించాను. చెప్పాను కదా, మేము విడి కాపురం పెట్టామని. మూడేళ్ళ తర్వాత మళ్ళీ ఉమ్మడిలోకి వెళ్ళాం, మా అత్తగారు ఆ పెద్ద ఇంటిలో ఒంటరిగా ఉంటున్నారని. అది మూడంతస్తుల విశాలమైన భవనం. అతని అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు వారి వారి ఆసక్తులను బట్టి అక్కడినుంచి వెళ్ళిపోయారు. ఇక, మా కుటుంబంలోని బంధువులంతా ఉమ్మడి కాపురాలు చేస్తున్నవారే. అత్తగారింట మంచి పేరు సంపాదించుకున్న వారే. మేమలా పెరిగాం. నేనొక్కదాన్నే కాస్త భిన్నంగా ఉన్నాను ఇప్పటిదాకా. బహుశా ఆ ఆలోచన నాలో తలెత్తసాగింది. నాకు మా అత్తగారు ఆ మూడంతస్తుల భవనంలో ఒంటరిగా ఉండడం అన్న భావన వెంటాడసాగింది. నేనామెతో అన్నాను, ”అమ్మా, మీరు ఒంటరిగా ఉంటున్నారు. మీరు సమ్మతిస్తే మీతో వచ్చి
ఉంటాము” అని. మేము వచ్చేస్తాము అని అనలేదు నేను. ఆ ముందు రాత్రి మా అక్క మా వారిని ఒప్పించడానికి ఎంతో ప్రయత్నించసాగింది. అతను అన్నాడు, ”నువ్వు ఉండలేవు. ఏదైనా జరిగితే నాతో చెప్పవు” అని. అప్పుడు నేనన్నాను, ”లేదు. నేను ఏమీ చెప్పను. కానీ ఇది మన కర్తవ్యం. ఆమె వృద్ధురాలు. ఆ ఇంటిలో చూసుకోవడానికి ఎవ్వరూ లేరు. ఇది మా పెంపకం. మంచయినా, చెడయినా ఆమెను గౌరవించాల్సిందే. ఆమె మీ కన్నతల్లి. మనం ఖచ్చితంగా తిరిగి వెళ్ళాల్సిందే” అని. అతను అంగీకరించలేదు.
”నీవు కావాలంటే తిరిగి వెళ్ళొచ్చు. కానీ తర్వాత ఎలాంటి ఫిర్యాదులూ చేయకూడదు” అతని షరతు అదీ. మేము తిరిగి వచ్చాము. ఆమె చేసిన ఏర్పాటు వలన మాది వేరే అంతస్తు. వేరే వంటిల్లు. అంతా సౌకర్యంగానే ఉండేది. సమస్యలేమీ లేవు.
అప్పటికి మాకు తెలియని విషయమేమిటంటే, ఆ ఇంటికి ఆస్తిపన్ను కట్టకపోవడం.
అది పెద్ద మొత్తమైంది. నేను అతనిని తరచూ అడుగుతూ ఉండేదాన్ని మనమెందుకు పన్నులు కట్టడంలేదు అని.
”అది నీకు సంబంధం లేని వ్యవహారం” అని కొట్టిపారేసేవాడు. బహుశా ఎక్కడో నాకు ఆ ఆస్తిపట్ల ఆసక్తి ఉందని భావించేవాడేమో. విషయం అది కాదు. నేను పన్నులు కట్టని వ్యవహారాలు ఇబ్బందుల్లో పడడం చాలాసార్లు చూశాను.
ఖాళీ చేయించడం?
అవును. ఒకరోజు, ఎట్టకేలకు… ఇవి గోప్యమైన విషయాలు. అయినా మీకు చెపుతున్నా. నేను అతని నుంచి విడిపోవాలా అని ఆలోచించవలసి వచ్చింది. ఒకానొక శుభోదయాన ఇల్లు ఖాళీ చేయమంటూ కార్పొరేషన్ మనుషులు ఎవిక్షన్ ఆర్డర్ చేతపట్టుకొని వచ్చారు. అంతకు ముందు అనేకసార్లు వారు హెచ్చరించి ఉన్నారు. ఎటువంటి చర్య తీసుకోలేదు, అతనితో సహా. ఆ ఇంటి కొడుకుగా అతను విషయం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేసి ఉండాల్సింది. ఆ రోజుటి సంఘటనను నేను వివరించలేను.
పన్ను వసూలు అధికారులు వచ్చి కూర్చున్నారు. మా అత్తగారు ఆ రోజు శాంతినికేతన్‌లో ఉన్న మా ఇంటికి ప్రయాణమై
ఉన్నారు. ఆమె పాటికి ఆమె వెళ్ళిపోయారు. మా కుటుంబాన్ని, మా పెద్ద బావగారిని అక్కడే వదిలేసి. కార్పొరేషన్ మనుషులు మా బావగారికి వివరాలు చెప్పారు. ”ఏం జరిగిందంటే, మా మామగారి పేరు, పెద్ద బావగారి పేరు ఒక్కటే ఎస్.కె.రాయ్. అందుచేత
ఉత్తరాలన్నీ ఎస్.కె.రాయ్ పేరిట వచ్చేవి. మా మామగారి తదనంతరం ఆ ఆస్తిని పేరు మార్పించలేదు. అందుచేత అన్ని ఉత్తరాలూ ఎస్.కె. రాయ్ పేరిట మా బావగారికి చేరేవి. ఆయన వాటిని పట్టించుకోలేదు. చాలా హెచ్చరికలు, నోటీసులు అందినా ఆయన వాటిని పట్టించుకోలేదు. ఎలాంటి పన్నులు కట్టలేదు.
కానీ అతనేం చేశాడు? అతను కేవలం…
అవును. అతను కేవలం సంపదను అనుభవిస్తూ మామగారు వదిలివెళ్ళిన వ్యాపారం చూసుకొంటున్నాడు.
నమూనా?
నమూనా. ధనికుని కొడుకు ప్రవర్తన. నేను మాత్రం నిర్ఘాంతపోయాను. అదృష్టవశాత్తు నాకు ఉన్నత ప్రభుత్వ అధికారి ఒకరు తెలుసు. ఆయన నేను చదువుకొనేటప్పుడు మా ప్రొఫెసర్. అదంతా వివరంగా చెప్పమంటారా… క్లుప్తంగా చెప్పనా?
ఫర్వాలేదు చెప్పండి.
ఓకే. నేను అతనికి ఫోన్ చేశాను. ఉదయం తొమ్మిది గంటలప్పుడు మీకు తెలుసు కదా. ఈ మనుషులు సాధారణంగా శనివారం పూట వస్తారు కోర్టుకెళ్ళే సమయం లేకుండా. ఆదివారం కోర్టుకు సెలవు.
నా కళ్ళకి ఆ సంఘటన కనబడుతున్నట్లుగా ఉంది.
అదృష్టవశాత్తు ఆయన ఫోన్ ఎత్తారు. నా దగ్గర ఆయన వ్యక్తిగతమైన నంబర్ ఉంది.
ఆయన అన్న మొదటి మాట, ”నీవు ఆ ఇంట్లో ఉంటూ ఇదెలా జరగనిచ్చావు కొయిలీ” అని. ”నాకు దీనిపై అధికారం లేదు. నేను ఒకరితో మాట్లాడుతాను. వారేమైనా సాయం చేయగలరేమో చూద్దాం. ఆయనను నేను అర్థించగలను, శాసించలేను. ఇది నా అధికార పరిధిని మించినది”.
ఈలోగా నేను అతనిని వెళ్ళి స్థానిక కౌన్సిలర్‌ని కలసి రమ్మన్నాను, కొద్ది సమయాన్ని పొందడం కోసం. అలాగే, ఎప్పటిలోగా కట్టాలో తెలుసుకుని రమ్మన్నాను. వారికి మా గురించి, మా కుటుంబం గురించి బాగా తెలుసు. వారు డబ్బు తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేరు.
మీరు వారికి పన్ను చెల్లించలేకపోయారా?
కాదు. కాదు. అది ఖాళీ చేయమన్న తాఖీదు. డబ్బు చెల్లించే కాలపరిమితి మించిపోయింది. ఎన్నో నోటీసులు. ఇప్పటిది ఆఖరి ఎవిక్షన్ నోటీసు. సినిమాల్లో చూపిస్తారే అలా. అప్పుడు నా భర్త మా కారు తీసుకొని కౌన్సిలర్ దగ్గరికి బయలుదేరారు. అధికారులు కారును బయటికి వెళ్ళనీయలేదు, ”ఆస్తిని దేనిని కదిలించకూడదు” అని. నా భర్త అప్పుడు కారు పెట్టేసి కౌన్సిలర్ ఇంటికి నడుచుకుంటూ వెళ్ళారు. పదిహేను నిమిషాల్లో సంబంధిత అధికారి నుంచి ఫోన్ వచ్చింది. నేను ఫోన్ ఎత్తాను. ఆ అధికారి ”కొయిలీ ఎవరు?” అని అడిగాడు. అప్పుడు మండిపడ్డాడు, ”భద్రలోక మహిళలూ” అదీ ఇదీ అంటూ. నేను నిశ్శబ్దంగా విన్నాను. ”ఒక లేఖ రాయండి” అన్నాడు. మళ్ళీ అడిగాడు ”ఎవరు కడతారు?” అని. ”నా భర్తా, అతని అన్న…”. ”నాకు మీ సంతకం కూడా కావాలి. పన్నుల వాయిదాలు సకాలంలో కడతామని గ్యారెంటీ ఇస్తూ” అన్నాడు. అప్పుడు ఎంత వత్తిడో మాటల్లో చెప్పలేను.
మొత్తానికి నా భర్తా, బావగారు పన్నులు వాయిదాల్లో చెల్లిస్తామని సంతకాలు చేశారు. నేను ప్రతి సంతకం చేశాను. మొత్తానికి ఆ గండం గడిచింది. ఒక్కరోజన్నా నా భర్త నా ప్రమేయం గురించి ప్రస్తావించలేదు. నేను అన్నాను, ”మీరు అయిదుగురు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు కలిసి మాట్లాడుకోండి ఈ పన్నులు ఎలా కట్టాలి, ఇతర వ్యవహారాలన్నీ”. వారిలో చాలామంది కలకత్తాలో లేరు. ”మీ కోసం నేను ఉత్తరం రాసిస్తాను. మీరు సంతకం చేయండి. మీరు చదవదలచుకోలేదు. కానీ, ఈ వ్యవహారాన్ని సావధానపరచుకోండి”. అతను ఒక్కమాటే అన్నాడు, ”నీకు అనవసరం”అని. ”ఇంత జరిగాక కూడా నాకు ప్రమేయం లేదంటారా?”. కనీసం ఒక్కమారు కూడా ఈ విషయమై మెచ్చుకోలు మాట కూడా అనలేదు, ఎన్నడూ, ఎప్పుడూ.
ఇదంతా భరింపశక్యంగా లేదు
వారం రోజుల తర్వాత మా అత్తగారు వస్తే అప్పుడన్నాను.”అమ్మా! నీవు ఆ మనుషులు రావడం చూశావు. అయినా వదిలేసి వెళ్ళావా? నీవు నా గురించి పట్టించుకోనక్కర్లేదు. నీ మనవరాళ్ళ గురించయినా పట్టించుకోవాలి కదా. వారు మీ రక్తం పంచుకొన్నవారు. నేనూ మా పుట్టింటికి వెళ్ళిపోయి ఉండవచ్చు. నాకు నా పుట్టిల్లు ఉంది కదా?” అప్పుడే మా అత్తగారితో నేను మాట్లాడడం. అంతే అన్నాను, అంతకు మించి మాట్లాడలేదు. దానికి ఆమె ”నాకు అర్థం కాలేదు” అన్నారు. ఆమెకు అర్థం కాలేదంట! ఇంటిచుట్టూ అంతమంది మనుషులు గుమిగూడారు. ఇంటి ముందు పోలీసులు. అయినా ఆమెకు ఏమీ అర్థం కాలేదంట. ”ఇంటిముందు ఆ గుంపేమిటని కానీ, ఆ పోలీసులు రావడమేంటని కానీ మీరు అడగలేదు. నేనెందుకు మిమ్మల్ని సాగనంపడానికి రాలేదు? మీరు కనీసం మనవరాళ్ళకైనా వెళుతున్నానని చెప్పలేదు. నేను వాళ్ళను తీసుకొని మా పుట్టింటికి వెళ్ళేదానిని. ఇదంతా చేయవలసిన అవసరం లేదు.”
అలా ఒకానొకరోజు ఘనీభవించిన సంఘటన వలన నేను నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. అతనితో విడిపోవడమా, కొనసాగడమా అని.
ఏమైనా నా జ్ఞాపకం అలా మిగిలిపోయింది. వారంతా కలిసి ఉమ్మడి నిర్ణయం తీసుకున్నారు. ఇంటిని అమ్మేయాలని, నాకు మా పనిమనిషి ద్వారా ఆ విషయం తెలిసింది. నా భర్తతో ఉన్న సమస్య ఏమిటంటే అతను మాట్లాడడు.
అతను మాట్లాడడం చాలా కష్టం. మిగిలిన కుటుంబమంతా మీరు అక్కడ ఉండకూడదనుకొంటున్నప్పుడు అతను వత్తిడి చేయలేకపోవచ్చు. ముందంతా మిమ్మల్ని సమర్ధిస్తూ మాట్లాడాడు కదా!
ఆ విషయమై నాకేమీ అభ్యంతరం లేదు. ఎందుకంటే ఏమి జరిగినా తనతో చెప్పొద్దు అన్నాడు. ఆ ఒప్పందం మీదే అతను ఆ ఇంటికి తిరిగి వచ్చాడు. నాకు కావలసిందంతా సమాచారం పంచుకోవడమే.
నాకు తెలుసు.
నాకు ఆ ఇంటిపై ఎలాంటి ఆసక్తి లేదు.
మీరేమంటున్నారో నాకు స్పష్టంగా తెలుస్తోంది.
నాకు ఆ ఇంటిపై ఎలాంటి ఆసక్తి లేదు. ఆ ఇంటిని ఎంతకు అమ్మారో కూడా నాకు తెలియదు. నాకు ఆసక్తి లేదు. కానీ, ఈ వ్యవహారమంతా ఆ అయిదుగురు సహోదరులు, వారి తల్లి మధ్యనే నడిచింది. నేనెప్పుడైనా ప్రస్తావించబోతే, అది నీకు సంబంధం లేని వ్యవహారం పొమ్మనేవారు. అది నా వ్యవహారం కాదా? నేను ఆ కుటుంబం కోసం అంత చేసాక? వారందరూ ఇవ్వాళ వీథుల్లో ఉండేవారు. ఇవ్వాళ వారంతా అనుభవిస్తున్న సంపద అంతా ఆ రోజు నేను ఆ ఇంటిని కాపాడబట్టే కదా? ఇదొక విషయం. అతడు మాట్లాడలేదు.
అతనన్నాడు, ”ఓ భగవంతుడా! నేను బతికి ఉన్నంతకాలం మాట పడాల్సిన విషయం ఇదీ”.
అందుకే నేనన్నాను, ”ఇకపై మీరు విననవసరం లేదు. ఇదే ఆఖరిసారి చెపుతున్నా.”
ఎందుకంటే, అప్పుడు నేను అతని నుంచి విడిపోదామా అని ఆలోచిస్తున్నా. ఇంతటి అవమానాన్ని భరించడం కష్టం.
మగవారు దాన్నొక సమస్యగా కూడా చూడరు.
కానీ, అప్పట్లో నాకు ఆ విషయం అర్థం కాలేదు.
కాదు. కొన్ని సంవత్సరాల క్రితం వరకూ నాకు కూడా ఆ విషయం అర్థం కాలేదు. కానీ, వారు మాత్రమే చూడదలచుకొన్న కొన్ని ఖచ్చితమైన పరిమితులు నాకు అవగతమవసాగాయి.
అయితే, ఆ ఒక్కసారి నేను అతని జీవితంలో నుంచి విడిపోదామని గట్టిగా అనుకొన్నాను. విడిపోవడం అన్నది అనుకున్నప్పుడే తక్షణం జరగాలి. కాలం సాగుతున్న కొద్దీ, ఆలోచిస్తున్నకొద్దీ సానుకూల దృక్పథం పెరుగుతుంది.
నాకై నేను సమాధానం చెప్పుకున్నాను. అతను నా కోసం అతని కుటుంబాన్ని ఎదిరించాడు. నా వెనుక ఒక రాయిలాగా నిలబడ్డాడు. అతనొక మంచి భర్త, మంచి తండ్రి, మంచి కుటుంబీకుడు. నాకు ఫిర్యాదులేమీ లేవు. ఈ విషయాన్ని వదిలేస్తాను. కానీ, ఆ విషయం నా మనసులో నిలిచిపోయింది. అతని పట్ల నా అభిప్రాయంలో ప్రభావం చూపింది. అతను మామూలుగానే ఉన్నాడు. అతనిపై ఈ సంఘటన ఎలాంటి ప్రభావం చూపినట్లు కనబడలేదు.
అందుకే నేనంటున్నాను. అతనికి ఇందులో ఇమిడి ఉన్నవన్నీ అర్థమై ఉండకపోవచ్చు.
అవును.
అతని కుటుంబం కోసం మీ ద్వారా ఇవన్నీ జరగడం కూడా అతనికి నచ్చకపోవడంతో, అతను మీ చొరవకు సానుకూలత ప్రకటించకపోయి ఉండొచ్చు. అతని అహంకారం అతన్ని ఆపి ఉండొచ్చు. అదే సమయాన మీ దుఃఖాన్ని అతను చూడలేకపోయాడు. బహుశా ఒక చిన్న మాట, చిన్న సంజ్ఞ దాన్ని మార్చి ఉండేది. అతనా పనిచేయలేదు.
ఇందులో చిత్రమైన విషయమేంటంటే, అతనే కాదు. అతని తల్లి, అన్న, అక్క ఎవరూ ఈ విషయాన్ని ఈనాటి వరకూ గుర్తించలేదు.
కాదు అది అర్థం చేసుకోవచ్చు. వారు దాన్ని మీ బాధ్యతగా భావించారు. అంతే.
అది నా జీవితంలో ఒక చేదు అనుభవం. అది కాకపోతే, జీవితం సాఫీగానే సాగుతున్నది. లైలీ పెళ్ళయింది. రేష్మి ఉద్యోగంలో చేరింది. అలాంటివన్నీ జరిగాయి. కానీ, చివరి రెండేళ్ళ కాలం అతను ఉద్యోగం నుంచి ముందస్తు విరమణ తీసుకున్నాడు. ఇంటిలో
ఉండడానికే పరిమితమయ్యాడు.
మీ అమ్మాయి పెళ్ళి సంగతేంటి? అదెలా జరిగింది?
అది బాగానే జరిగింది. మొదట్లో మేము అనేక సమస్యలు ఎదుర్కొన్నాం. ఎందుకంటే ఆమె మామగారు సి.పి.ఎం. వ్యవస్థలో ముఖ్యులు. మేమేమో బూర్జువాలం. దాంతో మొదట్లో కొద్దిపాటి వత్తిళ్ళు. చివరికి ఆయన పెళ్ళికి వచ్చారు. ఇప్పుడు మా అమ్మాయిని వదిలి ఉండలేరు. ఎటువంటి గొడవలూ ఏమీ లేవు. మా వైపు నుంచి అంతా సవ్యంగానే సాగింది.
అతను ముందస్తు ఉద్యోగ విరమణ చేశారా?
అవును. అతను ముందస్తు ఉద్యోగ విరమణ చేశారు. ఇదెలా చెప్పాలి? మా సంబంధంలో మా మధ్య మాటలు తగ్గసాగాయి. అతను సాయంత్రం పూట మద్యపానం తగ్గించుకొని బ్రిడ్జ్ ఆడసాగాడు. నేను సంతోషపడ్డాను. అతను పొగ తాగడం కొనసాగించాడు. మెల్లిగా ఏ తొమ్మిదింటికో ఇంటికి వచ్చేవాడు బ్రిడ్జ్ ఆడుకొని. అప్పుడు డ్రింక్ తీసుకునేవాడు. భోజనం చేసేసరికి ఏ పదకొండో, పదకొండున్నరో. నేను అంతవరకూ వేచి ఉండలేక పోయేదానిని. దాంతో మా భోజనాల వేళలు వేరయ్యాయి.
మేము మాట్లాడుకునే సమయాలు కరువయ్యాయి. నేను పనినుంచి వచ్చేసరికి అతను పేకాటకు వెళ్ళేవాడు. తిరిగి వచ్చాక గ్లాసు పట్టుకుని కూర్చునేవాడు. అది నాకు చిరాకు కలిగించేది. దాంతో, ఉదయాలు తప్పించి మేము మాట్లాడుకోవడమే తగ్గిపోసాగింది.
ఉదయాలు పాత రోజుల్లానే ఉండేవి. ఇద్దరం కలిసి టీ తాగుతూ మాట్లాడుకునేవారం. కానీ, సాయంత్రాలు చిరాకు పెట్టేవి.
అతను ఒంటరితనమనే భావనలో మునిగి ఉండి ఉంటారు…
మా అక్క కూడా అదే అంది. నిజానికి, ఆమె అన్నది కూడా ”నీ పర్యటనలు మానుకో” అని. కానీ నేనన్నాను, ”ముందు ఉద్యోగ విరమణ అంటే ఇంట్లో కూర్చోవడం కాదు. నీవు కావాలంటే ప్రొఫెషనల్ బ్రిడ్జ్ ఆడొచ్చు. మోడల్‌గా పనిచేయొచ్చు”. అతను వయసులో
ఉన్నప్పుడు మోడల్‌గా పనిచేశాడు. కానీ, ఆ ప్రేరణే లేదు.
విషాదం. చాలామంది ముందుకెళ్ళాలన్న తాపత్రయంలో మునిగి ఉంటారు. అలా లేని వాళ్ళను చూడడం విషాదమే. అతను మంచి నేర్పరితనం ఉన్న వ్యక్తి. తెలివిగలవాడు. అయినా, ముందుకెళ్ళాలన్న తపన లేదు. ఎవరికి వాళ్ళం ముందుకు సాగాలన్న తపన లేకపోవడం విషాదమే. అందులోనూ అతనిలో అన్ని కళలున్నాయి. అతని సంగీతం, నటన అన్నీ…
అవును. అతను సంగీతాన్ని కొనసాగించాడు.
కానీ, ఎక్కడో ఏదో లోపించింది
అవును. ఎక్కడో. అతను స్టేట్స్‌మన్ పత్రికలో వచ్చే క్రాస్‌వర్డ్ పజిల్స్ పూరించేవాడు. ఆ పై అతని పుస్తకాలుండేవి. చాలావరకు బ్రిడ్జ్ పుస్తకాలు. బాగా చదివేవాడు. ఎన్నో విషయాలు తెలిసినవాడు.
అతనొక నడిచే నిఘంటువు లాంటివాడు. అతను పుస్తకాల గురించి చాలా ఎక్కువగా మాట్లాడేవాడు. అది ఎప్పుడు మొదలయ్యిందో చెప్పలేను. మొదట్లో మమ్మల్ని ఒకరికి ఒకరు సరిజోడు… అనేవారు. కానీ, ఈ ముందస్తు ఉద్యోగ విరమణ తర్వాత మెల్లిగా సంగీత కార్యక్రమాలకు కూడా రావడం మానేశాడు. అతను అలా ముడుచుకుని పోవడంతో, నేను వాటికి ఒంటరిగానే వెళ్ళేదాన్ని. ఇప్పుడు మా అమ్మాయిలు అంటారు, ”అమ్మా, అతనికి నువ్వు ఒక దృఢమనస్కురాలివి. నీవు బలంగా ముందుకు సాగుతావు” అని. నిజమే, నేను నన్ను ముందుకు వెళ్ళేందుకు బలంగా ప్రేరేపించుకునే దానిని. కొంతమంది ఆడవాళ్ళు వారి భర్తలను ముందుకు ఎలా తోయాలని చూస్తారో నాకు తెలుసు. నేనెప్పుడూ ఒక మాట కూడా అనలేదు. మొదట్లో అన్న ఆ మాట, విదేశీ డిగ్రీ ఉన్న ఇంజనీర్ కావాలన్నది తప్పించి. అంతే. ఆ పై నేనెప్పుడూ అతనిని ముందుకు తోయలేదు.
పిల్లలను కూడా అంతే. వాళ్ళు సాధించిందంతా వారి స్వయంప్రేరితమే. నేనెప్పుడూ వారితో అనలేదు, ‘మీరు తరగతిలో మొదటి స్థానంలో రావాలి. మీరిది చేయాలి అది చేయాలి’ అని ఎప్పుడూ అనలేదు. నేను చెప్పేదానిని ”మంచి మనుషులు కండి” అని. అంతే. రేష్మి తన స్వంతంగా తను చేసుకొంది. అలాగే నా భర్తను కూడా నేను ముందుకు తోయలేదు.
అలాంటి ఒత్తిడి బయట నుంచి చాలా వచ్చి ఉంటుంది. నీవు ఒత్తిడి పెట్టక్కరలేదు. బయటవాళ్ళు ఉంటారు ”కొయిలీ చూడు, ఇతను చూడు” అంటూ.
కావచ్చు. అతని స్నేహితులు కూడా ఎప్పుడూ మెచ్చుకుంటూ ఉంటారు. నేను బిజీగా ఉంటానని, చురుకైన దానినని. అలా అతను నన్ను మెచ్చుకోలేదు అని నేననుకున్నా. మా స్నేహితులు చెప్పేవారు అతను నా గురించి ఎంతో గర్వపడేవాడని. అతను మెచ్చుకునేవాడు, కానీ నా ముందర కాదు. అందులోనూ, గత రెండు మూడేళ్ళుగా మా మధ్య సంభాషణలు తగ్గిపోయాయి. అతను ఆదివారాలు కూడా పేకాడుకోవడానికి వెళ్ళేవాడు. పొద్దునపూట కొన్ని గంటలు ఏదో పనిలో ఉండేవాడు. ఆ తర్వాత, గడియారం
ముళ్ళు కదలడానికి ఎదురుచూస్తూ ఉండేవాడు.
మా మధ్య ప్రేమ మృగ్యమైందని కాదు. కానీ, మా ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఘనీభవించసాగింది. చల్లగా, మంచుముద్దలా. మేము ముఖ్యమైన విషయాలే మాట్లాడుకునేవాళ్ళం. పిల్లల గురించి చర్చించుకునేవాళ్ళం. అదీ అవసరమైనంత మేరకే.
దానికి తోడు ఆయన పిల్లలు తనకన్నా నాతో ఎక్కువగా చనువుగా ఉంటారని భావించసాగారు. కానీ, ఇది తరువాత కలిగిన భావనే. ముందు లేదు.
పిల్లల్ని చూసి గర్వపడేవాడన్నారు?
సాధారణంగా. కానీ, ఆడపిల్లలు ఎదుగుతున్న కొద్దీ తల్లికి చేరువవుతారంటారు కదా. అలా, మేము చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. ఆయన ఒక్కడే మిగిలిపోయేవాడు. అదొక విషయం నేను అనుకొనేది. అతనికి తన కూతుళ్ళే సమస్తం.
అతనికి స్నేహితులు లేరా?
చాలామంది ఉన్నారని అనను. అతను చాలా మటుకు ఏకాంతాన్ని ఇష్టపడేవాడు. కానీ, అతనికి దగ్గరి స్నేహ బృందం ఒకటి
ఉండేది.
అదీ విషయం. ఉదాహరణకి ఒకసారి రీతూతో చర్చించాను. పెళ్ళయ్యాక కూడా అవే విలువలు ఉన్నప్పటికీ, దంపతుల మధ్య దూరం ఎలా పెరుగుతుంది అని.
నేను ఈ విషయం తెలుసుకోవాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా లాభం లేదు. ”నాలో ఏదైనా అంశం మీకు నచ్చట్లేదా? నా పట్ల ప్రేమ లేదా? చెప్పండి. నేను మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను” అని. నేనెప్పుడూ ఏదీ త్యాగం చేయవలసి రాలేదు. అతను అన్నీ ప్రోత్సహిస్తూనే ఉండేవాడు. నేను చాలా సమయం బయట గడుపుతానని మా అక్క అంది. ఇప్పుడు కూడా నేను నగరం బయటకు ప్రయాణించినా అది ఒక వారం అలాగ. కానీ అంతకుముందు, ప్రతిరోజూ పల్లెలకు వెళ్ళేదానిని. అతను నన్నెప్పుడూ ఆపలేదు, ఫిర్యాదు చేయలేదు.
పైగా పిల్లల్ని చూసుకొన్నాడు. అదొక విషయం.
అతనిలో ముఖ్యమైన విషయం ఏమిటంటే చాలా స్పష్టంగా ఉండేవాడు. లింగ వివక్ష ఉండేది కాదు. అతను దాన్ని నమ్మాడు, పాటించాడు. అతనెంత కపటంలేని వాడంటే నేను కపటం గల దానిగా భావించసాగాడు. నా భావోద్వేగాలను దాచిపెట్టుకుంటానని అతని నమ్మకం. కొన్నిసార్లు నేను వ్యవహార లౌక్యంగా ఉంటానని, ప్రవర్తిస్తాననీ, నా మనసులో మాటలు చెప్పననీ ఆయన భావించేవాడు. నన్ను నిజాయితీ లేనిదానినని భావించేవాడు.
అతను అదే పదం వాడాడా లేక అతనలా అనుకొని ఉంటాడని బహుశా మీరు భావించి ఉండొచ్చు…
అతను హిపోక్రిట్ అన్న పదం వాడాడు. నేను హిపోక్రిట్‌ని కాదు. కానీ కొన్ని సందర్భాలలో లౌక్యంగా వ్యవహరించవలసి వస్తుంది. అతనికి దానిపై నమ్మకం లేదు. నేను అన్నట్లుగా, అతనికి అన్నీ నలుపు, తెలుపు. ఆ నడుమ ఉన్న బూడిద వర్ణం ఛాయలు ఆయనకు తెలియదు.
అందుచేత, మా మధ్య ప్రేమ తగ్గలేదు కానీ, చివరి రెండు మూడు సంవత్సరాలు మా మధ్య మాటల అంతరం పెరిగింది. కానీ, సంగీతంపై మా ప్రేమను కొనసాగించాము ఎవరికి వారం. పేకాట, క్రాస్ వర్డ్స్, పుస్తక పఠనం. మేమిద్దరం కలిసి చేసేవి ఏమీ మిగలలేదు. అతను చనిపోవడానికి రెండు, మూడు నెలల ముందే అతను మళ్ళీ పాత మనిషిలా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అతను ఒక నాటకంలో నటించాడు. నన్నూ నటించమన్నాడు. ”లేదు, నాకు సమయం వీలు పడదు” అన్నాను. నాకు చాలా పని ఉంది. అలాగే, వాళ్ళమ్మ చేసే పనులను అతను ఎప్పుడూ అంగీకరించగలడని నేననుకోను. కానీ, అతను వెళ్ళిపోవడానికి ముందు చేసిన పూజ, ఒక యాదృచ్ఛికం. వాళ్ళమ్మ ఫోన్ చేసి, ”నాకు అక్కడికి వచ్చి నీతో పూజ చేయించుకోవాలని ఉంది” అంది. ఆమె వచ్చి మాతో ఉన్నారు. ఇదీ అసాధారణమే.