కంకాళం – వి. ప్రతిమ

అనంత నిశ్శబ్దాన్ని చీలుస్తూ హోరుగాలి… భయం గొల్పుతూ. తూరుపు గేటు బయట చిందరవందరగా పడి ఉన్న చెరుకు పిప్పిలో నుండి నడుస్తూ ఉలిక్కిపడిందామె. ఎంతో కాలం నుండి కుప్పలు కుప్పలుగా పోసి ఉన్న దానికి గుర్తుగా ఆ చెరుకు పిప్పి ఎండి ఎండి … గలగలలాడుతూ ఎడాపెడా కాళ్ళకు అడ్డం పడుతోంది. ఆ శబ్దానికి గేటువారగా ముడుచుకుని పడుకుని ఉన్న కుక్కపిల్ల ఒకటి నిద్ర లేచి కుయ్యి కుయ్యి మంటూ అరవసాగింది. అప్పటిదాకా బురద గుంటలో పొర్లినందుకు గుర్తుగా దాని ఒళ్ళంతా తడిచి బురద అంటుకుని ఉంది. గేటు బయట తలలు విరబోసుకుని నిలుచున్న చింతచెట్టు మూలంగా సాయంత్రం నాలుగ్గంటలకే చీకట్లు కమ్మేసినట్లుగా ఉంది.

గలగలలాడుతోన్న చెరుకు పిప్పిలో నుండి పిల్ల పామొకటి సరసరా పాకి గేటు పక్కనున్న గోడమీది నుండి లోపలికి జారిపోయింది.

భయంతో, దిగ్భ్రాంతితో ఆమె నరాలు ముడుచుకున్నాయి. అప్రయత్నంగా కుడిచేయి కొడుకు భుజాన్ని తాకింది.

అయినా ఆగకుండా ఇద్దరూ లోపలికడుగుపెట్టారు.

గేటు వద్ద నుండి కర్మాగారం భవంతి చాలా దూరంలో ఉంది. ఒకప్పుడు నున్నగా, నల్లగా మెరిసిపోతుండిన తారురోడ్డు అక్కడక్కడా గుంటలుపడి… ఆ గతుకుల్లో నుండి మొలిచిన పిచ్చి చెట్టు దుబ్బులు దుబ్బులుగా తమలో ఎన్నో పిల్ల పాముల్ని, పురుగూపుట్రాని దాచుకొని భయం గొల్పుతున్నాయి.

ఈ గేటుగుండా… ఈ తారురోడ్డు మీద ఎన్నెన్ని ట్రాక్టర్లూ, ఎన్ని చెరుకు నిండిన లారీలూ, ఎంతెంతమంది రైతులూ, వందలమంది ఉద్యోగులూ, తాత్కాలికంగా ఉన్న కార్మికులు… ప్రతిరోజు ఒక పెళ్ళి జరిగినట్లు సందడి సందడిగా ఉండేది. గేటు బయట మెయిన్‌ రోడ్డు మీద కూడా ఫర్లాంగు దూరం దాకా చెరుకు నిండిన ట్రాక్టర్లు నిలిచిపోయి ఉండేవి. అటువంటిదిప్పుడు ఈ చీకటిలాంటి నిశ్శబ్దం, నిర్మానుష్యం గుండెని తరుగుతున్నట్లుగా ఉంది.

పాతికేళ్ళ ముందు ఈ ఫ్యాక్టరీ పెట్టడానికి రైతు సోదరులూ, రాజకీయ నాయకులూ అంతా కలిసి ఊరూరా తిరిగి రైతులందరినీ ఒప్పించి ఈ కర్మాగారంలో వాటాదారులుగా చేర్పించడం… ఆమెకింకా కళ్ళముందు జరిగినట్లే ఉంది. అందులో తన తండ్రి కూడా ఒక వాటాదారు. చుట్టుపక్కలంతా మెట్ట నేలలే కావడంతో, అప్పటికే రైతులు వేరే పంట కోసం చూస్తుండడంతో చెరుకు వేయడానికి సుముఖత చూపించారు. ప్చ్‌… అదంతా ఒక కాలం.

అప్పటిదాకా చింతచెట్టు మీద నివాసమున్న గుడ్లగూబ ఒకటి వికృతంగా అరిచి ఆలోచనలో

ఉన్న ఆమె తలని తాకుతూ పారిపోయింది.

… … …

”ఒక్కొక్కటి చేస్తుంటాడు… అన్నీ అయిపోయినాయి… ఇప్పుడిదెత్తుకున్నాడు…” చేటలోని బియ్యాన్ని రెట్టింపు శబ్దం వచ్చేలా చెరుగుతూ తనలో తాను గొణుక్కుంది రత్నమ్మ.

ఆ చెరగడం తాలూకా విసురు ఆరుబయట కప్పులేని స్నానాల గదిలో స్నానం చేస్తున్న భర్తకి వినపడాలనే ఆమె ఉద్దేశ్యం. బియ్యం కడిగిపెట్టి ఎసరు కింద ఎక్కేసి మరికొన్ని కట్టెపేళ్ళు ఏరుకురావడానికి గడ్డివామి పక్కకెళ్ళింది. వామిమీద కప్పిన ముళ్ళ కంపలు గీరుకుని చేతిమీద రక్తమొచ్చింది.

రత్నమ్మకి చిరాకేసింది. తమ పెళ్ళయిన కొత్తలో ఈ దొడ్లోనే ఎన్నెన్ని పుట్ట ధాన్యం కూట్లు కట్టి ఉంచేవాళ్ళు. అయిపుట్ల వడ్లన్నీ ఆరుబయటుంచి కూడా ఏనాడూ వాటిమీద ముళ్ళకంపల్ని కాపలా వేసుకోవలసిన అవసరం రాలేదు. ఇప్పుడేమో ఉత్త గడ్డిని కాపాడుకోవడానికి ఇన్ని అవస్థలు. చిరాగ్గా చీరుకుపోయిన ముళ్ళకంపల్ని లాగి పక్కకి విసిరి మళ్ళీ పొయ్యి వద్దకు వచ్చింది.

అప్పటికి స్నానం చేసిన రాఘవయ్య రత్నమ్మని చూసి ఒకింత జంకుతూనే లోపలికెళ్ళాడు. భర్త లోపలికి వెళ్ళిందాకా సాలోచనగా చూసి దీర్ఘంగా నిట్టూర్చింది.

రత్నమ్మకి తాము నలుగురితో పాటుగా బతకలేకపోతుండామే అని మనోవేదన. అందరిలా నాలుగు వస్తువులూ కొనుక్కుని సుఖంగా ఉండాలని ఆశ. తమ చుట్టాలందరిలోనూ తామే తక్కువగా ఉన్నామని మధన. బతుకిట్లా పేలవంగా అయిపోవడానికి కారణం భర్తేనని ఆమె పూర్తి విశ్వాసం.

అయితే రాఘవయ్య రత్నమ్మ అనుకునేంత చాతకానివాడు, తెలివితక్కువ వాడు ఏంకాదు. ఇదే పదెకరాల్లో వ్యవసాయం చేసే ఇద్దరు కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేసి పంపించాడు. వాళ్ళ మనవళ్ళూ, సరవళ్ళూ, మంచీచెడ్డా, కానుపులూ అన్నీ చూశాడు. కొడుకుని కాలేజీలో చేర్పించాడు. అప్పుడు పైరు బాగానే పండేది. నీళ్ళకి కొదవుండేది కాదు. ఆ తర్వాత చెనగేస్తే కూడా బాగనే అయ్యేది. తర్వాత్తర్వాత ఎరువులు, విత్తనాలు, నీళ్ళు అన్నీ కొనాల్సి రావడంతో ఏ పంటేసినా గిట్టుబాటు కావడంలేదు. రెండేళ్ళ నుండీ పైసా చేతికి రాలేదు. కూతుళ్ళ పెళ్ళిళ్ళకీ, పబ్బాలకీ… కొడుకుని కాలేజీలో చేర్చడానికి చేసిన అప్పులు పాపంలా పెరిగిపోతూంటే మళ్ళీ మళ్ళీ చెనగేసి చేతులు కాల్చుకోలేక ఈ సారి ధైర్యం చేసి మరో కొత్తప్పు పుట్టించి చెరుకు పంటేసినాడు. అదీ రాఘవయ్య చేసిన తప్పు… ప్రస్తుతానికి రత్నమ్మ విసురూ…

అయితే మళ్ళీ తనలో తనే చెరుకు పంటేసి చెడిపోయినోడు లేడులే అని సరిపెట్టుకుంది. పోయినేడు, అంతకు ముందటేడు పోగొట్టుకున్నదంతా… అప్పులు… వడ్డీల బాధల్లో నుండి బయటపడ్తాం లెమ్మని ఆశపడింది… ఆతృతపడింది.

కానీ రాఘవయ్య రత్నమ్మ ఆశించినట్లుగా చెరుకు నరికాడే కానీ డబ్బులు చేతికందలేదు. ట్రాక్టరోళ్ళు, కూలోళ్ళు ఇంటి చుట్టూ తిరిగి పోతుండారు. చెరుకు నరకడం ఇక్కడి కూలోళ్ళకి చేతకాదని ఆరంబాకం అవతలి నుండి కూలోళ్ళను పిలవాల్సొచ్చింది. ఆ అరవ కూలోళ్ళు మాటలు కాదు అడిగిపోతుండారు. రాఘవయ్య ఫ్యాక్టరీ చుట్టూ తిరుగుతున్నాడు. రోజులు గడుస్తున్నాయి. పాత వడ్డీలకు కొత్తవి చేరి ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి. రత్నమ్మ గుండెలు జారిపోతున్నాయి.

”మన్దగ్గిరేమన్నా డబ్బులుండి ఏసినామా? ఎప్పుడయినా ఆ మార్వాడీల దగ్గర తేవాల్సిందే కదా… బ్యాంకులు అప్పులిస్తాయి అంటారు. వాటిచుట్టూ తిరిగేదెవురు? తిరిగి తిరిగి తెచ్చుకున్నా ఆ బ్యాంకి అప్పులు కూడా చాపకింద నీళ్ళు మాదిరి మనుషుల్ని ముంచేస్తుండె… బ్యాంకులకిప్పుడు అప్పులిచ్చేది ఒక యాపారమయిపోయుండాది… రైతుల్ని ముంచేదానికి…”

పనిచేస్తూ చేస్తూనే గొణుక్కుంటుంది రత్నమ్మ. ఒక్కోసారి పెద్దపెద్దగానే అప్పునీ, వడ్డీనీ, చెరుకునీ, ఫ్యాక్టరీని అన్నింటిని కలిపి శాపనార్ధాలు పెడుతుంది. రత్నమ్మ ఆలోచనల్లో నుండి తేరుకుని అన్నంకుండని లోపల పెట్టొచ్చేసరికి రాఘవయ్య లేడు.

”మళ్ళీ బొయినాడు గావాల ఫ్యాక్టరీకి. కాళ్ళరిగేట్టు తిరగతుండాండు కావల్సిందేలే ఈయినికి” కొరివి కట్టెల్ని బయటికి లాగి విసురుగా ఆర్పుతూ అనుకుంది.

అయితే రాఘవయ్య చక్కెర ఫ్యాక్టరీకి కాకుండా సి.డి.సి. ఛైర్మన్‌ రఘునాధరెడ్డి ఇంటికి పొయ్యాడు. రఘునాథరెడ్డి చెపితే ఫ్యాక్టరీలో డబ్బులు తొందరగా యిస్తారని హరినాథయ్య చెప్పారు. అందుకని రఘునాథరెడ్డిని బతిమాలకుందామని బయల్దేరాడు.

రఘునాథరెడ్డి పేదసాదా, మంచిచెడ్డా, కష్టంనష్టం తెల్సినోడు. అందరినీ గౌరవిస్తాడు. చిన్నచూపు చూడడు. అయినా చిన్నబోతూ, మధనపడుతూ ముందు వెనకలాడుతూనే రఘునాధరెడ్డి ఇంటి వైపుగా నడుస్తున్నాడు రాఘవయ్య.

… … …

”బొక్కపడేదాకా దొబ్బి తినేది… తినేప్పుడు పట్టిచ్చుకోకుండా అంతా అయిపోయిన తర్వాత డొల్లని ఒకటికి సగంగా ప్రైవేటు వ్యక్తులకు అమ్మేసేది… ఎక్కడ బట్టినా ఇదే కద సార్‌ జరగతా ఉండేది. పోనీ జరిగిందేదో జరిగిపోయింది. ప్రభుత్వాన్ని కూడా ఎవురైనా ప్రైవేటు వ్యక్తులకప్పగించేస్తే బాగుపడిపోద్ది,” చంద్రశేఖరం రసాయన శాస్త్రంలో పి.జి ఆనర్స్‌ చేసినవాడు. చాలాకాలం తణుకు ఫ్యాక్టరీలో కెమిస్టుగా పనిచేసి స్వంత జిల్లాకి రావాలని ఈ మధ్యనే వచ్చాడు.

”అసలెందుకు సార్‌… ఆలోచనలేని పనులేగానీ ఇవన్నీ. ఇప్పుడైనా ఫ్యాక్టరీని లాభాల బాటలో నడిపించొచ్చు…”

చంద్రశేఖరం మాటలకి విస్తుపోయి చూశాడు మేనేజర్‌. మామిడిపండు రసం నిండిన గ్లాసుని అందుకుంటూ రఘునాధరెడ్డి కూడా ఆసక్తిగా చంద్రశేఖరంకేసి చూడసాగాడు.

”అవును సార్‌…” రఘునాధరెడ్డి వంక చూస్తూ గ్లాసులోని జ్యూస్‌ని ఒక్క గుక్క లోపలికి తీసుకున్నాడు చంద్రశేఖరం. ”మన దేశంలో చెరుకు, మొక్కజొన్న ఇంత విస్తారంగా పండుతున్న దానికి ఇథనాల్‌ ఉత్పత్తి చేపట్టామనుకోండి, అసలీ పెట్రోల్‌ సమస్య లేకుండా పోతుంది. బ్రెజిల్‌ చూడండి… ఇరవై నాలుగు శాతం ఇధనాల్‌తో కూడిన పెట్రోల్‌ను అమ్ముతోంది. బ్రెజిల్‌ చెరుకు నుండి ఇధనాల్‌ని

ఉత్పత్తి చేస్తోంటే అమెరికా మొక్కజొన్న నుండి తీస్తోంది. కానీ మన దేశం మాత్రం మేధావుల్ని ఉపయోగించుకోకుండా వలస పంపుతుంది”. వ్యంగ్యమో, దిగులో తెలీనట్లుగా జ్యూస్‌ని గటగటా తాగి శబ్దం వచ్చేలా గ్లాసుని టీపాయ్‌ మీదుంచాడు చంద్రశేఖరం. ఆ శబ్దానికి అప్పటిదాకా టీపాయ్‌ మీద వాలి ఉన్న పిచ్చుక ఒకటి కిచకిచా శబ్దం చేస్తూ దాని గూటిలోనికి చేరుకుని ఒక గడ్డిపోచని చంద్రశేఖరం మీదికి విసిరింది.

”అవును నిజమే! నేనీ మధ్యనే చదివాను. చమురు సంక్షోభం నుండి బయట పడేందుకు బ్రెజిల్‌ తీసుకున్న నిర్ణయంవల్ల ఆ దేశం పర్యావరణం, వ్యవసాయపరంగానూ ఎంతో లాభపడింది” మాట నెమ్మదిగా ఉన్నా చాలా స్పష్టంగా ఉంటుంది రఘునాధరెడ్డి గొంతు.

– ”ప్చ్‌…” నిట్టూర్చాడు చంద్రశేఖరం. ”ఆ దేశం ఇప్పటికే పూర్తిగా ఇధనాల్‌తో నడిచే వాహనాలని ప్రవేశపెట్టింది. మన దేశం 2004 నాటికి కూడా పెట్రోల్‌లో పది శాతం మాత్రమే ఇధనాల్‌ కలపాలని నిర్ణయించుకుంది” ప్రభుత్వం చేతకానితనం మీద నిరసన చంద్రశేఖరం గొంతులో.

పర్చేజింగ్‌ ఆఫీసర్‌, మేనేజర్ల లావాదేవీలూ… కుమ్మక్కులూ తెలీకుండా ఏం పోలేదు చంద్రశేఖరానికి. నిజానికతడు వేసిన మొదటి చురక అదే. అందుకే అతడు మాట్లాడుతుంటే మేనేజరు ముఖం గంటు పెట్టుకుని కూర్చున్నాడు. అతడ్నే గమనిస్తూ రఘనాధరెడ్డి వెనక నిల్చున్న ఫోర్‌మెన్‌ రవణయ్య లోలోపలే చంకలు గుద్దుకుంటున్నాడు. ఫ్యాక్టరీ ఈ స్థితికి చేరడానికి తన వంతు సాయమేదో తానూ చేశాడు మేనేజరు. ఒకవైపు ఫ్యాక్టరీ దిగజారిపోతుంటే మరోవైపు అతడి ఆస్తులు పెరిగిపోవడాన్ని ఫ్యాక్టరీకొచ్చిన అతి తక్కువ కాలంలోనే గమనించాడు చంద్రశేఖరం.

అవతల రాఘవయ్య వరండాలో కూర్చుని అంతా వింటున్నాడు. అయితే ఎంత ఆలోచించినా వీళ్ళంతా ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కావడంలేదు అతనికి. మన దేశంలో ఉండే వనరుల్ని ప్రభుత్వం సరిగా వినియోగించుకోవడం లేదనీ, చెరుకు నుండి పెట్రోల్‌లో కలిపే ఆయిలేదో తీయొచ్చునని చెప్పుకుంటున్నారు. సమయానికి మేనేజరు కూడా అక్కడే ఉన్నాడు. చెరుకు డబ్బులడగొచ్చుననుకున్నాడు.

అప్పటికి సూర్యుడు నడినెత్తిని దాటి పడమరకి మారుతున్నాడు. కడుపులో కరకరలాడుతోంది. ‘ఈ వచ్చినోళ్ళు తాగనూ, తిననూగా మాట్లాడిందే మాట్లాడుకోనుగా ఉండారు…’ తనలో తానే మధనపడుతూ ఆరుబయట మొక్కల్లో కిచకిచలాడుతోన్న పిచ్చుకల్ని విసుక్కుంటూ రఘునాధరెడ్డి పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు రాఘవయ్య.

”లేద్సార్‌! ఇదికానీ ప్రభుత్వం ఆలోచించగలిగితే చెరుకు, మొక్కజొన్న పండించే రైతులకు గిట్టుబాటు ధరలు లభించడమే కాకుండా గ్రామీణ ప్రాంతాలు బాగా డెవలప్‌ అవుతాయి సార్‌… కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం మిగుల్తుంది. జీవితాల్ని, ప్రాణాల్ని కూడా పోగొట్టుకుంటోన్న రైతుల్ని మనం కాపాడుకోగలం సర్‌”. చంద్రశేఖరం గొంతులో, ఆలోచనల్లో ఆవేదన.

గతంలో ఈ విషయాన్ని కేన్‌ కమీషనర్‌. డైరెక్టర్‌ ఆఫ్‌ ది షుగర్స్‌ దృష్టికి కూడా తీసుకెళ్ళాడతడు. అత్యంత విలువైన ఆలోచనలన్నీ షరా మామూలుగా బుట్ట దాఖలు కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. అందుకే ఒక విరక్తితో సొంత జిల్లా కొచ్చేశాడతడు. అయితే అక్కడున్న అందరికీ తెలుసు, ఇదంతా తాము కాలక్షేపానికి మాట్లాడుకుంటోన్న మాటలే తప్ప ప్రభుత్వం దీన్ని సీరియస్‌గా పట్టించుకోదని, అదంత తేలిగ్గా జరిగే విషయం కాదనీను.

మాట్లాడుకుంటూ అంతా గేటువంక వెళ్తున్నారు.

రాఘవయ్య కెందుకో చప్పున దిగులు కమ్ముకొచ్చింది. తనలాగే ఈ దేశం కూడా చాలా అప్పుల్లో కూరుకుపోయినట్లుగా ఉంది. ఇందాకట్నుండి అంతా అదే మాట్లాడుకుంటుండారు. ప్రపంచ బ్యాంకు వడ్డీలు, ఋణాలు అంతా అయోమయంగా అర్ధమయ్యీ కాకుండా ఉంది రాఘవయ్యకి. దేశానికి కూడా అప్పులుంటాయా? వాళ్ళు కూడా మార్వాడీల మాదిరిగా షరతులు పెడతారా? వడ్డీలు మింగుతారా?

వాళ్ళందరినీ సాగనంపి తిరిగి ఇంట్లోకొస్తూ, ”ఏం రాఘవయ్యా?” అంటూ రఘునాధరెడ్డి పలకరిస్తే తప్ప తేరుకోలేదు రాఘవయ్య.

అప్పటికి రేగిన ఆకలంతా చచ్చిపోయిందతడి కడుపులో.

… … …

”అన్న… ఫ్యాక్టరీని అమ్మేస్తుండారంట గదన్నా?” ఫ్యాక్టరీలో హెల్పర్‌గా పనిచేసే వెంకటేశ్వర్లు దిగులుగా చెప్పాడు. అమ్మేస్తే దాంట్లో పనిచేసేవాళ్ళంతా ఏమయిపోతారో అర్థం కావడం లేదతనికి. రాఘవయ్య విస్తుపోయి చూస్తున్నాడు వెంకటేశ్వర్లుకేసి.

”జాతీయ స్థాయిలో పురస్కారాలు పొందిన ఫ్యాక్టరీని… ఈ రోజు కూడా వంద కోట్లు చేసే ఫ్యాక్టరీని రెండు కోట్లకి బేరం పెట్టారంటన్నా” ఏడుస్తున్నాడు ఫోర్‌మెన్‌ రవణయ్య. తమ స్వంత ఆస్తులేవో అమ్ముకుంటున్నట్లుగా ఉందతడి పరిస్థితి.

ఆ ఫ్యాక్టరీ పెట్టింది మొదలూ రవణయ్య అక్కడే పనిచేస్తున్నాడు.

లక్షా ఎనభై వేల టన్నుల చెరుకు గానుగాడ్డం తెలుసు రవణయ్యకి. క్రష్షింగ్‌ చేయక ఎక్కువయిన చెరుకుని ఫ్యాక్టరీ పర్మిషన్‌తోనే జిల్లాలో కొత్తగా పెట్టిన మరో ప్రైవేటు ఫ్యాక్టరీకి తోలడం దగ్గర్నుండి ఆదాయం ఎక్కువయి కార్మికులు కొందరికి జీతాలు కాక ఒకటికి రెండుసార్లు బోనస్‌లివ్వడం దగ్గర్నుండీ… పనెక్కువయి ఎక్స్‌ట్రా కార్మికుల్ని పెట్టుకోవడం దగ్గర్నుండీ… ఇవాళ పర్మినెంటు పనోళ్ళనే తీసేసేదాకా. ఇంకా ఇవ్వాళ రెండు నెలలకోసారి కూడా కార్మికులకి జీతాలివ్వలేని స్థితిలోకి ఫ్యాక్టరీ నెట్టబడ్డం దాకా తెలీని విషయమంటూ లేదు రవణయ్యకి.

రొయ్యలు గుంటలు దూసుకొచ్చి చెరుకు పంట తగ్గిపోవడం… ఉత్పత్తి తగ్గిన పరిస్థితుల్లో ఫ్యాక్టరీ గాడి తప్పడం… ఎక్కడివాళ్ళక్కడ గాదె కింద తవ్వుకు తినడం గురించి తెలుసు.

అంతర్జాతీయ ఒప్పందాల గురించి రవణయ్యకు తెలీకపోవచ్చుగానీ, ఇక్కడిన్ని చక్కెర కర్మాగారాలు పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పంచదారను అధికంగా దిగుమతి చేసుకోవడం గురించి తెలుసు. కేంద్రం పదహారు రూపాయలకి కొన్న పంచదారని మార్కెట్లో కిలో పదమూడు రూపాయలకే విక్రయిస్తుంచడంతో మొత్తం ఫ్యాక్టరీల పరిస్థితే అయోమయంగా తయారయింది. గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన చక్కెరను అమ్ముకునే దారిలేక, ఆదాయం లేక రైతులకు చెరుకు డబ్బులివ్వలేక అన్ని పరిస్థితులు…ఫ్యాక్టరీలో తొలినాటి నుండి ఇవ్వాల్టి వరకూ జరిగిన అనేకానేక పరిణామాలకు సాక్షీభూతం రవణయ్య.

రవణయ్యకు ఏడవడం కూడా తెలుసు.

అప్పటికే బాగా డీలాపడిపోయున్నాడు రాఘవయ్య. రవణయ్య ఏడుపుతో కడుపులో తిప్పినట్లుగా అయ్యింది. చెరుకు నరికి మూడు నెలలైపోయింది. ఈ తొంభై దినాల్నుండీ ఫ్యాక్టరీ చుట్టూ, అరవ కొరవ రఘునాధరెడ్డి ఇంటి చుట్టూ తిరిగి తిరిగి చావయిపోయింది. ఛైర్మన్‌ చెప్తుంటే మాత్రం ఇవ్వడానికూడా డబ్బులుండాల కదా… ఈ లోపల నరికిన చెరుకు మళ్ళీ ఎదిగొస్తా ఉండాది. చెరుకు నరకాలంటే మళ్ళీ కూలోళ్ళు, ట్రాక్టర్లూ… తల తిరిగిపోయింది రాఘవయ్యకి. ఇంక కొత్త అప్పు కూడా పుట్టేట్టుగా లేదు.

అసలే మే నెల కాలుస్తోంది.

యాభయ్యయిదేళ్ళ జీవితంలో ఇటువంటి ఎండలు ఇదివరకెన్నడూ చూడలేదు రాఘవయ్య. దాహానికి మలమలా మాడిపోతుండారు జనం. బయట వేడి… లోపల వేడి. చెప్పులరిగేట్టుగా తిరిగి తిరిగి పదేళ్ళ వయసు మీదపడ్డట్టుగా ఉన్నాడు రాఘవయ్య.

”మనోళ్ళంతా ఫ్యాక్టరీ అమ్మేదానికి లేదంటూ స్ట్రయికు చేస్తుండారు” మళ్ళీ వెంకటేశ్వర్లే అన్నాడు. వెంకటేశ్వర్లు తండ్రి రాఘవయ్యకి మంచి స్నేహితుడు. అంతా ఒకే వీథిలో ఉండడంతో ఒక కుటుంబంలోలా ఉండేవాళ్ళు.

కార్మికులంతా ఆందోళన చేయడం… నినాదాలతో ఊరంతా హోరెత్తిపోవడం… రాస్తారోకోలు… అన్నీ రత్నమ్మకు కూడా తెలుసు. వింటూనే ఉంది అన్నీ.

”అయితే ఏమయ్యా… అట్టన్న అమ్మేస్తే మంచోళ్ళ చేతికి పొయ్యిందంటే రైతులు బాగుపడతారు. చెరుకు నరికిన డబ్బులన్నా వస్తాయి. ఇప్పుడిట్టనే ఉంటే ఈ మనుషులు డబ్బుల్యాడ ఇస్తుండారు…” తనకు తెల్సిందేదో చెప్పబోయింది రత్నమ్మ.

”నువ్వు గమ్మునుండు…” కసురుకున్నాడు రాఘవయ్య.

అయితే రత్నమ్మాశించినట్లుగా ఫ్యాక్టరీ వేరేవాళ్ళ చేతుల్లోకి పోలేదు. కార్మిక నాయకుడు కోర్టుకు వెళ్ళి ‘స్టే’ ఆర్డరు తీసుకొచ్చాడు.

కర్మాగారం అమ్మకపోవడం బాగానే ఉందిగానీ ఇప్పుడు ఫ్యాక్టరీ రెండింటికీ చెడ్డ రేవడయిపోయింది.

ఇటు ఉద్యోగాల్లేక కార్మికులూ, అటు బాకీలు చెల్లించక రైతులూ అంతా ఊబిలో కూరుకుపొయ్యారు. అటూ, ఇటూ కాకుండా ఊగిసలాడుతోంది ఫ్యాక్టరీ.

ఆశచావని కొంతమంది ఫ్యాక్టరీ పిలుస్తుందని ఎదురుచూస్తున్నారు. చాలామంది నెల్లూర్లో రిక్షాలు తొక్కుతూ, మూటలు మోస్తూ… రైసుమిల్లుల్లో కూలీలుగా నిలిచిపోతే, మరికొంతమంది పనిని వెతుక్కుంటూ తిరుపతికి పొయ్యారు. మరికొందరు పెళ్ళాం పిల్లల్ని అనాధల్ని చేసి ఊళ్ళుపట్టి పొయ్యారు.

గానుగాడేటప్పుడు పెట్టుకుంటామంటూ పని లేనప్పుడల్లా వర్కర్లని తీసి పారేయడం… మళ్ళీ క్రషింగ్‌ టైమప్పుడు వేరేవాళ్ళని పెట్టుకోవడం ఇదంతా మామూలే కానీ, ఈ విధంగా ఫ్యాక్టరీ అమ్మేసే పరిస్థితి వచ్చి ఉద్యోగస్థులంతా ఈదినబడ్డం మాత్రం ఇప్పుడే చూస్తోంది రత్నమ్మ.

”గవర్నమెంటు సొమ్ముకి అమ్మా అబ్బ ఎవురుబోన్నా” నీర్సంగా నిట్టూర్చాడు వెంకటేశ్వర్లు రవణయ్యని ఓదారుస్తూ.

… … …

గట్టిగా, చల్లగా ఉన్న మంచుకొండల్లో నడుస్తున్నట్లుగా ఉంది రత్నమ్మకి. ఎండిన చెరుకు గెణుపుల్లో నుండి ముళ్ళేవో గుచ్చుకుంటున్నాయి. అయితే గుండెల్లో గుచ్చుకునే కనబడని ముళ్ళకంటే ఇవేమంత బాధగా లేవు.

అనుకుంటాంగానీ ఈ ఆస్తులూ, అంతస్థులూ, వస్తువులూ అన్నీ ఈ రోజుంటాయి, రేపు పోవచ్చు. కానీ మనిషి దూరమైతే మళ్ళీ వస్తాడా? దగ్గరున్నప్పుడు తెలీని కొత్త విలువలేవో మనసుని పిండుతున్నాయి.

కదలిక లేని సముద్రంలాంటి ఈ ఫ్యాక్టరీ లోపల కనబడని అలజడేదో వెంటాడుతున్నట్టుగా ఉంది. హోరుగాలి వాళ్ళిద్దర్నీ చుట్టేస్తూ దూసుకుపోతోంది.

తడబడుతూన్న కాళ్ళతో, ఒణుకుతోన్న చేతులతో చుట్టూ చూసింది. నూట యాభై ఎకరాల విస్తీర్ణంగల ఆ ఫ్యాక్టరీలో ఎక్కడో ఒకచోట శవాల్లా తిరుగుతోన్న ఒకరిద్దరు తప్ప మనిషి జాడేమీ లేదు. కొడుకు కూడా తండ్రి కోసం కళ్ళని దివిటీలు చేసుకుని వెతకసాగాడు.

‘చక్కెర కర్మాగారము’ అని రాసి ఉన్న పెద్దపెద్ద సిమెంటు అక్షరాల్లో నుండి క్కె వత్తూ, ఇంకా మ వత్తు వంటివి రాలిపోయి

ఉన్నాయి. అవన్నీ కూడా చదూతూంటే అంత దుఃఖంలోనూ రాఘవయ్య కొడుక్కి నవ్వొచ్చింది.

”చె…ర… కరాగారము”.

కాలేజీకి వెళ్ళి వస్తున్నాడే కానీ తండ్రి పడుతోన్న మానసిక క్షోభ తెలీకుండా ఏం పోలేదు మురళికి. వద్దు వద్దనుకుంటూనే చెరుకేసి మళ్ళీ అప్పుల్లో కూరుకుపొయ్యాడు. అందుక్కారణం ఫ్యాక్టరీ అన్న విషయం ఇప్పుడిప్పుడే తెలుస్తోంది తనకి.

ఈ ఫ్యాక్టరీ దివాలా తీయడానికి సరిగ్గా ముందు చెరుకు పంట పెట్టడం తండ్రి తప్పో, ఫ్యాక్టరీ తప్పో తెలీదు కానీ ఇప్పుడు నష్టపోయిందెవరు? కాలేజీకి వెళ్ళేంతవరకూ కూడా ఇక్కడ అప్పుడప్పుడూ కూలిపనికి వస్తూండేవాడు తను. అప్పుడు ఫ్యాక్టరీ మరీ ఇంత కళావిహీనంగా ఉండేదికాదు. అప్పటి ఎం.డి. పోయాక చెరుకు ఉత్పత్తి తగ్గాక గాడి తప్పినట్లుంది. ఏ ఫ్యాక్టరీలో ఏం జరుగుతోందో సామాన్యుడికేం తెలుస్తుంది. ఏ కంపెనీ ఎందుకు మునుగుతుందో, ఎట్లా తేలుతుందో మామూలు మనిషికి ఎలా అవగతమవుతుంది.

వారం రోజుల్నుండీ ఇంటికి రాని తండ్రి గురించి ఎవర్ని వాకబు చేయాలో తెలీకుండా ఉంది కొడుక్కి. అసలే అనారోగ్యంతో, ఆపై అప్పుల వత్తిడితో వడలిపోయి ఉన్న తండ్రి ఏమయిపోయాడోనని ఊర్లన్నీ తిరిగి తిరిగి వచ్చాడు మురళి తండ్రిని వెతుక్కుంటూ. ఒకవైపు దిగులూ, వేరొకవంక కోపమూ, అసహనమూ వాడ్ని నలిపేస్తున్నాయి.

చివరికి తల్లి పోరు పడలేక ఇట్లా ఈ ఫ్యాక్టరీ వద్దకు…

హోరుమంటోన్న ఈదురుగాలి గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. అప్రయత్నంగా తల్లీ కొడుకులిద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఏదో శంకిస్తూ ఇద్దరి మనసులూ మాట్లాడుకున్నాయి. పెదవులు విప్పి మాట్లాడుకోవడానికి ఎవరికీ ధైర్యం చాల్లేదు. తార్రోడు మీద పడిన గుంటల్లో నుండి, ఎండిన చెరుకుపిప్పిలో నుండీ దారీదరీ లేని లోతైన సముద్రాన్ని ఈదుతున్నట్లుగా ఉంది వారి పరిస్థితి.

దూరంగా గానుగాడే మిషను ఉన్న భవంతి ముందు ఒకరిద్దరు తచ్చాడుతున్నారు. ఊపిరొచ్చినట్టయింది రాఘవయ్య కొడుక్కి. ఫోర్‌మన్‌ సుబ్బారావు, హెల్పర్‌ వీరయ్య కుడివైపున్న బాయిలర్‌ రూము నుండి ఇటువైపుగా వస్తున్నారు. అడుగుపడని కాళ్ళతో ఉన్నచోటే నిలబడి వాళ్ళు వచ్చిందాకా ఎదురుచూసి అడిగాడు తండ్రి గురించి.

”ఎక్కడా కన్పించలేదే… మొన్నొకరోజు మాత్రం వచ్చి ముఖ్యమంత్రి ఫండ్‌లో నుండి డబ్బులొస్తాయంట కదా… రైతులకి ఎప్పుడిస్తారని అడుగుతున్నాడు. ఆ తర్వాత నేను చూడలా” చెప్పాడు వీరయ్య. ముఖ్యమంత్రి ఇచ్చే డబ్బులు పెద్ద పెద్ద రైతులకు, నోరుగల్లోళ్ళకూ సరిపాయె. మనదాకా యాడొస్తుండాయి. నిట్టూర్చాడు లోలోపలే.

”ఒకర్నొకరు చూసేట్టుగా, ఒకర్కొకరు ఎతుక్కునేట్టుగా ఉండాదా? ఎవురి పరిస్థితి వారికే అర్థం కాకపాయె. అయోమయంగా

ఉండాది” ఖండించాడు ఫోర్‌మెన్‌.

”కూతురింటికేమైనా బొయినాడేమో చూడకూడదంటయ్యా…” మనసొప్పక మళ్ళీ అన్నాడు వీరయ్య. అతడికి రాఘవయ్య కొడుకుని చూస్తుంటే జాలిగా ఉంది. దిగులు మేఘాలు కమ్ముకున్న వాడి ముఖంలో పదేళ్ళ తన కొడుకు ఛాయలు కన్పిస్తున్నాయి. వీరయ్యకు తల తిరిగినట్లుగా అయింది ఆ తల్లీకొడుకుల్ని చూస్తుంటే.

అంతలోనే తేరుకుని ఇదేదీ పట్టకుండా హడావిడిగా వెళ్ళిపోతోన్న ఫోర్‌మెన్‌ వెనుక పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వెళ్ళిపోయాడతడు. నడిసంద్రంలో అనుకోకుండా చేతికి దొరికిన చిన్న కొయ్యముక్కేదో జారిపోయినట్లుగా సుదీర్ఘంగా నిట్టూర్చి మళ్ళీ కొడుకు వంక చూసింది రత్నమ్మ.

”కావు… కావు” మంటూ కాకుల గుంపొకటి కర్మాగారం మీదుగా ఎగురుకుంటూ పోయింది. గుండెల్లో పుట్టిన గుబులును అణచుకుంటూ ఫ్యాక్టరీ ముందూ, వెనకా, పైన, కిందా అంతా వెతుక్కుంటూ తిరుగుతున్నారిద్దరూ.

క్రష్షింగు ప్లాంటు ఉన్న పెద్ద షెడ్డు వెనక జీలగచెట్ల నడుమ పాత సిమెంటు బెంచీమీద వెల్లకిలా పడున్నాడు రాఘవయ్య.

ఒక కాలు బెంచి మీద నుండి కిందికి వేళ్ళాడుతోంది.

చేతులు రెండూ ఎడాపెడా పడున్నాయి.

షెడ్డు కవతల ప్రహరీగోడ నానుకుని గుబురుగా పెరిగి ఉన్న జీలగచెట్లకి అల్లుకుని ఉన్న పిచ్చి దొండతీగ బెంచిమీదికి కూడా పాకి ఉంది. క్రష్షింగు ప్లాంటు గోడ మీద నుండి చలిచీమలు బారుపెట్టి అత్యవసరమైన పనులమీద తిరుగుతున్నట్లుగా ఎడాపెడా పారాడుతున్నాయి. ఎండిపోయిన చెరుకు ద్రవ్యాన్ని నాకడానికి కుక్కపిల్ల ఒకటి తనుకులాడుతోంది.

రాఘవయ్యని స్పష్టంగా చూడకుండానే గుండెలు జారిపోయాయి రత్నమ్మకి. అడుగు కూడా కదపలేనట్లుగా ఉన్నచోటనే కూలబడిపోయింది.

జీవితపు మొదటి మెట్టు మీద అడుగుపెడుతోన్న మురళి గుండెనెవరో అరచేత్తో పిసికినట్టయింది.

ఎక్కడో దూరతీరాల్లోనుండి పిలుస్తున్నట్లు, లోతుగా సన్నని మూలుగు… తడబడుతూ తండ్రి మీదుగా ఒంగి చూశాడు కొడుకు.

హంతకుడి జాడ తెలిపే మరణానంతర వాంగ్మూలమేదో ఇవ్వడానికి సిద్ధపడుతున్నట్లుగా అతడి పెదవులు విచ్చుకున్నట్లుగా

ఉన్నాయి.

ఎక్కడ్నుండో వినిపిస్తోన్న కీచురాళ్ళ శబ్దం దారితెన్నూ కానక విషాదంగా కర్మాగారం పాడుతోన్న నిశ్శబ్ద సంగీతంతో కలిసిపోయి వికృతంగా విన్పిస్తోంది.

Share
This entry was posted in దారి దీపాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.