ఒక గ్రామంలో బలమైన ఒక ఆబోతు ఉంది. అది మిగిలిన జంతువుల పట్ల చాలా భయంకరంగా ప్రవర్తించేది. తనకు ఎవరూ సాటిరారన్నట్లు తిరిగేది. కొన్ని జంతువులను తన కొమ్ములతో పొడిచి వాటి ప్రాణాలను బలి తీసుకుంది. దాని దెబ్బకు మిగతా జంతువులన్నీ భయపడుతుండేవి. ఒకరోజు తనకున్న బలానికి తనను ఎవరూ ఏమీ చేయలేరన్న అహంకారంతో ఊరిలోకి చొరబడి ప్రజలమీదికి
ఉరికింది ఆంబోతు. ఆ దాడిలో కొంతమంది ప్రజలు గాయపడ్డారు. మరికొందరు దాన్ని ఎలాగైనా పట్టుకోవాలని సాహసం చేశారు. ఆ క్రమంలో వారికి దెబ్బలు తగిలినా, గాయాలయినా పట్టు వదలకుండా ఆంబోతును పట్టుకొని గట్టి తాడుతో కదలకుండా కట్టి పడేశారు. దానికి రెండు రోజుల నుంచి ఎవరూ తిండి కూడా పెట్టకపోవడంతో ఆ ఆంబోతు ఆకలితో నకనకలాడిపోయింది. ఆ కట్లు విప్పేందుకు ఎవరూ సహాయం చేయలేదు, తన పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో ఆ ఆంబోతుకు తోచలేదు. మరోవైపు ఆకలితో బాగా నీరసించిపోయింది. అయితే అక్కడ తిరుగుతున్న రెండు ఎలుకలను చూసి తన పరిస్థితిని చెప్పుకొని కంటతడి పెట్టుకుంది ఆంబోతు. ఒకప్పుడు బలమైనదన్న అహంకారంతో విర్రవీగే ఆంబోతును చూసి సహాయం చెయ్యాలని లేకున్నా దాని పరిస్థితిని, బాధను చూసి ఎలుకల మనసు కరిగింది. ఆంబోతుకు సహాయం చెయ్యాలనుకున్నాయి. ఉపాయం ఆలోచించాయి. ఒక్కసారిగా ఆంబోతు దగ్గరకు వెళ్ళి తాడును కొరకడం మొదలుపెట్టాయి. దాంతో కట్లు తెగిపోయాయి. దాంతో బతుకుజీవుడా అనుకుంటూ వెళ్తున్న ఆంబోతుతో ఒక ఎలుక ఇలా అంది, ”ఆ భగవంతుడు మన ప్రాణాలు నిలుపుకొనేందుకు, మరొకరికి సహాయం చేసేందుకు శక్తిని ఇచ్చాడు. ఆ శక్తిని దుర్వినియోగం చేయకుండా పరోపకారం కోసం వినియోగించాలి. అప్పుడే మన జీవితం ధన్యమవుతుంది. నువ్వు పరోపకారం చేయకపోయినా అపకారం మాత్రం చేయకు. అది పరోపకారం కంటే పవిత్రమైనది” అని హితవు చెప్పింది. ఆంబోతుకు ఎలుక మాటలు కనువిప్పు కలిగించాయి. అప్పటినుండి అది మంచి ప్రవర్తనతో ఊరి ప్రజలు పెట్టింది తింటూ హాయిగా జీవించింది.