కులాంతర వివాహాల రక్షణ చట్టం రావాలి – జూపాక సుభద్ర

గ్రహస్థితులు బాగలేదనీ, జాతకాలు కలవట్లేదని తమ పిల్లలకు చెట్లకు, పుట్లకు, పశువులకు ఇచ్చయినా పెండ్లి జేస్తరు గానీ వేరే కులం, మతం మనుషులకిచ్చి పెండ్లి జేయని అమానవత్వాలు. అట్లా చేయాల్సి వస్తే చావనైనా చస్తారు, చంపనైనా చంపేస్తారు గానీ బతికి బట్టకట్టనియ్యరు. ఇది కులం అమానుషత్వం, కులం యొక్క క్రూరత్వం. కులమ్ముందు సమానత్వాలు, సౌభ్రాతృ త్వాలు, ప్రజాస్వామ్యాలు దిగదుడుపే. కులమ్ముందు అంతా బలాదూరే. అట్లా పెంచి పోషించింది కులాన్ని హిందూ ఆధిపత్య సమాజం. కులాంతర ప్రేమలకు, కులాంతర పెళ్ళిళ్ళకు కుల సమాజ ఆమోదముండదిక్కడ.

మిర్యాలగూడలో జరిగిన పెరుమాళ్‌, ప్రణయ్‌ కుల హత్యలు దేశమంతా నిత్యం జరుగుతూనే ఉన్నయి. కుల హత్యల మీద ఎలాంటి ఉద్యమాలు కానీ, కులాంతర, మతాంతర పెండ్లిల అనంతరం జరిగే దాడులమీద ఎలాంటి చర్చలు గానీ, ప్రజాపోరాటాలు గానీ జరగలే. ఈ మధ్య ఈ హత్యలు, దాడులు పెచ్చుమీరినయి. మధుకర్‌, నరేష్‌, శంకర్‌, ఇలవరసన్‌ అనేకం జరిగినయి, జరుగుతూనే ఉన్నయి. మొన్న మిర్యాలగూడలో ప్రణయ్‌ కుల హత్యతో పౌర సమాజాలు అలజడి రేపినయి. ప్రేమ ఒక మానవతా విలువ. అది కులం, మతం, జాతి, ప్రాంతం చూడని విలువ. దానికి సంకుచితాల్ని అంటగట్టి చిదిమేస్తోంది ఈ అసమానతల కుల సమాజం. ప్రణయ్‌ ఒక అంటరాని, చదువుకున్న, ఆర్థిక స్థోమతలు గల యువకుడు. కులాల్ని కాదని తనను ప్రేమించిన అగ్ర కుల అమ్మాయిని పెండ్లి చేసుకోవడం నేరమైందా! ఇది నేరమా!

హిందూ మత సంస్థలు ”అవును! ఇది నేరమే! విదేశీ మత పిశాచిని మట్టుపెట్టి క్రిస్టియన్‌ లవ్‌ జీహాద్‌ని అంతమొందించడం నేరమెట్లా అవుతది? హిందూ అమ్మాయిలు విదేశీ మతస్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ధనవంతులైన హిందూ అమ్మాయిలను ట్రాప్‌ చేసి మతం మారుస్తున్నరు. హిందూ అమ్మాయిలు ఎవరైతే అట్లా పెండ్లిళ్ళు చేసుకున్నరో వాళ్ళంతా ”ఘర్‌ వాపసి” రావాలని కూతమోతలు మోగిస్తున్నరు.

ప్రణయ్‌ ఎస్‌.సి కాదనీ బి.సి. సి అనీ, విదేశీ మతస్థుడనీ ప్రచారం చేస్తున్నయి హిందూ సంస్థలు. ప్రణయ్‌నే కాదు

ఉద్యోగాలు చేస్తున్న క్రిస్టియన్‌ పేరున్న అందర్నీ టార్గెట్‌ చేసి వాళ్ళ ఉద్యోగాలు ఊడగొట్టే పనిలో ఈ ‘హిందూ మంచ్‌’ లున్నాయి. నిజానికి మతం మార్చుకుంటే కులం బోదు, అంటరాని తనాలు పోవట్లేదు. మతమ్మారిన గూడేల్ని ఊర్ల కలుపు కోవడంతో వారి అంటరాని తనాలు కోల్పోలే.

ఇక్కడ ప్రణయ్‌, అమృతలు చేస్కొన్న వివాహం చర్చిలో కాదు, ఆర్య సమాజంలో పెండ్లి చేస్కున్నరు. ఆ అమ్మాయి నమ్మకాలను గౌరవించిండే గానీ… లవ్‌ జిహాదని ఆమెని క్రిస్టియన్‌ మతంలోకి మార్చలేదు (అదీ అమృత మాటల్లోనే).

ప్రణయ్‌ హత్య మీద ప్రగతిశీల శక్తుల్లో, కుల సంగాల్లో, మహిళా సంగాల్లో, ముఖ్యంగా ఎస్సీ సంగాల్లో ఒక ఆందోళన, అలజడి బయల్దేరి ఉద్యమ రూపాన్ని సంతరించుకోవడం, కులాంతర వివాహాలకు అండగా నిలిచే ఉద్యమాలు, చర్చలు, సభలు పెట్టడం కులాన్ని ధిక్కరించి పెండ్లి చేసుకునే యువతకు ‘ఒక ఓదార్పు, ఊరటనే కాదు అది కుల రహిత సమాజం కోసం బాటలు వేస్తుందనే ఒక ఆశ మినుకు మినుకుమంటోంది.

మహిళల మీద అత్యాచారాలు నిలువరించడానికి, శిక్షించడానికి ఎట్లయితే ‘నిర్భయ’ చట్టం వచ్చిందో అట్లనే కులాంతర వివాహాలు… చేస్కుంటే జరిగే కుల హత్యలను నిలువరించడానిక్కూడా ‘ప్రణయ్‌’ చట్టం రావాలని ఈ చర్చల్లో ఒక అభిప్రాయం బలంగా వస్తుండటం ఆమోదించాల్సిన అంశం. ప్రేమికులు, అదీ కులాంతర ప్రేమికుల కోసం, పెండ్లి చేసుకునే వారి కోసం ఒక రక్షణ చట్టం రావాలనే ప్రతిపాదన ప్రభుత్వాలు సీరియస్‌గా తీసుకొని చట్టం తేవాలి. ప్రణయ్‌ లాగా, లేదా ఆధిపత్య కులం మగవాళ్ళని చేసుకొని అన్యాయానికి బలి కాకూడదని అనుకుంటే… కొంత వరకైనా యీ హత్యలను ఆపొచ్చు అనే ఆశ ఉండడం సహజం.

కిందికులాల (ఎస్‌సి) అబ్బాయిలు, సవర్ణ అమ్మాయిల్ని ప్రేమిస్తే పెండ్లి చేస్కూంటే.. చంపేస్తున్నరు. అదే కింది కులాలైన ఎస్సీ అమ్మాయిల విషయంలో.. ప్రేమ, పెండ్లి అంశాలకన్నా… పెద్ద కులాల అబ్బాయిలు ప్రేమ పేరుతో మోసం చేయడం, లైంగికంగా వాడుకొని బైటగ్గొట్టే తంతులతో… అవమానాలు భరించలేక ఎస్సీ అమ్మాయిలు విషం దాగి, ఉరేసుకుని, రైలు పట్టాల మీద బడి, బిల్డింగ్‌ల పైనుంచి పడి చచ్చిపోయేట్టు చేస్తున్న హత్యలమీద మీడియా కన్ను బడది, కలం కాలు కదలది. దీనికి పెద్ద ఉదాహరణ- ఆ మధ్య సెంట్రల్‌ యూనివర్శిటీ ఆఫ్‌ హైద్రాబాద్‌ విద్యార్థిని సునీత అగ్రకుల ప్రేమ మోసానికి బలై ఆత్మహత్య చేస్కుంది.

అప్పుడు కూడా పెద్ద ఎత్తున దళిత సంగాలు ఉద్యమించినయి. అగ్రకుల మగవాళ్ళ ప్రేమలు ఎంత మోసకారియో, ఎట్లా ఆత్మహత్యలకు పురికొల్పుతాయో! వాటినుంచి విడివడాలనీ, ఎదిరించాలనీ విస్తృతమైన చర్చలు జరిగి, ఎస్సీ అమ్మాయిలు కొంత జాగ్రత్తపడిండ్రు.

…ప్రేమలు కులాలకతీతమనీ ‘వెలిప్రేమలు’ అని ఒక అద్భుతమైన కులాంతర ప్రేమల సజీవ చిత్రాలుగా డాక్యుమెంట్‌ చేసిన సాంబశివరావు వాటిలోని కుల, జెండర్‌ సంక్లిష్టతల్ని కూడా చర్చించాల్సి ఉంది.

Share
This entry was posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.